ప్రచారం మిన్న... ప్రగతి నిండుసున్నా

6 Jan, 2019 07:53 IST|Sakshi

శ్వేతపత్రం–9

రాష్ట్ర పారిశ్రామిక రంగంపై విశ్లేషణ

కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించకపోయినా వ్యక్తిగతంగా తనకున్న పేరును చూసి లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వస్తున్నాయంటూ తొమ్మిదవ శ్వేతపత్రం విడుదల సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. మరి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుంటే గత మూడేళ్లుగా రాష్ట్ర పారిశ్రామిక రంగం ఎందుకు నేల చూపులు చూస్తోందో సీఎం మాత్రమే సమాధానం చెప్పగలరు. ఒక పక్క రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ముఖ్యంగా తయారీ రంగం వృద్ధిరేటు భారీగా క్షీణించినట్లు శ్వేతపత్రంలో విడుదల చేసిన గణాంకాలే స్పష్టం చేస్తున్నా ఆ విషయాలను పేర్కొనకుండా పెట్టుబడులు వచ్చేశాయని నోటితో చెపుతూ కాగితాల్లో మాత్రం ‘కమిటెడ్‌’ ఇన్వెస్ట్‌మెంట్‌ అని పేర్కొనడం గమనార్హం.

గడిచిన మూడేళ్లుగా రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి ముఖ్యంగా తయారీ రంగం వృద్ధిరేటు గణనీయంగా పడిపోయిందంటూ శ్వేత పత్రంలోని గణాంకాలు స్పష్టం చేస్తున్నా.. పారిశ్రామిక రంగం దేశం కంటే వేగంగా దూసుకుపోతోందంటూ ఎటువంటి బెరుకు లేకుండా అబద్ధాలు, అవాస్తవాలు చెప్పడం ముఖ్యమంత్రి చంద్రబాబుకి మాత్రమే దక్కుతుంది. నాలుగేళ్లు కేంద్రంలో అధికారం పంచు కున్నా ఒక్క భారీ ప్రాజెక్టునూ తీసుకురాకపోగా, ప్రారంభమైన ఎన్‌టీపీసీ–భెల్‌ ప్రాజెక్టు కూడా అటకెక్కింది. రాష్ట్ర పారిశ్రామిక వృద్ధిలో కీలకపాత్ర పోషించే బందరు, భావనపాడు పోర్టులకు టెండర్లు పూర్తయినా భూసేకరణ పూర్తి చేయలేకపోవడంతో ప్రాజె క్టులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. భాగ స్వామ్య సదస్సుల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, పెట్టుబ డుల ఆకర్షణ పేరుతో విదేశీ పర్యటనలలో చంద్రబాబు మునిగితే లినా, ఈ నాలుగున్నరేళ్లుగా ఎలాంటి భారీ ప్రాజెక్టులనూ ఆకర్షించ లేకపోయారు. ఒకపక్క లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చామంటూనే అంతకు రెండింతలమంది నిరుద్యోగులున్నారంటూ కళ్ళార్పకుండా అబ ద్ధాలను వల్లెవేస్తున్నారు.

వెలుగులు ఎక్కడ?
రాష్ట్రానికి లక్షల కోట్ట పెట్టుబడులు వస్తున్నాయని, కేంద్రం సహక రించకపోయినా వ్యక్తిగతంగా నాకున్న పేరును చూసి ఈ పెట్టుబ డులు తరలి వసున్నాయంటూ తొమ్మిదవ శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రూ.1.77 లక్షల కోట్ల భారీ, మెగా ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, అలాగే రూ.5.27 లక్షల కోట్ల పెట్టుబడుల పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. మరి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుంటే గత మూడేళ్లుగా రాష్ట్ర పారిశ్రామిక రంగం ఎందుకు నేల చూపులు చూస్తోందో సీఎం మాత్రమే సమాధానం చెప్పగలరు. ఒక పక్క రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ముఖ్యంగా తయారీ రంగం వృద్ధి రేటు భారీగా క్షీణించినట్లు శ్వేతపత్రంలో విడుదల చేసిన గణాంకాలే స్పష్టం చేస్తున్నా ఆ విషయాలను పేర్కొనకుండా పెట్టుబడులు వచ్చే శాయని నోటితో చెపుతూ కాగితాల్లో మాత్రం ‘కమిటెడ్‌’ ఇన్వెస్ట్‌ మెంట్‌ అని పేర్కొనడం గమనార్హం. 2015–16లో 9.61 శాతంగా ఉన్న తయారీ రంగ వృద్ధిరేటు 8.49 శాతానికి క్షీణించింది. ఇదే సమ యంలో తయారీ రంగ వృద్ధిరేటు 13.89 శాతం నుంచి 8.36 శాతానికి పడిపోయింది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ఏకంగా రూ.2.51 లక్షల కోట్ల విలువైన 810 మెగా, భారీ పరిశ్రమలు నిజంగా ఉత్పత్తి ప్రారంభిస్తే వృద్ధిరేటు రెట్టింపు కావాలే కాని ఎలా క్షీణించిందో అర్థం కాదు.

ఏది నిజం?
ఉద్యోగాల కల్పన విషయంలో కూడా ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాల్లో పరస్పర విరుద్ధమైన గణాంకాలను పేర్కొన్నారు. ఈ నాలుగేళ్లలో 7.7 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు సీఎం ఒకపక్క డబ్బాలు కొడుతూనే మరో పక్క అంతకు రెండింతల మంది నిరు ద్యోగ భృతికోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు చెపుతున్నారు. ప్రాధి కారిక సర్వే ప్రకారం రాష్ట్రంలో 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించారు. ఇప్పుడు ఇందులో సీఎం చెప్పిన విధంగా 7.7 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లయితే నిరుద్యోగుల సంఖ్య 4.3 లక్షలకు మించకూడదు. కానీ మరి యువ నేస్తం పథకానికి 11.27 లక్షల మంది నిరుద్యోగులు ఎలా దరఖాస్తు చేసుకుంటారు? పైగా దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ప్రతీనెలా పెరుగుతూనే ఉంది. పరిశ్రమల ద్వారా ఏకంగా 7.7 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లయితే కొత్తగా ఇంత మంది నిరుద్యోగులు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రాధికారిక సర్వే గణాంకాలతో నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని పోల్చి చూస్తే ఈ నాలు గేళ్లలో 73,000 మందికి లోపే ఉద్యోగాలు లభించినట్లు అర్ధమవు తోంది. అలాంటప్పుడు 7.7 లక్షల మందికి ఎలా ఉద్యోగాలు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఇచ్చారో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలి. కాగా, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. రాష్ట్రంలో నిరు ద్యోగులు 65 లక్షల మంది ఉన్నారని వివిధ సర్వేలు చెపుతున్నాయి. అందరికీ నిరుద్యోగభృతి చెల్లించడానికి ఇష్టపడని సర్కారు విభిన్న నిబంధనలతో వారి సంఖ్యను 12 లక్షలకు కుదించి దానికి ప్రాధికా రిక సర్వే అని ముక్తాయింపు ఇచ్చింది. 

దశ దిశ మార్చే ప్రాజెక్టు ఒక్కటి వచ్చిందా?
విభజన తర్వాత పారిశ్రామికంగా బాగా వెనుకబడిన ఆంధ్రప్రదే శ్‌ను ఆదుకోవడానికి అనేక భారీ ప్రాజెక్టులను విభజన చట్టంలో పేర్కొనడం జరిగింది. నాలుగేళ్లు కేంద్రంలో అధికారం పంచుకున్న తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర దశ దిశ మార్చే కాకినాడ పెట్రో కెమి కల్స్, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్‌ ప్లాంటు వంటి ప్రాజెక్టుల్లో ఒకటి కూడా తీసుకురాలేకపోగా, రాయలసీమలో అప్పటికే ఏర్పా టైన ఎన్‌టీపీసీ భెల్‌ ప్రాజెక్టును అటకెక్కించినా మౌనంగా చూస్తు కూర్చుని ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే రాయలసీమను రత నాల సీమను చేయాలని భావించిన మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరీ చిత్తూరు జిల్లా మన్నవరంలో ఎన్‌టీపీసీ–భెల్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. రాజశేఖర్‌ రెడ్డి అకాల మరణం తర్వాత ఇచ్చిన మాట మేరకు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడమే కాకుండా తొలిదశ ఉత్పత్తి  ప్రారంభించడం కూడా జరిగింది. 2017లోనే ఈ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు భాగస్వామ్య కంపెనీ ఎన్‌టీపీసీ ప్రకటించినా కేంద్రంలో అధికారం పంచుకుంటున్న తెలుగుదేశం ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకుండా మౌనంగా ఉంది. అదే విధంగా కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి ముడి ఇనుము లభ్యత గురించి కేంద్రం స్పష్టమైన వివరాలను అడుగుతున్నా ఇవ్వకుండా ఇప్పుడు కేంద్రం నిర్మించడం లేదు కాబట్టి తానే స్వయంగా నిర్మిస్తు న్నట్లు ఎన్నికల ముందు శంకుస్థాపనలతో హడావుడి చేస్తున్నారు. దక్షిణ కోస్తాను వాణిజ్య రాజధానిగా చేసే దుగరాజపట్నం పోర్టు విషయంలో కూడా ఇలాగే జరిగింది. కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణం సాధ్యం కాదని, దీనికి ప్రత్యామ్నాయంగా మరోచోటు చూపిస్తే ఏర్పాటుచేస్తామని కేంద్రం చెపుతున్నా రాష్ట్రప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంది. ఈ విషయంలో కూడా రాజకీయం చేస్తూ దుగరాజ పట్నం బదులు రామాయపట్నంలో మైనర్‌ పోర్టును తామే కడుతున్నామంటూ ప్రభుత్వం ప్రకటన చేసింది. దీనిపై కూడా కేంద్రం దిగివచ్చి రామాయపట్నంలో ప్రతిపాదిత మైనర్‌ పోర్టు స్థానే తామే మేజర్‌ పోర్టును నిర్మిస్తామంటూ ప్రతిపాదన పంపింది. అయినా రాష్ట్రం స్పందించకుండా ఈ వారంలో శంకుస్థాపన చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. కాకినాడ–వైజాగ్‌ పెట్రోకెమిల్స్‌ కారిడార్‌ విష యంలోనూ ఇదే జరిగింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో మాదిరే వయబులిటీ గ్యాప్‌ ఫండ్‌ను (వీజీఎఫ్‌) సమ కూరిస్తే తక్షణం ప్రారంభిస్తామని ఓన్‌జీసీతో సహా ప్రభుత్వ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రకటించాయి. ఈ వీజీఎఫ్‌ను ఇచ్చేది లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం కూర్చుంది. కానీ ఇదే సమయంలో ఎన్ని కల ముందు ప్రైవేటు సంస్థ హల్దియాకు వీజీఎఫ్‌ కింద ఇచ్చే మొత్తం కంటే రెట్టింపు రాయితీలు ఇస్తూ ఒప్పందం కుదుర్చుకుంది. 

అయిన వారికి ఆకుల్లో...
974కి.మీ సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో ఓడరేవులు పారిశ్రామిక రంగంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఈ అంశాన్ని గుర్తించిన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి కృష్ణపట్నం ఓడ రేవు, గంగవరం పోర్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించడమే కాకుండా బందరు పోర్టుకు శంకుస్థాపన కూడా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత గడిచిన నాలుగున్నర ఏళ్లలో ఒక్క ఓడరేవు పనులను కూడా ప్రారంభించలేకపోయారు. కనీసం రాష్ట్ర రాజ ధానికి అత్యంత సమీపంలో ఉన్న కీలకమైన బందరు పోర్టుకు ఇప్పటి వరకు భూ సేకరణ పూర్తి చేయలేకపోయారు. ఎన్నికల వేల ఇప్పుడు భూ సేకరణ పూర్తి చేసి శంకుస్థాపన చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు ఓడరేవు టెండర్లు ఆదాని గ్రూపు దక్కించు
కుని రెండేళ్లు అయినా ఇప్పటి వరకు భూ సేకరణ పూర్తి చేయకపోవడంతో పనులు మొదలు కాలేదు. అలాగే హీరో గ్రూపు భారీ ద్విచక్ర వాహన తయారీ కేంద్రం ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే హైకోర్టు వివాదాల్లో ఉన్న భూమిని కేటా యించడంతో సంస్థ పనులు ప్రారంభించ లేకపోయింది. చివరకు హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే అప్పటి వరకు చేసిన పెట్టుబడిని అణా పైసలతో సహా తిరిగి చెల్లిస్తామంటూ

ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేయాల్సి వచ్చింది. విశాఖకు సమీపంలో భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయ విషయంలోనూ అదే జరిగింది. ఎయిర్‌పోర్టు టెండర్లను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్‌పోర్టు అథార్టీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) రాష్ట్ర ప్రభుత్వానికి అధిక రెవెన్యూ వాటాను ఆఫర్‌ చేయడం ద్వారా దక్కించుకోవడంతో ఏకంగా టెండర్లనే బాబు ప్రభుత్వం తర్వాత రద్దు చేసింది. అంతే కాదు తిరిగి పిలిచే టెండర్లలో ఏఏఐ పాల్గొనే అవకాశం లేకుండా నిబంధనలను మార్చి మరీ టెండ ర్లను పిలిచింది. ఇలా కీలకమైన ప్రాజెక్టులు ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్ల ఆలస్యం అయిపోతున్నాయి. కానీ ఇదే సమయంలో అయిన వారికి చెందిన ప్రాజెక్టులకు భూసేకరణ దగ్గర నుంచి అనుమతుల వరకు వేగంగా పనులు జరిగిపోతున్నాయి. తిరు పతిలో ఏర్పాటు అయిన ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ పార్కు, కియా మోటార్స్, విజయవాడలోని హెచ్‌సీఎల్‌ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. 

ప్రచార పాలసీలు– బూటకపు ఒప్పందాలు
గడిచిన నాలుగున్నర ఏళ్లుగా పారిశ్రామిక పాలసీలు, భాగస్వామ్య సదస్సులు, విదేశీ పర్యటనలు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రియాల్టీ షోలను నిర్వహిస్తూనే ఉంది. ఈ నాలుగున్నర ఏళ్లలో పెట్టుబడు లను ఆకర్షించడం కోసమంటూ ఏకంగా 22కు పైగా పారిశ్రామిక పాలసీలను విడుదల చేయడం గమనార్హం. అదే విధంగా 2016, 2017, 2018 సంవత్సరాల్లో వరుసగా మూడేళ్లు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీస్‌(సీఐఐ)తో కలిసి వైజాగ్‌ వేదికగా భాగస్వామ్య సదస్సులను నిర్వహించారు. ఇలా మూడు భాగస్వామ్య సదస్సుల ద్వారా మొత్తం రూ.19.6 లక్షల కోట్ల విలు వైన 1,761 ఒప్పందాలు కుదిరినట్లు గతంలో ప్రభుత్వం ప్రకటిం చింది. టీ కొట్లో పనిచేసే వారు, రాజకీయ నాయకుల కారు డ్రైవర్లకు సూటు బూటు తొడిగి వారిని పారిశ్రామిక వేత్తలుగా వేషాలు వేయించి ఒప్పందాలు చేసుకున్న వైనాన్ని గతంలో ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన వైనం తెలిసిందే. ఇప్పుడు ఈ విషయం శ్వేత పత్రం సాక్షిగా బయట పడింది. భాగస్వామ్య సదస్సులు కాకుండా రాష్ట్రంలో ఉన్న వన రులను దృష్టిలో పెట్టుకొని కొన్ని కంపెనీలు స్వతహాగానే పెట్టుబ డులు పెట్టడానికి ముందుకురాగా,  మరికొన్ని ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల్లో ఒప్పందాలు కుదిరాయి. ఈ నాలుగున్నర ఏళ్లలో మొత్తం 2,622 ఒప్పందాల ద్వారా రూ.15.48 లక్షల కోట్ల పెట్టుబ డులు, 32.35 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నట్లు శ్వేతపత్రంలో పేర్కొన్నారు. కానీ గత మూడు భాగస్వామ్య సద స్సుల్లోనే రూ.19.6 లక్షల కోట్ల ఒప్పందాలు వచ్చినట్లు చెప్పగా ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.15.48 లక్షలకు తగ్గించేశారు.

కేంద్ర మంత్రి ఉండి కూడా..
కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్‌ గజపతి రాజు ఉన్నప్పటికీ కొత్తగా ఒక్క ఎయిర్‌పోర్టును కూడా నిర్మించుకోలేక పోయాం. గత నాలుగేళ్లుగా జిల్లాకో ఎయిర్‌పోర్టు నిర్మిస్తామని చెప్పగా ఇప్పటి వరకు ఒక్కటి కూడా అందుబాటులోకి రాలేదు. చివరకు సొంత నియోజకవర్గం కుప్పంలో జనవరి 3న శంకుస్థాపన చేశారు. కేవలం ఒక్క కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయ పనులు మాత్రమే పూర్తి కావొచ్చాయి. నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయ టెండర్లు టర్బో మెఘాకు ఇవ్వగా ఇంకా అక్కడ భూ సేకరణ పూర్తి కాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. భోగా పురం టెండర్లు మొదటికి రావడంతో ఇది ఎప్పటికి పూర్తి అవు తుందో చెప్పలేని పరిస్థితి. అంతేకాదు విజయవాడ, తిరుపతి విమా నాశ్రయాలకు అంతర్జాతీయ హోదా వచ్చినా ఒక్క సర్వీసును కూడా ప్రారంభించలేకపోయారు. చివరకు విజయవాడ నుంచి కేవలం ఆరు నెలల కాలానికి ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగోకు రూ.18 కోట్లు ఎదురు చెల్లించి మరీ గత నెలలో సర్వీసులు ప్రారం భించారు. ఇలా అన్ని రంగాల్లో కొత్త పెట్టుబడులను ఆకర్షించలేక చతికిలబడిన ప్రభుత్వం శ్వేతపత్రాల్లో మాత్రం రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తున్నాయని, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యే లేదన్నట్లు చెబుతుండటం చంద్రబాబు అబద్ధాలకు నిదర్శనం.
-చంద్రశేఖర్‌ మైలవరపు, సాక్షి ప్రతినిధి

>
మరిన్ని వార్తలు