వరమా.. శాపమా!

22 Apr, 2020 00:21 IST|Sakshi

ఇన్‌బాక్స్‌

ఆశ  అత్యాశగా మారి స్వార్థం ముసిరినపుడు విచక్షణ జ్ఞానం మరిచి మనిషి అనేక తప్పిదాలకు పాల్పడతాడు. తప్పిదాల మూల్యమే ప్రపంచమంతా అనుభవిస్తున్న క్వారంటైన్‌ బందీఖాన మనిషిని బందీని చేసి స్వేచ్ఛగా ఎగిరే పక్షులతో, స్వతంత్రంగా తిరిగే జంతువులతో ప్రకృతి పరవశిస్తోంది.. భూమాత పాలిట వరమైన మహమ్మారి మనిషి పాలిట శాపమైంది.. ఊహించని విధంగా భూమిపై పెనుమార్పులు చోటుచేసుకుంటున్నవేళ 50వ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా మానవాళికి కరోనా గుణపాఠం లాంటిది.

మనిషి స్వార్థానికి అడవులను, చెట్లను నరికివేసి.. పక్షుల, జంతువుల స్వేచ్ఛను హరించడం.. పరిశ్రమల పేరిట గాలి నీరు కలుషితం చేసేశాడు. భూమండలాన్ని శాసించాలన్న స్వార్థపూరిత వైఖరికి కరోనా మహమ్మారి అడ్డుకట్టవేసి మనిషిని నాలుగ్గోడల మధ్య బందీ చేసింది.. ఫలితంగా అన్ని రంగాల్లో  కాలుష్యం తగ్గడం.. భూమిపై, లోపల పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. మానవ సంచారం తగ్గడంతో పక్షులు  స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. జంతువులు మునుపెన్నడూ లేనివిధంగా స్వేచ్ఛగా తిరుగుతూ జనావాసంలోకి వస్తున్న దృశ్యాలు ఇంటర్నెట్‌లో చూస్తున్నాం.. ఇంతకుముందు కని పించని  జంతువులను చూసి అటవీ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..

నగరాలలో స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడమనేది తీరని కోరిక..  పరిశ్రమలు మూసివేయడం.. వాహనాల రద్దీ తగ్గడంతో.. గాలి నాణ్యత పెరిగి నగరాలలో వాయుకాలుష్యం తగ్గినట్లు అనేక అధ్యయనాలు తెలి యజేస్తున్నాయి. మనిషిని నాలుగు గోడల మధ్య బందీని చేసి సవాల్‌ విసిరినా మహమ్మారి మూలాన వాతావరణంలో చోటుచేసుకుం టున్న పెనుమార్పులను.. ప్రకృతి పట్ల బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తిస్తాడని భావిద్దాం. కరోనా నుంచి గుణపాఠం నేర్చుకొని సరికొత్త ప్రపంచంలోకి సరికొత్త ఆలోచనలతో అడుగిడాలని ఆశిద్దాం.
(నేడు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం)
– ఎ. నాగరాజు, అప్పాజీపేట, నల్లగొండ

మరిన్ని వార్తలు