విజ్ఞానశాస్త్రంపై గాంధీ దార్శనికత

28 Feb, 2019 02:22 IST|Sakshi

సందర్భం

గాంధీజీ సైన్స్‌ అనే పదాల కలయిక చూడగానే చాలామంది మొహాలు ప్రశ్నార్థకమవుతాయి. ఆ విషయాలు పూర్తిగా ప్రచారంలో లేకపోవడమే అసలు కారణం. గాంధీ 150వ జయంతి సంవత్సరంలో, జాతీయ సైన్స్‌ దినోత్సవం నేపథ్యంలో కొన్ని కొత్త సంగతులు తప్పక తెలుసుకోవాలి. తన ఆత్మకథకు ఎక్స్‌పెరిమెంట్స్‌ అనే పదం శీర్షికలో ఉంచుకున్న ప్రయోగవాది ఆయన. గాంధీజీ పూర్తి రచనలు పరిశీలిస్తే చాలా చోట్ల తన దృష్టి, దృక్పథం, కృషి – ఈ దిశలో తారసపడతాయి.

1904లో దక్షిణాఫ్రికాను బ్రిటిష్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ సంస్థ సభ్యులు సందర్శించారు. వారితో చర్చిస్తూ గాంధీ సైన్స్‌ను ప్రాచుర్యం చేసి, బ్రిటన్‌ తన వలస దేశాలను కలుపుకోవాలని కోరారు. బ్రిటిష్‌ ఎంపైర్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌గా ఆ సంస్థ పేరును మార్చుకోమని సూచించారు. అంతేకాదు, భారతదేశంలో ఒక సమావేశం ఏర్పరచమని, దాని వల్ల భారతదేశం మాత్రమే కాక మొత్తం అసోసియేషన్‌ లబ్ధిపొందుతుందని కూడా వివరించారు. సైన్స్‌ ఒక సామూహిక ప్రయత్నం. తద్వారా ఆ సమాజాలే కాదు, సైన్స్‌ కూడా లబ్ధి పొందుతుందని వేరొక సందర్భంలో అన్నారు.  

వీలయినచోట్ల శాస్త్ర దృష్టిని పెంపొందించే రచనలు తన ‘ఇండియన్‌ ఒపీనియన్‌’ పత్రికలో ఇచ్చారు గాంధీ. సైన్స్‌ పరిమితులను గుర్తిస్తూనే, ఆ అభినివేశం వ్యాప్తి చెందాలని వాంఛించారు. వెసువియస్‌ అగ్నిపర్వతం బద్దలయినపుడు, విపత్కర పరిస్థితుల్లో సైతం శాస్త్రవేత్త మెటుస్సీ సమాచారాన్ని సేకరించడం అభినందనీయమని రాశారు. 1919–1920 ప్రాంతంలో సహాయ నిరాకరణోద్యమ సమయంలో యంత్రాల గురించి గాంధీ ఏమంటారని చాలామంది ప్రశ్నించారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వంటి వారు గాంధీని ఈ విషయంలో విమర్శించారు కూడా. తను యాంత్రీకరణకు వ్యతి రేకం కాదనీ, కానీ ఆ యంత్రాలను వాడే మనుషుల బుద్ధిని దారిలో పెట్టాలని చాలా స్పష్టంగా వివరిస్తారు (కంప్లీట్‌ వర్క్స్‌ 19వ సంపుటం) జగదీశ్‌ చంద్రబోస్, ప్రఫుల్ల చంద్ర రే దేశభక్తిపరులైన శాస్త్రవేత్తల దృష్టినీ, ప్రతిభను గాంధీ పలుసార్లు కొనియాడారు.

శాస్త్ర పురోభివృద్ధికోసం ప్రాణులను వాడటం గురించి గాంధీ చాలా లోతుగా, స్పష్టంగా విభేదిం చారు. శరీరకోత లేకుండా రక్తప్రసరణ సిద్ధాంతం ప్రతిపాదించడం సాధ్యమైనపుడు, చీటికిమాటికి ప్రయోగాలకు ప్రాణులను బలిచేయడం అర్థరహితమని వాదించారు గాంధీ. ఈ ప్రయోగాల వల్ల ఆధునిక వైద్య శాస్త్రం మతం అసలు స్ఫూర్తిని వదిలివేయడమే కాదు, దాని శరీరం నుంచి ఆత్మను కూడా తొలగించిందని అంటారు. సైన్స్‌ విషయంలో ఒక్క సిద్ధాంత విభాగం మాత్రమే చేయగలిగేది ఏమీ లేదు. పని మన మనసు, మెదడుతో కలిసి సాగితేనే అది అర్థవంతం అని కూడా చెబుతారు గాంధీ. అదే సమయంలో ఆధునిక శాస్త్రవేత్తల నమ్రత, శాస్త్ర అభినివేశం వంటివి మన సంప్రదాయ వైద్య మహనీయులలో లేవని కూడా ప్రకటిస్తారు.

1921లో ఢిల్లీలోని టిబ్బా కళాశాలని ప్రారంభిస్తూ ఆయుర్వేదం, యునాని పాటించే సైన్సులో శాస్త్రీయ అభినివేశం లేదని విమర్శించారు. ఎంతమాత్రం పరిశోధన చేయకుండానే సాగే ఈ భారతీయ వైద్య విధానాలు అగౌరవస్థాయిలోకి దిగజారిపోయాయని ఖండిస్తారు. మద్రాసు ఆయుర్వేద ఫార్మసి, కలకత్తా అష్టాంగ ఆయుర్వేద విద్యాలయ సమావేశాలలో – రెండూ 1925లోనే – లైంగిక సామర్థ్యాన్ని పెంచే రీతిలో ఆయుర్వేద ఔషధాలకు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడాన్ని గట్టిగా ఖండించారు.

కలకత్తా ప్రసంగం ఆయుర్వేద వైద్యులకు కోపం తెప్పించింది. కవిరాజ్‌ గణనాథ్‌ సేన్‌ అనే ఆయుర్వేద ప్రముఖుడు విభేదిస్తూ గాంధీని వివరించమని కోరారు. జవాబుగా చాలామంది ఆయుర్వేద వైద్యులు సర్వరోగాలను నయం చేస్తామని చెప్పుకునే దొంగవైద్యులనీ, వారిలో వినయంగానీ, ఆయుర్వేదం పట్ల గౌరవం గానీ, ఎటువంటి క్రమశిక్షణ గానీ లేవని గాంధీ ఢంకా బజాయించినట్టు ప్రకటించారు.

ఆయుర్వేద వైద్యం చౌక కానీ, సరళం గానీ, ఫలవంతం గానీ కాదని విమర్శిస్తూ, ఆయుర్వేద విధానాలు సంక్లిష్టమని ఖండిస్తారు. మలేరియాకు క్వినైన్, నొప్పులకు ఐయోడిన్‌ వంటి ఔషధాలు ఆయుర్వేదంలో చూపమని కోరుతారు గాంధీ. సేవాగ్రామ్‌లో కలరా సోకినప్పుడు, దీనికి సంబంధించి ఆయుర్వేదం, హోమియోపతిలో పరిశోధనలు సాగాలని కోరారు. ‘హరిజన్‌’ పత్రికలో ఒకసారి గాంధీ ఇలా రాశారు: Everything could be turned into a science or romance if there was a scientific or a romantic spirit behind it. 

వ్యాసకర్త : డా. నాగసూరి వేణుగోపాల్‌,  డైరెక్టర్, ప్రసారభారతి, రీజినల్‌ అకాడమి, ఆకాశవాణి, హైదరాబాద్‌
మొబైల్‌ : 94407 32392

మరిన్ని వార్తలు