అవసరం మేరకే ఆన్‌లైన్‌ విద్య

5 Jul, 2020 01:04 IST|Sakshi

సందర్భం

ప్రస్తుతం పాఠశాల విద్యలో ఆన్‌లైన్‌ క్లాసుల అలజడి జరుగుతోంది. దూరవిద్యా విధానంలో కొన్ని రోజులే క్లాస్‌ రూములో నేర్చుకొని, ఎక్కువ రోజులు ఇంట్లోనే బుక్స్, స్టడీ మెటీరియల్‌ చదువుకుని, పరీక్షలు వ్రాసి డిగ్రీ, డిప్లమో సర్టిఫికెట్లు పొందుతున్న విషయం చాలా కాలంగా వున్నదే. ఇప్పుడు కొన్ని రోజులు కూడా క్లాసు రూముకి పోకుండా ఇంట్లోనే కూర్చుని, ఏదో ఒక వృత్తి ఉద్యోగంలో వున్నవారు కూడా ఆన్‌లైన్‌ చదువుకుంటూ వివిధ రకాల కోర్సులు పూర్తిచేయడం ఉన్నత విద్యలో జరుగుతోంది. కాగా కరోనా వైరస్‌ భయంతో విద్యారంగంలో ఏర్పడిన ప్రతిష్టంభన పరిస్థితిలో పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్‌ క్లాసుల అలజడి ముందుకొచ్చింది. 

సీబీఎస్‌ఈ అనుబంధ ప్రైవేట్‌ కార్పొరేట్‌ స్కూళ్లలో ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణ చాలా రోజుల నుండి జరుగుతోంది. రాష్ట్ర సిలబసుతో నడుస్తున్న కొన్ని పెద్ద ప్రైవేట్‌ స్కూళ్ళు కూడా అదే బాట పడుతున్నవి. ఆన్‌లైన్‌ పేరుతొ అదనంగా ఫీజులు కూడా వసూలు చేస్తున్నవి. ఫీజుతో పాటు స్మార్ట్‌ ఫోనులు, ల్యాప్‌టాప్, కంప్యూటర్, వైఫై, డేటా వంటి అదనపు ఖర్చుల భారం తల్లిదండ్రులపైన పడుతోంది. పాఠం చెప్పడం, నోట్సు రాయించడం, హోమ్‌ వర్క్‌ చేయించడం పేరిట  ప్రైమరీ క్లాసుల పిల్లలనే రోజుకి 6–7 గంటలు వేధించడం జరుగుతోంది. సెకండరీ క్లాసుల విద్యార్థులు రోజుకి 10–12 గంటలు ఆన్‌లైన్‌ అవస్థ పడుతున్నారు. 

గంటల తరబడి స్క్రీన్‌ ముందు కూర్చుని తదేకంగా చూస్తూ ఉండడం వలన విద్యార్థులకు కంటి చూపు మందగించడం, నడుము నొప్పి వంటి శారీరక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌ అభ్యసన జరుగుతున్నంతసేపు తల్లి/తండ్రి లేదా ఎవరో ఒక పెద్ద వారు వారి పనిమానేసి పిల్లలకు తోడుగా ఉండాలి. ఇలాంటి సమస్యలున్నాయని ఇటీవల ఒకరు హైకోర్టును ఆశ్రయిస్తే ఆ విషయాన్ని ప్రభుత్వమే చూడాలని ధర్మాసనం వదిలేసింది. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదివే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఊసే లేదు. కొంతమందికే ఆన్‌లైన్‌ విద్య అందుతూ ఎంతోమందికి అలాంటి అవకాశం లేకపోవడం వలన విద్యారంగంలో సరికొత్త విభజన, అసమానత ఉత్పన్నమవుతోంది. 

ఎకడమిక్‌ షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ రెండో వారంలోనే పాఠశాలలు ప్రారంభించాల్సి వుంది. ఆగస్టు 15 దాకా ఆగాలంటే రెండు నెలల కాలం విద్యార్థులు చదువుకోకుండా ఖాళీగా వుండాలంటే కష్టమే. అందువలన అన్‌లైన్‌లో విద్యాభ్యాసాన్ని నడిపించాలనే కొన్ని పాఠశాలల కృషిని తల్లిదండ్రులు సమర్థిస్తున్నారు. అయితే కొన్ని పాఠశాలలే ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతూ సిలబస్‌ కవర్‌ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంటే కొంతమంది పేరెంట్స్‌ తమ పిల్లలను ఆ పాఠశాలల్లోనే చేర్చే అవకాశం వుంటుందని బడ్జెట్‌ స్కూళ్ల మేనేజర్లు ఆందోళన చెందుతున్నారు. అందువలన ఆన్‌లైన్‌ విద్యాబోధన ప్రభుత్వ ప్రైవేట్‌ పాఠశాలలు అన్నిం టిలోనూ అమలు జరిగే విధానం కావాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ కొంత ప్రయత్నం చేస్తోంది. ప్రాధమిక (1–8) తరగతులకు ఎన్సీఈఆర్టీ రూపొందిం చిన ‘ఆల్టెర్నేటివ్‌ ఎకడమిక్‌ కేలండర్‌‘ని యిటీవల విడుదల చేసింది. సెకండరీ లెవెల్‌ క్లాసుల కేలండర్‌ కూడా రావాలి. ఆ కేలెండర్లను రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు అనువుగా మలుచుకొని అమలుచేయాల్సి ఉంటుంది. కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన ప్రణాళికను మించి అతిగా వ్యవహరించే ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థలను ప్రభుత్వం నియంత్రించాలి.  రెండు నెలలు ఆలస్యంగా పాఠశాలలు ప్రారంభించాల్సి వున్నందున ఆ మేరకు 30% సిలబసును తగ్గించాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. కేంద్రీయ విద్యాలయాలు విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నవి. 

సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందున ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణ సులభమవుతోంది. పాఠశాలల్లో ఆన్‌లైన్‌ బోధనకు అవసరమైన సాధనాలు, సదుపాయాలు సమకూర్చుకోవాలి. అందుకోసమనే కొన్ని ప్రైవేట్‌ కార్పొరేట్‌ స్కూళ్ళు రూ 5–10 వేలు ఫీజులు వసూలు చేస్తున్నవి. పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్సుతో పాటు ట్యాబ్స్‌ అమ్ముతున్నవి. ఫీజు చెల్లించకపోయితే ఆన్‌ లైన్‌ కనెక్షన్‌ యిచ్చేది లేదని బెదిరిస్తున్నవి. స్కూల్లో అమ్మే ట్యాబ్‌ కొనలేకపోయినా ఇంట్లో సిస్టం లేదా ల్యాప్‌ ట్యాప్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌ వుండాలి. ఇంట్లో పాఠశాల విద్యార్థులు ఇద్దరుంటే రెండేసి ఉండాలి.

ఆన్‌లైన్‌లో చెప్పే పాఠాలు స్పష్టంగా చూడాలంటే 50 ఎంబీపిఎస్‌ నెట్‌ వర్క్, 500 జీబీ సామర్ధ్యం గల స్మార్ట్‌ఫోన్‌ వుండాలని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. ఒక క్లాసుకి ఒక జీబీ చొప్పున రోజుకి ఎన్ని క్లాసులు చూస్తే అన్ని జీబీలు ఖర్చవుతుంటది. అలాంటి ఏర్పాట్లు చేసుకుని అదనపు ఖర్చు భరిం చినా పట్నాల్లో పల్లెల్లో ఆన్‌లైన్‌ క్లాసులతో బోధనాభ్యాసన అరకొరగానే ఉండవచ్చు. పట్టణ ప్రాంతాల్లో 41%, గ్రామీణ ప్రాంతాల్లో 12% మాత్రమే ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులో వుంటుందన్న విషయం తెలిసిందే. ఈ అసాధారణ పరిస్థితిలో అవసరమైన మేరకు విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణకు విద్యాశాఖ బాధ్యత వహించాలి. 

ఎన్సీఈఆర్టీ, అజీమ్‌ ప్రేమ్‌జీ లాంటి సంస్థలు సూచించినట్లుగా 3–5 తరగతుల విద్యార్థులకు వారానికి 4 గంటలు, 6–8 తరగతుల వారికి 7 గంటలు, 9–12 తరగతులకు 10 గంటలు సమయమే ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలి. ఎల్కేజీ, యూకేజీ, 1–2 తరగతుల పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులను నిషేధించాలి. పాఠశాల సమయాల్లోనే ఆన్‌ లైన్‌ క్లాసులు నిర్వహించాలి. ఆన్‌లైన్‌ పాఠాలు అందుబాటులో లేని వారికి రికార్డ్‌ చేసిన పాఠాలను వాట్సాప్‌ ద్వారా పంపించే ఏర్పాట్లు చేయాలి.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు లేదా ట్యాబులు మరియు అవసమైన డేటా కార్డులు ప్రభుత్వమే అందించాలి. జూలై 15 నుండి నాలుగు వారాలకైనా ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణకు  విద్యాశాఖ పూనుకుంటే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఏదేమైనా పాఠశాలలు ప్రారంభించే వరకు విద్యార్థులు ఎకడమిక్‌ విషయాలతో మమేకం కావడానికి ప్రభుత్వం, యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమష్టి కృషి సమన్వయం పెరగాల్సిన అవసరం ఉన్నది. 


వ్యాసకర్త: నాగటి నారాయణ, ప్రముఖ విద్యావేత్త 
మొబైల్‌ : 94903 00577

మరిన్ని వార్తలు