నకిలీ విద్యార్హతలు అవినీతి కాదా?

4 Sep, 2019 01:16 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సందర్భం

కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులు రమేష్‌ పోఖ్రియాల్‌ నిషాంక్‌ ఎక్కడ మాట్లాడినా పురాతన విషయాలనే ప్రచారం చేస్తున్నారు. మే 30న మోదీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడే విద్యారంగంలో హిందుత్వ ప్రచారాన్ని ముమ్మరం చేయడానికే ఆయన్ను నియమించినట్లు తెలిసిపోయింది. అప్పటి నుండి అయన అదే పనిలో ఉన్నారు కూడా. గత ఆగస్టు పదో తేదీన బాంబే ఐఐటీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ‘ఆయుర్వేద ఆద్యుడు చరకుడే అణువు, కణమును కనిపెట్టాడని, కానీ వాటిని కనిపెట్టింది గ్రీకు తత్వవేత్త డెమోక్రిటిస్‌ అని పాశ్చాత్యులు ప్రచారం చేసుకున్నార’ని చెప్పి ఆశ్చర్యపరిచారు. 

ఆగస్టు 27న ఖరగ్‌పూర్‌ ఐఐటీ స్నాతకోత్సవ సభలో చేసిన ప్రసంగంలో ‘ప్రపంచంలో మొదటి భాష సంస్కృతమేనని, కాదని ఎవరైనా అనగలరా’ అని సవాల్‌ చేశారు. ‘సంస్కృతం శాస్త్రీయ భాష అయినందున భవిష్యత్తులో మాట్లాడే కంప్యూటర్లు అంటూ వస్తే అవి సంస్కృత భాషలోనే అని సెలవిచ్చారు. వేదాల కంటే మొదటి గ్రం«థం ఇంకేదైనా ఉందని ఎవరైనా చెప్పగలరా’ అని కూడా ప్రశ్నించారు. ‘శ్రీలంకకు సముద్రంపైన రామసేతు నిర్మించిందెవరు? అమెరికా, బ్రిటన్‌ ఇంజనీర్లా? భారతీయ ఇంజనీర్లే అని చెప్పాలి కదా. ఇలాంటి విషయాలపై పరిశోధనలు చేసి రుజువు చేయాల్సిన బాధ్యత ఐఐటీయన్లదేన’నీ కర్తవ్యబోధ కూడా చేశారు. ఆగస్టు పదహారున ఢిల్లీలో ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ ‘శిక్షా సంస్కృతీ ఉత్తాన్‌ న్యాస్‌’ నిర్వహించిన జ్ఞానోత్సవ్‌ కార్యక్రమంలో సైన్స్‌ టెక్నాలజీలో మనమే ఫస్ట్‌ అన్నారు. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని న్యూటన్‌ కంటే ముందు మన దేశంలోనే కనిపెట్టారని ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే విద్యామంత్రి పోఖ్రియాల్‌ విద్యార్హతల విషయం చర్చనీయాంశంగా మారింది. కేంద్రమంత్రిగా చేసిన ప్రమాణ పత్రంలో  ‘డాక్టర్‌ రమేష్‌ పోఖ్రియాల్‌ నిషాంక్‌‘ అని పేర్కొనడం తప్పు అని, అందువలన అయన ప్రమాణాన్ని రద్దు చేయాలని  హిమాచల్‌ప్రదేశ్‌ బీజేపీ రెబెల్‌ లీడర్‌ మనోజ్‌ వర్మ రాష్ట్రపతి రామనాథ్‌ కోవిందుకి ఆగస్టు 27న ఫిర్యాదు చేశారు. ‘ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ ఫర్‌ కాంప్లిమెంటరీ మెడిసిన్స్, కొలంబో’ నుండి పొందినట్లు హరిద్వార్‌ నియోజకవర్గం నుండి పోటీకి సమర్పించిన అఫిడవిట్‌లో  రాసుకున్న ‘డాక్టరేట్‌’ ఫేక్‌ (నకిలీ) అని వర్మ తన ఫిర్యాదులో ఆరోపిం చాడు. అది పోఖ్రియాల్‌ని బదనాం చేయాలనే దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణ మాత్రమేనని మానవ వనరుల మంత్రిత్వ శాఖ కొట్టిపారేస్తున్నా.. దానికి రుజువులున్నాయని వర్మ సవాల్‌ చేస్తున్నాడు. ఆ యూనివర్సిటీ ఇచ్చే డిగ్రీ, డిప్లమాలకు గుర్తింపు లేదని శ్రీలంక యూజీసీనే ప్రకటించిందని, అసలా యూనివర్సిటీని భారత ప్రభుత్వం గుర్తించలేదని వాదించాడు. 

అంతేకాదు, ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని హేమవతీ నందన్‌ బహుగుణ యూనివర్సిటీ నుండి పొందినట్లు పోఖ్రియాల్‌ పేర్కొన్న ఎమ్‌.ఏ. డిగ్రీ కూడా నమ్మదగింది కాదని గతంలో రాజేష్‌ మధుకాంత్‌ అనే అతను సమాచార హక్కు చట్టం ద్వారా రాబట్టే ప్రయత్నం చేసిన విషయాన్నీ ప్రస్తావించాడు. ఆ విషయంలో 2016లో సెంట్రల్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ మాడభూషి శ్రీధరాచార్యులు ఆర్డర్‌ వేసినా సమాధానం రాలేదనే విషయాన్ని గుర్తుచేశాడు. అవిగాకపోయినా, కేంద్ర విద్యామంత్రికి ఇంకా నాలుగు డిగ్రీలు ఉన్నట్లు ఎంహెచ్‌ఆర్డీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో వివరించినట్లు ’ది ప్రింట్‌’ వెబ్‌ పేపర్‌ పేర్కొన్నది. 

ఒకవైపు దేశమంతటా అలజడి రేపుతున్న వివిధ యూనివర్సిటీల పేరుతొ వెలువడుతున్న నకిలీ సర్టిఫికెట్ల సమస్యపై విచారణ కమిటీ వేయాలని మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆగస్టు 30న యూజీసీని కోరింది. మరోవైపు విద్యామంత్రి సర్టిఫికెట్లే వివాదంగా మారాయి. అధికారంలో ఉన్నవారిపై వచ్చే ఆర్థిక నేరారోపణలు అలా పక్కనపెట్టండి..  నకిలీ విద్యార్హతలు కలిగి ఉండడం అవినీతి కాదా అనే ప్రశ్నకూడా సమంజసమైందే. విద్యామంత్రి విద్యార్హతలే వివాదంగా మారితే దేశంలో నకిలీ సర్టిఫికెట్ల దందా బంద్‌ అవుతుందని ఆశించగలమా? 


వ్యాసకర్త: నాగటి నారాయణ, విద్యారంగ విశ్లేషకులు
మొబైల్‌ : 94903 00577

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా