నాలుగేళ్ల నగుబాటు

29 May, 2018 00:52 IST|Sakshi

రెండో మాట 

యువతకు ఉద్యోగావకాశాల కల్పన ద్వారా దేశంలో నిరుద్యోగం పారదోలుతామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటించింది. దీనితో సహా పారిశ్రామిక, వ్యవసాయ, కార్మిక రంగాలకు, దళిత, బహుజన వర్గాలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలు అన్నీ గుంటపూలు పూస్తున్నాయి. కానీ కుట్ర రాజకీయాల ద్వారా పేదరికాన్ని, దుర్భర దారిద్య్రాన్ని మరుగుపరిచేందుకు ప్రసిద్ధ సర్వే సంస్థల అంచనాలను కూడా పెట్టుబడి వ్యవస్థ (అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ) పాలకులు తారుమారు చేసే స్థితికి ఒడిగట్టడం కనిపిస్తున్నది. ఇందుకు ఉన్న ఉదాహరణలు ఒకటీ రెండూ కాదు.

‘చట్ట విరుద్ధంగా అపారమైన ధనరాశులను సంపాదించుకున్నవారు మాత్రమే అపవిత్ర కూటమిగా, అపవిత్ర కలయిక కోసం చేతులుకలుపుతున్నారు. కానీ ఒక్క బీజేపీకి మాత్రమే పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంట్‌ దాకా దేశ వ్యాప్తంగా 1500 మంది లెజిస్లేటర్లున్నారు. గత నాలుగేళ్లుగా బీజేపీ మాత్రమే కేంద్రంలో అవినీతి రహిత ప్రభుత్వాన్నీ నిజాయితీగల పాలననూ అందించింది.’– నరేంద్ర మోదీ (నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా 26న కటక్‌లో జరిగిన సమావేశంలో. అమిత్‌షా కూడా ఇలాంటి ప్రకటనే ఇచ్చారు)

‘దేశ ప్రజలకు ఇప్పుడు బీజేపీ (మోదీ) నాయకత్వం ఒక కొత్త తరహా అధికార ఉన్మత్త రూపాన్ని చూపిస్తున్నది. ఒక పద్ధతి ప్రకారమే నిరంతరం దాడులు జరుగుతున్నాయి. కనుకనే ప్రజలు నిరంతరం జాగరూకులై ఉండి పోరాడవలసిన సమయం వచ్చింది. రాజ్యాంగం ప్రకారం ద్రవ్య సంబంధమైన బిల్లులపై నిర్ణయాధికారం రాజ్యసభకు లేకపోయినా సభ ప్రతిపత్తిని కాస్తా మోదీ ప్రభుత్వం దిగజార్చింది. చివరికి న్యాయవ్యవస్థ కూడా పలు ప్రకటనల ద్వారా, తీర్పుల ద్వారా ఆ వ్యవస్థపైన మన విశ్వాసాన్ని దిగజార్చింది. తీర్పుల విలువ పడిపోయింది. దీనికి కారణం– పాలకుల నుంచి పనిగట్టుకుని ఒక పద్ధతి ప్రకారం చేసే దాడులకు న్యాయ వ్యవస్థ గురికావడమే. ఈ దాడులను సహించడానికి పౌరులు అలవాటుపడేలా బీజేపీ ప్రభుత్వం చేస్తోంది’.
– (హైదరాబాద్‌లో 25–5–18న జరిగిన తన నూతన గ్రంథ ఆవిష్కరణ సభలో బీజేపీ నేత, మాజీ మంత్రి, ప్రసిద్ధ పాత్రికేయుడు అరుణ్‌ శౌరి)

అబద్ధాన్ని అదేపనిగా వల్లిస్తే ప్రజలు నమ్ముతారన్నది ఫాసిస్ట్‌ గోబెల్స్‌ వ్యూహం. కేంద్రంలో నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంలో బీజేపీ నేతలు ప్రారంభించిన ఊదర కూడా అలాంటిదే. అందులో వాస్తవం ఎంతో దేశ ప్రజలకు ప్రత్యక్షానుభవమే. ఏ రంగాన్ని చూసినా ఇంతే. ఆఖరికి ‘బీజేపీకి మాత్రమే 1,500 మంది చట్టసభల సభ్యులు ఉన్నారు’ అన్న మోదీ ప్రకటన కూడా పెద్ద అబద్ధం. ఇలాంటి గప్పాల విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు తేడా మాత్రం లేదు. పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థలో విలువల కోసం దుర్భిణీ వేసి వెతుక్కోవడమే తప్ప ఫలితం ఉండదు.

 
దేశవ్యాప్తంగా 1,500 మంది చట్టసభల సభ్యులు అంటూ ప్రధాని వినిపించిన మాటలోని తర్కాన్ని విడమరిచి చూడాల్సిందే. ఎందుకంటే అందులో కనిపించే వాస్తవం వేరు. 29 రాష్ట్రాలలోని పది శాసనసభలలో మాత్రమే బీజేపీకి ఆధిక్యత ఉంది. అసలు దేశంలో ఉన్న శాసనసభ స్థానాల సంఖ్య 4,139. ఇందులో బీజేపీకి దక్కినవి 1,516. నిజానికి బీజేపీ పాలిత రాష్ట్రాలలో దక్కినవి (గుజ రాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌) 950. సిక్కిం, మిజోరం, తమిళనాడు సభలలో సున్న. మిగిలినచోట్ల ఆ పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయో చూడండి!

శాసనసభ     మొత్తం సీట్లు    బీజేపీకి దక్కినవి 

ఆంధ్రప్రదేశ్‌           175          4
తెలంగాణ             119         5
కేరళ                   140         1
పంజాబ్‌               117         3
ప. బెంగాల్‌           294         3
ఢిల్లీ                       70         3
ఒడిశా                  147       10
నాగాలాండ్‌              60       12

బీజేపీ భాగస్వామ్యం ఉన్న రాష్ట్రాలు

మేఘాలయ      60            2
బిహార్‌            243          53
జెకె                  87         25
గోవా                40         13
అయినా కొంతమంది విర్రవీగుడికి కారణం కనిపించదు. ఇలాంటి ధోరణి గతంలో హిట్లర్‌ జర్మనీలో కూడా ఉండేది. అతడి అనుచరులు తమ బలాన్ని ప్రదర్శించడానికి అనుసరించిన మార్గాల్లో ఒకటి– కోట్ల మంది నిరుద్యోగ యువకుల అండదండలు ఉన్నాయని ప్రకటించడం. వారే తమ సైన్యమని చెప్పుకోవడం. ఇక్కడ బీజేపీలో చోటామోటా నేతలు కూడా తమ పార్టీకి 11 కోట్ల మంది సభ్యులు ఉన్నారని ప్రచారం చేయడం తెలిసిందే.

యువతకు ఉద్యోగావకాశాల కల్పన ద్వారా దేశంలో నిరుద్యోగం పారదోలుతామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటించింది. దీనితో సహా పారిశ్రామిక, వ్యవసాయ, కార్మిక రంగాలకు, దళిత, బహుజన వర్గాలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలు అన్నీ గుంటపూలు పూస్తున్నాయి. కానీ కుట్ర రాజకీయాల ద్వారా పేదరికాన్ని మరుగు పరిచేందుకు ప్రసిద్ధ సర్వే సంస్థల అంచనాలను కూడా పెట్టుబడి వ్యవస్థ (అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ)పాలకులు తారుమారు చేసే స్థితికి ఒడిగట్టడం కనిపిస్తున్నది. ఇందుకు ఉదాహరణలు ఒకటీ అరా కాదు.

అపార ధనరాశులు సంపాదించుకున్నవారంతా ప్రతిపక్షాలలోనే ఉన్నట్లు మోదీ చిత్రిస్తున్నారు. కానీ అనేక సాధికార సర్వేల ప్రకారం నేడు దేశంలో ధనిక పార్టీ బీజేపీ అని తేలింది. అంతేగాదు, ‘అవినీతిపరుల’ సంఖ్యలో బీజేపీ కాంగ్రెస్‌ను మించిపోయిందనీ, కాంగ్రెస్‌ పాలనలో మాదిరి నేటి బీజేపీ పాలనలో కూడా లెజిస్లేటర్లు (పార్లమెంటు/శాసనసభల్లో) ఎక్కువ సంఖ్యలోనే కేసులు ఎదుర్కొంటున్న అవి నీతిపరులున్నారనీ ‘ఏటీఆర్‌’ నివేదికలు వెల్ల డించాయి. అందుకనే ప్రసిద్ధ ఆర్థిక నిపుణుడు, ఉదారవాద ప్రజాస్వామ్యవాది యాశ్చ మౌనిక్‌ మాటలు ఇక్కడ గుర్తు చేసుకోవాలి. రబ్బరులాగా ఎటుపడితే అటు సాగుతూ, ఆకర్షణీయంగా ఉండే ‘ప్రజల’నే పదాన్ని సృష్టించడానికీ ఆ పేరుతో మోసగించడానికీ పునాది ‘రాజు దైవాంశ సంభూతుడన్న’ సిద్ధాంతమేనని అంటారాయన. రబ్బరులాగా సాగే ఆ పదాన్ని ఆసరా చేసుకుని ‘జన సమ్మతమైన వ్యక్తి’ పేరుతో దూసుకువచ్చే నాయకులు కొందరుంటారని (‘ప్యూపుల్స్‌ వర్సెస్‌ డెమోక్రసీ’ గ్రంథంలో) కూడా ఆయన చెప్పారు. నాయకులు ఎంతటివారైనా ప్రజ లపై తమకుగల పరిమితాధికారానికీ, ప్రజలపట్ల జవాబుదారీ (పూచీ)తనానికీ మధ్య ఉండాల్సిన సమతుల్యతను తుంగలో తొక్కేస్తుంటారు. అలాంటివాళ్లు అల్లిన కట్టుకథే ‘పాపులిజం’ అని కూడా ఆయన అన్నాడు. 

దీనిని బట్టి బేరీజు వేసుకున్నప్పుడు ఈ నాలుగేళ్ల పాలనలో ప్రజా బాహుళ్యం నడుం విరిచిన తొలి నిర్ణయమే ‘నోట్ల రద్దు’. కరెన్సీ చెలామణిని నిర్వహిస్తూ, శాసించే రిజర్వు బ్యాంకును సహితం పక్కన పెట్టేసి తీసుకున్న ఆ నిర్ణయం పార్లమెంటునూ, దేశ ప్రజలనూ చకితులను చేసింది. పాత, కొత్త గవర్నర్లు పెక్కుమంది మోదీ ప్రభుత్వ చర్య పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలకుల అనాలోచిత చర్యల పర్యవసానాన్ని ముందే పసిగట్టిన నాటి ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ రాజీనామా చెయ్యాల్సి వచ్చింది, తరువాత గుజరాత్‌నుంచి పట్టుకొచ్చిన ఊర్జిత్‌ పటేల్‌గానీ, ప్రధాని మోదీగానీ, చివరికి ఆర్థిక మంత్రిగా అరుణ్‌ జైట్లీగానీ పార్లమెంటరీ కమిటీ ముందుకు వచ్చి ఈ పరిణామానికి వివరణ ఇవ్వకుండా తప్పించుకుంటూ వచ్చారు.

ఇలా బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్లలోనూ తీసుకున్న నిర్ణయాలతో గ్రామీణ మధ్యతరగతి ప్రజలను, నిత్య వ్యవహారాలలో నగదు (క్యాష్‌) లావాదేవీలపై ఆధారపడే వ్యవసాయదారులను, చిన్న వ్యాపారులను నానా యాతనలకు గురిచేశారు. ఏటీఎంలు మూతపడ్డమే కాదు, అసలు పబ్లిక్‌ రంగ బ్యాంకులే ‘నో క్యాష్‌’ బోర్డులతో (నేటికీ) ‘స్వాగతం’ పలుకుతూనే ఉన్నాయి. ఇక జీఎస్టీ విధానంతో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీయడమేగాక, ద్రవ్య వ్యవహార లావాదేవీలను నియంత్రించి, విధాన నిర్ణయాలకు రూపకల్పన చేసే ఫైనాన్స్‌ కమిషన్‌ ప్రతిపత్తిని కూడా దిగజార్చేశారు. దేశీయ తయారీ (మాన్యుఫ్యాక్చరింగ్‌) పరిశ్రమల్ని దేశీయంగానే ఉత్పత్తి ఇతోధికం చేసేందుకు (మేకిన్‌ ఇండియా) పథకాన్ని రూపొందించినట్టే రూపొం దించి, దేశవాళీ ఉత్పత్తులంటే అర్థం మన దేశంలోకి విదేశీ గుత్త పెట్టుబడి వర్గాలను ఆహ్వానించి వారిచేత ‘దేశీయ ఉత్పత్తులు’ నిర్వహించే పరాధార దుస్థితికి ‘ఆహ్వాన పత్రిక’గా మార్చారు. ప్రధానిగా తొలినాటి విదేశీ పర్యటనల్లోనే మోదీ పోర్చుగీస్‌ దోపిడీ వ్యాపారులైన అందరూ ‘వాస్కోడిగామాలై ఇండియాకు తరలి రమ్మని’ పిలుపిచ్చారని మరవరాదు.

ఇక భావ ప్రకటనా స్వేచ్ఛకు, రాజ్యాంగం హామీపడిన మతాతీత సెక్యులర్‌ సోషలిస్టు, ప్రజాతంత్ర రిపబ్లిక్‌ ఎదుగుదలకు, దేశంలోని పౌరహక్కుల రక్షణకు పూచీ లేకుండా పోయింది. దళిత, జాతీయ మైనారిటీ బహుజనులపై ఏదో ఒక మిషపైన నిరంతర దాడులను, హత్యలను నర్మగర్భంగా ఆమోదించడమో, ఏమీ ఎరగనట్టు నటించడమో పాలకులకు అలవాటుగా మారడం, చివరికి ‘లవ్‌ జిహాద్‌’ ముసుగు కింది దౌర్జన్యకాండకు దిగడం– ఈ నాలుగేళ్లలోనే పరిపాటిగా మారడం గమనించాలి. ఇవన్నీ మనం సాకుతున్న పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థకు సహజ అవలక్షణాలని గుర్తించాలి. చివరికి సమాచార హక్కు చట్టాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం చెదలు పట్టిస్తోంది. ‘మంచి రోజులు రావడమంటే’ అర్థం (బ్రిటిష్‌ మాజీ ప్రధాని మాక్మిలన్‌ నినాదం ఇదే)– ఏమిటో ప్రపంచ ప్రసిద్ధ ఆర్థిక వేత్త సమీర్‌ అమీన్‌ ఇలా స్పష్టం చేశాడు.

‘‘పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రజలకు దుర్భరమైన దారిద్య్రాన్ని సృష్టించి పెట్టింది. అభివృద్ధి పేరిట ఇండియాలో జరిగే అభివృద్ధి– దేశంలోని కేవలం 15–20 శాతంమందికే పరిమితమవుతోంది, మిగతా 85 శాతం ప్రజా బాహుళ్యం దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్నది!’’
 
- ఏబీకే ప్రసాద్‌(సీనియర్‌ సంపాదకులు)
abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు