ప్రతిపక్షంలో ‘ప్రధాని’ ఎవరు?

28 Apr, 2019 00:29 IST|Sakshi

అభిప్రాయం

దేశంలో అయిదేళ్ల తన పరి పాలన తీరును చూసి ఓటు వేయమని ప్రధాని నరేంద్ర మోదీ ఒకవైపు.. ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియని కూటమి మరొకవైపు వెరసి ఎన్డీయే, యూపీఏ తిరిగి 2019 సార్వత్రిక ఎన్నికల్లో తలపడుతున్నాయి. కానీ, యూపీఏ కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరో నేటికీ జాడ తెలియటంలేదు. ఎన్‌డీఏ మాత్రం అత్యధిక ప్రజాదరణ కలిగిన మోదీని నమ్ముకుని సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం అయింది. ఇంకా ఏర్పడని మూడవ కూటమి ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో దానికి నాయకత్వం వహిస్తానని కేసీఆర్‌ ముందుకు వచ్చినప్పటికీ, ఏ ఇతర  పార్టీలూ ఆయనతో జత కట్టిన సందర్భం కనబడటం లేదు. ఎన్డీయే, యూపీఏలో లేని పార్టీలతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పరుస్తా అని ప్రకటించిన కేసీఆర్‌ ఇప్పటికైతే ఒంట రిగానే మిగిలారు. ఇక యూపీఏ సంగతి చూద్దాం.. యూపీఏకి నాయకత్వం వహిస్తున్న రాహుల్‌ని బలపర్చడానికి యూపీఏ కూటమిలో ఇతర పార్టీలు అంతగా ఆసక్తి చూపించడం లేదు.  రాహుల్‌ మినహా మరొక అభ్యర్థి యూపీఏలో కానరావడం లేదు.

వృద్ధతరానికి చెందిన శరద్‌పవార్, ఫరూక్‌ అబ్దుల్లా, మన్మోహన్‌సింగ్, ములాయంసింగ్‌ యాదవ్, దేవెగౌడ, లాలూప్రసాద్‌ యాదవ్‌.. రిటైర్మెంట్‌కి చేరువలో ఉన్నారు కనుక వీరందరూ ప్రధాని అభ్యర్థిత్వానికి పోటీలో ఉన్న దాఖలాలు లేవు. రాహులే మా ప్రధాని అభ్యర్థి అని కాంగ్రెస్‌ చెప్పినా యూపీఏలో ఉన్న మిగతా పక్షాలు పెద్దగా స్పందించటం లేదు. ఎన్డీఏ అభ్యర్థి ప్రధాని మోదీకి అసలు సిసలైన ప్రత్యర్థి ఎవరంటే యూపీఏ కూటమి చెప్పే పరిస్థితిలో లేదు. ఇక యూపీలో ఉండి లేనట్టే ఉన్న మాయావతి యూపీలో నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్నారు. బద్ధశత్రువులైన సమాజ్‌వాదీ పార్టీతో కలిసి తను కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి కొంతైనా సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు మాయావతి. యూపీలో గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన మాయావతి తిరిగి కోలుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. అందుచేత ఆమె ప్రధాని అభ్యర్థిగా పోటీలో లేనట్టే లెక్క.

తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా గెలవలేని జనసేన మాత్రం ప్రధానిగా మాయావతి మా అభ్యర్థి అని ప్రకటించడం విశేషం. ఇక మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్‌ రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు. అటు బీజేపీతో ఇటు కమ్యూనిస్టులతో ఒంటరి పోరాటం చేస్తూ బెంగాల్‌లో తన సత్తా చాటాలని చూస్తున్నారు. అందుచేత కాంగ్రెస్‌తో పోరాటం, బీజేపీతో పోరాటం, కమ్యూనిస్టులతో పోరాటం కాబట్టి ప్రధాని అభ్యర్థిగా సమర్థించడానికి అసలు సిసలైన నాయకులు లేరు మన చంద్రన్న తప్ప. ఇకపోతే చంద్రబాబు దగ్గరికి వద్దాం. అప్పుడెప్పుడో ప్రధాని అవ్వమంటేనే వద్దన్నా ఇప్పుడు ఇస్తానంటే వద్దం టానా అంటున్న బాబు పేరును ప్రధానిగా ప్రస్తావించే నాయకులు దేశంలో కరువయ్యారు. కానీ చంద్రన్న మాత్రం దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని వివిధ రాష్ట్రాల పర్యటనలో తలమునకలై ఉన్నారు. చెన్నైలో, బెంగళూరులో, బెంగాల్లో, ఢిల్లీలో ప్రెస్‌మీట్‌లు పెడుతూ ప్రత్యేక విమానంలో చక్కర్లు  కొడుతున్నారు.

ఇంకా ముఖ్యమైన విషయం... కాంగ్రెస్‌కు కూటమిలోని పార్టీలకు చాలా విషయాలలో పడదు. కాంగ్రెస్‌కు దేశంలోని ప్రధాన ప్రతిపక్షాలకు, ప్రాంతీయ పార్టీలకు మధ్య పడదు. అలాగే వీటికీ కాంగ్రెస్‌ అంటే పడదు. ఇంత గందరగోళం మధ్య యూపీఏతో కలిసివచ్చే పార్టీల కన్నా, కలసిరాని బలమైన పార్టీలే ఎక్కువ. ప్రస్తుతం దేశంలో ప్రధాని  మోదీకి ప్రత్యామ్నాయం కనుచూపుమేరలో కానరావట్లేదు. దేశంలో అనేక సర్వేల్లో ఇప్పటికీ ప్రధానిగా మోదీనే కావాలని 73 శాతం దేశప్రజలు కోరుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే మోదీ తన ప్రత్యర్థులు చేరుకోలేని విధంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో అందనంత ఎత్తులో ఉన్నారు. ‘సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌’  నినాదంతో బలమైన భారతదేశం నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తూ గత ఐదేళ్లలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోని ప్రధానిగా, సొంత డబ్బుతో తన ఇంటిఖర్చులు నిర్వహిం చుకుంటున్న ప్రధానిగా, రోజుకి 18 గంటలు పని చేస్తున్న ప్రధానిగా, దేశ రక్షణకు కాపలాదారుడుగా, ప్రజల డబ్బుకి కాపలాదారుడుగా, దేశ సరిహద్దుల కాపలాదారుగా, మహిళలకి  కాపలాదారుడుగా మీ ముందు ఉన్నా అంటూ భరోసా కల్పిస్తూ ప్రజలను ఓటు అడుగుతున్నారు ప్రధాని, చౌకీదారు నరేంద్ర మోదీ.

వ్యాసకర్త బీజేపీ సీనియర్‌ నాయకుడు
ఈ–మెయిల్‌ : raghuram.delhi@gmail.com
పురిఘళ్ల రఘురామ్‌

మరిన్ని వార్తలు