మెరుపులద్ది మరకలై మిగిలారు!

20 May, 2020 00:11 IST|Sakshi

విశ్లేషణ

‘ఈ నగరానికి మీరు కొత్త అనుకుంటాను / ప్రమాదం చూడగానే దారిలోనే ఆగిపోయారు’. ఇది బషీర్‌ బదర్‌ రాసిన కవిత. నగరం కోల్పోయిన ఆత్మను, నగర నివాసి అలక్ష్యం, నిర్లక్ష్య ధోరణి పట్ల కవి నేరారోపణకు ఈ కవితాపాదం ప్రతీక. ఒకప్పుడు నగరం ఆధునికతకు పట్టుగొమ్మగా ఉండేది. అది స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు నెలవుగా ఉండేది. ప్రజలు తమ కులనామాన్ని వదిలేసుకుని కుల వివక్షకు దూరమయ్యేవారు. ప్రతి ఒక్కరూ మెరుగైన జీవితం గడిపేందుకు అవకాశాలను కల్పించే స్థలం నగరం. మనుషులు తాము కోరుకున్నరీతిలో సరళమైన సంబంధాల్లోకి ప్రవేశించే చోటు నగరం. మిరుమెట్లు గొలిపే నగర విశేషాల వర్ణచిత్రాలు ప్రవాహ సదృశంగా ప్రజలను వలస బాట పట్టించేవి. భారతీయ నగరాలు, పట్టణాలు వలసలతో నిండిపోయేవి.

కానీ నగరంలోని అనుభవం అందరి స్వప్నాలను విషాదకరంగా కరిగించేసింది. నోరూరించే బ్రెడ్‌ నుంచి మైమరిపించే డిజైనర్‌ దుస్తుల వరకు వినియోగదారులను ప్రలోభపెట్టే అసంఘటిత ఆర్థిక వ్యవస్థకు చెందిన పనిస్థలాల్లో కాస్త పని సంపాదించుకోగానే.. వలస కూలీలు తెరిచివున్న మురికికాల్వలతో కూడిన, చెత్తాచెదారంతో నిండిపోయిన, ఆస్బెస్టాస్‌ రేకులతో కట్టిన పాడుపడిన షెల్టర్ల వంటి గుడిసెల్లో తమకూ కాస్త చోటు సంపాదించుకునేవారు. నగరాల్లోని మెరుపులు వలస కూలీలను చాలా దూరం నుంచి ఆకర్షించేవి. 

ముజఫర్‌ ఆలీ తీసిన మరుపురాని చిత్రం గమన్‌లో (1978), ముంబై టాక్సీ డ్రైవర్‌గా నటించిన ఫరూకీ షేక్‌.. నగరం తనది కాకుండా పోయిన అనుభవాన్ని అద్భుతమైన పాట ద్వారా తలపింపచేశాడు. ‘ఈ నగరంలో ఎందుకు ప్రతి ఒక్కరూ కలవరపడిపోతున్నారు? వారి హృదయం ఎందుకు దహించుకుపోతోంది? వారి కళ్లు తుపానులాంటి భావోద్వేగాలతో ఎందుకు నిండివుంటున్నాయి?’ నిజానికి నగరాలు, పట్టణాల్లోని గుడిసెవాసులే పరాయీకరణ భావంతో బాధపడటం లేదు. ఇర్ఫాన్‌ ఖాన్‌ 2013లో తీసిన ‘లంచ్‌ బాక్స్‌’ అనే గొప్ప సినిమాను గుర్తు చేసుకోండి. పట్ణణ ప్రాంతాల్లోని ఒంటరితనంపై దీనిలా చిత్రించిన సినిమా మరోటి లేదని చెప్పవచ్చు.

నగరం ఎన్నడూ సుఖప్రదంగా ఉండలేదు. సాహిత్యకారులు, నగర సామాజిక శాస్త్రవేత్తలు, కవులు, మానసిక నిపుణులు సల్పిన కృషి నగరంలోని అనిశ్చితిని, ద్వంద్వ ప్రవృత్తిని చెబుతూ వచ్చింది.  వ్యక్తి పురోగతి, భౌతిక ప్రయోజనాలు, స్వేచ్ఛకు నగరం ఒక కూడలిగా ఉండేది. నగరం ప్రగతికి, సృజనకు, సామాజిక మార్పుకు కేంద్ర స్థానం. కాని అదే సమయంలో నగరం వ్యక్తి నిరపేక్షతకు, సామాజిక నియమాల విచ్ఛిన్నతకు, ఒంటరితనానికి, మానసిక అవ్యవస్థకు మారుపేరుగా ఉండేది. మానసిక వ్యాధుల చికిత్స అనే విభాగం పూర్తిగా నగరాల్లోని పరిస్థితులు తయారు చేసిన ఉత్పత్తే అని చెప్పాలి.

జర్మన్‌ నగర సామాజిక శాస్త్రవేత్త జార్జి సిమ్మెల్‌ (1858–1918) సుప్రసిద్ధ రచన ’ది మెట్రోపోలిస్‌ అండ్‌ మెంటల్‌ లైఫ్‌’ (1908)లో నగరంలోని అత్యంత కీలకమైన లక్షణాలకు రూపమిచ్చారు. నగరం వ్యక్తిగత పురోగమనానికి అనేక అవకాశాలనిస్తుందన్నారు. అదే సమయంలో అది మితిమీరిన ఉత్తేజాలకు, ప్రేరణలకు కేంద్రంగా కూడా ఉంటుంది. ప్రజలు ఇతరులతో, తమతో తాము అనుసంధానం కావడాన్ని కరెన్సీ నోట్‌ మాత్రమే నిర్ణయిస్తుందని సిమ్మెల్‌ వర్ణించారు.

అయితే పాశ్చాత్య పండితుల అభిప్రాయాలను, అంచనాలను భారత్‌ ఎప్పుడూ తోసిపుచ్చుతూనే వచ్చింది. ఇక్కడ నగర పరిస్థితికి సంబంధించిన ప్రత్యేక లక్షణం అనేది లేదు. చాలా మంది భారతీయుల అభిప్రాయం ప్రకారం నగరం.. గ్రామీణ ప్రాంత పీడనకు ప్రతిరూపంగా ఉంటుంది. 2000 సంవత్సరంలో మోహన్‌దాస్‌ నిమిష్‌ రాయ్‌ తీసిన ‘అప్నే అప్నే పింజర్‌’ సినిమాలో చెప్పినట్లుగా,  బాంబేనగరంలో భయంకరమైన దారిద్య్రం, నిరుద్యోగం ఉంటున్నప్పటికీ, అక్కడ మనుషులను తోటి మనుషుల నుంచి విడదీసే గోడలు ఉండవు. నగరంలో కులం ఉండదని మోహన్‌ దాస్‌ చెప్పారు.

కానీ బాంబేలో కులం నిశ్శబ్దంగానే మనిషి జీవితంలో ప్రవేశిస్తుంటుంది. నగరవాసిగా అతడి అనుభవానికి అది రూపమిస్తుంది. నగరంలోని ఆలయం దళితులకు ప్రవేశం కల్పించేది కాదు. గ్రామీణ ప్రాంతాల్లో మాదిరి పాశవికతను కులపీడన ప్రదర్శించనప్పటికీ, అంటరానితనం అనే కళంకం నగరంలో కొనసాగుతుండేది. దళితులు తమ పనులు చేసుకోవాలంటే ఇప్పటికీ తమ కులాన్ని దాచుకోవలసిందే. ప్రత్యేకించి అగ్రకులాలకు సంబంధించిన కాలనీలో దళితులు జీవించాలని కోరుకుంటే అతడి కులపరమైన అస్తిత్వాన్ని దాచుకోవలసిందే. వారి కులం తెలిసిపోయిందంటే ఆ కాలనీ నుంచి సాగనంపుతారు కూడా.

నగరానికి సంబంధించిన మరొక పరిహాసాస్పద అంశాన్ని చూడండి. వలస కూలీలు నగరాలను నిర్మిస్తారు. కానీ ఆ నగరంలో వాళ్లకు కాస్తంత చోటు ఉండదు. ఇలాంటి సమయంలో వైరస్‌ వంటి వ్యాధులు దేశంపై విరుచుకుపడ్డాయనుకోండి, ఆర్థిక వ్యవస్థ లాక్‌ డౌన్‌ అవుతుంది. దయాదాక్షిణ్యాలు లేని చిన్నచిన్న పెట్టుబడిదారులు తమ కార్మికులకు తలుపులు మూసేస్తారు. నయాపైసా కూడా చేతిలో లేని కిరాయిదారులను నెల వారీ రెంట్‌ కక్కాల్సిందేనని గృహ పెట్టుబడిదారులు పీడిస్తారు.

ఆహారం కరువవుతుంది. పైగా అత్యంత దుర్బల వర్గాలపట్ల పాలకులు పరమ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తారు. భారతీయ ఆర్థిక వ్యవస్థ వలస కార్మికుడి భుజస్కంధాలపైనే ఆధారపడి ఉంది. కానీ ఈ ఆర్థిక వ్యవస్థ, రాజకీయ నాయకులు, సమాజం మొత్తంగా ఆపత్కాలంలో కార్మికుల అవసరాలను అసలు పట్టించుకోదు. ఫెమినిస్టులు గృహం అనే భావనను విమర్శిస్తుంటారు కానీ దోపిడీ స్వభావం కలిగిన ఆర్థిక వ్యవస్థలో, సమాజంలో అష్టకష్టాలు పడుతున్నవారికి ఇల్లు అనేది తమ ఉనికికి సంబంధించిన ప్రత్యేక అంశంగానే ఉంటూ వస్తోంది. 

ఉండటానికి కాస్త చోటు లేదా ఇల్లు లేదు అనే భావనే ఇప్పుడు వేలాది వలస కార్మికులు నగరాలను విడిచిపెట్టి జాతీయ రహదారులపై నడిచేలా చేస్తోంది. నడిచి నడిచి రక్తసిక్తమైన పాదాలు, తమకంటూ మిగిలిన వస్తువుల బరువుతో వంగిపోయిన వీపు, ఆశలు కోల్పోయిన కళ్లు, ఆకలితో కరచుకుపోయిన పొట్టలు, నీరు లేక పిడచ కట్టుకుపోయిన గొంతులు.. ఇవీ కాలిబాట పట్టిన మన వలస కార్మికుల గుర్తులు. చేతిలో కాస్త డబ్బు ఉంటే రోడ్డుమీద వెళుతున్న ట్రక్కులో వారు ప్రయాణించేవారు. కానీ వీరిలో చాలామంది వద్ద చిల్లిగవ్వ లేదు. సొంత ఊరు చేరుకుంటే ఆకలిదప్పులకు గురికాము అనే కాస్త ఆశ తప్ప మరేమీ వారికి ఇప్పుడు మిగిలిలేదు.

సంక్షోభకాలాల్లో నగరం ఆశ్రయమిస్తుందనే ప్రతి అంచనా ఇప్పుడు తల్లకిందులైపోయింది. కానీ రారమ్మంటూ వేలాది వలసకార్మికులను పిలుస్తున్న భారతీయ గ్రామాల పరిస్థితే ఇప్పుడు బాగుం డటం లేదు. పైగా అవి 1960లలో బాలీవుడ్‌ సినిమాలు వర్ణించిన ఊహాస్వర్గాలుగా మిగిలిలేవు. ఇప్పుడు భారతీయ గ్రామాలు చాలావరకు నిరాశానిస్పృహలకు, ఆకలిదప్పులకు నెలవుగా ఉంటున్నాయి. కానీ ఇన్నాళ్లుగా నగరాల్లో పనిచేసుకుంటూ బతికిన కోట్లాది మంది వలస కార్మికులకు తమ గ్రామమే సొంతిల్లులాగా కనిపిస్తోంది.

ప్రజలను తమ ఇళ్లతోపాటు తమ హృదయాలను కూడా వదులుకునేలా చేసిన పారిశ్రామిక విప్లవ కాలం నుంచి ఆధునిక పరిస్థితి అంటేనే ఆశ్రయం లేకుండా పోవడం అనే సత్యం ఇప్పుడు మరోసారి రుజువవుతున్నట్లుంది. మానవ చరిత్రలో ఇలాంటి పరిణామం గురించి కారల్‌మార్క్స్‌ అద్భుతంగా వర్ణించారు. ‘స్థిరపడి ఘనీభవించిన సంబంధాలన్నీ, వాటిని అంటిపెట్టుకుని వుండే పురాతన పూజ్య అభిప్రాయ, దురభిప్రాయాలన్నీ కొట్టుకుపోయాయి; కొత్తగా ఏర్పడే సంబంధాలూ, స్థిరపడకముందే పాతబడి పనికిమాలినవై పోతున్నాయి. గట్టిదనుకున్నదంతా కరిగి గాలిలో కలసిపోతున్నది. పవిత్రమనుకున్నదంతా మైలపడిపోతున్నది. చివరకు మానవుడు భ్రమలు తొలగించుకొని తన నిజమైన జీవన పరిస్థితులనూ, తోటి మానవులతో తనకుగల సంబంధాలనూ ఎదుర్కోక తప్పలేదు’.

19వ శతాబ్దంలో సంభవించిన తీవ్రమైన సామాజికపరమైన స్థానభ్రంశానికి.. మార్క్స్‌ సమాధిమీది రాతల్లాగా శాశ్వతత్వం కల్పిం చారు. రైతులు తమ పొలాలను, ప్రజలు తమ గృహాలను వదిలిపెట్టి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. అది నగరం కావచ్చు మరొక దేశం కావచ్చు. ఆ శతాబ్దంలో రష్యన్‌ రైతులు పట్టణాలకు వలసవెళ్లారు. ఐరిష్‌ ప్రజలు న్యూయార్క్‌కు, చికాగోకు వెళ్లారు. ప్రష్యన్లు బెర్లిన బాట పట్టారు. ఇక మన దేశంలోని తమిళులను ఒప్పందకూలీ లుగా దక్షిణాఫ్రికాకు, కరేబియన్‌కు పంపించారు. ఇక చైనా ప్రజలను నిర్బంధంగా ఆగ్నేయాసియా దేశాలకు కూలీలుగా పంపించారు. భవి ష్యత్తు స్పష్టమైంది. ఇక జీవితం పట్టణాల్లోనే ఉంటుంది.

కానీ మార్కెట్‌లాగే, నగరం కూడా కొనడం, అమ్మడం చేసేవారికోసమే ఉంటుంది. కొనలేని, అమ్మడానికి ఏమీలేని వారికి పట్టణం సరైన చోటు కాదు. ఇప్పుడు ఈ  2020లో భారత ప్రభుత్వం మన సమాజంలోని అత్యంత దుర్బలులైన ప్రజా బృందాన్ని గాలికి వదిలిపెట్టేయడం ద్వారా ఆ పాత సత్యం మరోసారి రుజువైంది. విషాదం ఏమిటంటే, మన కళ్లముందే జరుగుతూ వస్తున్న మానవీయ సంక్షోభానికి చెందిన మహా పాతకాన్ని గుర్తించడంలో మనం విఫలమయ్యాం.

‘బాటసారుల బిడారు సాగిపోతోంది. పాదచారుల పాదాలనుంచి రేగుతున్న దుమ్మును మనం నిశ్శబ్దంగా చూశాం.‘ వేలాది కార్మికులు తమ సొంత ఇళ్ల వైపు తరలిపోతున్నప్పుడు, మన నగరం ఇక ఎన్నటికీ ఆశ్రయమిచ్చే గృహంగా ఉండదని గుర్తించాం. వలస కూలీల మానసిక అవ్యవస్థకు, అశాంతికి, విచ్ఛిన్నతకు నగరం మూలమైంది. ఆకలిదప్పులతో తలపడుతున్న రైతులకు నెలవైన గ్రామం ఇది తమదీ అని భావిస్తున్న వారికి కూడా ఆశ్రయం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది. మరి వలస కార్మికులు ఆశపడుతున్న తమదైన ఇల్లు ఎక్కడుంది? లేదా ఇల్లు అనేది ఒంటరితనం నుంచి, పరాయీకరణ నుంచి మనల్ని కాపాడే ఒక భ్రమ మాత్రమేనా?
వ్యాసకర్త: నీరా చాంద్‌ హోకే, రాజనీతిశాస్త్రం విశ్రాంత ఆచార్యులు, ఢిల్లీ యూనివర్శిటీ

మరిన్ని వార్తలు