మరణించే హక్కు గురించి మాట్లాడే నవల

19 Feb, 2018 00:19 IST|Sakshi

తన అంతర్జాతీయ కచేరీ పర్యటనకి మూడు వారాల ముందు, ఆత్మహత్యా ప్రయత్నం చేయడంతో, హాస్పిటల్లో చేరిన ఎలిఫ్రిడీ (ఎల్ఫ్‌)తో నవల ప్రారంభం అవుతుంది. ఆమె ప్రపంచ ప్రసిద్ధి పొందిన పియానిస్ట్‌. డబ్బున్నది. ప్రేమించే భర్త్‌ నిక్‌ ఉంటాడు. కానీ, మానసిక వ్యధతో బాధపడుతూ, మరణించాలన్న ప్రగాఢమైన కోరిక ఉన్న స్త్రీ. చనిపోయేందుకు– కడుపు మాడ్చుకోవడం, నిద్ర మాత్రలు మింగడం, మణికట్టు కోసుకోవడం, బ్లీచ్‌ తాగడం వంటి ప్రయత్నాల్లో వేటినీ వదలదు. ‘ఎల్ఫ్‌ చనిపోవాలనుకుంది కానీ తను బతకాలన్నది నాకోరిక. మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకునే శత్రువులం’ అన్న చెల్లెలు యోలాండా (యోలీ) జీవితం ఆటుపోట్లకి గురైనది.

కథనం ఆమె స్వరంతోనే వినిపిస్తుంది. అక్కను చుట్టుముట్టిన చీకటి గురించి తెలిసిన యోలీని, కారుణ్య మరణం చట్టబద్ధం అయిన స్విస్‌ క్లినిక్కి తనను తీసుకెళ్ళమని ఎల్ఫ్‌ అడుగుతుంది. తను వొప్పుకున్నా లేకపోయినా కూడా, ఎల్ఫ్‌ ఆత్మహత్యా ప్రయత్నం ఎప్పుడో అప్పుడు నెరవేరుతుందని గ్రహించిన యోలీ – అక్కకి సహాయపడ్డానికే నిశ్చయించుకుంటుంది. కానీ, బాంక్‌ ఆమెకి లోన్‌ ఇవ్వదు. ఎల్ఫ్‌కూ, నిక్‌కూ ఉమ్మడి ఖాతా ఉండటం వల్ల ఆ ప్రయాణాన్నిభర్తనుంచి దాయడం ఎల్ఫ్‌కు కుదరదు.

తన పుట్టినరోజు జరుపుకోడానికి ఎల్ఫ్‌ హాస్పిటల్‌ నర్సుల అనుమతి తీసుకుని బయటకెళ్ళి, నిక్‌తో పాటు విందు భోజనం చేసి, పుస్తకాలు తెమ్మని అతన్ని లైబ్రరీకి పంపుతుంది. ఎదురుగా వస్తున్న రైలు కింద తల పెట్టేసి, ఆత్మహత్య చేసుకోవడంలో కృతకృత్యురాలవుతుంది. తన జీవిత బీమా డబ్బుని యోలీకి వదిలిపెడుతుంది.  ఎల్ఫ్‌ తండ్రి కూడా ఇదే విధానంలో, 12 సంవత్సరాల కిందట తన మరణాన్ని ఎంచుకుంటాడు. అక్కచెల్లెళ్ళ పల్లెటూరి బాల్య జ్ఞాపకాలని రచయిత్రి  స్పష్టంగా, శక్తిమంతంగా వర్ణిస్తారు.

కథనం– సానుభూతికీ, పరిహాసానికీ మధ్య ఊగిసలాడుతుంది. మితిమీరిన విషాదం కనిపించక, పదునైన చమత్కారం కనబడుతుంది. కొన్ని చోట్ల నవ్విస్తుంది కూడా. అందుకే నవల విషాదకథల జోన్రాలోకి మాత్రం రాదు. కథాంశం తక్కువా, అస్పష్టమైన కవిత్వం ఎక్కువా ఉన్న ఈ నవల నిజాయితీగా అనిపిస్తుంది. కెనడియన్‌ రచయిత్రి మిరియమ్‌ తియస్‌ దీన్లో కొటేషన్‌ మార్క్స్‌ ఉపయోగించరు. అందువల్ల, ఏ పాత్ర మాట్లాడుతోందో, అది పలికిన మాటో, ఆలోచనో అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. నవల ఆఖరున రచయిత్రి డి.హెచ్‌.లారెన్స్‌ను ఉటంకిస్తారు: ‘ఎన్ని ఆకాశాలు మీద పడ్డా సరే, మనం బతకక తప్పదు.’
‘జీవితంతో అలిసిపోవడం వల్ల మరణాన్ని ఎంచుకోవడం సహేతుకమైనదేనా! మనం ప్రేమించే వారిపట్ల మనకే బాధ్యత ఉండదా?’ అన్న ఎన్నో ప్రశ్నలని పుస్తకం సంధిస్తుంది. చనిపోయే ఎంపికా, ఆత్మహత్యకు
సంబంధించిన అవమానం ఎదురుకోవడం అన్న అంశాలు నవల నేపథ్యానికి ఆయువుపట్టు. బ్రిటనీ మేనార్డ్‌ మొదలుపెట్టిన ‘మరణించే హక్కు’ ఉద్యమం ఊపందుకున్న తరువాత, ఈ పుస్తకం 2014లో విడుదల
అయింది. ఇది రచయిత్రి ఆరవ నవల. తియస్‌ పుస్తకాలు ఎక్కువగా మానసిక వ్యాధులకి సంబంధించినవే.

ఈ స్వీయ చరిత్ర 2014లో ‘రోజర్స్‌ ట్రస్ట్‌ ఫిక్షన్‌’ బహుమతి పొంది,‘స్కాటియా బాంక్గిలర్‌’బహుమతికి షార్ట్‌ లిస్ట్‌ అయింది. తదుపరి రెండేళ్ళలో మరెన్నో బహుమతులు కూడా గెలుచుకుంది. ఆడియో పుస్తకం కూడా ఉంది.

కృష్ణ వేణి

మరిన్ని వార్తలు