మరణభయం?

15 May, 2018 03:36 IST|Sakshi

మనిషికి ఉన్న భయాలన్నింటిలోకి అతి పెద్దది మరణభయం. సరిగా చెప్పాలంటే ఉన్న ఒకే ఒక భయం ఇది అని చెప్పవచ్చు. ఎన్నిటికో భయపడుతున్నామని అనుకుంటారు. అవన్నీ మరణంతో ముడిపడి  ఉంటాయి. ఆ ఒక్క భయం లేకపోతే ఇక భయాలే ఉండవు. నాకు పామంటే భయం అన్నారనుకోండి. అది కాటు వేస్తే  చనిపోతామన్నది అసలు భయం. అది కాటు వేసినా ఏమీ కాదు అని నిశ్చయంగా తెలిసినపుడు భయపడరు. అలాగే చాలామందికి రోగమంటే భయం. రోగం వస్తే చనిపోతామని భయం. ఆస్పత్రులకి వెళ్ళటానికి భయపడే వాళ్ళకి ఉన్నది కూడా మరణభయమే. అక్కడ కనపడే దృశ్యాలు చాలావరకు అటువంటివే కదా! ఇక ఎవరైనా చనిపోయారంటే ఆ చాయలకే వెళ్లరు ఎంతో మంది. ఇలా చూస్తే ఏ భయానికైనా అసలైన కారణం మరణం.

మరణం అంటే భయం ఎందుకు? అది తెలుసుకోటానికన్నా ముందు అసలు భయం అంటే ఏమిటి? అన్నది తెలియాలి? తెలియకపోవటమే భయహేతువు. చీకటిలోకి వెళ్లటానికి ఎందుకు భయపడతాం? అక్కడ ఏమున్నదో తెలియదు కనుక.  అనుకోకుండా విద్యుత్తు పోయి చిమ్మచీకటి అయిపోతే, సొంత ఇల్లు అయినప్పుడు తడుముకుంటూ వెళ్ళి దీపం వెలిగించే ప్రయత్నం చేస్తాం. భయపడం. కారణం? మన ఇంట్లో ఏవి ఎక్కడ ఉంటాయో తెలుసు. అదే కొత్తచోటు అయితే అడుగు ముందుకి వెయ్యటానికి ధైర్యం ఉండదు. ఈ రెండు రకాల ప్రవర్తనలకి కారణం – అక్కడ ఉన్నది తెలియటం, తెలియక పోవటం మాత్రమే. మరణం విషయం కూడా అంతే!

శరీరం వదిలిన తరువాత ఏం జరుగుతుంది? అన్నది సూచన మాత్రంగానైనా తెలిస్తే భయానికి అవకాశం తక్కువ. అది రహస్యంగా ఉండటం ఎన్నో ఊహలకి కారణం అవుతోంది. ఆ రహస్యం ఛేదించటానికే ప్రపంచంలోని అందరు తత్త్వవేత్తలు, సాధకులు ప్రయత్నం  చేశారు. తర్వాత ఏమిటి? అన్నది తెలిస్తే ఉత్కంఠ ఉండదు. ఉత్సాహం నీరుగారి, నిర్లిప్తత చోటు చేసుకుంటుంది. అరమరుగు ఉంటేనే దేనికైనా అందం. మరణం దానికి అపవాదం కాదు. అందుకే దానిపై ఎన్నో ఊహపోహలు. భయాలు.
-డాక్టర్‌ ఎన్‌. అనంతలక్ష్మి

మరిన్ని వార్తలు