పెద్ద చదువు పెద్ద ఆందోళన

24 Mar, 2020 00:41 IST|Sakshi

ఈ రుణభారం వారి కుటుంబ జీవితం ప్రారంభించడాన్ని ఆలస్యం చేయొచ్చు, కొత్త ఇల్లు కొనడాన్ని వాయిదా వేయొచ్చు, ఉద్యోగ విరమణ తర్వాతి పెట్టుబడులను ప్రభావితం చేయొచ్చు. ఇంతకుమించి, ఈ నిర్ణయాలన్నీ తీసుకోవడంలో వారు పడే మానసిక ఆందోళన వెల కట్టలేనిది. 

ఏ పెద్ద చదువు లేని వాళ్లు కూడా చెప్పగలిగే అంశం ఏమిటంటే, పెద్ద చదువులు చదివినవాళ్లు పెద్దగా సంపాదిస్తారు అని. దీన్నే నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కాలేజెస్‌ అండ్‌ ఎంప్లాయర్స్‌ (అమెరికా) సర్వే చేసి మరీ ప్రకటించింది. ఒక సబ్జెక్టులో బ్యాచిలర్‌ డిగ్రీ ఉన్నవాళ్లకంటే, అదే సబ్జెక్టులో మాస్టర్‌ డిగ్రీనో, డాక్ట రేటో ఉన్నవాళ్లు ఎక్కువ జీతంతో తమ ఉద్యోగాన్ని మొదలుపెడుతున్నారు. అయితే, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీకి చెందిన జేమ్స్‌ పైన్, విస్కా న్సిన్‌–మాడిసన్‌ యూనివర్సిటీకి చెందిన ఎరిక్‌ గ్రాడ్‌స్కీ మాత్రం ఈ విషయాన్ని ఇంకోలా చూస్తున్నారు. ఈ సోషియాలజిస్టులు కూడా విద్యాధికులు ఎక్కువగా సంపాదిస్తున్నారని ఒప్పుకుంటూనే, ఈ మొత్తం ప్రక్రియలో ఉన్న సంక్లి ష్టత మీద దృష్టి పెడుతున్నారు.

గణితం, సైన్స్, ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ల్లో మాస్టర్‌ డిగ్రీ ఉన్నవాళ్లు, అదే సబ్జెక్టు ఆధారిత ఉద్యోగాల్లో యేటా సుమారు 75,000– 79,000 అమెరికా డాలర్ల ప్రారంభ వేతనం పొందు తున్నారు. ఇవే సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉన్నవాళ్ల కంటే ఈ వేతనాలు సుమారు 10–30 శాతం ఎక్కువ. ఒకవేళ వారు డాక్టరేట్‌ కూడా చేసివుంటే, వారి కెరి యర్లు లక్ష అమెరికా డాలర్లతో ప్రారంభమైనా ఆశ్చర్యం లేదు. అదే బ్యాచిలర్‌ డిగ్రీ ఉన్నవాళ్ల జీతాలు 62,500–70,000 అమెరికా డాలర్ల మధ్య  ఉండొచ్చు. ఈ అంతరాన్ని ‘అడ్వాన్స్‌డ్‌ డిగ్రీ వేజ్‌ ప్రీమియం’ అని పిలుస్తున్నారు జేమ్స్‌ పైన్, ఎరిక్‌ గ్రాడ్‌స్కీ.

అయితే, ఎంత పై చదువులకు వెళ్తూంటే అంత అప్పులు అవుతున్నాయి. హైస్కూలు అయిపోగానే అమెరికా విద్యార్థులు అండర్‌గ్రాడ్యుయేట్‌ చదువుల కోసం సుమారు 13,500 డాలర్ల రుణం తీసుకుం టున్నారు. 6 శాతం వడ్డీతో నెలకు 500 డాలర్ల చొప్పున ఇది రెండున్నరేళ్లు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత బ్యాచిలర్‌ డిగ్రీ కోసం ఈ అప్పు 25,000 డాలర్లు ఉంటుంది. అదే 6 శాతం స్థిర వడ్డీతో నెలకు 500 చొప్పున దీన్ని తీర్చడానికి ఐదేళ్లు పట్టొచ్చు. తర్వాత మాస్టర్‌ డిగ్రీ కోసం 70,000 డాలర్లు గనక తీసుకుంటే, ఇది మొత్తం తీరడానికి ఇరవై ఏళ్లు పట్టొచ్చు.

అయితే, ఈ మొత్తాలు అందరికీ ఏకరీతిలో లేవు. ఉదాహరణకు 2016లో ఎంబీఏ పూర్తిచేసినవాళ్ల రుణం సగటున 66,300 డాలర్లు ఉండగా– సైన్స్, సైకాలజీ, ఫైన్‌ ఆర్ట్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, థియాలజీ లాంటి చదువుల కోసం దీనికి దాదాపు రెండు రెట్లు, అంటే 1,32,000 డాలర్ల రుణం తీసుకున్నారు. అదే ఆరు శాతం వడ్డీతో నెలకు వెయ్యి డాలర్ల చొప్పున చెల్లించేలా చూసుకుంటే గనక, ఎంబీఏ వాళ్లు ఆరేళ్లలో దీన్ని చెల్లించాల్సి వస్తే, డాక్టరేట్‌ డిగ్రీవాళ్లు రుణవిముక్తులు కావడానికి కనీసం 18 ఏళ్లు పడుతుంది.

మళ్లీ ఈ రుణ భారాలు కూడా అందరూ సమా నంగా మోయడం లేదు. గ్రాడ్యుయేషన్‌ కోసం వెళ్తున్న ఆఫ్రికన్‌ అమెరికన్లు, అదే డిగ్రీ చదువుతున్న శ్వేతజాతీయుల కంటే 50 శాతం ఎక్కువ రుణం చేయవలసి వస్తోంది. అంటే సుమారు 11 ఏళ్లు ఎక్కువగా వాళ్లు రుణగ్రస్తులుగా ఉంటున్నారు. మరో వైపు, కేవలం బ్యాచిలర్‌ డిగ్రీ ఉన్న ఆఫ్రికన్‌ అమెరికన్ల కంటే, మాస్టర్‌ డిగ్రీ ఉన్న ఆఫ్రికన్‌ అమెరికన్ల వేతనాలు సుమారు 30 శాతం అధికంగా ఉంటున్నాయి. అదే పీహెచ్‌డీ ఉంటే ఈ తేడా 65 శాతం. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, శ్వేత జాతి అమెరికన్ల మధ్య ఉన్న అంతరంతో పోలిస్తే, ఈ వేతనాలు వరుసగా 12, 10 శాతాలు అధికం.

మొత్తంగా అమెరికా విద్యార్థులు 1.7 ట్రిలియన్‌ డాలర్ల విద్యారుణం బాకీ ఉన్నారు. ఎంబీఏనో, లా డిగ్రీ లాంటి విద్యార్హతలో వేతనాల్లో పెరుగుదలను ఇస్తాయనేది నిజమే. కానీ దీనితో ముడిపడివున్న ఆర్థిక, సామాజిక, మానసిక అలజడులను పరిగణన లోకి తీసుకోవాలి. ఈ రుణభారం వారి కుటుంబ జీవితం ప్రారంభించడాన్ని ఆలస్యం చేయొచ్చు, కొత్త ఇల్లు కొనడాన్ని వాయిదా వేయొచ్చు, ఉద్యోగ విర మణ తర్వాతి పెట్టుబడులను ప్రభావితం చేయొచ్చు. ఇంతకుమించి, ఈ నిర్ణయాలన్నీ తీసుకోవడంలో వారు పడే మానసిక ఆందోళన వెల కట్టలేనిది.కాబట్టి, పెద్ద చదువుల కోసం ఇంతటి ఆందోళన పడవలసినంతటి విలువైనదా, కాదా తేల్చలేక పోతు న్నామని అంటున్నారు జేమ్స్, ఎరిక్‌. ఒకటి మాత్రం వాళ్లు స్పష్టం చేస్తున్నారు. ఏ చదువు కోసం చేసే రుణమైనా ఆ చదువుతో సులభంగా తీరిపోయేలా విద్యావిధానాలు ఉండాలని చెబుతున్నారు.
– పి.శివకుమార్‌

మరిన్ని వార్తలు