గతంతో ఘర్షిస్తేనే అమెరికాకు భవిష్యత్తు 

17 Jun, 2020 00:22 IST|Sakshi

విశ్లేషణ

నల్లజాతీయులపై అమెరికాలో కొనసాగుతున్న జాతివివక్షాపరమైన దాడులు, హత్యలు శతాబ్దాలుగా కొనసాగుతున్న బానిసత్వ సంస్కృతి గతం నుంచి ఆ దేశం ఏమాత్రం బయటపడలేదని ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. మినియాపోలీస్, సియాటిల్‌లో ఇద్దరు నల్లజాతీయులను పోలీసు అధికారులు దారుణంగా హత్య చేసిన ఘటన అటు అమెరికాలో, ఇటు గ్రేట్‌ బ్రిటన్‌లో ఒక సరికొత్త సాంస్కృతిక విప్లవానికి నాంది పలుకుతోంది. గతచరిత్ర తప్పిదాలతో ఘర్షణ పడటం ద్వారానే అమెరికా ఒక సరికొత్త, వివక్షారహితమైన సంస్కృతి పథంలో పయనించగలదు. 1970లో, పలువురు వృద్ధ తరం జర్మన్లు గతంలో నాజీలు తలపెట్టిన నేరాలకు గానూ ప్రపంచానికి క్షమాపణ తెలియజేస్తూ వార్సా ఘెట్టో స్మారక స్తూపం వద్ద మోకాళ్లు వంచి నిలబడటం చరిత్రకెక్కింది. జాతివివక్ష, జాతీయ, సామ్రాజ్యవాద భ్రమల్లో మునిగితేలుతున్న వారు తమ సమాజం సుదూర గతంలో చేసిన తప్పులను అంగీకరించడం అంటే అది తమ బలహీనతే అని  భావిస్తారు. అయితే అదేసమయంలో అవమానకరమైన గత చరిత్రతో ఘర్షించి కొత్త మార్గం చేపట్టడం అనేది ఏ జాతికైనా, సమాజానికైనా అతిగొప్ప బలానికి చెందిన వనరుగానే ఉంటుంది.

ఇప్పుడు గ్రేట్‌ బ్రిటన్, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అక్షరాలా ఒక సాంస్కృతిక విప్లవం చెలరేగుతోంది. బానిస యజమానుల విగ్రహాలను కూల్చివేస్తున్న నిరసనకారులు తమపట్ల శ్వేతజాతీయులు గతంలో చేసిన పాపాలకు గాను నైతిక నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ వీధుల్లోకి వస్తున్నారు. బానిసత్వం, సామ్రాజ్యవాదం అనేవి ప్రపంచంలోనే అత్యంత ప్రధానమైన దేశాల్లో సంపదకు, అధికారవర్గాలకు మద్దతుగా నిలుస్తున్నాయని, అదేసమయంలో కోట్లాదిమంది నల్లజాతి ప్రజలను తరాలపాటు దారిద్య్రంలోకి నెడుతూ అవమానిస్తున్నాయని నిరసనకారులు ఎలుగెత్తి చాటుతున్నారు.
తాజాగా విగ్రహాలను విధ్వంసం చేస్తున్నవారు చాలావరకు ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. కెంట్‌లో డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన శాసనసభ్యులు జాతిపరమైన హింసాకాండకు బలవుతున్న బాధితుల పట్ల సంఘీభావం ప్రదర్శిస్తూ మోకాళ్లమీద నిలబడుతూ ఒక అరుదైన దృశ్యాన్ని ఆవిష్కరించడం నిజంగా నమ్మలేని విషయమే. అసంఖ్యాకంగా వ్యక్తులు, సంస్థలు జాతిపరమైన న్యాయానికి మద్దతుగా ముందుకువస్తున్నారు. జాతి సమానత్వాన్ని ఉల్లంఘిస్తున్నవారిని పేరుపెట్టి మరీ అగౌరవపరుస్తున్నారు.

అయితే ప్రత్యేకించి కరోనా వైరస్‌ విధ్వంసం శిథిలాల నుంచి లేచి నిలబడాలని చూస్తున్న అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో సరికొత్త జాతీయ గుర్తింపునకు సంబంధించి మరింత లోతుగా, దృఢంగా సాగుతున్న సమరం ఇప్పుడే ప్రారంభమైంది. తిరిగి మార్చడానికి వీల్లేనంత వైవిధ్యపూరితంగా ఉంటున్న అమెరికన్‌ సమాజంలో దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మూర్తీభవించిన శ్వేతజాతి దురహంకారానికి తిరుగులేని నిదర్శనంగా కనిపిస్తున్నారు. అలాగే విన్‌స్టన్‌ చర్చిల్‌పై ఇప్పటికీ బ్రిటన్‌లో కొనసాగుతున్న ఆరాధనా భావం బోరిస్‌ జాన్సన్‌ హయాంలో సంఖ్యరీత్యా మరింతగా పెరుగుతోందే తప్ప జాత్యహంకార ధోరణి తగ్గుముఖం పడుతున్న సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. 

బానిస యజమానులకు సంబంధించి ససాక్ష్యంగా నేటికీ మిగిలివున్న వాస్తవాలు.. ప్రస్తుతం అమెరికాలో అసంఖ్యాక ప్రజలను ఆకర్షించనట్లుగానే, బ్రిటిష్‌ సామ్రాజ్యంపై, అలనాటి రవి అస్తమించని సామ్రాజ్య వైభవంపై, దాని విస్తార అధికారంపై భావోద్వేగపరంగా పెంచుకుంటూ వస్తున్న అనుబంధం కూడా టోరీ ప్రభుత్వ అప్రయోజకత్వాన్ని కాపాడలేదు. బ్రెగ్జిట్‌ నుంచి ఎలా బయటపడాలన్న విషయంపై టోరీ ప్రభుత్వం ఇప్పుడు మల్లగుల్లాలు పడుతోంది.

జాతివివక్షానంతర, సామ్రాజ్యవాద అనంతర గుర్తింపు కోసం ప్రస్తుతం శోధిస్తున్న అమెరికా, బ్రిటన్‌ దేశాలు.. రెండు ప్రపంచ యుద్ధాల్లో తమకు రాజీపడని శత్రువుగా నిలిచిన జర్మనీ నుంచి తెలివైన పాఠాలు నేర్చుకోవలసి ఉంది. ఒకవైపు అమెరికాలోని వర్జీనియాలోని కార్లోటెస్‌విల్లీలో ‘మా నేల, మా నెత్తురు’ అంటూ స్వస్తిక్‌ బేనర్లు ధరించి మరీ శ్వేతజాతి దురహంకారులు నినదిస్తుండగా, బ్రెగ్జిట్‌ మార్గంలో వలసప్రజలపై తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి బ్రిటన్‌లో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

కానీ గతంలో జాత్యహంకారానికి మారుపేరుగా నిలిచిన జర్మనీ మాత్రం పదిలక్షల మందికిపైగా వలస ప్రజలకు స్వాగతం పలుకుతూ కొత్త్త సంస్కృతికి తలుపులు తెరిచింది. ఇదే విషయాన్ని సుసాన్‌ నీమన్‌ సకాలంలో రాసిన ’లెర్నింగ్‌ ఫ్రమ్‌ ది జర్మన్స్‌’ పుస్తకం ఈ పరిణామాన్ని రెండో ప్రపంచ యుద్ధానంతరం జర్మనీలో తలెత్తిన అతి పెద్ద, విస్తృత సామాజిక ఉద్యమంగా వర్ణించింది. 
ప్రపంచ యుద్ధానంతరం జర్మనీలో విజయవంతంగా ఉనికిలోకి వచ్చి నిలిచిన పచ్చిమితవాద పార్టీ ది ’ఆల్టర్‌నేటివ్‌ ఫర్‌ జర్మనీ’ ఈ సరికొత్త జర్మనీ చైతన్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించింది. కానీ చిన్న ప్రజాపునాది మాత్రమే కలిగి ఉన్న ఈ పార్టీ అంతర్యుద్ధం, కరోనా వైరస్‌ వ్యూహం మధ్య ప్రస్తుతం కొట్టుమిట్టులాడుతూ తమ ప్రాభవాన్ని చాలావరకు కోల్పోయింది. పైగా, దేశ నాజీ గతాన్ని తిరస్కరించడం కానీ, తగ్గించడానికి ప్రయత్నించడం కానీ చేస్తున్న ఈ పార్టీ దేశంలో పెరుగుతున్న జాత్యహంకార వ్యతిరేక మనోభావాలను బలోపేతం చేయడానికి తోడ్పడింది.

జాతి దురహంకారతత్వం నుంచి స్థిరంగా, విస్తృతంగా బయటపడినందువల్లే, ఇటీవలి సంవత్సరాల్లో ఆంగ్లో–అమెరికాను ధ్వంసం చేసిన విషఫూరిత రాజకీయాలనుంచి పూర్తిగా బయటపడే ప్రక్రియలో జర్మనీ అత్యున్నత స్థాయికి చేరుకుంది. అయితే ఇది ఒక్కరాత్రిలో సంభవించింది కాదు. అమెరికా దక్షిణ ప్రాంతంలో పూర్తిగా విడిపోయిన జాతుల మధ్య పెరిగిన తత్వవేత్త నీమన్, చాలాకాలం బెర్లిన్‌లో నివసిస్తూ, ఒక గొప్ప వ్యాఖ్య చేశాడు. ’’చరిత్రలో అత్యంత దారుణమైన నేరాలకు పాల్పడిన వారు తమ నేరాలను అంగీకరించడానికి దశాబ్దాల కఠిన కృషి అవసరమైంది. ఆ తర్వాతే వారు తమ నేరాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం మొదలెట్టారు.’’

అమెరికా నుంచి వచ్చి పశ్చిమజర్మనీలో నివసిస్తున్న వారు నాజీ సంస్కృతిని రద్దు చేయాలంటూ చేసిన డిమాండ్‌ పాక్షికంగా మాత్రమే ఫలవంతమైంది. అనేకమంది నాజీ నేరస్తులు ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో సోవియట్‌ కమ్యూనిజానికి వ్యతిరేకంగా బ్రహ్మాండంగా ఉపయోగపడ్డారని అమెరికా నిఘా సంస్థలు కనుగొన్నాయి. నిజానికి 1960లలో జర్మనీలో చెలరేగిన విద్యార్థి తిరుగుబాటును నాజీ అనుకూలురైన వ్యక్తులు, సంస్థలు రెచ్చగొట్టారు. నాజీల శకంలో ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లు, ప్రొఫెసర్లు తమ ప్రాభవాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ఇలా ప్రయత్నించారు.
అనేకమంది జర్మన్లు నేటికీ తాము బాధితులమేనని తలుస్తుంటారు. దశాబ్దాల తర్వాత సైతం ఒక అలనాటి నాజీ సంస్కృతిని స్మరించుకోవడం, వేడుకలు జరపటం జర్మనీలో తరగతి గదుల్లో, వెలుపల కూడా జరుగుతూ వచ్చింది. 

నాజీ నేరాలకు బలైన బాధితులు పెద్ద, చిన్న స్మారక చిహ్నాలు జర్మనీ వ్యాప్తంగా నెలకొన్నాయి. బెర్లిన్‌లోని నాటి మారణహోమానికి చిహ్నంగా నిర్మించిన స్మారక చిహ్నం కానీ, స్థానిక వీధుల్లో నెలకొల్పిన శిలా విగ్రహాలు కానీ ఒకప్పుడు తమతో జీవించి తర్వాత నాజీలతో బలవంతంగా తరలించబడిన వారి పేర్లు, తేదీలను నమోదు చేశాయి. 
1970లో, పలువురు వృద్ధ తరం జర్మన్లు నాజీ నేరాలకు గానూ ప్రపంచానికి క్షమాపణ తెలియజేస్తూ వార్సా ఘెట్టో స్మారక స్తూపం వద్ద మోకాళ్లు వంచి నిలబడటం చరిత్రకెక్కింది. కానీ ఆనాటి ఆ దృశ్యం అసాధారణమైన బలాన్ని కలిగి ఉంది. నైతిక అంతర్ముఖత్వం, చారిత్రక విచారణ ద్వారా పునరుత్తేజం చెందిన ఒక సమాజం, సంస్కృతి సరికొత్త రూపాన్ని అది ప్రతిబింబించింది.

జర్మనీలోని ఈ సరికొత్త సంస్కృతితో ఆంగ్లో–అమెరికన్‌ ప్రవృత్తులను పోల్చి చూద్దాం. వామపక్ష భావాలున్న నాటి బ్రిటన్‌ ప్రధాని గోర్డాన్‌ బ్రౌన్‌ 2005లో తూర్పు ఆఫ్రికాలో పర్యటించినప్పుడు బ్రిటన్‌ తన వలసవాద గతానికి గానూ క్షమాపణ చెప్పే రోజులు శాశ్వతంగా ముగిసిపోయాయి అని ప్రకటించాడు. వాస్తవానికి బ్రిటన్‌ తన వలసపాలన దురాగతాలకు ఎన్నడూ క్షమాపణ చెప్పింది లేదు.
తన జాతివివక్షకు సంబంధించిన గతంతో ఘర్షణపడి మారిపోయిన జర్మనీ తరహా ప్రవర్తన ఆంగ్లో–అమెరికా ప్రాంతంలో సమీప భవిష్యత్తులో కూడా ఏర్పడే సూచనలు కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఫాక్స్‌ న్యూస్‌కి చెందిన పచ్చి మితవాద జర్నలిస్టు టక్కర్‌ కార్ల్‌సన్‌ వంటి అసంబద్ధ ప్రేలాపనలు చేస్తున్నవారు తాజాగా ప్రదర్శిస్తున్న పశ్చాత్తాపమన్నదే ఎరుగని జాత్యహంకార ధోరణి.. బ్రిటన్, అమెరికాలను ఆవరిస్తున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక విషమ పరిస్థితులను మరింతగా పెంచి పోషించగలదు.

జాతివివక్ష, జాతీయ, సామ్రాజ్యవాద భ్రమల్లో మునిగితేలుతున్న వారు తమ సమాజం సుదూర గతంలో చేసిన తప్పులను అంగీకరించడం అంటే అది తమ బలహీనతే అని నిస్సందేహంగా భావిస్తారు. అయితే అదేసమయంలో అవమానకరమైన గత చరిత్రతో ఘర్షించి కొత్త మార్గం చేపట్టడం అనేది ఏ జాతికైనా, సమాజానికైనా అతిగొప్ప బలానికి చెందిన వనరుగానే ఉంటుంది.

పంకజ్‌ మిశ్రా 
వ్యాసకర్త రచయిత, కాలమిస్ట్‌

మరిన్ని వార్తలు