సంపన్న ఇండియా.. నిరుపేద భారత్‌..

2 Aug, 2019 01:36 IST|Sakshi

‘‘ప్రపంచ నూతన ఆవిష్కరణల సూచి’’పై 2019కి గాను మొత్తం 126 దేశాలలో భారత్‌కు 52వ ర్యాంకు లభించింది. ఈ సూచిపై ఒక దేశం తాలూకు ర్యాంకును 7 ప్రాతిపదికల ఆధారంగా నిర్ణయిస్తారు. వీటిలో ముఖ్యమైనవి కొన్ని 1) మార్కెట్‌ పరిణతి 2) విజ్ఞాన, సాంకేతిక ఆవిష్కరణలు 3) మానవ వనరుల అందుబాటు, పరిశోధన 4) వ్యాపార రంగంలో ఆధునికత 5) సృజనాత్మక  ఆవిష్కరణలు 6) మౌలిక సదుపాయాలు 7) వ్యవస్థల ఉనికి... ఈ కొలబద్దల ఆధారంగా లభించిన మన ర్యాంకు (52) ఖచ్చితంగా మెరుగైనదే ! కానీ, అదే సమయంలో మనం 2018కి సంబంధించిన మన దేశం తాలూకు మరొక ర్యాంకును కూడా చూడాలి. అది, మన మానవాభివృద్ధి సూచీ. 2018లో, మొత్తం 189 దేశాలలో ఈ సూచీపై మన దేశానికి 130వ ర్యాంకు లభించింది. ఈ సూచీలో ర్యాంకింగ్‌ను ఇచ్చేందుకు ప్రాతిపదికలుగా : 1) ఆయు ప్రమాణాలు 2) విద్యాస్థాయి 3) తలసరి ఆదాయం వంటి వాటిని పరిగణిస్తారు. 

మన దేశం తాలూకు ర్యాంకుల మధ్యన ఉన్న వైరుధ్యాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంది. దేశంలో అత్యంత విజ్ఞానవంతులైన, నిపుణులైన మేధోవంతులైన, నాణ్యమైన కొనుగోలు శక్తి గల ప్రజల ఉనికిని ‘‘ప్రపంచ ఆవిష్కరణల సూచీ’’ 52వ ర్యాంకు చెబుతోంది. కాగా, విద్య, జీవన ప్రమాణాలను చెప్పే ‘‘మానవాభివృద్ధి సూచీ’’ విషయంలో మన దుస్థితిని మనకు లభించిన 130వ ర్యాంకు చెబుతోంది. మరి, ఈ పరస్పర విరుద్ధ, వైచిత్రితో కూడిన ర్యాంకులకు కారణం ఏమిటి ? దీనికి జవాబు సులువే. అది, మన దేశంలోనే రెండు దేశాలు ఉండటం. ఒకటి, మెజారిటీ సామాన్య పేద జనాల భారత్‌! రెండవది, అంతర్జాతీయ స్థాయి విద్యావంతులూ, బిలియనీర్‌లు ఉన్న ఇండియా!! 

మరి, 70 సంవత్సరాల స్వాతంత్య్రానంతరం ఇటువంటి అసమానతలకు కారణం ఏమిటి ? దీనికి కారణాలు అనేకం. నిజానికి, స్వతంత్ర భారతం తొలిదశలోనే ఈ దేశం అంతర్జాతీయ స్థాయి ఉన్న ఐఐటీలు, ఐఐఎమ్‌ల వంటి ఉన్నత విద్యాసంస్థలను ఏర్పరచుకుంది. కానీ దశాబ్దాలుగా మన ప్రాథమిక, మాధ్యమిక విద్యారంగాలు  ముఖ్యంగా సామాన్య జనాలకు విద్యనందించే సంస్థల ప్రమాణాలు నాసిరకంగానే ఉంటున్నాయి. 8వ తరగతికి చేరినా, తమ మాతృభాషలో కూడా సరిగా చదవలేని, గణితంలో చిన్న చిన్న కూడికలు కూడా చేయలేని స్థితిలో కోట్లాది మంది బాలలు ఉన్నారని, ఈ మధ్యన జరిగిన పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే, ఐఐటీలు, ఐఐఎమ్‌ల వంటి ప్రీమియర్‌ సంస్థలలో విద్యను పొందిన వారిని కోట్లాది రూపాయల పారి తోషికంతో ఉపాధి ఆహ్వానిస్తోంది.. కొద్దిపాటి మేధోవంతులూ, కులీనులూ కూలీల పిల్లల మధ్యన అంతరాన్నీ, అగాథాన్ని సృష్టిస్తోన్న కథ ఇది. 

మన దేశం తాలూకు ఈ వైరుధ్యాన్ని ఎత్తిచూపే  ఒక కార్టూన్, 1980లలో మన తెలుగు పత్రికలలో ఒకదానిలో వచ్చింది... అదినాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ, దేశంలో కంప్యూటర్‌లను ప్రవేశపెట్టడానికి సంబంధించినది. ఆ కార్టూన్‌లో రాజీవ్‌గాంధీ జపాన్‌ నుంచి మన దేశంలోకి కంప్యూటర్‌ను ఒక విమానంలోనో, లేదా కనీసం నౌకలోనో తీసుకువస్తున్నట్లుగా కాక దానిని ఆయన ఒక ఎండ్లబండిపై తీసుకువస్తున్నట్లుగా కార్టూనిస్టు చిత్రించారు! పారిశ్రామికీకరణకు ముందరి వ్యవసాయ జీవన విధానం తాలూకు ప్రతిబింబం అయిన ఎండ్లబండి ఒక వైపున, పారిశ్రామిక విప్లవానంతర నూతన దశ తాలూకు కంప్యూటర్‌ సాంకేతిక పరిజ్ఞానం రెండవ వైపునా ఈ కార్టూన్‌లో కనపడతాయి. నాటికీ నేటికీ అదే నిజం. నిజానికి 1990లలో ఆర్థిక సంస్కరణలతో ఈ వైరుధ్యం తాలూకు అసమానతలు మరింత పెరిగాయి. 

దీనికి, విద్యావ్యవస్థలోని లోపాలతో పాటుగా 1990ల అనంతర  కులీన వర్గాల అనుకూల అభివృద్ధి నమూనా కూడా తోడయ్యింది. మౌలికంగా, వ్యవసాయాధారిత దేశస్తులమైన మనం ముందుగా, సరుకు ఉత్పత్తి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసుకోవడం కాకుండా, సూటిగా సాఫ్ట్‌వేర్, బీపీఓల వంటి అధిక నిపుణతల అవసరం ఉన్న సేవారంగంలోకి వెళ్ళాం. అంటే, మనం 1970–80లలో మన దేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్నే పోలిన చైనా, దక్షిణ కొరియా, తైవాన్‌ల వంటి దేశాల బాటన  ముందుగా పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహం ఇచ్చుకొనే దిశలో ప్రయాణం చేయలేదు. పారిశ్రామికీకరణను నిర్లక్ష్యం చేశాం. 2014లో మేకిన్‌ ఇండియాకు శ్రీకారం చుట్టినా, అప్పటికే పుణ్యకాలం కాస్తా అయిపోయింది. కాబట్టే, ఈ అసమానతల పర్వం తాలూకు ప్రతిబింబాలుగా, నేడు మన కళ్ళ ముందు  ‘ప్రపంచ ఆవిష్కరణల సూచీ’, ‘మానవాభివృద్ధి సూచీ’లు నిలుస్తున్నాయి. పైగా అంతర్జాతీయ క్షుద్బాధితుల సూచీపై 2018లో 119 దేశాలలో మనం 103వ స్థానంలో ఉండటం గమనార్హం.


వ్యాసకర్త : డి.పాపారావు, ఆర్థికరంగ విశ్లేషకులు, మొబైల్‌ : 98661 79615 

మరిన్ని వార్తలు