నాటకరంగ ఘనాపాఠి పీసపాటి

12 Jul, 2020 01:20 IST|Sakshi

పీసపాటి నరసింహమూర్తి శతజయంతి 

ఆంధ్ర రంగస్థలంలో పద్యనాటకాల స్థానం శిఖరాయమానం. ఈ వైభవానికి ఎందరో మహానటులు పునాదులై నిలిచారు. వారిలో పీసపాటి నరసింహమూర్తి ప్రథమశ్రేణీయులు. వీరి శతజయంతి సంవత్సరం ఇది. ఈ జూలై 10కి 100 ఏళ్ళు నిండాయి. తెలుగునేల నలుచెరుగులా వారి  పేరున వేడుకలు జరపాల్సిన శుభ  సందర్భం ఇది.  పద్యం తెలుగువాడి సొత్తు. భారతీయ భాషల్లో  తెలుగుభాషను విశిష్టంగా నిలబెట్టింది ఈ పద్యమే.

పద్య పఠనంలో పీసపాటి నరసింహమూర్తిది పూర్తిగా అర్థవంతంగా, భావస్ఫూర్తితో, ఔచిత్యభరితంగా, చిన్నపాటి రాగాలతో పద్యాన్ని రసవంతం చెయ్యడమన్నదే తన బాణీ. తెలుగు పద్య యవనికపై ఇతనొక విప్లవం. పద్యం పాడాలా, చదవాలా అంటే, పాడక్కర్లేదు, చదవక్కర్లేదు, అరవకపోతే చాలని చమత్కార సుందరంగా సమాధానం చెప్పిన గడసరి పీసపాటి. శ్రీకృష్ణుడు ముఖ్యంగా, రాయబారం సీనులో వీరి నటన శిఖరసమానం. అంతగా ఆ పాత్రపై ప్రభావం చూపినవాడు పీసపాటి. 

ఎన్టీఆర్‌ కూడా స్వయంగా వీరి నాటకాలు చూశారు. ఎన్నోసార్లు ఉచితరీతిన గౌరవించారు కూడా. 1949లో ఒక సందర్భంలో శ్రీకృష్ణ పాత్రలో ఈయన నటన, సంభాషణ, పద్యపఠనం చూసిన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి మురిసిపోయి, ఆశీస్సులు  అందించడమేకాక, ఘనంగా సత్కరించాడు. తిరుపతి వేంకటకవుల చేతుల మీదుగానే సత్కారం పొందిన ఏకైక భాగ్యవంతుడు పీసపాటి మాత్రమే. విశ్వనాథ సత్యనారాయణ కూడా వీరి  నటనకు పరవశుడై, పద్యరూపాలలో ప్రశంసించాడు. ఒక్కొక్కప్పుడు ఎదురుగా ఉన్న పాత్రలు, ప్రేక్షకుల ప్రతి స్పందనలుబట్టి, అప్పటికప్పుడు స్వయంగా సంభాషణలు తానే కూర్చి, చెప్పేవారు. సాధారణంగా పద్యాలకు ఒన్స్‌ మోర్‌లు వచ్చేవి. కానీ, వీరి సంభాషణలకు కూడా ఒన్స్‌మోర్‌లు రావడం విశేషం.

ఇంతటి భుజకీర్తులు పొందిన పీసపాటి జీవితం వడ్డించిన విస్తరి  కాదు. కష్టాల కడలి ఈది, జీవితనాటకంలో పైకొచ్చాడు. విజయనగరం జిల్లా రాముడువలస వీరి స్వగ్రామం. చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించారు. చుట్టాల పంచన చేరి,  కొంతకాలం బతుకు సాగించాడు. దగ్గరి బంధువు పెద్దిభొట్ల రామనాథం ఈయనకు వేదం నేర్పించాడు. కొంతకాలం పౌరోహిత్యం చేశాడు. మరికొంతకాలం శ్రీకాకుళం జిల్లా పొందూరులో రైస్‌ మిల్లులో డ్రైవర్‌ గానూ పనిచేశాడు.

జీవిక కోసం అన్ని ప్రాంతాలు తిరిగాడు. తెనాలి, కాకినాడ  ప్రాంతంలో కొంతకాలం నివసించాడు. పీసపాటి తన 18వ ఏట మొట్టమొదటిగా ముఖానికి రంగువేసుకున్నాడు. రంగూన్‌ రౌడీ అనే సాంఘిక నాట కంలో కృష్ణమూర్తి పాత్రలో నాటకరంగంలోకి అడుగుపెట్టాడు. కాకినాడలో ఉన్నప్పుడు కిళాంబి  కృష్ణమాచార్యుల దగ్గర కొంతకాలం నటనలో శిక్షణ పొందాడు. అక్కడే ఒక హార్మోనిస్టు దగ్గర పద్యాలు పాడడం కూడా సాధన చేశాడు. 1946లో తన 26వ ఏట తొలిసారిగా, పాండవ ఉద్యోగ విజయాలు నాటకంలో శ్రీకృష్ణుడి పాత్ర వేశాడు. అప్పటి నుండి ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. పద్యనాటకాలలో దశాబ్దాలపాటు వివిధ పాత్రల్లో విజృంభించాడు.

తెలుగు పద్యనాటకరంగానికి పితామహులుగా చెప్పుకొనే ధర్మవరపు రామకృష్ణమాచార్యులు రచించిన  చిత్రనళీయం నాటకంలో బాహుకుని పాత్రలో పీసపాటివారికి సాటి ఇంకొకరు లేరు. ముఖ్యంగా, 27 పద్యాలతో కూడిన నక్షత్రమాల సంస్కృత సమాస భూయిష్ఠంగా ఉంటుంది. అటువంటి పద్యాలను ఏకబిగిన, అలవోకగా చదివి, అద్భుతంగా ఆ పాత్రలో జీవించి, అందరినీ ఆశ్చ ర్యచకితులను చేశాడు. నక్షత్రకుడిగా,  హరిశ్చంద్రుడిగా, అర్జునుడిగా, బిల్వమంగళుడిగా, భవానీశంకరుడిగా, ప్రతాపరుద్రీయంలో చెకుముకిగా, పౌరాణిక, సాంఘిక పద్యనాటకాలలో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి, రక్తికట్టించాడు.

ఎన్ని పాత్రలు పోషించినా,  కృష్ణుడి పాత్రలోనే జగత్‌ ప్రసిద్ధి చెందాడు. దేశమంతా తిరిగి ఎన్నో గౌరవాలు,  సత్కారాలు, బిరుదులు పొందిన పీసపాటివారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకమైన కళాప్రపూర్ణ ప్రదానం చేసి, గౌరవించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రెండు సార్లు సంగీత నాటక అకాడెమీ సభ్యత్వం ఇచ్చింది. జీవిత చరమాంకం వరకూ నటిస్తూనే ఉన్నాడు. జీవనసంధ్యలో కన్యాశుల్కంలో లుబ్ధావధానిపాత్ర వేసి అందర్నీ ఆశ్చ ర్యంలో ముంచివేశాడు. 2007 సెప్టెంబర్‌ 28న, 87వ ఏట తన బతుకుపాత్ర ముగించాడు. తెలుగు పద్యానికి, పద్యనాటకాలకు విశేషఖ్యాతి తెచ్చిపెట్టిన పీసపాటి నరసింహమూర్తి తెలుగుపద్యం ఉన్నంతకాలం చిరంజీవిగా ఉంటాడు.


వ్యాసకర్త: మాశర్మ, సీనియర్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు