దిద్బుబాటు లేకుంటే తిప్పలు తప్పవు!

6 Dec, 2019 00:25 IST|Sakshi

గత ఆయిదున్నరేళ్ల పాలనలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించిన బీజేపీ.. మహారాష్ట్రలో ఆకస్మిక రాజకీయ పరిణామాలతో చేష్టలుడిగిపోయింది. శివసేనకు కాంగ్రెస్‌ మద్దతు ఇస్తుందని ఊహించలేకపోయిన బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహపరంగానే దెబ్బతినిపోయింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వైఫల్యం, జీడీపీ పతనం, నిరుద్యోగిత వంటి మరకలు ఉన్నప్పటికీ మోదీపై వ్యక్తిగతంగా సదభిప్రాయం ఆ పార్టీకి నేటికీ బలాన్ని అందిస్తోంది.

అయితే నరేంద్రమోదీ, అమిత్‌ షాలు తమను తాము చక్కదిద్దుకోగలమని నిరూపించుకున్నారు. మహారాష్ట్ర గుణపాఠాలను త్వరగా నేర్చుకుని బీజేపీ మిత్రుల సంఖ్యను పెంచుకుని, శత్రువుల సంఖ్యను తగ్గించుకుంటే అది మళ్లీ తన పూర్వ ప్రభలను వెదజల్లుతుంది. పం«థాను మార్చి గెలుపొందడం.. మారకుండా ఓటమివైపు పయనించడం అనే రెండు అవకాశాలు బీజేపీ ముందున్నాయి.

శివసేన రూపంలో ఆప్తమిత్రుడే బద్ధ శత్రువుగా మారి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పర్చాక బీజేపీలో నిశ్శబ్దం తాండవిస్తోంది. దీనిపైనే శరద్‌ పవార్‌ ప్రతి రోజూ వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు: ‘అమిత్‌ షా ఎక్కడ? ఎమ్మెల్యేలను గెల్చుకుని ప్రభుత్వాలను ఎవరు ఏర్పర్చగలరు?’ ఇక బీజేపీ సాహసప్రవృత్తి కలిగిన ప్రతిపక్షాన్నే ఎదుర్కోనుందా లేక ఆ పార్టీ తన సంతృప్తస్థాయిని ఇప్పటికే చేరుకుందా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంతృప్తస్థాయి అంటే సాధ్యపడినంత అత్యున్నత స్థాయికి చేరిందనీ, ఇక తదుపరి దశలో క్షీణత లేక పతనం తప్పదని అర్థం. అయితే బీజేపీ తగ్గుముఖంలో ఉందని ఇప్పటికిప్పుడే చెప్పడం తొందరపాటే కావచ్చు.

మోదీ నేతృత్వంలోని బీజేపీ 2014 నుంచి నిరంతర విజయాలను నమోదు చేస్తూ వచ్చింది. కొన్ని ఉపఎన్నికల్లో నష్టపోయి ఉండవచ్చు. కానీ ఆ పార్టీ బలాన్ని సంతరించుకుంటూనే వచ్చింది. పెద్దనోట్ల రద్దు, పేలవమైన జీఎస్టీ వంటి తప్పిదాలను మోదీ ప్రభుత్వం చేసినప్పటికీ మొత్తం మీద ప్రధాని మంచి పనులే చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు.అయితే 2019 అక్టోబర్‌ 24న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి విజయం తప్పదనిపించిన చోట ఉన్నట్లుండి భారీ రాజకీయ విషాదంగా పరిణమించింది.

బీజేపీ, శివసేనలు ఈ ఎన్నికల్లో గెలిచినప్పటికీ శివసేన తర్వాత ఒక్కసారిగా బీజేపీని ఎత్తి కుదేసింది. ఈసారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవి తనకే కావాలని శివసేన బహిరంగంగా పట్టుబట్టడంతో ఇరుపార్టీల మధ్య విచ్ఛిన్నత తప్పలేదు. అనేక మలుపులు, ఒడిదుడుకుల తర్వాత బీజేపీ ప్రధాన శత్రువులైన కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన శరద్‌ పవార్‌తో పొత్తు కలిపిన శివసేన ఏకంగా ప్రభుత్వాన్నే ఏర్పర్చేసింది. మహారాష్ట్ర రాజకీయాలు బీజేపీని నిస్సహాయతలోకి నెట్టేశాయి.

ఎన్నికల వ్యూహ రచనలో అతిశక్తిమంతులుగా ముద్రపడిన నరేంద్రమోదీ, అమిత్‌ షాలు నిస్సహాయులైనట్లు కనిపించారు. బీజేపీకి ఇప్పుడు శివసేన బద్ధ శత్రువైంది. పైగా కాంగ్రెస్, ఎన్సీపీలు బీజేపీకి బదులుగా మహారాష్ట్రలో ప్రభుత్వంలో ఉన్నాయి. ప్రతిపక్షం ఐక్యంగా ఉంటే బీజేపీ, మోదీలను ఓడించగలదనే సంకేతాన్ని కొత్త కూటమి ఇచ్చింది.

మహారాష్ట్రలో బీజేపీ ఓటమి ఫలితాలు
మహారాష్ట్రను బీజేపీ కోల్పోవడం  నిస్సందేహంగా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. దేశంలోనే అత్యంత సంపన్న రాష్ట్రం మహారాష్ట్ర. బీజేపీ ప్రత్యర్థులు ఇక్కడ వచ్చే ఎన్నికలకోసం ఎలెక్టోరల్‌ బాండ్ల ద్వారా భారీ నిధులను సేకరించగలరు. 2019 లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి 48 లోక్‌సభ స్థానాలకుగాను 41 స్థానాలు గెల్చుకున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఫలితాన్ని సాధించడం చాలా కష్టం. అందుకే మహారాష్ట్రలో ఓటమి బీజేపీ పతనానికి నాంది పలుకనుందా లేక మరో చిన్న పరాజయంగానే మిగిలిపోతుందా అనేది ప్రశ్నగా మిగిలింది.

మహారాష్ట్రను కోల్పోవడం బీజేపీని నైతికంగా దెబ్బతీసింది. ఒక సంపన్న రాష్ట్రం ఇంత సులభంగా తమ చేతుల్లోంచి చేజారిపోయిందా అని బీజేపీ కేడర్, నాయకత్వం చేష్టలుడిగిపోయారు. బలహీనంగా కనిపించిన శివసేన చేతుల్లో అజేయమైనదని పేరొందిన మోదీ, షాల వ్యూహం దెబ్బతినిపోవడం బీజేపీ ప్రతిష్టను మసకబార్చింది. మహారాష్ట్రనే కోల్పోయినప్పుడు, రానున్న జార్ఖండ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ నష్టపోవచ్చు. ప్రతిపక్షం మళ్లీ శక్తిని పుంజుకుంది, ఐక్యత అనేది బలమైన బీజేపీని కూడా ఓడించవచ్చనే అభిప్రాయం ప్రతిపక్షంలో పెరిగింది.

బీజేపీ బలాలు
మహారాష్ట్రలో బీజేపీ ఓడిపోయినప్పటికీ, లోక్‌సభ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల 6 నెలల కాలం ఉంది. నరేంద్రమోదీ సత్పరిపాలనను అందించగలిగితే రాజకీయాల్లో పైచేయి సాధించటానికి ఇది సుదీర్గ సమయమే. కాబట్టి 2014 ఎన్నికల్లో ప్రజల విశ్వసనీయతను బీజేపీ పొందే అవకాశం ఉంది కూడా. పైగా ప్రతిపక్షానికి జాతీయ వ్యాప్తంగా తమ్ముతాము నిరూపించుకున్న జాతీయ స్థాయి నాయకులు లేరు. సోనియా గాంధీ కుటుంబం ఇప్పటికే విస్తృత ప్రచారం జబ్బు బారినపడ్డారు.

ఇక వారినిుంచి ఒరిగేదేమీ లేదు. రాజకీయాల్లో పాతబడిపోతే త్వరగా తెరవెనక్కు పోతారు. ప్రజలు మార్పు కోరుకుంటారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వాన్ని యువతకు, నూతన నేతలకు ఇవ్వడానికి సిద్దంగా లేదు. కాంగ్రెస్‌ తన జనాకర్షణ శక్తిని కోల్పోయిందని బీజేపీకి తెలుసు. పైగా కాంగ్రెస్‌ నుంచి దానికి వచ్చే ప్రమాదం ఏదీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్‌లో అందరూ ప్రాంతీయనేతలే. జాతీయ నేతలు లేరు. 

అదే అధికార పక్షాన్ని చూస్తే ఈశాన్య భారత రాష్ట్రాల్లో కూడా బీజేపీ బాగా ఎదిగింది. బెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలు, అసోంలలో బీజేపీ బలీయమైన శక్తిగా మారింది. బెంగాల్లో మమతకు, ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌కు బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. అసోంని, ఈశాన్య భారతాన్ని దాదాపు ఈ పార్టీనే పాలి స్తోంది. బీజేపీకి ఇది అతిపెద్ద బలం మరి. పైగా తూర్పు, ఈశాన్య భారత్‌లో కోట్లాదిమంది పరదేశీయులు వలస వచ్చి స్థిరపడినందున బీజేపీ ప్రవేశపెట్టిన జాతీయ పౌరసత్వ చట్టం ఎన్‌ఆర్‌సీ దేశంలోని అనేక ప్రాంతాల్లో భావోద్వేగాలను ప్రేరేపించింది.

ఎన్నార్సీకి భారీ డిమాండ్‌ ఉంటున్నందున బీజేపీ ఈ ఎన్నార్సీని అమలు పర్చి భారీ ప్రయోజనాన్నే పొందవచ్చు. ఇక విదేశీ విధాన వ్యవహారాల్లో మోదీ గొప్ప విజయం సాధించారు. కశ్మీర్‌ వంటి కీలక అంశంలో ప్రపంచం మొత్తంగా మన వాదనను బలపర్చేలా మోదీ ప్రభుత్వం చేయగలిగింది. దేశంలో వారసత్వ రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటుండటంతో వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకలాగే సులభం కావచ్చు.

బీజేపీ బలహీనతలు
మహారాష్ట్రలో వ్యూహపరంగా బీజేపీ దెబ్బతినిపోవడానికి కేంద్రీకృత నాయకత్వమే కారణం. శివసేనకు రెండున్నర ఏళ్లు ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని హామీ ఇచ్చి ఉంటే మహారాష్ట్ర ఇంత సులభంగా చేజారిపోయి ఉండేదని చాలామంది పరిశీలకుల వ్యాఖ్య. కానీ ఈ విషయాన్ని మోదీ, షాలకు చెప్పే ధైర్యం బీజేపీలో ఎవరికీ లేదు. శివసేన డిమాండును అంగీకరించి ఉంటే ఇంత ఉపద్రవం ఎదురయ్యేది కాదు.

బీజేపీ కూడా కాంగ్రెస్‌ లాగే అధిష్టానం, దాని ముందు ఎవరూ నిలబడలేని పనివిధానంతో సాగుతోంది. మోదీ, షా, పీయూష్, గడ్కరీ, రాజ్‌నాథ్‌ సింగ్‌ మినహాయిస్తే మంత్రిమండలి రాజకీయంగా, పాలనాపరంగా బలహీనమైంది. అనుభవం లేని మంత్రులవల్లే ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం, విద్య వంటి రంగాలు ఫలితాలనివ్వడం లేదు. పైగా పొత్తు పార్టీలను నిర్లక్ష్యం చేయడం బీజేపీని బాగా దెబ్బతీస్తోంది. 2019 లోక్‌ సభ ఎన్నికల్లో ఘనవిజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న బీజేపీ కూటమి పార్టీలను పక్కనబెట్టేసింది. పైకి ఏమీ అనలేకపోయినా వీరంతా సమయం కోసం కాచుకుని ఉన్నారు.

మహారాష్ట్ర ఉదంతంలో గుణపాఠాలు
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరన్న విషయం మర్చిన బిజేపీ శివసేనకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతిస్తుందని ఊహించలేకపోయింది. అనూహ్యంగా అలా జరగడంతో బీజేపీ షాక్‌కు గురయింది. కాంగ్రెస్‌ పార్టీ శివసేనతో పొత్తుకు సిద్ధపడగలదని ఏమాత్రం ఊహించినా శివసేనకు సీఎం పదవిని ఇవ్వడానికి బీజేపీ సిద్ధపడిపోయేది. ఢిల్లీని ఏలుతున్న తనను అర్భక పార్టీ అయిన శివసేన ఏం చేస్తుందన్న నిర్లక్ష్యం ప్రదర్శించడమే బీజేపీ కొంప ముంచింది. ఏకు అనుకున్న శివసేన ఇప్పుడు ప్రమాదకర శత్రువుగా మారిపోయింది. అలాగే మీ మిత్రుల సంఖ్యను పెంచుకుని శత్రువుల సంఖ్యను తగ్గించుకోవాలన్న ప్రాథమిక సూత్రాన్ని బీజేపీ మర్చిపోయింది. 

అయితే నరేంద్రమోదీ, అమిత్‌ షాలు తమను తాము చక్కదిద్దుకోగలమని నిరూపించుకున్నారు. పెద్దనోట్ల రద్దు గురించి మోదీ ఇప్పుడు కనీసంగా ప్రస్తావించలేదు. అరుణ్‌ జైట్లీ జీఎస్టీని కుప్పగూలిస్తే, మోదీనే దాన్ని మెరుగుపర్చారు. ఉపయోగంలేని మంత్రుల, నేతలను వదిలించుకోవడంలో మోదీ, షాలు సిద్ధహస్తులు. తన రాజ కీయాలను మార్చుకుని మిత్రులను సంపాదించుకుని మరింత నమ్రతగా ఉండే అవకాశం ఇప్పటికీ బీజేపీ ముందుంది. ఈకోణంలో మహారాష్ట్ర బీజేపీకి పెద్ద గుణపాఠమైంది. బీజేపీ తన తప్పిదాలను సరిదిద్దుకుని నమ్రత గల పార్టీగా మారుతుందా? ఇప్పుడు బీజేపీకి రెండు అవకాశాలున్నాయి. మార్పు చెంది గెలుపొందడం, మారకుండా ఉండి ఓటమి వైపు పయనించడం!


వ్యాసకర్త,
పెంటపాటి పుల్లారావు, 

ప్రముఖ రాజకీయ విశ్లేషకులు 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా