పాదయాత్రకు అపూర్వ జనాదరణ

16 May, 2018 02:47 IST|Sakshi
వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి( పాత చిత్రం)

పశ్చిమ గోదావరి జిల్లాలో 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చూసిన తర్వాత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ‘ప్రజాప్రస్థానం’ యాత్రలో ఇదే జిల్లాలో మొదటి నుంచి చివరి వరకు వారం రోజులపాటు వైఎస్‌ఆర్‌తో నేను నడిచిన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఆనాడు ఖమ్మం జిల్లా నుంచి వైఎస్‌ అడుగుపెడితే, నేడు కృష్ణా జిల్లా నుంచి జగన్‌ పశ్చిమలోకి అడుగుపెట్టారు. నాటి బాబు ప్రభుత్వపాలన ప్రజల్ని తీవ్ర కష్టాల్లోకి నెట్టిన కాలమది. వ్యవసాయం దండగ అన్న మాటలతో వ్యవసాయాన్ని నిర్వీర్యంచేస్తూ సాగిన పాలనా కాలమది. ఆ సమయంలోనే 25 ఏళ్ళ తన రాజకీయ జీవితంలో వైఎస్‌ దేశ రాజకీయ చరిత్రలో తొలిసారిగా 1400 కిలోమీటర్లు ‘ప్రజాప్రస్థానం’ పేరుతో పాదయాత్రచేశారు. పశ్చిమలో అడుగుపెట్టిన సమయంలో రైతులతో మాట్లాడిన సందర్భంలో వారి కళ్ళలో సుడులు తిరుగుతున్న కన్నీళ్ళు, ముఖాల్లో నిర్వేదం దగ్గరుండి చూసిన వైఎస్‌ చలించిపోయారు. ఆనాటి ‘ప్రజాప్రస్థానం’ యాత్రను దాదాపు మొత్తం మీడియా కవర్‌ చేసింది. 
 
కానీ 2003తో పోలిస్తే 2017–2018 నాటికి మీడియా తీరు పూర్తిగా మారిపోయింది. వైఎస్‌ యాత్రకు మించి జగన్‌ పాదయాత్రకు జనాదరణ రెట్టింపయినా ఒకవర్గం మీడియాకు కనిపించడంలేదు.  రాష్ట్రం అభివృద్ధి పయనంలో ఉందని చెప్పడానికి ఒకవర్గం మీడియా నానా తంటాలు పడుతోంది.   

వైఎస్‌ పాదయాత్ర చేసిన హయాంలో ఉన్న బాబు దుష్టపాలనను మించిపోయిన దారుణమైన పాలనను ఇప్పుడు చూస్తున్నామని, ప్రజల కష్టాలను గాలికొదిలేసి వేల, లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేస్తున్నారని జగన్‌ నాలుగేళ్ళుగా ఆరోపిస్తూనే ఉన్నారు. జగన్‌ పాదయాత్రలో అడుగడుగునా జనం సమస్యలు చెబుతుంటే తమ ప్రభుత్వం పట్ల 80 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పడం బాబు ప్రభుత్వానికే చెల్లింది.  

ఆనాడు పాదయాత్ర చేసి బాబు దుష్టపాలనకు వైఎస్‌ చరమగీతం పాడినట్లుగానే నేడు ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న జగన్‌ ఈ ప్రభుత్వానికి ముగింపు పలకడం ఖాయమని ప్రజలు భావిస్తున్నారు. వైఎస్‌ యాత్ర తర్వాత జరిగిన 2004 నాటి ఎన్నికల్లో అది నిజమైంది. ఇప్పుడు జగన్‌ యాత్ర ముగిసిన తర్వాత 2019లో జరిగే ఎన్నికల్లో అదే నిజమవుతుందన్న వాదనకు యాత్రలో ప్రజల జనాదరణే సాక్ష్యం.

వై.శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు, విజయవాడ
 85198 45556

>
మరిన్ని వార్తలు