పవన్‌జీ... ఈ ప్రశ్నలకు బదులేదీ?

31 Jul, 2018 09:18 IST|Sakshi
పవన్‌ కళ్యాణ్‌

ఈమధ్య కాలంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న వ్యాఖ్యలు, విసురుతున్న సవాళ్లు వింతగా ఉన్నాయి. నాలుగేళ్లపాటు కేంద్రం లోనూ, రాష్ట్రంలోనూ ఉన్న అధికార పక్షాలతో అంటకాగిన మహానుభావుడాయన. గత ఎన్ని కల్లో ప్రత్యేక హోదా, ఇతర వాగ్దానాల విష యంలో టీడీపీ, బీజేపీలతోపాటు పవన్‌ కూడా జవాబుదారీ. దాన్ని తప్పించుకోవడం కోసం ఆ శిబిరం నుంచి పారిపోయి వచ్చి ప్రతిపక్ష నాయ కుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డిపై దాడికి దిగడం వంచనకు పరాకాష్ట. అయ్యా... పవన్‌ గారూ టీడీపీ, బీజేపీలతోపాటు మీరు కూడా ఈసారి ఎన్నికల్లో ప్రజాకోర్టు బోనులో నిలబడి ఎన్నో అభియోగాలకు జవాబు ఇవ్వాల్సి ఉంది.

అమరావతి రైతుల్ని ప్రభుత్వం అనేకవిధాల భయపెట్టి వారి భూముల్ని కబ్జా చేసినప్పుడు మీరెక్కడ ఉన్నారు? తుందుర్రులో ఆక్వా పరిశ్రమకు వ్యతిరేకంగా గ్రామస్తులంతా పోరాడుతున్నప్పుడు, మహిళలను సైతం పోలీస్‌స్టేషన్లకు తీసుకెళ్లి అవమానిస్తున్నప్పుడు, ఆ కుటుంబాలను జైళ్లలో బంధించినప్పుడు కనీసం చంద్రబాబు దగ్గర మీ పలుకుబడి ఉపయోగించి ఆ అణచివేత చర్యలను ఆపగలిగారా? గరగపర్రు ఉదంతంలో దళితులను ఊరి నుంచి వెలివేసిన పెద్దలకే ప్రభుత్వం అండగా నిలబడినప్పుడు, ఆందోళన చేస్తున్నవారిని అరెస్టులు చేసినప్పుడు మీరు కనీసం ఇది తప్పు అని చెప్పారా? అప్పుడు బాబు ఏం చేస్తారని భయపడి మీరు మౌనంగా ఉండిపోయారు? ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించిన ఒక మహిళా తహసీల్దార్‌ను ఎమ్మెల్యే జుట్టు పట్టి ఈడ్చినప్పుడు మీ ధైర్యసాహసాలు ఏమయ్యాయి? మీ నోటినుంచి మాట పెగల్లేదు ఎందుకని? రిషితేశ్వరి అనే అమ్మాయి ఆత్మహత్యకు కారకులైనవారిని ప్రభుత్వం నిస్సిగ్గుగా కాపాడాలని చూసినప్పుడు ఒక్కసారంటే ఒక్కసారైనా అడిగారా? ఆమె కుటుంబానికి ధైర్య వచనాలు పలికారా? బ్లాక్‌ డే సందర్భంగా ఆందోళన చేయమని పిలుపునిచ్చిన మీరు పత్తా లేకుండా పోతే ఆరోజు విశాఖపట్నానికి తరలివెళ్లి పోరాడింది జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రమే. ఆరోజు మీరు కనీసం మాట మాత్రంగానైనా బాబు తీరును ఖండించారా?

పొరుగునున్న తెలంగాణలో ‘ఓటుకు కోట్లు’ కేసులో బాబు ఇరుక్కున్నప్పుడు అది సబ్‌ జ్యుడీస్‌ గనుక మాట్లాడనని మీరు అన్నారు. కానీ జగన్‌మోహన్‌ రెడ్డిపై బాబు అండ్‌ కో కుట్రపన్ని, వ్యవస్థల్ని వాడుకుని కేసులు నడిపిస్తుంటే వాటిపై ఇంకా తీర్పు రాకుండానే మీరు ఆయనపై అవాంఛనీయమైన వ్యాఖ్యలు చేస్తారు. ఈ రెండు నాల్కల ధోరణి ఎందుకు సార్‌? వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బాబు కొన్నప్పుడూ మీరు మాట్లాడలేదు. వారికి మంత్రి పదవులిచ్చి సత్కరించినప్పుడూ అడగలేదు. తమ పార్టీ సహచరులే అధికారపక్షానికి ఫిరాయించి, మంత్రుల ముసుగులో కూర్చుని సభలో తాము నిలదీసిన ప్పుడల్లా ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భరించాలా? ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడితే మద్దతు ఇవ్వబోనని బాబుకు ఆరోజు మీరెందుకు చెప్పలేకపోయారు? లేస్తే మనిషిని కాదన్నట్టు నాకు ఎమ్మెల్యేలుంటే శాసనసభను ఊపేసేవాడినని ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి ఉన్న పదవులను కూడా వదులుకుని కాంగ్రెస్‌ నుంచి ఒంటరిగా బయటకు వచ్చి సోనియాగాంధీపై పోరాడారు. ఆ పోరాటాన్ని చూసి ప్రజలు ఆదరించి జగన్‌ వెంట నడిచినవారిని ఎమ్మెల్యేలుగా గెలిపించారు. నా వెనక ఎమ్మెల్యేలు ఉంటేనే పోరాటం చేస్తానని ఆయన షరతు పెట్టలేదు. ముందు ఎవరిని నిలదీయాలో, ఎవరిపై పోరాడాలో తెలుసుకుని అప్పుడు యుద్ధానికి దిగండి.

పోరాటమంటే నలుగురు ఎమ్మెల్యేలను నెగ్గించుకుని అసెంబ్లీలో కూర్చోవడం కాదు. అవసరమైతే ఆ అసెంబ్లీని బహిష్కరించడం కూడా పోరాటరూపమే. గతంలో ఎన్టీఆర్, తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆ పని చేశారు. చైనా ప్రాచీన యుద్ధ నిపుణుడు సన్‌ జూ రాసిన ‘యుద్ధ కళ’ పుస్తకం చదవండి. మీకు కాస్తయినా జ్ఞానం వస్తుంది. సినిమా గ్లామర్‌తో నేనేం చెప్పినా చెల్లుతుందని మీరు అనుకుంటే ప్రజలు అమాయకులు కాదు. ముందు నాలుగేళ్ల తప్పిదాలకు క్షమాపణలు చెప్పే సంస్కారాన్ని ప్రదర్శించండి. తర్వాత ఇతరాలు మాట్లాడండి.

- పిల్లి ప్రేమ్‌కుమార్
పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా
సెల్‌: 85558 70102

మరిన్ని వార్తలు