ఒక్క ఏడాది.. పెక్కు విజయాలు

30 May, 2020 00:29 IST|Sakshi

విశ్లేషణ 

గత ఆరేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ దేశాన్ని విజయవంతమైన మార్గంలో ముందుకు నడిపిస్తున్నారు. వరుసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది పూర్తయింది. ఈ సంవత్సరం ఎంతో క్రియాశీలకంగా గడిచింది. ఈ ఏడాదిలో ఆయన పనితీరును మూడు భాగాలుగా విభజించి చూడవచ్చు. మొదటిది దేశాభివృద్ధి దిశగా చారిత్రక జాతీయ కార్యక్రమాలు, రెండవది కోవిడ్‌ మహమ్మారితో అలుపెరుగని పోరాటం, మూడవది ఆత్మనిర్భర్‌ భారత్‌ రూపంలో దేశ భవిష్యత్తుకు పునాది వేయడం. 

ఆర్టికల్‌ 370ను రద్దు చేయడం, లడఖ్, జమ్మూ కశ్మీర్‌ కేంద్ర పాలిత భూభాగాల ఏర్పాటు, పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు, అయోధ్య రామ మందిరం నిర్మాణం అంశాన్ని వివాదరహితంగా పరిష్కరించడం లాంటి వాటిని జాతీయ, చారిత్రక రాజకీయ విజయాలుగా అభివర్ణించవచ్చు. ఈ నిర్ణయాల తర్వాత కశ్మీర్‌ పరిస్థితి మెరుగుపడింది. 50 సంవత్సరాల నుంచి మండుతున్న బోడో సంక్షోభాన్ని అంతం చేసే దిశగా జరిగిన సమగ్ర ఒప్పందం దేశ చరిత్రలో మేలి మలుపు. ఫలితంగా సమాజంలో అన్ని వర్గాలు చాలా సంతోషంగా ఉన్నాయి.  అదే విధంగా త్రిపుర, భారత ప్రభుత్వం, మిజోరం మధ్య త్రైపాక్షిక ఒప్పందం ద్వారా బ్రూ రియాంగ్‌ శరణార్థుల సంక్షోభం విజయవంతంగా పరిష్కరించారు. అలాగే ఒక్క సంవత్సరంలో గర్భిణులకు ఆరు నెలల సెలవు లాంటి అతి పెద్ద నిర్ణయాలు సామాజిక సంస్కరణల దిశగా బాటలు వేశాయి.  
కోవిడ్‌ మహమ్మారితో పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడం జరిగింది. దీని ద్వారా కలిగే నష్టాన్ని మరింత తగ్గించే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

కోవిడ్‌–19తో పోరాటం చేసే విషయంలో అప్పట్లో చాలా విభాగాల్లో మన సామర్థ్యం తక్కువగా ఉండేది. కోవిడ్‌ మహమ్మారికి ఆస్పత్రులు లేవు. ఇప్పుడు 800 కు మించి ఆస్పత్రులను కలిగి ఉన్నాము. పరీక్షల కోసం ఒకే ల్యాబ్‌ మాత్రమే ఉండే పరిస్థితి నుంచి 300కు మించి పరీక్ష కేంద్రాలను అభివృద్ధి చేశాం. వ్యక్తిగత రక్షణ దుస్తులు, మాస్క్‌లు, స్వాబ్‌ స్టిక్‌లు కూడా దిగుమతి అవుతున్నాయి. ఫలితంగా మనందరం ఆత్మనిర్భర్‌ అవ్వగలిగాం. అంతే కాదు ప్రస్తుతం ఇది మేక్‌ ఇన్‌ ఇండియా విజయవంతమైన గాథగా చెప్పుకోవాలి. దేశీయ సామర్థ్యాన్ని మరింత పెంచగలిగాం. ఇప్పుడు భారతదేశంలో వెంటిలేటర్లు ఉత్పత్తి అవుతున్నాయి. 165 డిస్టిలరీ మరియు 962 మంది తయారీ దారులకు హ్యాండ్‌ శానిటైజర్లను ఉత్పత్తి చేసేందుకు లైసెన్స్‌లు ఇవ్వడం జరిగింది. ఫలితంగా 87 లక్షల లీటర్ల హ్యాండ్‌ శానిటైజర్ల ఉత్పత్తి జరిగింది. కరోనా సవాళ్ళను ఎదుర్కొనే పోరాటంలో రాష్ట్రాలు రుణాల బారిన పడకుండా 15 వేల కోట్ల రూపాయల ఆరోగ్య ప్యాకేజీ, రాష్ట్రాల విపత్తు ఉపశమన నిధికి 11 వేల కోట్లు కేటాయించడం జరిగింది. కోవిడ్‌ పోరాటంలో భాగంగా 3 వేల రైళ్ళు 45 లక్షల మంది వలస కార్మికులను సురక్షితంగా వారి సొంత ప్రాంతాలకు చేర్చాయి. విదేశాల్లో చిక్కుకున్న వేలాది మంది భారతీయులను విజయవంతంగా తీసుకురాగలిగాం.  

ప్రధాని మోదీ తమ తొలి ప్రాధాన్యతను పేద ప్రజలకే ఇచ్చారు. తమ మొట్టమొదటి ప్యాకేజీలో 25 కిలోల బియ్యం / గోధుమలు, 5 కిలోల పప్పులు ఉచితంగా (5 నెలలు) అందిస్తూ 80 కోట్ల కుటుంబాలకు ఆహార భద్రత కల్పించారు. ఇప్పటికే ఉన్న నెలకు 5 కిలోల బియ్యం/గోధుమలను అధిక రాయితీతో కిలోకు 2 నుంచి 3 రూపాయలకు అందించే పథకానికి ఇది కొనసాగింపు. అదే విధంగా 5 కోట్ల మంది రేషన్‌ కార్డులు లేని వారికి ప్రభుత్వం 10 కిలోల బియ్యం/ గోధుమలను, 2 కిలోల పప్పులను 2 నెలల పాటు ఉచితంగా అందించింది. 20 కోట్ల మహిళల జన్‌ధన్‌ ఖాతాల్లో ఒక్కొక్కరికి 1500 రూపాయల (500 చొప్పున 3 నెలలు) చొప్పున వారి బ్యాంక్‌ ఖాతాల్లో మొత్తం 30 వేల కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. 8 కోట్ల కుటుంబాలకు 2 వేల రూపాయల విలువైన 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందజేయడం జరిగింది. దాదాపు 9 కోట్ల మంది రైతులకు 2 వేల రూపాయల చొప్పన వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 50 లక్షల మంది చిన్న వర్తకులు 10 వేల చొప్పున పొందారు.  నిర్మాణ కార్మికుల నిధి నుంచి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు నిధులు అందాయి. వీటన్నింటినీ ఎవరైనా లెక్కిస్తే మన సమాజంలో 10 శాతం మేర ఉన్న అట్టడుగు వర్గాలకు కుటుంబానికి 10 వేల చొప్పున లబ్ధి చేకూరింది.  

 ఈ అభివృద్ధిలో మూడో భాగం ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ ద్వారా ఉన్నతమైన సంస్కరణలు. ఆర్థిక రంగం, మౌలిక వసతులు, వ్యవస్థ, క్రియాశీల జనశక్తి, డిమాండ్‌ పెంపు అనేవి భారత ఆర్థిక వ్యవస్థకు చెందిన 5 స్తంభాలు. 20 లక్షల కోట్ల రూపాయలతో ప్రకటించిన ఈ ప్యాకేజీ భారతదేశ స్థూల జాతీయోత్పత్తి(జి.డి.పి)లో 10 శాతానికి సమానం. ఇది సమాజంలోని ప్రతి వర్గం మీద దృష్టి పెట్టింది. చిన్న, మధ్యతరహా రుణాలపై 2 శాతం వడ్డీ ఉపసంహరించడం జరిగింది. 63 లక్షల స్వయం సహాయక బృందాలకు 20 లక్షల రూపాయల వరకూ అనుషంగిక ఉచిత రుణాలు లభిస్తాయి. ఈ మొత్తం గతంలో 10 లక్షలకు మాత్రమే పరిమితమై ఉండేది.  

చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వచనం కంపెనీలకు మరింత ప్రయోజనం చేకూర్చే విధంగా మార్చడం జరిగింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, ఎన్‌.బి.ఎఫ్‌.సి.లకు కలిపి 4,45,000 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. వ్యవసాయ మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు లక్ష కోట్లు, అదనంగా మత్స్య సంపద అభివృద్ధికి 20 వేల కోట్లు, పశు సంపద సంరక్షణలో భాగంగా టీకాలతో పాటు పాదాలు మరియు నోటి వ్యాధుల చికిత్సల కోసం 15 వేల కోట్ల రూపాయలు అందించడం జరిగింది. ఇందులో మరింత ముఖ్యంగా చెప్పుకోవలసింది 70 వేల కోట్ల రూపాయల క్రెడిట్‌ లింక్‌ సబ్సిడీ. 

 ఈ ప్యాకేజీలో అతి పెద్ద సంస్కరణలకు బీజం వేశారు. రక్షణలో స్వావలంబన అనేది ఒక చారిత్రక చొరవగా చెప్పుకోవాలి. ఇప్పటి వరకూ 100 శాతం ఆయుధ సామగ్రిని దిగుమతి చేసుకుంటున్నాము. కానీ రక్షణ రంగంలో ఎఫ్‌.డి.ఐ.ని అనుమతించలేదు. కపట సూత్రాల నుంచి శ్రీ నరేంద్ర మోదీ దేశాన్ని బయటకు తీసుకురావడమే గాక,
74 శాతం ఎఫ్‌.డి.ఐలను రక్షణ ఉత్పత్తుల దిశగా అనుమతి అందించారు. ఏకకాలంలో భారతదేశంలో తయారైన ఆయుధాలకు సంబంధించి రక్షణ విడిభాగాల దిగుమతిని నిషేధించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి లక్ష కోట్ల రూపాయల కల్పన అతి గొప్ప నిర్ణయం. ఎందుకంటే ఇది నిరుపేదలకు ఉపాధిని కల్పిస్తుంది. వలస కార్మికులు సొంత గ్రామాలకు తిరిగి వస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు అధిక డిమాండ్‌ ఉంటుంది. గత యు.పి.ఎ. ప్రభుత్వం ఎం.ఎం.ఆర్‌.ఈ.జి.ఏ. మీద చేసిన ఖర్చు 37 వేల కోట్లు కాగా, గత ఐదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వ రికార్డు స్థాయిలో సగటున 55 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు దానిని దాదాపు రెట్టింపు చేసి లక్ష కోట్లకు పెంచడం జరిగింది. పేదలను ఆదుకునేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదే సమయంలో పరిశ్రమలు మరియు పన్ను చెల్లింపు దారులకు లబ్ధి చేకూర్చే దిశగా అనేక రాయితీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. 

చివరగా ఈ ప్యాకేజీలో మరింత కీలకమైన అంశం వ్యవసాయ రంగంలో చారిత్రక సంస్కరణలు. రైతులకు ఎ.పి.ఎం.సి.ల నుంచి స్వేచ్ఛ కల్పించారు. వారు తాము పండించిన పంట, తమ ఇష్టానుసారంగా ఎక్కడైనా అమ్మే అవకాశం కల్పించారు. వారి పంటను మార్కెట్‌ చేసుకునేందుకు వారు ఎవరితోనైనా ఒప్పందం కుదుర్చుకోవచ్చు. అత్యవసర వస్తువుల చట్టం అనే రైతు వ్యతిరేక నిబంధనల నుంచి వారికి ఉపశమనం లభించింది. మార్కెట్‌లో రైతులకు ఎక్కువ ధర లభిస్తున్న నేపథ్యంలో వారి మీద ఎలాంటి పరిమితులు, ఆంక్షలు ఉండవు. ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీ భారతదేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇది దూరదృష్టి కలిగిన ఆలోచన. చారిత్రకమైన కేటాయింపు. వివేకవంతమైన నిర్ణయం. ( ఈ అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి)

వ్యాసకర్త : ప్రకాశ్‌ జావడేకర్‌, కేంద్ర పర్యావరణం, అడవులు–సమాచార ప్రసార శాఖల మంత్రి
 

మరిన్ని వార్తలు