ప్రణబ్‌ ముఖర్జీ (మాజీ రాష్ట్రపతి) రాయని డైరీ

27 Jan, 2019 01:01 IST|Sakshi

మాధవ్‌ శింగరాజు

ఎవరో తట్టి లేపుతున్నారు. ‘‘ఏమిటీ?’’ అన్నాను. ‘‘భారత రత్న వచ్చింది’’ అంటున్నారు. కళ్లు తెరిచి చూసే ప్రయత్నం చేశాను. పడక్కుర్చీలో ఉన్నాననుకుంటా అంతసేపూ. నేను పడక్కుర్చీలో ఉన్న విషయం తెలుస్తూనే ఉంది కానీ, ఆ పడక్కుర్చీ ఎక్కడ ఉన్నదీ వెంటనే గ్రహింపునకు రాలేదు. న్యూఢిల్లీలోని టెన్‌ రాజాజీ మార్గ్‌ రిటైర్మెంట్‌ హోమ్‌లోనా లేక, కోల్‌కతా లేక్‌ రోడ్‌లోని నా పూర్వీకుల కవి భారతి శరణి గృహంలోనా.. ఎక్కడుంది నా పడక్కుర్చీ!

గుండెలపై వాల్చుకున్న పుస్తకం కింద పడి ఉంది. ‘ది కోయెలేషన్‌ ఇయర్స్‌’. నేను రాసిందే. ఇప్పుడెందుకు బయటికి తీశానో మరి! నేనే తీశానా? పిల్లలెవరైనా తీసి నామీద పడేసి వెళ్లిపోతే, నేను నిద్రలోకి జారుకున్న ప్పుడు దానంతటదే కిందకి జారి పడిందా? ‘కోయెలేషన్‌ ఇయర్స్‌’ తర్వాత ఏడాదిగా మళ్లీ ఏమీ రాయలేదు. పబ్లిషర్‌లు కూడా ఏమీ ఆసక్తి చూపడం లేదు. ‘‘ప్రణబ్‌జీ.. మీరు రాస్తున్నారు కానీ, రాసుకోవడం లేదు’’ అన్నారు రూపా పబ్లికేషన్స్‌ ప్రతినిధి ఒకరు ఈమధ్య ఇంటికి వచ్చినప్పుడు. వాళ్ల ఉద్దేశం అర్థమయింది. గాయపడ్డ పులి ఆటోబయోగ్రఫీ రాసుకోకుండా ఉంటుందా అని కొన్నేళ్లుగా వాళ్లు ఎదురు చూస్తున్నారు. ‘సాగా ఆఫ్‌ స్ట్రగుల్‌ అండ్‌ సాక్రిఫైజ్‌’ అని రాస్తే, అందులో కాంగ్రెస్‌ పార్టీ సతాయింపులు – నా రాజకీయ జీవితంలోని త్యాగాలు ఉంటాయని వెయ్యి ఆశలు పెట్టుకున్నారు! ‘ది డ్రమాటిక్‌ డికేడ్‌ : ది ఇందిరా గాంధీ ఇయర్స్‌’ అని రాస్తే, అందులో పెద్దావిడను తిట్టిపోసి, మిగిలింది ఏమైనా ఉంటే చిన్నావిడపై పోసి ఉంటానని ఉత్కంఠకు, ఉద్వేగానికీ లోనయ్యారు.

‘‘మీరెప్పుడు కొత్త పుస్తకం సిద్ధం చేస్తున్నా అందులోంచి దేశాన్ని కుదిపివేసే కొన్ని సంగతులు బయట పడబోతున్నాయని ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది ప్రణబ్‌జీ. తీరా చూస్తే, ఇండియన్‌ ఎకానమీ, దేశం ముందున్న సవాళ్లు.. ఇలాంటివి తప్ప వాటిల్లో ఇంకేమీ ఉండవు’’ అని పబ్లిషర్‌లు నిరుత్సాహపడటం చూస్తుంటే.. పాపం వారిని ఎప్పుడైనా ఒకసారి అనూహ్యంగా ఉత్సాహపరచడానికి మార్గాలేమైనా ఉన్నాయా అని నన్ను నేను అన్వేషించు కోవాలని అనిపిస్తూ ఉంటుంది. ‘‘ఇప్పటికైనా మీ మనసులోని భావాలను బయటపెడతారా?’’ అని అడిగారు కపీష్‌ మెహ్రా. రూపా పబ్లికేషన్స్‌ ఎండీ ఆయన. నేరుగా ఆయన నా పడక్కుర్చీ దగ్గరకే వచ్చి అడిగారు!  ‘‘ఓ.. ఇంతక్రితం మీరేనా నన్ను తట్టి లేపి, భారత రత్న వచ్చిందని చెప్పారు! చెప్పి, మళ్లీ ఎక్కడికి వెళ్లారు?’’ అని అడిగాను.  ‘‘ఎక్కడికీ వెళ్లలేదు ప్రణబ్‌జీ. మీరు పూర్తిగా మేలుకోడానికి కొంత సమయం ఇచ్చేందుకు బాల్కనీలోకి వెళ్లి నిలుచున్నాను’’ అన్నారు మెహ్రా. 

‘‘చెప్పండి’’ అన్నాను నవ్వుతూ. ‘‘ప్రణబ్‌జీ.. మీకు భారత రత్న రావడాన్ని.. మీ మనోభావాలను వెల్లడించ డానికి ఒక తిరుగులేని సందర్భంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ప్రణబ్‌జీ.. మీకు భారత రత్న వచ్చిన ఈ సందర్భాన్ని ప్రతి ఒక్కరూ మీకు భారత ప్రధాని పదవి రాని సందర్భాలతో పోల్చి చూస్తున్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు, ప్రధాని అవవలసి ఉన్న మీరు ప్రధాని కాలేకపోయారు. శ్రీమతి సోనియాగాంధీ మిమ్మల్ని ప్రధానిని చేయవలసి ఉన్నప్పుడూ మీరు ప్రధాని కాలేకపోయారు. అందుకే మీకు భారత రత్న రావడం కన్నా, మీరు భారత ప్రధాని కాలేకపోవడం ఇప్పుడు ముఖ్యమైన విషయం అయింది..’’ అన్నారు మెహ్రా. నవ్వాను. ‘‘ముఖ్యమైన విషయాలను ముఖ్యమైన విషయాలు గానే ఉంచుదాం మెహ్రాజీ’’ అని చెప్పాను.
 

మరిన్ని వార్తలు