కాళోజీ యాదిలో ...

8 Sep, 2019 01:10 IST|Sakshi

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా

కవిగా కాళోజీకి పేరుప్రతిష్టలు తెచ్చిపెట్టిన పుస్తకం ‘నా గొడవ’. ఇది 1953లో విడుదలయింది. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన మహాకవి శ్రీశ్రీ ఆ సందర్భంగా అన్న మాటలు చిరస్మరణీయాలు. ‘ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివిన ప్రతి ఒక్కరికీ ఇది తమ గొడవగానే అర్థమవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది విషాలజగత్తు ప్రజలందరి గొడవ’ అన్నారు. ఆనాటినుండి కాళోజీ ప్రచురించిన ప్రతి కవితాసంకలనానికి నా గొడవ అనే పేరు పెట్టాడు. ప్రపంచబాధంతా శ్రీశ్రీ బాధ అయినట్లే ప్రజల గొడవంతా తన గొడవగా భావించి కవితా ప్రస్థానం సాగించిన వ్యక్తి కాళోజీ. కాళోజీ తన పోరాటాలన్నింటికి కవిత్వాన్ని మాధ్యమంగా ఎంచుకున్నాడు. ఆయన చెప్పదలుచుకున్న దానిని సూటిగా సరళమైన ప్రజల భాషలో చెప్పేవాడు. ఆయనది బడిపలుకుల భాషకాదు, పలుకుబడుల భాష. అందుకే ఆయన రచనలు ప్రజలకు చేరువయ్యింది.

ఒకప్పుడు భాషకోసం సమైక్య రాష్ట్రాన్ని ఆహ్వానించిన కాళోజీ, అవమానాల పాలవుతున్న ఆ భాషకోసమే మళ్లీ తెలంగాణ రాష్ట్రం అడగడానికి వెనకాడలేదు. ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం వాడుకభాషలోనే రాయాలనేది అతని ప్రగాఢవిశ్వాసం. తెలంగాణ భాష అన్నా, యాస అన్నా అపారమైన అభిమానం. తెలంగాణ భాష, యాసలను ఎవరు కించపరిచినా సహించేవారు కాదు. పరభాష మనల్ని మనం మనంగా బ్రతకకుండా చేస్తుంది. పరభాషను భుజాలపై మోస్తూ మన భాషను మనం అగౌరవపరుస్తున్నాం.

ఈ వైఖరిని మనం ఎండగట్టాలనేవారు కాళోజీ. కొన్నాళ్లు కాళోజీ జన్మదినాన్ని  తెలంగాణ మాండలిక భాషాదినోత్సవంగా ఆయన అభిమానులు జరి పిండ్రు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పిదప కాళోజీ జన్మదినాన్ని తెలం గాణ భాషాదినోత్సవంగా, అధికారి కంగా నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షనీయం, అభినందనీయం. తెలుగు భాషా, సంస్కృతుల వికాసానికి కాళోజీ ఎనలేని కృషిచేశారు. తెలంగాణ ప్రజాసంస్కృతికి విఘాతం కలిగినప్పుడల్లా తన గొంతు వినిపించేవారు. మనభాష, మన పలుకుబళ్లు ఇప్పుడు మన సొంత రాష్ట్రంలో కాళోజీ జన్మదినం రోజున తెలంగాణ భాషాదినోత్సవంగా జరుపుకోవడం గర్వించదగింది.

వ్యాసకర్త: ప్రొఫెసర్‌ జి. లక్ష్మణ్, తత్వశాస్త్ర విభాగం, ఓయూ ‘ మొబైల్‌: 98491 36104
 

మరిన్ని వార్తలు