దళితవాడల దరహాసం

12 Apr, 2018 00:45 IST|Sakshi

కొత్త కోణం
పదవీ విరమణ చేసి 24 ఏళ్లు పూర్తయ్యాయి. 84 ఏళ్ల వయసులో కూడా ఈ వర్గాల కోసం ఆయన నిరంతరం తపిస్తూనే ఉన్నారు. దేశంలోనే అణచివేతకు గురౌతున్న వర్గాలకు సమస్యలు ఎదురైనప్పుడల్లా గొంతులేని వారి పక్షాన ప్రతిస్పందించే తొలి స్వరం పి.ఎస్‌. కృష్ణన్‌దే. ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమం పట్ల చూపుతోన్న నిర్లక్ష్యాన్నీ, దళితులపై, ఆదివాసీలపై జరుగుతున్న దాడులనూ ఎలుగెత్తి చాటుతూ తన ఉత్తరాల ద్వారా, ప్రభుత్వాన్ని తట్టిలేపుతున్నవారు కృష్ణన్‌.

దళితులను తాకిన తెమ్మెరలు సైతం మలినమౌతాయని వారి నివాసాల జాడలను ఊరవతలికి తరమికొట్టిన కుత్సితపు కుల వ్యవస్థ మనది. అటు పాలకుల నిర్లక్ష్యానికీ, ఇటు సామాజిక వెలివేతకు గురై నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో ఆఖరిమెట్టు నుంచి కూడా అగాథాల్లోకి జారిపోతోన్న దళితులను అప్పుడప్పుడూ ఓ ఆపన్నహస్తం ఆదుకుంటూ ఉంటుంది. మలినపడిన జాతుల వేలి కొసలను పట్టుకొని పైకి లాగేందుకు మరపురాని సాహసాలు చేసిన ముగ్గురిని తెలుగు సమాజం ఎప్పటికీ స్మరించుకుంటుంది. నిరాడంబరుడూ, నిత్య దళిత విముక్తి కాముకుడూ ఎస్‌.ఆర్‌. శంకరన్‌ అటువంటి వారిలో ఒకరు. మరొకరు కె. ఆర్‌. వేణుగోపాల్‌. ఆ కోవకే చెందిన వారు మాజీ ఐఏఎస్‌ అధికారి పి.ఎస్‌. కృష్ణన్‌. ‘బడుగు బలహీన వర్గాల పట్ల అమిత పక్షపాతం, కులాంతర వివాహాలు జరగాలంటూ పట్టుదలగా వాదించటం, మత మౌఢ్యాలను తిప్పి కొట్టేందుకు తన సంస్కృత పరిజ్ఞానాన్ని వినియోగించడం, గ్రామాధికారులకన్నా గ్రామస్తుల మాటలను విశ్వసించడం, అన్యాయాలను ధిక్కరించే శక్తులకు చేయూతనివ్వడం..’ కృష్ణన్‌ గురించి ఆయన ఉద్యోగ జీవితపు ఆరంభదశలో పై అధికారి రాసిన రహస్య నివేదికలో మాటలివి.

 ఎవరీ కృష్ణన్‌? 1932 డిసెంబర్‌ 30వ తేదీన కేరళలోని తిరువనంతపురంలో ఆయన జన్మించారు. పి.ఎల్‌. సుబ్రహ్మణ్యన్, ఈతల్లి అన్నపూర్ణల కుమారుడు. అక్కడే హైస్కూల్‌ చదువు కొనసాగించారు. ట్రావెన్‌కోర్‌ విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో బీఏ పట్టా, మద్రాసు క్రిస్టియన్‌ కాలేజీ (మద్రాసు యూనివర్సిటీ) నుంచి ఇంగ్లిష్‌ సాహిత్యంలో ఎంఏ పట్టా తీసుకున్నారు. ఐఏఎస్‌కు ఎంపిక కావడానికి ముందు తమిళనాడులోని కాంచీపురంలో పచియప్ప కళాశాలలో ఇంగ్లిష్‌ అధ్యాపకునిగా పనిచేశారు.

తెలుగు నేలకు సుపరిచితులు
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ముందు హైదరాబాద్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారిగా ఎంపికైన కృష్ణన్, 1956లో ఆంధ్రప్రదేశ్‌ అవతరించినప్పుడు తెలుగుగడ్డపై తొలిసారి అడుగుపెట్టారు. వివిధ హోదాల్లో పనిచేసిన అనంతరం కృష్ణన్‌ భారత ప్రభుత్వ కార్యదర్శిగా నియమితులయ్యారు. సివిల్‌ సర్వీసెస్‌లోకి అడుగుపెట్టిన కృష్ణన్‌కి కుల వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆయన కుల వ్యతిరేక భావాల మూలాలు కేరళ సామాజిక ఉద్యమాలవే. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యన్‌ నుంచే ఎన్నో విషయాలను నేర్చుకున్నారు. 1942లో ౖ‘టెమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ పత్రిక చదివి అస్పృశ్యుల గురించి తెలుసుకున్నట్టు ఆయన ఒక సందర్భంగా చెప్పారు. అప్పుడాయన వయసు పదేళ్లు. అప్పుడే డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ గురించి కూడా తెలుసుకున్నారు. అంబేడ్కర్‌ సామాజిక నేపథ్యం, ఆయన పోరాటాలను గురించి తండ్రిని అడిగి తెలుసుకునేవారు కృష్ణన్‌. తండ్రి భావాలే తనను అస్పృశ్యతా వ్యతిరేకిగా మార్చినట్టు కూడా ప్రకటించుకున్నారు. కేరళలో సాగిన నారాయణ గురు సాంస్కృతిక ఉద్యమం, అయ్యంకాళి నడిపిన సామాజిక ప్రతిఘటనోద్యమం కృష్ణన్‌ను సామాజిక మార్పు వైపు నడిపించేందుకు ఉపయోగపడ్డాయి. ఆ స్ఫూర్తే భారత ప్రభుత్వ అధికారిగా ఎటువంటి అడ్డంకులనైనా ఎదుర్కొనే శక్తిని కృష్ణన్‌కు అందించింది. అది మొదలు సమాజంలో అణచివేతకూ, వివక్షకూ గురౌతోన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం కోసం నిరంతరం తపించారు.

ఐఏఎస్‌ శిక్షణ పూర్తయిన తరువాత కృష్ణన్‌ మొట్టమొదట ఉద్యోగ బాధ్యతలు నిర్వహించినది అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకాలోనే. అక్కడ తహసీల్దారుగా నియమితులయ్యారు. అప్పుడే ఆ తాలూకాలో దళితులు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు అందజేశారు. తాటిచర్ల అనే గ్రామంలో దళితవాడలో మూడురోజులు గడిపారు. దేవాలయం ముందర ఖాళీ స్థలంలో ఒక టెంట్‌ వేసుకొని దళితులతోనే కలసి తింటూ, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని ఆ దళిత కుటుంబాలు ఈయనకు అన్నం పెడితే ఆ ఇళ్లలో ఒకరికి భోజనం ఉండదు. అది గమనించిన కృష్ణన్‌ భోజనానికి డబ్బులు చెల్లించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్‌ ఉద్యమాలు ఊపిరి పోసుకుంటున్న సమయంలో (1964– 69 మధ్యకాలం) ఖమ్మం, తూర్పుగోదావరి జిల్లాల్లో కలెక్టర్‌గా పనిచేశారు. అదే సమయంలో ఆదివాసీ భూముల రక్షణ కోసం, అన్యాక్రాంతమైన భూములను ఆదివాసీలకే అప్పగించడం కోసం ఉనికిలో ఉన్న చట్టాలను కఠినంగా అమలుచేసిన అధికారిగా ఆయనకు పేరుంది. చట్టాలలోని లోపాలను సరిచేసే ప్రయత్నం కూడా చేశారు.

దళిత వాడల్లోనే బస
అప్పటివరకు అధికారులు దళిత వాడలకెళ్లడమే విచిత్రం. కానీ కృష్ణన్‌ దళిత వాడల్లోనే బసచేసి, వారి తిండే తిని ప్రభుత్వాధికారులకు ఆనాడే మార్గదర్శకంగా నిలిచారు. ఈ అనుభవం కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకున్న తరువాత ఎంతగానో ఉపయోగపడింది. ముఖ్యంగా ఎస్సీ కుటుంబాలు, వాడలు అభివృద్ధికి నోచుకోకపోవడానికి కుల అసమానతలతో పాటు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ఆ వాడల దరిదాపుల్లోకి చేరడం లేదనే విషయాన్ని ఆయన గ్రహించారు. అందువల్లనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రణాళికా బడ్జెట్‌లో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఖర్చు చేయాలనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. అందుకు గాను ఎస్సీల కోసం స్పెషల్‌ కాంపోనెంట్‌ ప్లాన్‌ రూపకల్పన చేసి, దాన్ని ప్రభుత్వ విధానంగా మార్చడానికి కృషి చేసిన దార్శనికుడు కృష్ణన్‌.

మొరార్జీ దేశాయ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు 1978లో ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్టు కృష్ణన్‌ చెప్పారు. అదేకాలంలో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన షెడ్యూల్డ్‌ కులాల, తెగల ఆర్థిక సహకార సంస్థలకు అదనపు నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాలనే విధానాన్ని కూడా ఆయన ఆరోజే రూపొందించారు. దాన్నే మనం ఇప్పుడు స్పెషల్‌ సెంట్రల్‌ అసిస్టెన్స్‌ అని పిలుస్తున్నాం. ఆ రోజు కృష్ణన్‌ అంకురార్పణ చేసిన స్పెషల్‌ కాంపోనెంట్‌ ప్లాన్‌ చాలా కాలం తగినంత ఫలితాన్ని అందించలేకపోయింది. కానీ 2001 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రగులుకున్న ఉద్యమంతో 2012 నాటికి చట్ట రూపం ధరించింది. అదే ఈరోజు దళిత ఉద్యమానికి ఒక ఆయుధమైంది. దళితుల అభివృద్ధికి స్పెషల్‌ కాంపోనెంట్‌ ప్లాన్‌ (2006 నుంచి దాన్ని షెడ్యూల్డ్‌ కాస్ట్‌ సబ్‌ప్లాన్‌గా పిలుస్తున్నారు) ఒక ప్రధాన వనరుగా ఉందనేది దేశంలోని దళితులందరూ గుర్తిం చారు. అందుకే ఈరోజు ఎస్సీ సబ్‌ప్లాన్‌ ఉద్యమం దళిత ఉద్యమ ప్రధాన ఎజెండాగా మారింది.

అత్యాచార నిరోధక చట్టం ఆవిష్కరణకు....
ఎస్సీలు, ఎస్టీలపైన జరుగుతున్న అత్యాచారాలనూ దమనకాండనూ అరికట్టేందుకు రూపొందించిన ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం రూపకల్పనలో కూడా పిఎస్‌.కృష్ణన్‌ భాగస్వామి. ఆయన పదవీ విరమణ చేసిన తరువాత కూడా ఆ చట్టంలో చేయాల్సిన సవరణల కోసం జరిగిన ప్రయత్నంలో కూడా సైనికుడిలా పాటుపడ్డారు. ఆయనతో పాటు ఎంతోమంది కృషి వలన ఆ చట్టంలో రావాల్సిన సవరణలలో కొన్నైనా రాబట్టుకోగలిగాం. అయితే అదే చట్టానికి మరో ప్రమాదం పొంచి ఉన్న ప్రస్తుత సమయంలో కూడా సుప్రీంకోర్టు తీర్పు కారణంగా రాబోయే ప్రమాదాన్ని ఆయన పసిగట్టి దేశవ్యాప్తంగా ఐదువందల సంఘాలతో ఏర్పడిన జాతీయ దళిత సంఘాల ఐక్య కూటమికి ప్రధాన సలహాదారుగా ఉన్నారు. దళితులపై జరుగుతున్న దాడులను నిరోధించడానికి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, అమలులో ఉన్న చట్టాల గురించి ఆమూలాగ్రం తెలిసిన కృష్ణన్‌ అనుభవం ఉద్యమానికి ఎంతో ఉపయుక్తం. దేశ రాజకీయాలను మలుపు తిప్పిన మండల్‌ రిజర్వేషన్‌ల రూపకల్ప నకు కూడా కృష్ణన్‌ చేసిన కృషి మరువలేనిది. నాటి ప్రధాని వీపీ సింగ్‌ తీసుకున్న మండల్‌ అనుకూల నిర్ణయాన్ని రాజ్యాంగబద్ధం చేయడానికి, చట్ట రూపంలోనికి తేవడానికి ఆయన అనుసరించిన ఎత్తుగడలు ఆనాటి నాయకత్వాన్ని విస్మయానికి గురిచేశాయి. కృష్ణన్‌ లేనట్లయితే మండల్‌ రిజర్వేషన్లు చట్టపరంగా నిలబడేవి కావని ఎంతో మంది నాయకులు కొనియాడారు.

మైనారిటీలకు రిజర్వేషన్లు....
అదేకాలంలో ఎస్సీల నుంచి బౌద్ధులుగా మారిన వారికి కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయనే ఆలోచనను ప్రభుత్వానికి తెలియజేసి, ఒప్పించి మెప్పించిన ఘనత కృష్ణన్‌దే. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ముస్లింలలో ఉన్న పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం లాంటి సమస్యల పట్ల ఎంతో లోతుగా ఆలోచిం చిన వ్యక్తి కృష్ణన్‌. అందుకుగాను న్యాయపరమైన, చట్టపరమైన అడ్డంకులను అధిగమించేందుకు పదవీ విరమణానంతరం కూడా ప్రభుత్వాలకు సహాయసహకారాలను అందించడం మనకు తెలుసు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌.రాజశేఖరరెడ్డి తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలనే అంశం చర్చకు వచ్చినప్పుడు వైఎస్‌కి గుర్తుకొచ్చిన ఏకైక వ్యక్తి కృష్ణన్‌. ఆ విషయంలో వై.ఎస్‌. ప్రభుత్వానికి సలహా దారుగా ఉండి, ముస్లిం రిజర్వేషన్ల రూపకల్పనలో కీలక భూమిక పోషించినవారు కృష్ణన్‌.

పదవీ విరమణ అనంతరమూ...
పదవీ విరమణ చేసి 24 ఏళ్లు పూర్తయ్యాయి. 84 ఏళ్ల వయసులో కూడా ఈ వర్గాల కోసం ఆయన నిరంతరం తపిస్తూనే ఉన్నారు. దేశంలోనే అణచివేతకు గురౌతున్న వర్గాలకు సమస్యలు ఎదురైనప్పుడల్లా గొంతులేని వారి పక్షాన ప్రతిస్పందించే తొలి స్వరం పి.ఎస్‌. కృష్ణన్‌దే. ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమం పట్ల చూపుతోన్న నిర్లక్ష్యాన్నీ, దళితులపై, ఆదివాసీలపై జరుగుతున్న దాడులనూ ఎలుగెత్తి చాటుతూ తన ఉత్తరాల ద్వారా, ప్రభుత్వాన్ని తట్టిలేపుతున్నవారు కృష్ణన్‌. పి.ఎస్‌.కృష్ణన్‌ స్వాతంత్య్రానంతరం తొలితరం అధికారయంత్రాంగంలో ఒక నమూనాగా చెప్పుకోవచ్చు. మనందరం ఎంతో భక్తిభావంతో గుండెల్లో దాచుకున్న ఎస్‌.ఆర్‌. శంకరన్‌కు పిఎస్‌.కృష్ణన్‌ సీనియర్‌ మాత్రమే కాదు. ఆయనకు గురువుకూడా. ఆ తరం మానవతా విలువలకు ప్రతీకగా నిలిచిన కృష్ణన్‌ జీవితం నేటి తరం అధికారులకు కొంతైనా ఆదర్శం కాగలిగితే అట్టడుగు వర్గాలకు కాస్త అయినా మేలు జరుగుతుంది.


మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213 
 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు