కార్పొరేట్‌ వైద్యం ప్రజావ్యతిరేకం

23 May, 2018 02:19 IST|Sakshi

సందర్భం

ఒక అర్థశతాబ్ది క్రితం అన్ని తరగతుల వారికి ఉన్నవారికి లేనివారికి వైద్య సదుపాయం సర్కారీ దవాఖానాల్లోనే దొరికేది. వైద్యులు రోగుల నుంచీ, వారి బంధువుల నుంచీ కొంత మొత్తాన్ని వసూలు చేసేవారు. నాల్గవ తరగతి ఉద్యోగులూ మామూళ్ల కోసం పీడించేవారు. దీంతో నాలాంటి వాళ్లం ప్రైవేటు రంగంలో వైద్య సదుపాయాలు విస్తరిస్తే మెరుగైన వైద్యం లభించే అవకాశం ఉంటుందని భావించాము.

ఆ క్రమంలో దేశంలో ప్రప్రథమంగా అపోలో ఆసుపత్రుల సముదాయం మొదలైంది. ఈ 50 ఏళ్లలో కార్పొరేట్‌ ఆసుపత్రులు సంపన్నులకు, పేదలకు కూడా వైద్య సదుపాయాలు కల్పించే ప్రధాన కేంద్రాలుగా ఏర్పడ్డాయి. అయితే కార్పొరేట్‌ ఆసుపత్రుల దోపిడీ, వాటి అనైతిక కార్యక్రమాలు చూసిన తర్వాత సర్కారీ దవాఖానలే  కార్పొరేట్‌ ఆసుపత్రుల కన్నా వెయ్యిరెట్లు నయం అనే భావన మాలాంటి చాలామందిలో ఈనాడు కలుగుతున్నది.

ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించడంలో తమ బాధ్యతను పూర్తిగా వదిలేసిన ప్రభుత్వాలు, ఎటువంటి నియంత్రణ లేక అనైతిక కార్యక్రమాలకు నెలవైన ప్రైవేట్‌ కార్పొరేట్‌ వైద్య రంగం, పూర్తిగా పరిణతి చెందని వైద్య బీమా రంగం కలిసి ఒక అసంపూర్ణ ఆరోగ్య వ్యవస్థ రూపుదిద్దుకోవటానికి దోహదం చేశాయి. దీంతో ప్రజల ఆరోగ్య ఆర్థిక భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదమున్నది.

2014–15 ఆరోగ్య గణాంక అంచనాల ప్రకారం ఆరోగ్యపరమైన ఖర్చులు 71% ప్రజలే భరిస్తున్నారు. కేంద్రప్రభుత్వం 8%, రాష్ట్ర ప్రభుత్వాలు 13% భరించగా ఆరోగ్య బీమా వ్యవస్థ కేవలం 3.7 శాతం మాత్రమే భరించింది. ఇక ఆరోగ్యం మీద చేసిన ఖర్చులలో 26% ప్రైవేటు ఆసుపత్రులకు 14శాతం ప్రభుత్వ ఆసుపత్రులకు 29 శాతం మందుల మీద ఖర్చయింది. స్థూల జాతీయోత్పత్తిలో 3.89% ఆరోగ్య రంగంపై ఖర్చు కాగా జాతీయోత్పత్తిలో కేవలం 1.3 శాతం మాత్రమే ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇక ఆరోగ్యబీమా రంగం నుంచి జరిగిన ఖర్చు పైన పేర్కొన్న విధంగా చాలా స్వల్పం మాత్రమే.

పై గణాంకాలను పరిశీలిస్తే ప్రభుత్వ ప్రాధాన్యాలలో మార్పులు తప్పనిసరి అనిపిస్తోంది. ముఖ్యంగా మందులపై ప్రజలు చేస్తున్న ఖర్చు చాలా జాస్తిగా ఉన్నది కనుక జనరిక్‌ మందులు ప్రచారంలోకి తీసుకు రాగలిగి దేశమంతటా వాటి సరఫరాను జరిగేటట్లు చూడగలిగితే ప్రజలు మందులపై చేసే ఖర్చులో బాగా ఆదా చేసుకునే అవకాశం కన్పిస్తున్నది. ప్రభుత్వ ఆసుపత్రులను  కార్పొరేట్‌ ఆసుపత్రులకు ప్రత్యామ్నాయంగా బలోపేతం చేయడం తప్పనిసరైంది. 

14వ ఆర్థిక సంఘం విభజింప తగిన పన్నులలో రాష్ట్రాల శాతాన్ని 42 శాతానికి పెంచింది. దీనివల్ల ఎటువంటి నిబంధనలకు లోబడని ఆదాయం రాష్ట్రప్రభుత్వాలకు ఉంటుందని దానిని తాము నిర్దేశించుకున్న ప్రాధాన్యతలను అనుసరించి ఖర్చు చేసే అవకాశం ఉంటుందని భావించడమైంది. తదనుగుణంగా విద్య వైద్యరంగాలపై కేటాయింపులు పెరిగే అవకాశం ఉంటుందని భావించారు. కానీ వాస్తవ పరిస్థితులు ఈ భావనకు అనుగుణంగా లేవు. తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రాలు విద్య వైద్యంపై ఎక్కువ ఖర్చు చేయగా ఎక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రాలు ఈ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఉదా‘‘కు 2016–17 మధ్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నీటిపారుదల రంగంపై ఖర్చు ముందు ఏడాదితో పోలిస్తే 57 శాతం పెరిగింది. ఆరోగ్య రంగంపై 13 శాతం మాత్రమే పెరి గింది. బీహార్‌ చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో ఆరోగ్య రంగంపై ఖర్చు వరుసగా 64%, 51% పెరిగింది.

రాష్ట్రాలకు షరతులు లేని నిధులు బదలాయిస్తే సామాజిక ప్రాధాన్య రంగాలపై ఖర్చు చేస్తారని అనుకోవటం సరికాదని రుజువయింది. ప్రధానంగా నీటి పారుదల రంగంలో కేటాయిం పులు పెంచి తద్వారా ఎన్నికలకు కావలసిన నిధులను సేకరించుకోటానికి ఫార్ములాను కనిపెట్టిన  రాష్ట్రాలలో వైద్య ఆరోగ్యరంగాల కేటాయింపులు పెరిగే అవకాశం తక్కువ. వాస్తవానికి తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రాలు విద్యా వైద్య రంగాలపై ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. విద్య వైద్య రంగాలకు కేటాయింపులు పెంచాలనే అంశాన్ని 14వ, 15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలలో పొందుపరచలేదు. ఇప్పటికైనా 15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలను సవరించి ఈ అంశాన్ని పొందుపరిస్తే భవిష్యత్తులోనైనా విద్య వైద్య రంగాలకు కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది.

ఐవైఆర్‌ కృష్ణారావువ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి 
 

మరిన్ని వార్తలు