కారుకు ఓటెందుకేశానంటే..

13 Dec, 2018 01:24 IST|Sakshi

అభిప్రాయం

నేను సమైక్యతావాదిని. 70ఏళ్ల తెలంగాణ వెనుకబాటుతనానికి, రాజకీయ పార్టీల దుష్పరిపాలనే ప్రధానమైన కారణమని, రాష్ట్ర విభజన దీనికి సరైన పరిష్కారం కాదని నమ్మాను. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న, నాయకత్వం వహించిన వారందరూ నాకు సన్నిహితులే. వారి అనుభవాలు, వీరగాధలువింటూనే పెరిగాను. అయినా, నా శాయశక్తులా విభజనను వ్యతిరేకించాను. సమైక్యత కోసం ఒక రాజకీయ జేఏసీ నిర్మించడానికి అన్ని పార్టీల నాయకత్వంతో, అప్పటి సీఎంతో సహా అందరినీ కలిసి ఒక విఫలయత్నం చేశాను.

రాష్ట్ర విభజన తరువాత అన్నిరకాల రాజకీయాలకు దూరంగా ఉండిపోయాను. ఈ దూరం రాజకీయ చిత్రపటాన్ని కొంత స్పష్టతతో చూసే అవకాశమిచ్చింది. తరువాత జరిగిన ఎన్నికలలో ఓటు వేయలేదు. క్రమేపీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటించిన అనేక పథకాలను, వాటి ప్రచారాలను చూశాను. అంతకుముందు చూసిన అనేక పబ్లిసిటీ ఫ్లెక్సీల్లాగే ఉన్నాయి. ఇంత డబ్బు ఫ్లెక్సీల మీద పెట్టే బదులు, ఏదైనా ఉపయోగపడే కార్యక్రమాలకు వాడొచ్చుకదా అనుకున్నాను.

క్రమేపీ కొన్ని కార్యక్రమాలు–మొట్టమొదట గ్రామాలలో పాత చెరువుల పూడిక తీయడం, కొత్త చెరువులు తవ్వడం–చూసి, ఈ ప్రభుత్వానికి ఏం చేయాలో స్పష్టత ఉందని అర్థమయ్యింది. ఆ తరువాత ఒక్కొక్కటే కార్యరూపం దాల్చడంతో.. నిజాయితీతో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయనే అభిప్రాయం కలిగింది. అన్ని సమస్యలు ఒక్కసారే పరిష్కారం అయిపోవు. తప్పులు, ఒడిదుడుకులు లేకుండా కూడా జరగవు. అసలు జరుగుతున్నాయా? లేదా? ఈ ప్రభుత్వం సరైన మార్గంలో వెళుతోందా లేదా అనేది ప్రశ్న. ఈ మాత్రం పనులు జరిగిన దాఖలాలు దేశంలో చాలా కొద్దిగానే ఉన్నాయి. 

రాజకీయం న్యాయమైనదైనప్పుడు ఒప్పులను అభినందించాలి. తప్పులను ఎలా సరిచేసుకోవాలో చెప్పి, సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఎన్నికలలో గెలి పించడమో, ఓడించడమో ఒక్కటే గమ్యం కాదు. ఇంకా గ్రామీణాభివృద్ధి, నిరుద్యోగం వంటి సమస్యలున్నాయి. వీటిని పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీలు ఇచ్చింది.

70 ఏళ్ల పాటు పేరుకుపోయిన సమస్యల మురుగునీటిని ఒక్కసారిగా తొలగించడం సాధ్యం కాదు. అలా అనుకోవడం అత్యాశే అవుతుంది. ఈ ప్రభుత్వం గత నాలుగేళ్లలో గ్రామ సీమలకు ఇచ్చిన నీరు, బీడువారిన నేలలో పైరులు చూసిన చిన్న రైతుల ఆనందం, తాగు నీరు, ఆరోగ్య కార్యక్రమాలు, ఆర్థిక సహాయాలు, విద్యావిధానంలో మార్పుల కోసం ప్రయత్నాలు, ఐటీ రంగం, కరెంట్‌.. ఇలా ఇచ్చిన హామీల వైపు చిన్నచిన్న అడుగులు వేయడం నా అనుభవంలో మొదటిసారి చూశా. 

రెండడుగులు వెనక్కు వెళ్లి, రాజకీయ పార్టీ కోణం నుండి కాకుండా.. అభివృద్ధిని ఆశించే సాధారణ వ్యక్తిగా చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. సాధారణ ప్రజలు ఊహా లోకాల్లో, దీర్ఘకాలిక ప్రణాళికలలో, ఉన్నతమైన రాబోవు యుగాలను చూడరు. అవన్నీ ఉపన్యాసాలకే పరిమితం. ఈరోజు తమ వాస్తవ పరిస్థితులు ఎలా మెరుగవుతున్నాయి, ఆ మెరుగుదలకు దారితీసే పథకాలను ఎవరు అమలు చేస్తారనే ఉత్కంఠతో, ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. Politics are about hope. Elections are about hope. ఈ నమ్మకాన్ని ఎవరు కలిగిస్తారో, వారిని ప్రజలు ఆదరిస్తారు, గెలిపిస్తారు. ప్రాణాలుపెట్టి రక్షించుకుంటారు. దీనికి సిద్ధాంతపరమైన రాజకీయ వాదనలు అవసరం లేదు. నమ్మకం ఒక్కటే చాలు. 

సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ, అధికార పార్టీ జాతీయస్థాయి అధ్యక్షుడు అమిత్‌ షా, మరో జాతీయ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీలకు తోడు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కట్టకట్టుకుని తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి దిగగానే.. తాము ఇష్టపడిన ప్రభుత్వానికి ముప్పు కలుగుతోందనే భయం, ఆందోళన తెలంగాణ ప్రజల్లో కలిగింది. తమ ప్రభుత్వాన్ని రక్షించుకోవడం కోసమే ఇక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇలా పెరిగిన పోలింగ్‌ శాతానికి కొందరు రాజకీయ పండితులు భిన్నమైన విశ్లేషణలు, వ్యాఖ్యానాలు చేశారు. ఈ ప్రభుత్వానికి రైతులు, కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, అన్ని కులాలవారు, మతాల వాళ్లు వ్యతిరేకులని భాష్యం చెప్పారు. నాకు ఈ ప్రభుత్వంతో వ్యక్తిగత అవసరాలేమీ లేవు. మా నియోజకవర్గం అభ్యర్థులెవరో తెలీదు. వారెవరితో పరిచయం లేదు. నన్నెవరూ తమకే ఓటు వేయమని అడగలేదు. ఎస్సెమ్మెస్‌లు కూడా రాలేదు. అయినా, పొద్దున్నే పోలింగ్‌ బూత్‌కు వెళ్లా. ఈవీఎంను చూస్తే అన్నీ తెలియని పేర్లే ఉన్నాయి. ఓ నిరక్షరాస్యుడిలా పేర్లతో సంబంధం లేకుండా కారు గుర్తు దగ్గర ఉన్న బటన్‌ నొక్కా... పేపర్‌ స్లిప్‌ మీద కారు బొమ్మ వచ్చింది. 

ఎన్నికల ఫలితాలు ఎలా వున్నా, ఒక మంచి పని చేశానన్న తృప్తితో పోలింగ్‌ బూత్‌ బైటికి వచ్చా. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ఇతర రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలకు ఒక ముఖ్యమైన సందేశాన్నిచ్చాయి. అదేమిటంటే.. ఉపన్యాసాలు, ప్రలోభాలు, నినాదాలు కాదు; ప్రజాహిత కార్యాచరణే గెలిపిస్తుందని. Anti-incumbency అనే మాటకు అర్థమేమీ లేదు. బాగా పనిచేసే చేతిని ఎవరూ విరగ్గొట్టుకోరు.


వ్యాసకర్త : డా‘‘ పుచ్చలపల్లి మిత్ర ,రాజకీయ విశ్లేషకుడు
mitrapuchalapalli@gmail.com 
 

మరిన్ని వార్తలు