మోదీ, షాలకు కుడిభుజం జైట్లీ

25 Aug, 2019 03:06 IST|Sakshi
అరుణ్‌ జైట్లీతో వ్యాసకర్త 

నివాళి

అపార అనుభవానికి సౌహార్ద్రత తోడైతే అది అరుణ్‌ జైట్లీ. అందుకే పదవులు ఆయన్ను వెదుక్కుంటూ వచ్చాయి గానీ, పదవుల కోసం ఆయన పోటీ పడలేదు. ఎక్కడ సమస్య వచ్చినా దాన్ని సునాయాసంగా పరిష్కరించడంలో అరుణ్‌ జైట్లీ అగ్రగణ్యుడు. వాజపేయి, అద్వానీల తర్వాత పార్టీలో యువతకు జైట్లీయే మార్గదర్శకుడు. పార్లమెంటులోనైనా, పార్టీ కార్యక్రమాల్లో అయినా, బహిరంగసభల్లోనైనా ఆయన చేసే ఉపన్యాసాలు నభూతో నభవిష్యతి. ఆయనొక విజ్ఞానభాండాగారమని ఆ ఉపన్యాసాలు చాటి చెబుతాయి. 

అరుణ్‌ జైట్లీ ఐదక్షరాలు... దేశ రాజకీయానికి సరికొత్త భాష్యాన్ని చెప్పిన ఘనాపాటి. అందరూ రాజకీయాలు చేస్తారు. ఆయన కూడా చేస్తారు. అయితే ఆయన మిగతా వారందరికీ భిన్నమైన వ్యక్తి.  ఎవరినీ కూడా తనకు పోటీ అనుకోరు. రావాల్సింది వస్తుంది... వచ్చేదాన్ని ఎవరూ ఆపలేరన్న సిద్ధాంతమే ఆయన రాజకీయం. దేశంలోని దిగ్గజ నాయకులు ఆయనకు సహచరులు. తనకు తెలిసింది అందరికీ చెప్పడం... దేశ అభివృద్ధి, పార్టీ లక్ష్యాలపైనే ఆయన దృష్టింతా ఉండేది. తనతో సమాన వయసున్నవారితోనూ సఖ్యతతో మెలగడం ఒక్క జైట్లీ దగ్గరే మనం చూడగలం. సుష్మా స్వరాజ్, అనంతకుమార్,  వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్‌ సింగ్, మనోహర్‌ పారికర్,  మోదీ... ఇలా అందరితోనూ ఆయన సత్సంబంధాలు కలిగి ఉండేవారు. కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తూ దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సత్సంబంధాలు నెరిపారు. సమస్యలు వచ్చినప్పుడు జైట్లీ స్పందించే తీరు ఆయా రాష్ట్రాల సీఎంలను ఆయనకు ప్రీతిపాత్రులను చేసింది.  

అపార అనుభవాన్ని జోడించి రాజకీయాల్లో రాణించిన అతికొద్దిమంది నాయకుల్లో జైట్లీ ఒకరు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ నుంచి తర్ఫీదు పొందిన ఆణిముత్యాల్లో జైట్లీ ఒకరు. విద్యార్థి నాయకుడిగా, ఏబీవీపీ ఢిల్లీ అధ్యక్షుడిగా, న్యాయవాదిగా న్యాయవాదిగా సొలిసిటర్‌ జనరల్‌గా ఆయన దేశానికి పరిచయమయ్యారు. అనేక అంశాలపై స్పందించే తీరు జైట్లీకి మిగతా వారికి మధ్య తేడా ఏంటో ఇట్టే తెలియజేసేది. ఎమర్జెన్సీ సమ యంలో జైలుకెళ్లి ప్రభుత్వ విధానాలపై పోరాటం చేశారు. చిన్న వయసులోనే సొలిసిటర్‌ జనరల్‌గా ఎంపికై సంచలనం సృష్టించారు. జనసంఘ్‌ ద్వారా రాజకీయ ప్రవేశం చేసి ఆ తర్వాత బీజేపీలో అతి కీలకమైన నాయకుడిగా ఎదిగారు. జైట్లీ బహు ముఖ ప్రజాశాలి.  కాగితాలు చూడకుండానే ప్రపంచంలోని కీలక అంశాలపై ధారాళంగా ఉపన్యసించగల దిట్ట ఆయన.  

భారత ప్రతిపక్షనేతగా, సీనియర్‌ పార్లమెంటేరియన్‌గా  ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, కేంద్ర రక్షణ మంత్రి, కార్పొరేట్‌ ఎఫైర్స్‌ మినిస్టర్‌గా న్యాయశాఖ మంత్రిగా, అదేవిధంగా సమాచారశాఖ మంత్రిగా చివరిగా  ఆర్థిక శాఖ మంత్రిగా దేశానికి సమర్థవంతమైన నాయకత్వం వహించారు. తన వ్యక్తిత్వంతో ఆహర్యంతో ప్రతిపక్ష నేతలను కూడా ఆకర్షించిన మహానేత జైట్లీ. అటల్‌ బిహారి వాజ్‌పేయి తర్వాత అంతటి చతురత ఉన్న నేత ఒక్క అరుణ్‌ జైట్లీ అని చెప్పొచ్చు. రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిన నేతల్లో ఒకరు. ఎప్పుడూ ఫలానా పదవి కావాలని ఆరాటపడలేదు. ఎప్పుడూ పదవులు వెదుక్కుంటూ వచ్చాయి తప్పించి ఆయన పదవులను ఎప్పుడూ కోరుకోలేదు. మాజీ ప్రధాని వాజ్‌పేయి  నాయకత్వంలో అనేక కీలక మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు.

యూపీఏ 1, యూపీఏ 2లో ప్రతిపక్ష నేతగా దేశానికి దిశానిర్దేశం చేశారు. బీజేపీ కీలక నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వచ్చిన సంక్షోభాలను నివారించి... ఆయా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేశారు. పార్టీలో  వాజ్‌పేయి, అద్వానీ తర్వాత ముఖ్యనేతగా ఎదిగారు. ట్రబుల్‌షూటర్‌గా జైట్లీని పార్టీ నేతలు పిలుచుకుంటారు. వాజ్‌పేయి తర్వాత పార్టీలో యువతకు మార్గనిర్దేశకుడిగా మారారు. మరీ ముఖ్యంగా మీడియాతో అనేక మంది సీనియర్‌ జర్నలిస్టులతో సత్సంబంధాలు నెరిపేవారు. ఆయా అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించి అవగాహన కలిగించేవారు. పార్టీ కార్యాలయంలో, పార్లమెంట్లో, బహిరంగ సభల్లో ఆయన చేసే ఉపన్యాసాలు న భూతో న భవిష్యతి. ఆయా అంశాలపై ఆయన స్పందించే తీరు చూస్తే ఆయననో విజ్ఞాన భాండాగారంగా చెప్పు కోవాల్సిందే. అటల్‌ తర్వాత దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీతో జైట్లీకి ఎంతో సన్నిహిత సంబంధాలున్నాయి. 1996 నుంచే మోదీ, జైట్లీ అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. గుజరాత్‌ రాజకీయాల్లో ఇన్‌చార్జిగా పనిచేసిన సమయంలో మోదీతో జైట్లీ అనేక విషయాలపై సుదీర్ఘంగా చర్చించేవారు. నాటి నుంచే నరేంద్రమోదీకి కుడిభుజంగా జైట్లీ నిలిచారు. అందరూ అమిత్‌ షాను మోదీకి కుడిభుజం అనుకుంటారు కానీ, అమిత్‌ షాకి, మోదీకి కూడా జైట్లీ కుడి భుజంగా వ్యవహరించారు.  

మరీ ముఖ్యంగా జైట్లీగారితో నా అనుబంధం 26 ఏళ్ల నుంచి కొనసాగుతోంది. ఎప్పుడు కన్పించినా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. పార్టీ గురించి, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల గురించి నాతో చర్చించేవారు. అలాంటి ధీశాలిని కోల్పోవడం యావత్‌ భారత్‌ దేశానికి తీరని లోటు. సీనియర్‌ నాయకుడిగా అనేక విషయాల్లో జైట్లీ దిశానిర్దేశం చేశారు.  కాంగ్రెస్‌ పార్టీ ఆర్థిక సంస్కరణల గురించి చాలా మంది చెప్పుకుంటారు కానీ, దేశానికి అసలు సిసలు సంస్కరణలు తీసుకొచ్చిన మేధావి జైట్లీ. ఇక జైట్లీకి క్రికెట్‌ అంటే అమితంగా ఇష్టం. ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌కు సుదీర్ఘకాలం నాయకత్వం వహించారు. అనేక అంశాలపై నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టేలా మాట్లాడటం ఒక్క జైట్లీకే సాధ్యం. అలాంటి వ్యక్తిని కోల్పోవడం ఎంతో బాధాకరం.  

పురిఘళ్ల రఘురామ్, బీజేపీ సమన్వయకర్త
ఈ–మెయిల్‌ : raghuram.bjp@gmail.com

>
మరిన్ని వార్తలు