నిరాశానిస్పృహల్లో బాబు పార్టీ!

20 Nov, 2019 00:51 IST|Sakshi

సందర్భం

అధికారం కోల్పోయి అయిదు నెలలు కూడా గడవకముందే తెలుగుదేశం నాయకత్వంలో ముసలం పుట్టింది. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించినవారే అది పోయిన వెంటనే అధినేత చంద్రబాబుపై, అతని కుమారుడు లోకేశ్‌బాబుపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తెలుగుదేశం శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొని ఉంది. ఎన్నడూ లేనంత నిస్తేజంలో మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, ముఖ్య నాయకులు ఉన్నారు. నేను చాలాసార్లు టీవీ చర్చల్లో చెప్పిందే ఇప్పుడు నిజమవుతోంది. ఎన్నికల ముందు నేను చాలాసార్లు తెలుగుదేశం ఘోరంగా ఓటమి చెందుతుందని, భవిష్యత్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేరని, ఇదే చివరిసారని గట్టిగా చెప్పాను. ఇప్పుడు తెలుగుదేశంలో జరుగుతున్న పరిణామాలు నేను చెప్పింది నిజమే అన్నట్లు జరుగుతున్నాయి. 

ఇప్పటికే తెలుగుదేశం అధికార ప్రతినిధులు ఒక్కరొక్కరిగా బీజేపీవైపు వచ్చేశారు. ముందుగా కరుడుగట్టిన తెలుగుదేశం వాది, పార్టీని అత్యంత సమర్థవంతంగా సమర్థించిన లంకా దినకర్‌ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత మేధావి, మితభాషి, నిజాయితీకి మారుపేరుగా ఉన్న చందు సాంబశివరావు, అలాగే స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ మిషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ వెంకటరావు, మరో తెలుగుదేశం ప్రతినిధి యామిని కూడా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఇలా అనేకమంది నాయకులు తెలుగుదేశంలో భవిష్యత్‌ లేదని, ఇక ఆ పార్టీ తిరిగి కోలుకోలేదని తెలుసుకుని ఇతర పార్టీల్లో చేరుతున్నారు. జిల్లాల్లో కిందిస్థాయి నాయకులు ఒక్కొక్కరుగా వైఎస్సార్సీపీ, బీజేపీల్లో చేరుతున్నారు. ఒకపక్క చంద్రబాబు వయస్సు మీద పడుతోంది. మరోపక్క తన కుమారుడు లోకేశ్‌ సమర్థతపై అనేక అనుమానాలు, మొన్న ఎన్నికల్లో స్వయంగా ఓటమి పాలవడం, అనేక విమర్శలు ఎదుర్కొనడం ఇవన్నీ బాబుని కలచివేస్తున్నాయి. మొన్న ఎన్నికల్లో చాలామంది శాసనసభ్యులకు డబ్బులు ఇవ్వలేదని నాతో చాలా మంది వాపోయారు. సాక్ష్యాలు కూడా ఉన్నాయి.  

స్వర్గీయ ఎన్టీఆర్‌కి 70 ఏళ్ల వయసులో వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకుని బాబు ఆయన్ను ఎంతో బాధ పెట్టారు. ఇప్పుడు సరిగ్గా తాను కూడా అదే వయసులో అలాంటి బాధనే ఎదుర్కొంటున్నారు. పార్టీపైనా, ముఖ్యంగా చంద్రబాబు, లోకేశ్‌లపై వల్లభనేని వంశీ, ఆమంచి, అన్నం సతీశ్‌ లాంటివాళ్లు చేసిన విమర్శలు, తిట్టిన తిట్లు అన్నీ ఇన్నీ కాదు. ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష...’ అన్నట్టు చంద్రబాబు గతంలో చేసినవన్నీ ఇప్పుడాయనకు చుట్టుకుంటున్నాయి. ఒకపక్క గంటా శ్రీనివాసరావు పార్టీని వీడుతున్నట్లు ఆయనతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు వెళ్తున్నట్టు వినబడుతోంది. ప్రత్తిపాటి పుల్లారావు కూడా తాను పార్టీ మారుతున్నట్టు సన్నిహితులతో చెప్పారంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.  

పార్టీని ఎలాగైనా కాపాడుకోవాలని చంద్రబాబు ఇప్పుడు మథనపడుతున్నారు. బీజేపీతో స్నేహం వీడి తప్పు చేశానని బహిరంగంగా ఒప్పుకుంటున్నారు. మళ్లీ కలిసి పనిచేద్దామని తహతహలాడుతున్నారు. బీజేపీ అధినాయకత్వం అందుకు ససేమిరా అంటోంది. ఇప్పటికే మూడుసార్లు టీడీపీతో జతకట్టి మోసపోయామని, దానితో చెలిమి వల్ల రాష్ట్రంలో పార్టీ దెబ్బతిందని బీజేపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. తమ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు తయారైందని గ్రహించిన టీడీపీ నేతలు అనేకమంది బీజేపీవైపు చూస్తున్నారు. మరికొంతమంది అటు వైఎస్సార్సీపీ వైపు వెళ్లలేక, ఇటు పార్టీలో ఉండలేక అయోమయంలో పడుతున్నారు. లోకేశ్‌కు తెలిసీ తెలియక పార్టీలో సీనియర్లని ఎన్నో రకాల అవమానాలకు గురిచేసి తనకు నాయకత్వ లక్షణాలు లేనేలేవని నిరూపించుకున్నారు. ఇవన్నీ తెలిసినా చంద్రబాబు పుత్రవాత్సల్యంతో మౌనంగా ఉండిపోయి భార తంలో ధృతరాష్ట్రుడిని తలపిస్తున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ వస్తేగానీ పార్టీకి భవిష్యత్తు లేదని అనేకమంది టీడీపీ నేతలు అనుకోవడానికి  వెనకున్న కారణం ఇదే. అది జరగకపోతే పార్టీ నుంచి శాసన సభ్యుల వలసలు ఖాయం. అప్పుడు తెలుగుదేశానికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు.  


పురిఘళ్ల రఘురాం 
వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, అధికార ప్రతినిధి
ఈ–మెయిల్‌ : raghuram.bjp@gmail.com

మరిన్ని వార్తలు