కశ్మీరంలో పారిశ్రామిక శకం

29 Jan, 2020 00:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సందర్భం

ఏ ప్రాంతం అయినా అభివృద్ధి చెందాలంటే స్థానికంగా ఉన్న ప్రజల నైపుణ్యాలను ఉపయోగించుకుని, వారికి సరైన ఉపాధి అవకాశాలను చూపించి, వారు ఆర్థికంగా ఎదిగేలా చేయాలి. ఒక ప్రాంతం లోని వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే వారు ఆ సొమ్మును ఆ ప్రాంతంలోనే తిరిగి పెడతారు. కాబట్టే ఆర్థిక రంగంలో మంద గమనం వస్తే.. ప్రజల వద్ద వీలైనంత ఎక్కువ నగదు ఉండేలా ప్రభుత్వాలు చర్యలు చేపడుతుంటాయి. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికంగా ఎదగాల్సిందే. పరిశ్రమలు వస్తేనే స్థానికులకు ఉపాధి లభిస్తుంది, అలా వారి ఆర్థిక పరిస్థితులతో పాటు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. గాంధీ పేరు పెట్టుకున్న నెహ్రూ కుటుంబ సుదీర్ఘ పాలనలో దేశం ఎంతగా వెనుకబడిందో.. కశ్మీర్‌ అంతకంటే ఎక్కువ వెనుకబడింది. వాస్తవానికి నెహ్రూ కూడా కశ్మీరీ పండిటే. బహుశా ఆ ఉద్వేగంతోనే తనకు చేతకాకపోయినా కశ్మీర్‌ సమస్యను పరిష్కరించాలని భావించి, పటేల్‌ను దూరంగా పెట్టి పెద్ద తప్పు చేశారు. ఆ తర్వాత దేశాన్ని పాలించిన ఆయన వారసురాలు ఇందిరాగాంధీ కానీ, ఆమె వారసుడు రాజీవ్‌ గాంధీ కానీ, దశాబ్దకాలం పాటు ప్రధాని కంటే ఎక్కువ అధికారదర్పాన్ని ప్రదర్శించిన ఆయన భార్య కానీ కశ్మీర్‌ను, కశ్మీరీ పండిట్లను ఏమాత్రం పట్టించుకోలేదు. వీరి హయాంలో కశ్మీర్‌ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడి నట్లు అయింది.  

కశ్మీర్‌లో చివరిసారిగా ఒక పెద్ద పరిశ్రమను పెట్టి 50 ఏళ్లవుతోంది. ఆ పరిశ్రమ పేరు చీనాబ్‌ టెక్స్‌ టైల్స్‌. మళ్లీ ఇన్నాళ్లకు మోదీ ప్రభుత్వం కశ్మీర్‌ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించింది. కశ్మీరీ పండిట్లను కూడా తిరిగి వారివారి స్వస్థలాలకు సగర్వంగా వెళ్లేలా చర్యలు తీసుకుంటోంది. కశ్మీర్‌ మెడకు గుదిబండగా మారిన కాంగ్రెస్‌ ప్రభుత్వ తప్పుల్ని వదిలించడంతోనే హోం శాఖ తన చేతులు దులుపుకోలేదు. ఆ ప్రాంతంలో శాంతి భద్రతల్ని గతంలో ఎన్నడూ లేనివిధంగా మెరుగుపర్చింది. కాంగ్రెస్‌ హయాంలో మిలిటెన్సీకి పెట్టనికోటగా మారిన కశ్మీర్‌లో ఇప్పుడు మిలిటెంట్ల ప్రభావం కేవలం 10 శాతానికి పరిమితమైంది.  పారిశ్రామికంగా కశ్మీర్‌ అభివృద్ధి చెందేందుకు ప్రధానమంత్రి కార్యాలయం, హోం శాఖ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. తమ కంపెనీలను ప్రారంభించేందుకు ఇప్పటికే 43 సంస్థలు అంగీకారం తెలిపాయి. గత ఆరు నెలల కాలంలోనే దాదాపు రూ.15 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ఆ కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. మైనింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వంటి 14 రంగాల్లో ఈ కంపెనీలు ప్రారంభం కానున్నాయి.  

కశ్మీర్‌ విషయంలో మోదీ ప్రభుత్వం కేవలం ప్రైవేటు పెట్టుబడులకే పరిమితం కాలేదు. రైల్వే, పెట్రోలియం, సహజవాయువు, వాణిజ్యం మొదలైన శాఖల ద్వారా కూడా భారీగా ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెడుతోంది. కశ్మీర్‌లో భారీగా రైల్వే పనులు జరుగుతున్నాయి. కశ్మీర్‌ నుంచి కోచి వరకు గ్యాస్‌ పైపులైన్‌ పనులు ప్రారంభం కానున్నాయి.  కశ్మీర్‌కు పూర్వవైభవం తీసుకొచ్చే చర్యల్లో భాగంగా గత ఆరు నెలలుగా పట్టుమని పదిమందిని తమతమ ఇళ్లల్లోనే ఉండమని చెబితేనే పార్ల మెంటు దద్దరిల్లిపోయింది. మరి కశ్మీరీ పండిట్లది వేల సంవత్సరాల చరిత్ర. అంత గొప్ప చరిత్ర ఉన్న లక్షలాది మంది పండిట్లను 1990లో కశ్మీర్‌ నుంచి బలవంతంగా వెళ్లగొట్టారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 5 లక్షలమంది. అంతమందిని కట్టుబట్టలతో తన్నితరిమేస్తే ఏం జరగాలి? పార్లమెంటు ఎంతగా స్పందించాలి? కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? కానీ.. గత 30 ఏళ్లుగా ఏమీ చేయలేదు. ఆఖరికి పాండవులది పద్నాలుగేళ్ల వనవాసమే. కానీ, కశ్మీరీ పండిట్లది అంతకు రెండింతలు ఎక్కువ. ఒకవైపు వారంతా దేశం నలుమూలల్లో నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు కశ్మీర్‌ లోని వారి ఇళ్లు, దేవాలయాలు పాడుబడిపోయాయి. ఇలాంటి చారిత్రక తప్పిదాలను నరేంద్ర మోదీ తన నాయకత్వ ప్రతిభతో పరిష్కరిస్తు న్నారు. హోం మంత్రి అమిత్‌ షా తన పరిపాలనా చాతుర్యంతో, సమర్థతతో సరిదిద్దుతున్నారు. ఇది కశ్మీర్‌కు కొత్త ప్రారంభం. కశ్మీర్‌ భూతల స్వర్గం అనేమాట ఇప్పుడు నినాదం కాదు, వాస్తవం.

పురిఘళ్ల రఘురాం
వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, అధికార ప్రతినిధి

 

మరిన్ని వార్తలు