మోదీ.. ప్రజల్ని గెలిపించగల నాయకుడు

19 Apr, 2020 00:43 IST|Sakshi

సందర్భం

కరోనా అనంతరం ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత వేగంగా ఎదగగల దేశం భారత్‌ మాత్రమే. ఇది  బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌లో ప్రపంచంలోనే గొప్పది అని పేరుపడిన ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌(ఈఐయూ) నివేదిక చెప్పిన మాట. కరోనా వైరస్‌ మహమ్మారిని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశం భారత్‌. ఇది ఇప్పుడు ప్రపంచం అంతా అంటున్న మాట. ఎందుకంటే.. వందవ కేసు నమోదైన రోజు నుంచి ముప్పై రోజుల్లో భారత్‌లో నమోదైన మొత్తం కేసులు 15 వేలు కూడా దాటలేదు. కానీ, ప్రపంచానికే పెద్దదిక్కుగా పరిగణించే అమెరికాలో ఏడు లక్షలు దాటితే, బ్రిటన్, చైనా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో సైతం భారత్‌కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

మనకంటే ఎక్కువ కేసులు నమోదైనప్పటికీ కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశాలు దక్షిణ కొరియా, సింగపూర్, జపాన్‌ మాత్రమే. మిగతా అభివృద్ధి చెందిన దేశాల్లోని అన్ని ప్రభుత్వాలూ కరోనాపై యుద్ధంలో చేతులెత్తేశాయి. ఆయా దేశాధినేతలంతా తలలు పట్టుకుంటే, ప్రజలంతా విలవిల్లాడిపోతున్నారు. కొన్ని దేశాధినేతలకూ, వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ వైరస్‌ సోకింది. దేశాల సరిహద్దులు ఆపలేని, చిన్నా, పెద్దా.. పేద, ధనిక అన్న భేదం లేని వైరస్‌ ఇది. ఇలాంటి వైరస్‌ను భారత్‌ చాలా చక్కగా కట్టడి చేసింది. కానీ, ఒకే ఒక్క మతపరమైన కార్యక్రమం కారణంగా దేశంలో కేసులు ఉన్నట్టుండి పెరిగిపోయాయి. కరోనా కేసుల్లో సగానికి పైగా ఆ మత కార్యక్రమ సంబంధమైనవే. ఇక్కడ మతాన్ని కానీ, ఆ మత విశ్వాసాలు పాటించే వారిని కానీ నిందించాల్సిన పనిలేదు. వారి తప్పూ లేదు. కానీ, అందులో ఉన్న కొందరు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే వారికి మంచి చెడ్డలు చెప్పేందుకు పెద్దలు ఎవ్వరూ ముందుకు రాకపోవడమే విషాదం.

ఇప్పుడు భారత్‌  ఆర్థికంగా చూసినా, ఆరోగ్యపరంగా చూసినా చాలా భద్రమైన చేతుల్లో ఉంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముడుతున్నప్పుడు అమెరికా సహా ఏ దేశమూ నేనున్నానంటూ ఒక పెద్దన్న పాత్ర పోషించలేదు, ఒక్క భారత్‌ తప్ప. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలంటూ ప్రధాని మోదీ సార్క్‌ దేశాధినేతలకు పిలుపునిచ్చారు. వ్యక్తిగత చొరవతో, వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేయడమే కాకుండా కోటి అమెరికన్‌ డాలర్లతో నిధిని కూడా ఏర్పాటు చేశారు. అక్కడితో ఆగకుండా పలు దేశాల ప్రధానులు, అధ్యక్షులతో మోదీ ఫోన్లో మాట్లాడారు. కరోనాపై పోరాటానికి భారత్‌ తరపున అన్ని విధాలా సహాయం చేస్తామని చెప్పారు. మోదీ చొరవను, నాయకత్వ ప్రతిభను  అమెరికా, రష్యాలు ప్రశంసించాయి. ‘ప్రపంచం విపత్తుల్లో ఉన్నప్పుడు కావాల్సింది ఇలాంటి నాయకత్వమే’ అని అమెరికా మోదీని అభినందించింది. 

ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు భారతదేశం సర్వసన్నద్ధంగా ఉంది. కరోనా కేసుల్ని, అనుమానితుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిక్షణం సమీక్షిస్తోంది. మహమ్మారి ఉధృతిని తట్టుకునేందుకు అవసరమైనన్ని వైద్య సామగ్రిని, యంత్రాలను సిద్ధం చేసింది. అవసరానికి తగ్గట్టుగా మందుల్ని కూడా దగ్గర ఉంచుకుంది. అత్యంత అభివృద్ధి చెందిన దేశమైన బ్రిటన్‌లో లాగా వైద్యులు డస్ట్‌బిన్‌ కవర్లను కప్పుకునే దుస్థితి భారతదేశంలో లేదు. ధీమానే కాదు బీమాను కూడా అందించి అభివృద్ధి చెందిన దేశాలు సైతం తనవైపు చూసేలా చేస్తోంది. 

ఇది ఒక యుద్ధం. ప్రపంచ దేశాలన్నీ ఒక కనిపించని శత్రువుతో పోరాడుతున్నాయి. ఇలాంటి యుద్ధ సమయంలో మోదీ నాయకత్వాన్ని అన్ని దేశాలూ అభినందిస్తోంటే విమర్శలు మాత్రం ఒక దేశం నుంచే వినబడుతున్నాయి. అది మన శత్రుదేశమైన పాకిస్తాన్‌ నుంచి అనుకుంటే మీరు పొరబడినట్లే. ఆ విమర్శలు వినిపిస్తోంది మన సొంత దేశం నుంచే. ఇలాంటి విపత్తులోనూ రాజకీయం చేయాలని చూసే కాంగ్రెస్‌ పార్టీ నాయకులే నరేంద్ర మోదీని టార్గెట్‌ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఒకప్పుడు మోదీపై పోటీకి దిగి, రోడ్డెక్కి ఆరోపణలు చేసిన కేజ్రీవాల్‌ సైతం మోదీ సమయానుకూల నిర్ణయాల వల్లే దేశంలో కరోనా సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం అని బహిరంగంగా ప్రశంసిస్తుంటే, కాంగ్రెస్‌ నాయకులు మాత్రం కోడిగుడ్డుపై కూడా ఈకలు పీకుతున్నారు.

దేశంలో లాక్‌డౌన్‌ విధించి 21 రోజులు గడుస్తున్నాయి. తొలిదశ పూర్తయ్యింది. రెండో దశ మొదలు కానుంది. ఈ రోజు వరకూ దేశవ్యాప్తంగా ఒక్కటంటే ఒక్క ఆకలి చావు కూడా లేదు. నిజమే, కొంతమంది వలసకార్మికులు కాలి నడకన వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని మొదలు పెట్టి, మార్గమధ్యంలో చనిపోయారు. ఇది చాలా దురదృష్టకరం. కానీ, వారు అప్పుడు ఉంటున్న నగరాలను వదిలిపెట్టాల్సిన పనిలేదు. సొంతూళ్లకే వెళ్లాల్సిన పనీ లేదు. ఎక్కడివారక్కడ ఉండటం వల్ల నష్టం కూడా ఏమీ లేదు. అందరికీ ఆహారం, మౌలిక సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రయాణాలను రద్దు చేసినా, రాష్ట్రాల సరిహద్దుల్ని మూసివేసినా, నియమాలను, నిబంధనలను అతిక్రమించి ఇంకా కొందరు సొంతూళ్లకు వెళ్లాలనే తపనతో ఆపదల్ని కొనితెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. తన బాధ్యత ప్రకారం ప్రభుత్వం ప్రజలందరికీ భరోసా కల్పిస్తోంది. 

నూటముప్పై కోట్ల మంది ప్రజల్ని కాపాడేందుకు నరేంద్ర మోదీ కంకణం కట్టుకున్నారు. కనీవినీ ఎరుగని మానవ విపత్తును ప్రపంచం ఎదుర్కొంటున్న సమయంలో ఈ విశ్వంలో ఎన్నడూలేనంత మందిని లాక్‌డౌన్‌ చేసి, వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. భారత్‌లోని ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని చాటిచెప్పేందుకు, ప్రజల్లో విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచేందుకు, మనోధైర్యాన్ని నూరిపోసేందుకు పలు కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు. ‘దేశం ముందు.. వ్యక్తిగతం ఆఖరికి’ అన్నది భారతీయ జనతాపార్టీ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని అక్షరాలా రుజువు చేసి, కరోనాపై యుద్ధంలో భారతదేశాన్ని గెలిపించడమే కాదు, తమ దేశాలనూ గెలిపించగల సత్తా ఉందని ప్రపంచదేశాల నాయకులు, ప్రజలు అనుకునేంత ధైర్యాన్ని నింపిన వ్యక్తి మోదీ.


పురిఘళ్ల రఘురాం 
వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, న్యూఢిల్లీ
ఈ–మెయిల్‌ : raghuram.bjp@gmail.com

మరిన్ని వార్తలు