హమ్మయ్య.. పీడ విరగడైంది

22 Mar, 2018 08:56 IST|Sakshi

సందర్భం

కేవలం అసెంబ్లీ నియోజకవర్గాల సీట్లు పెంచలేదన్నదే బీజేపీకి బాబు కటీఫ్‌ చెప్పడానికి వెనుక ఉన్న వ్యూహమని ఇప్పుడందరికీ తెలిసిపోయింది. కానీ ఈ పరిణామాలు బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని కలిగించాయి.

బీజేపీ శ్రేణుల్లో ఉగాది ముందుగా వచ్చింది. కేంద్రం నుంచి టీడీపీ మంత్రులను ఉపసంహరించుకోవడం, ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోవడం..  బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని కలిగించాయి. బీజేపీ శ్రేణులు రెండు దశాబ్దాల తర్వాత ఆనందంతో ఉప్పొంగాయ్‌. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు రెండుసార్లు గెలవడం బీజేపీ వల్లనేనని అందరికీ తెలిసిన విషయమే. కేవలం అధికార దాహంతో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 1999, 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించారు. బాబు గతంలో కూడా అటల్జీతో చెలిమి చేశారు. అటల్జీ చరిష్మాను ఉపయోగించుకొని సీఎం అయ్యారు. మరోసారి మోదీ వల్లే సీఎం అయ్యారు.

బాబు రెండుసార్లు బీజేపీని మధ్యలో వదిలేసి వెళ్లిపోవడం రాజకీయ ప్రయోజనాల కోసమన్నది తెలిసిన విషయమే. అయితే లేనిది ఉన్నట్టుగా... ఉన్నది లేనట్టుగా ప్రచారం చేస్తూ బీజేపీని దెబ్బతీయాలని బాబు కుట్రపన్నారు. ఏపీకి బీజేపీ నాలుగేళ్ల నుంచి రాష్ట్రానికి నిధులిస్తోంది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక నాలుగు ఎయిర్‌ పోర్టులు మంజూరు చేసింది. కేంద్ర సంస్థలను ఇస్తోంది. ఇచ్చిన సంస్థలకు నిధులను దఫదఫాలుగా అందిస్తోంది. 

ఉమ్మడి రాజధానిని వదిలేయడానికి ప్రధాన కారణం ఓటుకు కోట్లు కేసే. సరే అమరావతి వచ్చారు. ఇక్కడన్నా ఏదైనా చేశారంటే అదీ లేదు. దేశంలోని ఏ సీఎం తిరగనంతగా... 28 దేశాలు తిరిగి వచ్చారు. 18 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. బాబు పర్యటనలతో ఏపీకి నిధులు వస్తాయని, కంపెనీల రాకతో నిరుద్యోగం తగ్గుతుందని భావించి కేంద్రం ముందుండి సహకరిం చింది. 28 దేశాలు తిరిగి వచ్చి.. బాబు ఏం సాధించారు. విదేశీ పర్యటనలన్నింటికీ ప్రత్యేక చార్టెడ్‌ ఫ్లయిట్‌లో వెళ్లారు. ఇతర సీఎంలు ప్యాసింజర్‌ విమానాల్లో వెళ్తే... బాబు ఢిల్లీ పర్యటనలకు కూడా ప్రత్యేక విమానాలనే వాడారు. నిధులను పెద్ద ఎత్తున దుర్వినియోగపర్చారు. 

బాబులో మార్పు రావడానికి ప్రధాన కారణం ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి. నాలుగేళ్లుగా జగన్‌ ప్రత్యేక హోదా గురించే మాట్లాడుతున్నారు. కాలేజీల్లో విద్యార్థులతో మాట్లాడటం దగ్గర్నుంచి, ఢిల్లీ వేదికగా ఆందోళనలు, జిల్లాల్లో ధర్నాలన్నీ కూడా ప్రత్యేక హోదా చుట్టూ తిరిగాయ్‌. అప్పుడు బాబు హోదా గురించి ఒక్క మాట మాట్లాడలేదు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది ప్రత్యేక హోదా అన్నారు. ఆ తర్వాత  హోదా వద్దులే... ప్యాకేజీ చాలన్నారు. కేంద్రం, దేశంలో ఏ రాష్ట్రానికి చేయని విధంగా సాయం చేసిందన్న బాబు... అనూహ్యంగా ప్లేటు ఫిరాయించారు. ఏపీలో తన పాలనపై వ్యతిరేకత రావడం, ప్రతిపక్ష నేత జగన్‌కి ఆదరణ పెరుగుతోందన్న రాష్ట్ర, కేంద్ర ఇంటెలిజెన్స్‌ నివేదికలతో హోదా పల్లవి అందుకున్నారు. జగన్‌ది రాజకీయంగా పైచేయి అవుతున్న తరుణంలో రంగంలోకి దిగి... మొన్నటి వరకు కేంద్రంపై ప్రేమ ఒలకబోసిన బాబుగారు ఇప్పుడు మోదీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తంగా బాబు రాజకీయంగా తనకు మేలు జరిగేది చేయాలని భావిస్తున్నారు తప్పించి... ఏపీకి మేలు జరిగే ఎలాంటి అంశాన్నీ టేకప్‌ చేయలేదు. 

ఏపీకి సాయం కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌... ఎస్పీవీ ద్వారా రాష్ట్రానికి నిధులు అందించేందుకు కేంద్రం సిద్ధమైతే అందుకు సహకరించకపోగా, కేంద్రం నిధులివ్వడం లేదంటూ విమర్శలు గుప్పిస్తారు. విజయవాడ కనక దుర్గమ్మ ఫ్లైఓవర్‌ కోసం మూడు వందలకోట్ల రూపాయలు కేటాయిస్తే అది ఇప్పటికీ ప్రారంభం కాలేదంటే వైఫల్యం ఎవరిదో ఇంకా చెప్పాలా? పోలవరం ప్రాజెక్టు కోసం వంద శాతం నిధులిస్తామని కేంద్రం ముందుకు వచ్చినా, నిధులివ్వడం లేదంటూ కబుర్లు చెప్తారు. డబ్బుల కోసం, కమిషన్ల కోసమే ప్రాజెక్టును కేంద్రం నుంచి తీసుకొని తాత్సారం చేస్తూ వచ్చారు. బీజేపీని అల్లరి చేసి, రాజకీయ లబ్ధి పొందాలనే కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చారు. తాజాగా తనపై అన్ని పార్టీలూ పగబట్టాయంటున్నారు. అయితే ప్రజలే ఆయనపై ద్వేషంతో ఉన్నారనేది సుçస్పష్టం. ఉదయం ఒక మాట, మ«ధ్యాహ్నం మరో మాట మాట్లాడతారు. రాత్రి ఇంకో మాట మాట్లాడుతూ తనదే పైచేయి అంటారు. ఓవైపు జనసేన అధినేత పవన్‌... రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఎండగడ్తున్నారు. సాక్షాత్తూ సీఎం తనయుడి అవినీతిని ప్రశ్నించారు. గతంలో బాబు పాలన బాగా చేస్తారని చెప్పిన పవన్‌... ఇప్పుడు మంత్రులంతా అవి నీతితో పొంగిపొర్లుతున్న విషయం తెలుగు ప్రజలకు అసలు తెలియంది కాదు. లోకేశ్‌ అవినీతిపై సీబీఐ విచారణ చేయాలని కోరుతున్నారంటే బాబు పాలన తీరును అర్థం చేసుకోవచ్చు. కేవలం అసెంబ్లీ నియోజకవర్గాల సీట్లు పెంచలేదన్నదే బీజేపీకి బాబు కటీఫ్‌ చెప్పడానికి వెనుక ఉన్న వ్యూహమన్నది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ప్రతిపక్షం నుంచి ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలకు సీట్ల పెంపు కోసం ఢిల్లీ పర్యటనల్లో మాట్లాడారు తప్పించి... ఒక్కసారి కూడా ఏపీ సమస్యల విషయాన్ని ప్రస్తావించలేదన్నది వంద శాతం నిజం. బాబు దుష్ప్రచారాన్ని ప్రజలు ఎంత నమ్ముతారో కాలమే నిర్ణయిస్తుంది. అభివృద్ధికి పట్టం కడ్తారో... అబద్ధాలు చెప్పే చంద్రబాబుకు ఓటేస్తారో కాలమే చెప్తుంది.


వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, ఢిల్లీ
పురిఘళ్ల రఘురాం 
ఈ–మెయిల్‌ : raghuram.delhi@gmail.com

మరిన్ని వార్తలు