మైనార్టీల రక్షణ ముసుగులో దాడులు

13 Mar, 2020 01:20 IST|Sakshi

విశ్లేషణ

దేశ రాజధాని ఢిల్లీలో చెలరేగిన హింస, అల్లర్లలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరం. ఈ హింసాత్మక ఘటనల్లో ఒక మతం వారిని, కేంద్ర ప్రభుత్వాన్ని.. ముఖ్యంగా హోం శాఖను అనుమానించేలా చాలామంది మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఈ ఘర్షణల్లో మూడు మతాలకు చెందినవాళ్లు బాధితులయ్యారు. రెండు వర్గాల మధ్య అపోహలు సృష్టించి, అనుమానాలు రేకెత్తించి, సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టారు. అల్లర్లకు, ఆస్తి నష్టానికి సంబంధించి చట్టం తనపని తాను చేస్తుంది. పోలీసులు ఇప్పటికే కొందరు నిందితులను పట్టుకున్నారు. మరికొందరిపై కేసులు నమోదు చేశారు. విచారణ కొనసాగుతోంది. కానీ, అనుమానాలు రేకెత్తించి, అపోహలు సృష్టించిన వారి సంగతి ఏంటి?

గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, వ్యతిరేక ప్రదర్శనలు చేస్తున్నారు. అసదుద్దీన్‌ ఒవైసీ, ఆ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా సీఏఏ నిరసన కార్యక్రమాలకు హాజరై ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ప్రతి ఒక్కరిచేతా జాతీయ జెండా పట్టించి, రాజ్యాంగ పీఠికను చదివిస్తూ, అంబేడ్కర్‌ ఫొటోలను ప్రదర్శిస్తూ పైకి చాలా పద్ధతిగల వ్యక్తిలాగా కని పించాలని ప్రయత్నించారు. కానీ, ఆయన పార్టీ నాయకుడైన వారిస్‌ పఠాన్‌ మాత్రం ఫిబ్రవరి 16వ తేదీన ‘(సీఏఏ వ్యతిరేక ప్రదర్శనల్లో) మహిళల్ని ముందుపెట్టామని అంటున్నారు. ఆడ సింహాలు బయటికొస్తేనే చెమటలు కక్కుతున్నారు. ఇక మనమంతా బయటికొస్తే ఏం జరుగుతుందో మీరు అర్థం చేసుకోగలరు. 100 కోట్ల మంది (హిందువుల) కంటే 15 కోట్ల మంది (ముస్లింలు) శక్తివంతులు. దీన్ని గుర్తు పెట్టుకోండి’ అని అసదుద్దీన్‌ సమక్షంలోనే రెచ్చగొట్టారు. 

ఒకప్పుడు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా ఉన్న వారిస్‌ పఠాన్‌ అసెంబ్లీ సాక్షిగా ‘భారత్‌ మాతాకీ జై’ అని నినదించనని చెప్పి సస్పెండ్‌ అయ్యారు. అంతటి ఘన చరిత్ర కలిగిన ఆయన తన సమక్షంలో బహిరంగ సభలో, మీడియా ముందు హిందువులను రెచ్చగొట్టేలా, ముస్లింలను హింసవైపు ప్రేరేపించేలా మాట్లాడితే అసదుద్దీన్‌ ఏం చేశారు? దేశానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా ఏ ఒక్కరు ప్రవర్తించినా వాళ్లు ముస్లిం వ్యతిరేకులేనని చెప్పిన ఒవైసీ వారిస్, పఠాన్‌ విషయంలో మౌనంగా ఉన్నారెం దుకు? హిందువుల్ని హీనంగా చిత్రీకరిస్తూ వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీ నాయకులకు కొత్తేమీ కాదు. ఇలా ఎదుటివారిని తక్కువ చేయమని ఏ మతమూ చెప్పదు. తన మతం గురించి గొప్పలు చెప్పుకోవడం ఏమాత్రం తప్పు కాదు. కానీ, ఎదుటివారి మతాన్ని కించపర్చడం మాత్రం క్షమార్హం కాదు.

అయితే, వారిస్‌ పఠాన్‌ మాత్రం ఒక విషయాన్ని బహిరంగంగా ఒప్పుకున్నారు. అదేంటంటే.. మహిళల్ని ముందుపెట్టి సీఏఏ నిరసన ప్రదర్శనలు చేయడం. దీనిని ఒక వ్యూహంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఫిబ్రవరి 22వ తేదీన కూడా ఈశాన్య ఢిల్లీలో వందలాది మంది ముస్లిం మహిళలు రోడ్లపైకి వచ్చారు. ఇది కూడా ఒక వ్యూహం ప్రకారమే జరిగింది. ఎందుకంటే మరో రెండు రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ఢిల్లీ వస్తున్నారని, ఆ సందర్భంగా సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుందని, పోలీ సులు, కేంద్ర ప్రభుత్వం దృష్టి మొత్తం ఆ పర్యటన సజావుగా జరిగేలా చూడటంపైనే ఉంటుందని అందరికీ తెలుసు. మీడియా కవరేజీ కూడా ఈ విషయాలపైనే ఎక్కువగా ఉంది. దీంతో రోడ్లపైకి వచ్చిన ఈ ముస్లిం మహిళలంతా జఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో ఏకమై సీలంపూర్, మౌజాపూర్, యమునా విహార్‌లను కలిపే రోడ్లను దిగ్బంధించారు. సీఏఏను వెనక్కు తీసుకునేవరకూ తాము అక్కడినుంచి కదలబోమని మంకుపట్టుపట్టారు. 

అదే సమయంలో సీఏఏ అనుకూల ప్రదర్శనకారులపై కూడా రాళ్లదాడులు జరిగాయి. ఆ తర్వాత రాళ్లదాడులు కాస్తా పెట్రోలు బాంబులతో దాడులుగా మారాయి. అసలు అప్పటికప్పుడు వేలా దిమందికి రాళ్లు, పెట్రోలు బాంబులు ఎక్కడినుంచి వచ్చాయి? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. అల్లర్లలో ఆమ్‌ ఆద్మీ పార్టీ కౌన్సిలర్‌ తాహిర్‌ హుస్సేన్‌ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్‌తో తాహిర్‌ హుస్సేన్‌ అల్లర్లకు ముందు మూడు రోజులపాటు జరిపిన మంతనాలు, అమనతుల్లా ఖాన్‌ ఆ మూడు రోజుల్లో ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాతో జరిపిన 18 ఫోన్‌ సంభాషణలు, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో జరిపిన 9 ఫోన్‌ సంభాషణలు ఏంటో కూడా తేలాల్సి ఉంది. 

ఇప్పటికే పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌ షా చెప్పినట్లుగా సీఏఏ వల్ల ఒక్కరి పౌరసత్వం కూడా పోదు. పొరుగుదేశాల్లో మతం పేరుతో ఇబ్బందులు పడుతున్న మైనార్టీలకు పౌరసత్వం ఇవ్వడానికే ఈ చట్టం తెచ్చారు తప్ప భారతదేశంలో ఎన్నో దశాబ్దాలుగా నివసిస్తున్న, సమాజంలో అంతర్భాగమైన ముస్లింలను వెళ్లగొట్టేందుకు కాదు. పార్లమెంటులో అన్ని పార్టీలూ సమగ్రమైన చర్చలు జరిపి, సెలక్ట్‌ కమిటీకి పంపించి, క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత చేసిన చట్టమే పౌరసత్వ సవరణ చట్టం. ఇందులో ఎలాంటి తప్పులూ లేవు. దీన్ని అడ్డం పెట్టుకుని, అమాయకుల్ని మోసం చేసి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్న వారిపట్ల జాగ్రత్తగా ఉండండి. 

ఎన్నో దశాబ్దాలుగా భారతదేశంలో నివసిస్తూ, సమాజంలో అంతర్భాగమైన ముస్లింలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి నష్టమూ జరగదు. కానీ, ముస్లింల పేరుతో దేశంలోకి చొరబడాలని చూసే అసాంఘిక శక్తులకు, ముస్లింలను అడ్డుపెట్టుకుని రాజకీయాలను చేయాలనుకునే పార్టీలకు, మైనార్టీల జపం చేసే సూడో సెక్యులరిస్టులకు మాత్రం మోదీ అంటే ఏమాత్రం గిట్టదు. అందుకే వాళ్లు అమాయకులైన ప్రజల్ని రెచ్చగొట్టి, తమ పబ్బం గడుపుకుంటున్నారు. కానీ, అలాంటి వారు కూడా చట్టం ముందు చేతులుకట్టుకుని నిలబడే రోజు తప్పకుండా వస్తుంది.

వ్యాసకర్త: పురిఘళ్ల రఘురాం
బీజేపీ సమన్వయకర్త, అధికార ప్రతినిధి
ఈ–మెయిల్‌ : raghuram.bjp@gmail.com

మరిన్ని వార్తలు