వివక్ష విసిరిన భయోత్పాతం

27 Dec, 2019 01:52 IST|Sakshi

సమకాలీనం

ఆపత్కాలంలో తన తోక కొసను తానే శరీరం నుంచి విడగొట్టుకోగలిగే ప్రత్యేక లక్షణం బల్లికి ఉంది. అలా విడివడిన తోక భాగం గిలగిలా కొట్టుకుంటుంటే అప్పటి వరకు తనను వెంటాడిన శత్రువు క్షణాల పాటు విస్మయానికి గురౌతుంది. అదే అదునుగా... సదరు బల్లి శత్రువుకి చిక్కే గండం తప్పించుకొని మెల్లగా సురక్షిత ప్రాంతానికి జారుకుంటుంది. మొండి శరీ రానికి మళ్లీ తోక మొలిచి బల్లి మామూలు స్థితికి వస్తుంది, అది వేరే విషయం! 

పాలకులూ ప్రధానమైన ప్రజాసమస్యలు, తాము నేరుగా బాధ్యత వహించాల్సిన ముఖ్యాంశాల నుంచి జనం దృష్టి మళ్లిం చేందుకు ఇతరేతర విషయాల్ని తెరపైకి తెస్తుంటారు. అది గ్రహించని సాధారణ ప్రజలు, విద్యావంతులు, సమకాలీన ప్రసారమాధ్యమా లతో సహా... అలా తెరపైకి తీసుకువచ్చిన అప్రస్తుత అంశాల చుట్టే తిరుగుతూ, జనాల్ని తిప్పుతూ ఉంటారు. దాంతో అసలు సమస్యలు చర్చకు రాకుండా మరుగున పడిపోతుంటాయి. 

ఇది మన ప్రజాస్వా మ్యంలో ఇటీవల రివాజుగా మారింది. జాతీయ పౌర నమోదు పట్టి (ఎన్నార్సీ), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయంలో జరుగు తున్న రగడ కూడా అటువంటిదేనేమో! అన్న భావన మొదట కలిగినా, అంతకన్నా ఎక్కువ ప్రమాద సంకేతాలే ఇప్పుడు కనిపిస్తు న్నాయి. మొదట దీన్నొక దృష్టి మళ్లింపు చర్యగా పలువురు భావిం చడానికి బలమైన కారణాలే ఉన్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి దిగ జారడం, వార్షిక ఆర్థికాభివృద్ధి రేటు పడిపోయి 5–4 శాతం మధ్య కొట్టుమిట్టాడటం, నిరుద్యోగ సమస్య జఠిలమవడం, వ్యవసాయం కునారిల్లడం... వంటి వైఫల్యాల నుంచి జనం దృష్టి మళ్లించడానికి కేంద్రం చేపట్టిన చర్యనేమో అనుకున్నారు. 

కానీ, ఎన్నార్సీ అమలుకు పూర్వ రంగంగా ఇప్పుడు జాతీయ జనాభా నమోదు పట్టి (ఎన్పీఆర్‌) తయారీకి నడుం కట్టడంతో, ఎన్నార్సీ అమలుకే కేంద్రం కట్టుబడినట్టు రూఢీ అయింది. ఈ విషయంలో ఎన్డీయే ప్రభుత్వ పెద్దల మాటలకు, చేతలకు పొంతనలేనితనం సందేహాలకు తావి స్తోంది. మత ప్రాతిపదికన వివక్షాపూరిత విధానాలతో ఈ ప్రక్రియ చేపడుతున్నారనే విమర్శతో దేశవ్యాప్త నిరసనలు చెలరేగుతు న్నాయి. భారతీయ ముస్లీంలలో ఒక విధమైన భయాందోళనలకు ఇది కారణమౌతోంది. ఈ విషయంలో దేశ ప్రజల, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయ ఝరి రెండు పాయలుగా చీలింది. ఎనార్సీ, సీఏఏ, ఎన్పీఆర్‌ ఒకటికొకటి సంబంధం లేనివిగా చెబుతున్న కేంద్ర ప్రభుత్వపు మాటలూ నిజం కాదు.

చర్చించలేదంటే.....!?
రాజకీయాల్లో కొన్నిసార్లు వ్యూహాత్మక వెనుకడుగు సహజమే! పాల కులు తమ ఆలోచనల్ని శైశవ దశలోనే జనబాహుళ్యంలోకి వదిలి, స్పందనను బట్టి ముందుకు సాగటమో, వెనక్కి తగ్గటమో చేస్తుం టారు. ఎనార్సీ విషయంలోనూ బీజేపీ నాయకత్వం ఇదే పంథా అనుసరిస్తోందేమో అనుకున్నారు. అసోమ్‌లో చేసినట్టు, దేశమం తటా అమలు చేస్తామని ముందు పార్లమెంట్‌ వేదిక నుంచి, బయటా చెప్పిన వారే దేశ వ్యాప్త నిరసనలు చూసి, ‘మేమసలు చర్చించనే లేద’ంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనని ధృవీ కరిస్తూ హోమ్‌ మంత్రి, బీజేపీ అధినేత అమిత్‌షా మాట్లాడారు. 

కానీ, స్పష్టత కొరవడింది. ఆలోచించలేదన్నారు కదా! పోనీ, ‘అమలు తలంపు లేదు’ అంటున్నారా? అంటే, అనటం లేదు. అందుకే, నిరస నలు పెల్లుబికి సర్వత్రా నిప్పు రగులుతూ ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు తాము ఎన్నార్సీ అమలు పరిచేది లేదని కరాఖండిగా ప్రకటించాయి. తాజాగా జాతీయ జనాభా నమోదు పట్టి (ఎన్పీఆర్‌) రూపొందించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. దీనికోసం ప్రత్యేకంగా బడ్జెట్‌ పెట్టడమే కాకుండా వచ్చే సంవత్సరం ఏప్రిల్‌– సెప్టెంబరు మధ్య ఈ ప్రక్రియ పూర్తిచేయాలని మంత్రివర్గం ఆమో దించింది. ఈ చర్యలతో సర్కారు వైఖరి స్పష్టమైంది. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకత రాగానే, ఎన్నార్సీకి, సీఏఏకి  సంబంధం లేదని ఇన్నాళ్లు చెబుతూ వస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఎన్నార్సీకి, ఎన్పీఆర్‌కు సంబంధం లేదని చెబుతోంది. 

ఈ వాదనే విచిత్రం. ఇవన్నీ ఒక తాను (పౌరసత్వ చట్టం–1955) ముక్కలే! కేంద్ర ప్రభుత్వ పెద్దలు, మంత్రులు లోగడ చేసిన అధికారిక ప్రకటనకు తాజా వాదన పూర్తి విరుద్దం! హోమ్‌ మంత్రిత్వ శాఖవారు లోగడ (2014 కు పూర్వం, తర్వాత కూడా) లోకసభలో పలు సందర్భాల్లో... ఎన్నార్సీ అమలుకు ఎన్పీఆర్‌ తొలిమెట్టని సెలవిచ్చారు. రెండు వేర్వేరు ప్రక్రియలే అయినా, ఒకదానితో ఒకటి ముడివడి ఉన్న వ్యవ హారాలే! సాపేక్షంగా చెప్పాల్సి వస్తే.... పిండి పిసకటం, రొట్టె కాల్చడం రెండూ ఒకటి కాదు. వేర్వేరనే మాట నిజమే! కానీ, పిండి పిసికేది దేనికి? రొట్టె కాల్చడానికి కాదా? మరి సంబంధం లేదని ఎలా అనగలం?

కాంగ్రెస్‌ సందిగ్దతకు కారణమేంటో!
మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ భాగస్వామ్యంతో ఉన్న మహా రాష్ట్ర ప్రభుత్వాధినేతలు... తాము ఎనార్సీ అమలుపరచమని ప్రకటిం చారు. అలా ప్రకటించిన మమతా బెనర్జీ (పశ్చిమబెంగాల్‌), వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (ఆంధ్రప్రదేశ్‌), నితీష్‌కుమార్‌ (బీహార్‌), నవీన్‌ పట్నాయక్‌ (ఒడిశా) తదితర ముఖ్యమంత్రులు వేర్వేరు పార్టీలకు స్వయంగా అధినేతలు. కాంగ్రెస్‌ విషయానికి వస్తే పరిస్థితి భిన్నం. ఢిల్లీ అధినాయకత్వం విధాన ప్రకటన చేయాలి. ఎన్నార్సీని ఇంతగా ప్రతిఘటిస్తున్న కాంగ్రెస్‌ అధినాయకత్వం, తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దీన్ని అమలుపరచబోమని ప్రకటించడం లేదు. 

ఇది, అదు నుగా బీజేపీ నాయకత్వం కాంగ్రెస్‌పైనే బాణాలు ఎక్కుపెడుతోంది. పౌరసత్వ ప్రస్తుత సవరణ చట్టం మూలాలు 2003 సవరణలోనే ఉన్నాయి. పౌరసత్వ చట్టం–1955ను నాటి వాజ్‌పేయి ప్రభుత్వం సవరించింది. దశాబ్ద కాలం (2004–14) అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఎందుకీ సవరణల్ని తొలగించలేదని అడుగుతున్నారు. నాటి యూపీఏ ప్రభుత్వం (2010–11) ఎన్పీఆర్‌ జరిపినా ఎన్నార్సీకి సాహసించలేదు. 2014 తర్వాత పార్లమెంటులోనే పలు సందర్భాల్లో తాము దేశవ్యాప్త ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లతో వెళతామని ఎన్టీయే పాల కులు విస్పష్టంగా చెప్పినా కాంగ్రెస్‌ ఎందుకు వ్యతిరేకించలేదు? అనే ప్రశ్న సంధిస్తున్నారు. 

అందుకేనేమో, కాంగ్రెస్‌ ప్రస్తుత సంకట పరి స్థితి! కానీ, ఇప్పుడు వివాదమంతా వాజ్‌పేయి నేతృత్వంలో (2003) జరిగిన పౌరసత్వ సవరణ చట్టంపైనే అన్నది గుర్తెరగాలి. దాని ప్రకారం, భారత పౌరుల్ని లెక్కించి ఎన్పీఆర్‌ రూపొందిస్తారు, లెక్కిం  చిన పౌరుల పౌరసత్వాన్ని ప్రభుత్వం గుర్తించాలి. అలా గుర్తింపు పొందిన పౌరులంతా మరో అధికారిక పత్రం ‘జాతీయ భారత పౌర నమోదు పట్టి’ (ఎన్‌ఆర్‌ఐసీ)లో భాగమవుతారు. దాన్నే మనమిపుడు ఎన్నార్సీ అంటున్నాం. ఈ ప్రక్రియ మధ్యలో, లెక్కించిన పౌరుల గుర్తింపునకు తాజా పౌరసత్వ సవరణ చట్టం–2019 ప్రాతిపదిక అవుతుంది. అదే తాజా వివాదానికి ఆజ్యం పోస్తోంది. ఎందుకంటే, తాజా సవరణల్లో పొందుపరిచిన ప్రాతిపదికలే వివాదాస్పదంగా, వివక్షాపూరితంగా ఉన్నాయి.  ఇక, ఒకటికొకటి సంబంధం లేదనే వాదనకు అర్థమే లేదు.

సవరణ–ప్రాతిపదికలతోనే తంటాలు
కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాం 2010–11లో జరిగిన ఎన్పీఆర్‌కి, ఇప్పుడు జరుపబోయేదానికి ఎంతో వ్యత్యాసముంది. సవరణ చిన్న దిగా కనిపిస్తున్నా, ఎన్నార్సీ ప్రక్రియకు సీఏఏ చట్ట తాజా సవరణాం శాల్ని అనుసంధానించినపుడు సమస్య జఠిలమౌతోంది. ప్రాతిపదిక లలా ఉన్నాయి. లెక్కించిన పౌరుల్ని గుర్తించి, పౌరసత్వం ఇచ్చే అంశంపైనే (అంటే... మిగిలిన వారికి నిరాకరించే, అనే అర్థం కూడా తీసుకోవాలి) ఈ ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టినట్టు స్పష్టమౌతోంది. ఎలా అంటే, తాజా ఎన్పీఆర్‌లో, మీవే కాకుండా మీ తలిదండ్రుల పుట్టిన స్థలం, తేదీల ధ్రువీకరణనూ అడుగుతారు. ఉదా: మీరు 26 జనవరి, 1950–1 జులై, 1987 ల మధ్య పుట్టిన భారతీయులైతే, మీ పుట్టిన స్థలం–తేదీ ఉంటే సరిపోతుంది. 

కానీ, 2 జులై 1987–2 డిసెంబరు 2004 మధ్య పుట్టిన వారైతే, మీ తలిదండ్రుల్లో ఒకరైనా భారతదేశంలో పుట్టిన పౌరులై ఉండాలి. అడిగితే, వారి పుట్టిన స్థలం, తేదీని ధ్రువీకరించాల్సి ఉంటుంది. 2004 డిసెంబర్‌ 3, లేదా తర్వాత పుట్టిన వారైతే మరింత సంక్లిష్టమైన ప్రక్రియ ఉంది. మీరు భారత్‌ లోనే పుట్టినా, మీకు ఓటరు–ఆధార్‌ కార్డు ఉన్నా తలిదండ్రుల పుట్టిన తేదీ–స్థలం ధ్రువీకరణ లేకుంటే మీకు పౌరులుగా గుర్తింపు దక్కదు. మూడు పొరుగు దేశాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లను ఎంపిక చేసుకోవడం, ఆయా దేశాల్లో అల్ప సంఖ్యాకులైన అయిదు మతాల వారిని తీసుకొని, ముస్లింలను పరిగణనలోకి తీసుకోకపోవ డంతో ప్రస్తుత వివక్ష నెలకొందనే వాదన ఉంది. 

ఇది రాజ్యాంగం కల్పించిన సమానత్వ స్ఫూర్తికి, నిబంధనలకు వ్యతిరేకమని వారం టున్నారు. అసోమ్‌లో అమలైన ఎన్నార్సీ వల్ల స్థానికులు, హిందు వులు, గిరిజనులతో సహా దాదాపు పదిలక్షల మంది పౌరసత్వం దక్కక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అక్కడి సంక్షోభాన్ని పరిష్కరించకుండానే దేశవ్యాప్త ఎన్నార్సీ అమలు లెక్కలేనన్ని చిక్కుల్ని స్వాగతించడమే అని విపక్షాల విమర్శ. ఇంకా చాలా.. సమాధానా ల్లేని సందేహాలు, జవాబులు దొరకని ప్రశ్నలు భారత దేశ లౌకిక మూల సూత్రపు పునాదుల్ని వణికిస్తున్నాయి.
-దిలీప్‌ రెడ్డి

ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

మరిన్ని వార్తలు