వ్యూహం లేక ఒరిగిన ‘వలస’ పక్షులు

9 May, 2020 00:39 IST|Sakshi

విశ్లేషణ

లాక్‌డౌన్‌ ప్రకటించగానే వలస కార్మికుల బాధలు పట్టించుకోకుండా చేతులెత్తేశారు పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు. వలస కార్మికుల కష్టం మీద వందల వేల కోట్లు సంపాదించిన వీళ్లకు కనీసం భోజనం పెట్టడానికి కూడా దయ రాలేదు. పోనీ నాలుగు డబ్బులు ఇచ్చి ఇంటికి పంపడానికి కూడా వీరికి మనసొప్పలేదు. జాతీయ, ప్రాంతీయ మీడియాలో విపక్షాలు గోల పెట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ హృదయం కొద్దిగా కరిగింది. శ్రామిక రైలు ప్రవేశపెట్టారు. కానీ దేశంలోని పదికోట్ల మంది వలస కార్మికులకు వారి గమ్యస్థానాలకు తరలించడానికి ఎన్ని రైళ్లు కావాలి, ఎన్ని రోజులు నడపాలి అనే ప్లాన్‌ లేకుండా ఆదరాబాదరాగా ప్రవేశపెట్టారు. ముందుచూపులేని విధానాల వల్ల దేశవ్యాప్తంగా అభివృద్ధి పనులు నిలిచిపోతాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పరిస్థితిని చక్క దిద్దటానికి ప్రణాళిక ప్రకారం వ్యూహరచన చేయాలి.

నెత్తిన మూట,  సంకన పసిపాప, పక్కన నడిచే పిల్లలు,  పైన భగభగ మండే ఎండ, కింద చెప్పులు లేని నడక, ఎండకు కాలిన కాళ్లకు బుగ్గలు, ఎండిన డొక్కలు, కంటినిండా నీరు, గుండెనిండా వేదన–గమ్యం లేని వందల వేల కిలోమీటర్లు నడక. ఇది దేశంలోని ఏ రోడ్డున చూసినా, ఏ మూలను చూసినా కనిపించిన వలస కార్మికుల హృదయ విదారక దృశ్యాలు. వీరి బాధను చూసి రాతి గుండెలు కూడా కరిగిపోతాయి. 

కానీ మన పాలకుల గుండెలు కరుగలేదు. ఇది కరోనా రక్కసి ప్రభావమని పాలకులు తప్పించుకుంటున్నారు.  కానీ ఇది ఏలుతున్న వారి అసమర్ధత. అంతే కాదు పేద వర్గాల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేని దొరతనం. సంపన్న వర్గాల పిల్లలు విదేశాలలో చిక్కుకుంటే ఆగమేఘాల మీద ప్రత్యేక విమానాలను పంపి తేవాలనుకునే ప్రభుత్వ నేతలకు వలస కార్మికులను గమ్యస్థానాలకు పంపాలని కానీ, భోజనం పెట్టాలని కానీ, ఉన్నచోటే కనీస సౌకర్యాలు కల్పించాలని కానీ ఆలోచన రాలేదు. 
(చదవండి: కూలీలను చిదిమేసిన రైలు)

లాక్‌డౌన్‌ ప్రకటించిన మొదటి రోజే కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వాలు తమ ఓటర్లకు నగదు పంపిణీ, రేషన్‌ సరుకులు ప్రకటించారు. వెంటనే వలస కార్మికులకు కూడా ఇదే ప్రభుత్వ సహాయాన్ని అందించాలని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. ప్రభుత్వం మొక్కుబడిగా వలస కార్మికులకు కూడా ఈ సదుపాయాలను కల్పిస్తామని ప్రకటించింది. కానీ ఆచరణలో అమలు కాలేదు. ఎందుకో తెలుసా వీరికి మీరు పనిచేసే రాష్ట్రాలలో ఓట్లు  లేవు.  ఓట్లు ఉంటే తప్ప సహాయం చేయరని తేలిపోయింది.  పోనీ ఇన్ని రోజులు పని చేయించుకున్న  యాజమాన్యాలు  ఆదుకుంటాయా అంటే.. వాళ్లూ చేతులెత్తేశారు.

దీనితో వలస కార్మికులు నాలుగు వారాలు అర్ధాకలితో నెట్టుకొచ్చారు. ఇక లాభం లేదని ఆకలి చావులకు భయపడి తమతమ గ్రామాలకు వెళ్లాలని బరువైన మనసుతో ఖాళీ గిన్నెలు, గ్లాసులు మూటకట్టుకొని బయలుదేరారు.  అక్కడక్కడా ధైర్యం ఉన్న వలస కార్మికులు రవాణా సౌకర్యం కల్పించాలని నిరసన ప్రదర్శనలకు దిగితే, లాఠీ ఛార్జ్, బాష్పవాయు ప్రయోగం చేసి చెదరగొట్టారు. వలస కార్మికుల నడక  కష్టాలు ఇంతా అంతా కాదు.  

కొందరు దారిలోనే ఆకలితో సొమ్మసిల్లి చనిపోతే, మరికొందరు ప్రమాదాలలో చనిపోయారు.  ఇంకా చనిపోతున్నారు, కాలినడకన ఒక నిండు గర్భిణీ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని తన సొంత ఊరు చేరడానికి ఇద్దరు పిల్లలతో వెళుతుంటే, మేడ్చల్‌ దాటగానే రోడ్డు పక్కనే చెట్ల కింద పండంటి పసిపాపను కన్నది. ఈ సంఘటన భారత జాతి ఆత్మను ప్రశ్నించింది. తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఆమెను నర్సాపూర్‌ ఆసుపత్రికి తరలించారు. 

వలస కార్మికుల బాధలు, కన్నీటి  గాధను, మూగ రోదనను చూసి భారతమాత కన్నీళ్ళు పెట్టి ఉంటుంది. న్యాయ దేవత తన నిస్సహాయతను చూసి తలదించుకుని ఉంటుంది. జాతీయ రహదారుల వెంట జాతరలా వెళుతున్న వలస కార్మికుల బాధలు టీవీలలో, పత్రికలలో చూసి భారతదేశం అభివృద్ధి చెందుతున్న  దేశమేనా అని ప్రపంచ దేశాలు ఆలోచనలో పడ్డాయి. అభివృద్ధి అంటే కొంతమంది పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు రాజకీయ నాయకుల అభివృద్ధి కాదు. 

అందమైన బంగ్లాలు కాదు, ఫ్లైఓవర్‌ ఫ్లవర్‌ రోడ్లు కాదు. విమాన సౌకర్యాలు కాదు. రిలయన్స్‌ అంబానీ, ఆదాని, టాటా– బిర్లాల ఆస్తి సంపద పెరగడం కాదు. దేశంలో ప్రతి పౌరునికి  కూడు గూడు ఉద్యోగం ఉపాధి కలిగిననాడు నిజమైన అభివృద్ధి.  దేశ సంపద, అభివృద్ధి ఫలాలు ప్రతి పౌరునికి దక్కిన రోజు.. అదే నిజ మైన అభివృద్ధి. అసలు ఈ వలస కార్మికులు ఎవరు? తాము పుట్టిన గడ్డపై ఉపాధి కరువై బతుకుతెరువు లేక పొట్ట చేత పట్టుకొని  దేశం కాని దేశం వచ్చి, రక్తాన్ని చెమటగా మార్చి  రాత్రింబవళ్లు పనిచేస్తున్న శ్రమజీవులు. బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి వచ్చి ఇతర రాష్ట్రాలలో పనిచేస్తున్న శ్రమజీవులు.  

మన రాష్ట్రం నుంచి కూడా బొంబాయి, పూణే, సూరత్, బెంగళూరుకు కూడా వెళ్లి వేలాది మంది  పని చేస్తున్నారు. అలాగే ప్రపంచంలో కూడా ప్రతి అభివృద్ధి చెందిన దేశంలో ముఖ్యంగా అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, గల్ఫ్‌ దేశాలలో కూడా కోట్లాది మంది మన భారతీయులు ఉన్నారు. తెలంగాణలో అనధికార లెక్కల ప్రకారం 15 లక్షల మంది వలస కార్మికులు ఉన్నారని అంచనా. దేశంలో పది కోట్ల మంది వలస కార్మికులు పని చేస్తున్నట్టు లెక్కలు  తెలుపుతున్నాయి.

వలస కార్మికులు లేకుంటే మన రాష్ట్రంలో లేబర్‌ కొరత తీవ్రంగా ఉండేది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో భవన నిర్మాణ కార్మికులు మొత్తం వలస కార్మికులే. పెద్దపెద్ద అందమైన భవనాలు, అపార్ట్‌మెంట్‌లు కట్టినవారు. ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా ఫ్లై ఓవర్స్‌ నిర్మించినది వీరే.  జాతీయ రహదారులను రింగ్‌ రోడ్‌ లను తీర్చి దిద్దింది వీరే. మనం తినే సన్న బియ్యం, సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ పండించడానికి నిర్మించిన కాళేశ్వరం దాని ఉప ప్రాజెక్టులు, కాలువలు, అలాగే మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని కృష్ణ  ప్రాజెక్టులు కాలువలు తవ్వింది, తవ్వుతున్నది, గంపలు పలుగు పారలు పట్టింది వలస కార్మికులే.  
(చదవండి: కార్మికులను తయారుచేద్దాం!)

మనకు కాంతినిచ్చే లైట్లు, చల్లని  ఎయిర్‌ కండిషనర్‌ మిషన్లు, కరెంటు ఉత్పత్తి చేసే పరికరాలు తయారు చేసే ప్రైవేట్‌ ఎలక్ట్రికల్‌ కంపెనీలలో రాత్రింబవళ్లు కష్ట పడేది వలస కార్మికులే.  మన రోగాలను నయం చేసే మందులను తయారు చేసే ఫార్మసీ కంపెనీలలో పని చేసేది వలస కార్మికులే.  అలాగే రైసు మిల్లుల్లో, సిమెంటు, ఐరన్, ప్లాస్టిక్‌ కంపెనీలలో పనిచేసే మెజారిటీ కార్మికులు వలస కార్మికులే.

రక్తాన్ని చెమటగా మార్చి దేశాన్ని దేశ సంపదను సృష్టిస్తున్న సృష్టికర్తలు వీళ్లు. ప్రాజెక్టులు కట్టకుండానే కట్టినట్లు చెరువులో పూడికలు తీయకుండానే తీసినట్లు, రోడ్లు వేయకుండానే వేసినట్లు దొంగ బిల్లులు సృష్టించి కోట్లకు కోట్లు ధనాన్ని కొల్లగొట్టి లూటీ చేసిన స్కాం బాబులు ఈ కరోనా కష్టకాలంలో, ఇంద్ర భవనాలలో విందు వినోదాలలో తేలి ఆడుతున్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించగానే వలస  కార్మికుల బాధలు పట్టించుకోకుండా చేతులెత్తేశారు పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు.  

ఈ వలస కార్మికులకు పని లేదు, కాబట్టి జీతాలు లేవన్నారు. వీరికి జీతాలు ఇవ్వాలని, వీరిని ఆదుకోవాలని ప్రభుత్వం చేసిన ఉత్తుత్తి ప్రకటనలను ఈ బడాబాబులు లెక్కచేయలేదు. ఇంతవరకు వలస కార్మికుల కష్టం మీద వందల వేల కోట్లు సంపాదించిన  పారిశ్రామికవేత్తలకు, కాంట్రాక్టర్లకు కనీసం భోజనం పెట్టడానికి కూడా దయ రాలేదు. పోనీ నాలుగు డబ్బులు ఇచ్చి ఇంటికి పంపడానికి కూడా వీరికి కఠిన హృదయం కరగలేదు. 

జాతీయ, ప్రాంతీయ మీడియాలో విపక్షాలు గోల పెట్టిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయం కొద్దిగా కరిగింది. శ్రామిక రైలు ప్రవేశపెట్టారు. అప్పటికే 60 శాతం మంది వలస కార్మికులు కాలినడక మధ్యలో ఉన్నారు. లక్షలాది మంది వలస కార్మికులకు ఈ శ్రామిక రైలు సరిపోదు. దేశంలోని పదికోట్ల మంది వలస కార్మికులకు వారి గమ్యస్థానాలకు తరలించడానికి ఎన్ని రైళ్లు కావాలి. 

ఎన్ని రోజులు నడపాలి అనే ప్లాన్‌ లేకుండా ఆదరాబాదరాగా విమర్శలను తప్పించుకోవడానికి నామమాత్రంగా ప్రవేశపెట్టారు. ప్లాన్‌ లేకుండా సింగిల్‌ స్టాప్‌ విధానం పెట్టడంతో అక్కడినుండి గమ్యస్థానాలు చేరడానికి ఒక్కొక్కరు 100 నుండి 200 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం కొనసాగించవలసి వస్తుంది. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడే వలస కార్మికుల విషయంలో ప్రభుత్వ పెద్దలు మనసుపెట్టి ఆలోచన చేయలేదు. 

లాక్‌ డౌన్‌ దశలవారీగా తొలగించిన తర్వాత వలస కార్మికులను పంపడంలో ఏమైనా అర్థం ఉందా? ఎందుకంటే లాక్‌డౌన్‌ తరువాత, సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత  వలస కార్మికులు లేకపోతే అన్ని అభివృద్ధి పనులు ఆగిపోతాయి. 17 లక్షలమంది వలస కార్మికులు వెళ్లి పోతే తెలంగాణలోని వారి స్థానాలను ఎలా భర్తీ చేస్తారు? ప్రభుత్వం ముందు చూపుతో వలస కార్మికులను ఆదుకుంటే బాగుం డేది. ప్రభుత్వం వద్ద ఎఫ్‌సీఐ గోడౌన్లలో లక్షల టన్నుల ధాన్యాలు మురిగిపోతున్నాయి. వాటిని వలస కార్మికులకు ఇస్తే వారి ఆకలి బాధలు తీరేవి. ఇప్పుడు లాక్‌డౌన్‌ తర్వాత ఉత్పత్తి రంగం కొనసాగేది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సరి అయిన ప్రణాళిక లేక ఇప్పుడు ఎటూ కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం పరిస్థితిని చక్క దిద్దటానికి ప్రణాళిక ప్రకారం వ్యూహరచన చేయాలి.

వ్యాసకర్త: ఆర్‌. కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు