సాంస్కృతిక విప్లవ సేనాని త్రిపురనేని

27 Oct, 2018 01:58 IST|Sakshi

సందర్భం

త్రిపురనేని మధుసూదనరావు విమర్శ చాలా పదునుగా ఉంటుంది. వ్యాసమైనా, ఉపన్యాసమైనా ముక్కుకు సూటిగా పోతుంది. ఎదురుగా వస్తే అడ్డంగా నరికేసేటట్టు ఉంటుంది. పక్కనొచ్చినా చాలు. సమాజాన్ని, సాహిత్యాన్ని గతితార్కిక చారిత్రక భౌతికవాద తాత్విక దృష్టితో అధ్యయనం చేసి, పరిశీలించి విమర్శిం చారు. త్రిపురనేని మధుసూదనరావు  సాహిత్య సర్వస్వం’ మూడు సంపుటాలుగా విప్లవ రచయితల సంఘం అచ్చేసింది. ఈ సంపుటాలను ఆదివారం (అక్టోబరు 28) ఉదయం తిరుపతిలో ఆవిష్కరించనున్నారు. త్రిపురనేని భాష, శైలి, తాత్విక నిబద్ధతతో నిక్కచ్చిగా ఉంటాయి. ఆయన భావాలు తన తరాన్నే కాకుండా, తరువాతి తరాన్ని కూడా ప్రభావితం చేసేవిధంగా ఉంటాయి.

సాహిత్యంలో యుగవిభజనను కాలక్రమపద్ధతిని బట్టో, కవుల్ని బట్టో, రాజవంశాలను బట్టో, ప్రక్రియలను బట్టో చేయడం అశాస్త్రీయం. చరిత్ర పరిణామానికి ఏ శక్తులు, ఏ ఆలోచనలు దారి తీశాయో, వాటి వ్యవస్థ ఆధారంగానే సాహిత్య పరి ణామం ఉంటుందని త్రిపురనేని విశ్లేషించారు. మౌఖిక సాహిత్యం నుంచి, లిఖిత, పురాణ, ప్రబంధ, భావవాద, అభ్యుదయ, ప్రజా విప్లవసాహిత్యంగా జరిగిన పరిణామాన్ని వివరించారు.సాహిత్య చరిత్రలో ప్రతి యుగం అంతకుముందు యుగాన్ని అధిగమిస్తుంది. పాత వ్యవస్థపైన దాడి చేయకపోతే కొత్త వ్యవస్థ రాదంటారు. 

విమర్శ ఘాటుగా ఉండవలసిందే. అది ఎంత తీవ్రంగా ఉన్నా నాకు అభ్యంతరం లేదంటారు త్రిపురనేని. జ్ఞానానికి హద్దులు ఉంటాయి కానీ, అజ్ఞానానికి మాత్రం వుండవంటారు. చిన్నపిల్లలు మనల్ని ఆకర్షించినట్టే, బాల్యదశలో ఉన్న సమాజం సృష్టిం చిన సాహిత్యం కూడా మనల్ని ఇప్పటికీ ఆకర్షిస్తుం దని మార్క్స్‌ చెప్పిన మాటలను గుర్తు చేస్తారు.

జీవితంలో వ్యక్తిగత సుఖాన్ని, అవసరమైతే ప్రాణాన్ని కూడా ఫణంగా పెట్టి ఉన్నత శ్రామికరాజ్యాన్ని సాధించడానికి కలాన్ని ఆయుధంగా చేసే వాడే ఈ రోజు కవి. కవి అంతరంగిక సంస్కారం, ఆలోచనా ధోరణి పూర్తిగా శ్రమజీవులతో మమేకం చెందడం చాలా అవసరమంటారు. కవితని తొలుత రాజకీయ ప్రమాణంతోనే పరిశీలించాలని, వాల్మీకి, వ్యాసుడు రాజకీయాలే రాశారని అని గుర్తు చేస్తారు. ఒక విమర్శని పూర్వపక్షం చేయడానికి అవసరమైన అధ్యయనం కృషి, జ్ఞానం త్రిపురనేని సొంతం.

సికింద్రాబాదు కుట్రకేసు సందర్భంగా అక్కడి మేజిస్ట్రేట్‌ కోర్టులో, తిరుపతి కుట్రకేసు సందర్భంగా చిత్తూరు సెషన్స్‌ కోర్టులో త్రిపురనేని చదివిన ప్రకటనలో మధ్యయుగాల నుంచి ఈ నాటి వరకు వచ్చిన సాహిత్యాన్నంతా సమీక్షించారు. మార్క్సిస్టు మూల సిద్ధాం తాలను ఆధారం చేసుకునే సాహిత్య విమర్శను అభివృద్ధి చేసిన త్రిపురనేని అనేక కొత్త అంశాలను ప్రతిపాదిస్తూ, సాహిత్య విమర్శని  ముందుకు తీసుకెళ్లారు. 

త్రిపురనేని  ‘గతితార్కిక సాహిత్య భౌతిక వాదం’ సాహిత్య చరిత్రలో ఒక సరికొత్త ప్రతిపాదన. పునాది, ఉపరితలం అవయవాలతో కూడిన సమాజమనే అవయవిలో ఒక అవయవంగానే సాహిత్యానికి అస్తిత్వముంటుంది. ఈ దృష్టి నుంచి పరిశీలించడమే గతితార్కిక సాహిత్య భౌతికవాదం. గతించిన రచయితల్లో అశాస్త్రీయ అవగాహన ఉంటే సరిచేయలేం కనుక అంచనావేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సజీవులైతే సవరించగలుగుతుంది.

ఇది సాహిత్య కళాసిద్ధాంతాలలో ఒకటి కాదు. పూర్వ సిద్ధాంతాలన్నిటినీ వెనక్కు నెట్టిన శాస్త్రీయ తాత్విక ప్రతిపాదన. త్రిపురనేని ప్రతిపాదన విరసంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ప్రతిపాదనను చలసాని ప్రసాద్, కొండపల్లి సీతారామయ్య లాంటి వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాస్తే, కేవీఆర్‌ పాక్షికంగా వ్యతిరేకించారు. వీరి విమర్శలను కూడా అంతే తీవ్రంగా పూర్వపక్షం చేస్తూ త్రిపురనేని వినయంగా వివరించారు. ఆయనొక గొప్ప వాదప్రియుడు.

ఈ చర్చలన్నీ త్రిపురనేని మధుసూదనరావు సాహిత్య సర్వస్వంలో ఉన్నాయి. ఆయనతో మాట్లాడడం, ఆయన ఉపన్యాసాలు వినడం, ఆయన రచనలు చదవడం నిజంగా ఒక విజ్ఞానోత్సవం. త్రిపురనేని పైన ఎన్ని వాద వివాదాలున్నా ఆయనొక సాంస్కృతిక విప్లవ సేనాని. (తిరుపతిలో ఆదివారం ‘త్రిపురనేని మధుసూదనరావు సాహిత్య సర్వస్వం’ ఆవిష్కరణ సందర్భంగా)

వ్యాసకర్త : రాఘవశర్మ, సీనియర్‌ పాత్రికేయులు, మొబైల్‌ 94932 26180

మరిన్ని వార్తలు