అందరి మంచినీ కోరిన అక్షరం

28 Feb, 2018 00:52 IST|Sakshi
రచయిత మునిపల్లె రాజు

సందర్భం
మనిషి అంతరంగం, క్లిష్ట సమయాలలో చేసే పోరాటమే కాదు, అప్పుడు తోటివారి విషయంలో ఉండవలసిన మానవతా స్పర్శనే మునిపల్లె రాజు తన కథలకి వస్తువుగా ఎంచుకున్నారు. ఆయన అందరి మంచిని కోరే మానవతావాది.

కల్మషం, మర్మం, లౌక్యం వంటివాటికి ఎంతో దూరంగా ఉండే ఆధునిక ముని మునిపల్లె రాజు. గతం, వర్తమానాలను సమంగా మేళవించుకోగలిగిన విశిష్ట వ్యక్తిత్వం ఆయనది. ఆయన రచనలు ఆ వ్యక్తిత్వాన్నే ప్రతిబింబించాయి. మృదు స్వభావం, విస్తృత పఠనంతో అబ్బిన అవగాహన, ఎదుటివారిని మెప్పించడానికి కాకుండా, జీవితాన్ని మెప్పించడానికి అనవరత తపన– వెరసి మునిపల్లె రాజు.

కవిత్వం, సమీక్ష, నవల– ఇలా వివిధ ప్రక్రియలు చేపట్టినా, ఆయన ప్రధానంగా కథకుడు. మంచితనం వైపు, ఉత్తముల వైపు, ఆదర్శం వైపు మొగ్గు చూపే రచయితలు ఎక్కువే. బలహీనుల పట్ల సానుభూతి కలిగిన వారూ ఉంటారు. కానీ మునిపల్లె రాజు మాత్రం అందరి మంచిని కోరే మానవతావాది. ఒకరకంగా మనిషితనం పట్ల, మంచి జీవితం పట్ల ఆయనది అత్యాశ. కానీ అభిప్రాయాల దగ్గర మాత్రం నిర్మొహమాటి.

మునిపల్లె రాజు (16.3.1925–24.2.2018) గుంటూరు జిల్లా గరికపాడులో పుట్టారు. తండ్రి హను మంతరావు, తల్లి శారదాంబ. 1943 నుంచి 1983 వరకు నాలుగు దశాబ్దాల పాటు ఆయన భారత రక్షణ శాఖలో వివిధ హోదాలలో పనిచేశారు. పదవీ విరమ ణానంతరం సికింద్రాబాద్‌లో స్థిరపడ్డారు. అయితే ఈ ప్రస్థానంలో చాలా ఎగుడుదిగుళ్లు ఉన్నాయి.

అవి ఆయన మాటల్లోనే: ‘మా పూర్వీకులది గుంటూరు జిల్లా మునిపల్లె. కలకత్తా–మద్రాసు ట్రంక్‌ రోడ్‌ పక్కనే ఉండడం వల్ల కొంత నాగరికత సంత రించు కున్న గ్రామం. నా జననం రెండు ప్రపంచ సం గ్రామాల మధ్య నెలకొన్న ఆర్థిక మాంద్య దశ లో–హంగ్రీ థర్టీస్‌ అనబడే 1925లో. మా తరాన్ని ఊండెడ్‌ జనరేషన్‌ అని చరిత్ర పేర్కొంటున్నది. ఆ తర్వాత మా కుటుంబం దగ్గర్లోనే ఉన్న తెనాలి పట్టణానికి తరలిపోయింది. అదొక సాంస్కృతిక కేంద్రం. దానితోడు మా కుటుంబంలో రాజకీయ చైతన్యం, పుస్తక పఠనం, సామాజిక సంస్కరణల పట్ల గాఢా నురక్తి ఉండడంతో నేను ఆ దిశలోనే పయనించాను.

అన్ని భావధారలకీ సంబంధించిన ఏదో ఒకరకం చర్చ నిత్యం మా ఇంట్లో జరుగుతూ ఉండేది. అది వినడం, విశ్లేషించి జీర్ణించుకోవడం నాకు అలవడ్డాయి. మా నాన్నగారి హఠాన్మరణం తదుపరి మా పేదరికం వల్ల చిన్న ఉద్యోగం చూసుకుని, ఆ ఉద్యోగ రీత్యానే దేశాటనం చేశాను. భారత దేశపు బహుళత్వంలోని ఏకత్వం అనుభవంలోకి రావడం ఈ దేశాటనం వల్లనే.

మొదట్లో కవిత్వ ధోరణి ప్రబలంగా ఉన్నా, కాల్పనిక సాహిత్యంలో వచన ప్రక్రియలందే మనసు లగ్నమైంది. నా విద్యార్థి దశలో అబ్బిన రచనా వ్యాసంగం– ఇప్పటికీ నన్ను సమ్మోహితుడిని చేస్తుంది. కొత్తగా కలం పట్టిన యువకుల వ్యక్తీకరణను ప్రోత్సహించడం నాకెంతో ఆనందం. రష్యన్‌ మాస్టర్ల సాహిత్యం వల్ల అన్ని వాదాల కన్నా, మానవతావాదమే నన్ను ఆకర్షించింది. నా రచ నలన్నింటిలో అది ప్రతిఫలిస్తుందని నా విశ్వాసం.’

రాజుగారి కథలు జీవితంలోని దయనీయ కోణంతో పాటు, ఔదార్యాన్ని కూడా చూపించి సమాజం పట్ల సానుకూలతను పెంచుతాయి. మనిషి అంతరంగం, క్లిష్ట సమయాలలో చేసే పోరాటమే కాదు, అప్పుడు తోటివారి విషయంలో ఉండవలసిన మానవతా స్పర్శనే మునిపల్లె రాజు తన కథలకి వస్తువుగా ఎంచుకున్నారు. వారాలు చేసుకుని చదువు కోవడం కొంతమంది పేద పిల్లల జీవిత దృశ్యమే కాదు, మరికొందరి ఔదార్యానికీ అనురాగానికీ ప్రతి రూపం.

ఇలాంటి వారాల పిల్లలు రాజుగారి కథలలో కనిపిస్తారు. ఆయన ‘వారాలబ్బాయి’ కథ ప్రత్యేకమై నది. ఊరు మంచినే తన మేలుగా భావించే ముదు సలి శేషమ్మ జీవితంలో అన్ని బాధలనీ భరిస్తూ తల్లిగా తన బాధ్యతకే అంకితమైన జానకమ్మ, జీవితపు విలు వని, ఆధ్యాత్మిక వారసత్వాన్ని తెలిపే దొడ్డమ్మ.. ఇలా రాజుగారి కథలలో ఎన్నెన్నో పాత్రలు.

రాజుగారు రాసిన ఒకే ఒక నవల ‘పూజారి’ (1952). బీఎన్‌ రెడ్డి నిర్మించిన ‘పూజాఫలం’ చిత్రా నికి ఇదే మాతృక. ఈ నవలారంభమే గాఢమైనది. రచయిత తాత్వికత, అంతర్‌దృష్టి ఎలాంటివో తెలి యచేసే ఆరంభమది. ఒక ఊరిలో ఒక పార్క్‌ దగ్గర నవల ఆరంభమవుతుంది. అది ఆలనా పాలనా లేనట్టే ఉన్నా, నిరుపయోగంగా లేదు. అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు వినియోగించుకుంటున్నారు.

నవలా నాయకుడు మధు పరిచయం ఈ అంశం ద్వారా చెప్పారు రచయిత. మధు పెద్ద జమీకి వార సుడు. తల్లీతండ్రీ మరణించడంతో తాతగారి సంరక్షణలో ఉన్నాడు. కానీ క్షయ వ్యాధి సోకి, మద నపల్లి శానెటోరియంలో ఉంటున్నాడు. అన్నీ ఉన్నా ఉత్సాహం లేదు. అందుకే ‘నిరాశా వేదాంతి’ అతడు. కానీ ఇలాంటి జీవితంలోనూ రెండు మంచి అలవాట్లు అతడికి ఉన్నాయి.

ఒకటి సంగీతం పట్ల మక్కువ. రెండు క్రమం తప్పకుండా కళాశాలకు వెళ్లడం. తోడు గా ఉండేందుకు ఇంటి కింది భాగం అద్దెకు ఇచ్చారు. వీరి అమ్మాయే ప్రీతి. ఆమె రాక మధుకు అనూహ్య అనుభవం. కళాశాలలో పరిచయమైన శ్రీరాం కూడా మధుకు ఇష్టమే. వాళ్లిద్దరిలో మధుకి నచ్చిన అంశం ఆశ, ఆత్మబలం. కానీ ప్రీతి ఎలా వచ్చిందో అలాగే నిష్క్రమించింది. కానీ జమీ గుమాస్తా రామకృష్ణయ్య కూతురు సుశీల మధునీ, జమీని ఒక క్లిష్ట పరిస్థితి నుంచి రక్షిస్తుంది.

ఈ క్రమంలో మధు, సుశీల దగ్గర వుతారు. డిఫాటిజమ్‌ – అపరాధ భావం అన్నది ఓ మానసిక శాఖ. దానికి ప్రతిరూపంగా మధు పాత్రని నిర్మించారు మునిపల్లె రాజు. మంచి రచయిత కాలం కన్నా ఒక్క అడుగైనా ముందే ఉండి ఆలో చిస్తాడు. అందుకు పూజారి నవల మంచి ఉదాహరణ. నిజా నికి ఎల్లలు ఎరుగని ఆలోచన ఆయనది.

వి.రాజారామ మోహనరావు
(వ్యాసకర్త ప్రముఖ రచయిత 91105 32710)

మరిన్ని వార్తలు