నవ్యాంధ్రలో మరో నాటకం

17 Nov, 2018 23:57 IST|Sakshi

త్రికాలమ్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకో భయపడు తున్నారు. భయం లేదని ప్రజలను నమ్మించేందుకు ఎనలేని ధైర్యం, పోరాట పటిమ ఉన్నట్టు నటిస్తున్నారు. ఉదారస్వభావులైన నాయకులూ, స్వశక్తిలేని అర్భకులూ ఢిల్లీ సింహాసనంపైనlఉన్నప్పుడు మాయోపాయం చేసి స్వప్రయో జనాలు నెరవేర్చుకోవడం, ప్రత్యర్థులకు అపకారం చేయడం తెలిసిన చంద్ర బాబు పప్పులు ఇప్పుడు ఉడుకుతున్నట్టు లేదు. చంద్రబాబూ, ఆయన మిత్రులూ ఒక పద్ధతి ప్రకారం కేంద్ర ప్రభుత్వంతో వ్యవహారం చేశారు. ఢిల్లీలో బలమైన యంత్రాంగం ఏర్పాటు చేసుకున్నారు. వాజపేయి అధికారంలో ఉన్నం తకాలం ఆయననూ, ఉపప్రధాని లాల్‌కృష్ణ అడ్వాణీనీ సేవించి తమ ప్రయో జనాలు నెరవేర్చుకునేవారు.

మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉండగా చిదంబరం, గులాంనబీ ఆజాద్‌ వంటి నాయకుల ద్వారా తమకు అవసరమైన పనులు చేయించుకున్నారు. వారితో కలసి కుట్రలు చేశారు. అదే కార్యాచరణ నరేంద్ర మోదీ హయాంలో నాలుగేళ్ళు కొనసాగించారు.. వెంకయ్యనాయుడు మంత్రిగా ఉన్నంత కాలం ఆయన సహకారంతో కొన్ని పనులు చేయించుకున్నారు. ఆయనకు ఉపరాష్ట్రపతిగా పదోన్నతి లభించిన అనంతరం నరేంద్రమోదీని చంద్రబాబు కలుసుకోవడమే అసాధ్యంగా కనిపించింది. అరుణ్‌జైట్లీని ప్రసన్నం చేసుకున్నప్పటికీ చంద్రబాబు కోరికలు తీర్చమని మోదీకి చెప్పే చొరవ ఆయనకు లేదు. ఎత్తులూ, పైఎత్తులే రాజకీయంగా, కుట్రలూ, కుతంత్రాలే యుద్ధవ్యూహాలుగా పరిగణించి ‘చక్రం’ తిప్పే క్రమంలో చంద్రబాబు అనేక తప్పిదాలు చేశారు. ఎన్నికల వ్యయాన్ని విపరీతంగా పెంచడం ఆయన దేశానికి చేసిన అపకారాలలో ప్రధానమైనది. భారీగా ఖర్చు చేసి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చిన నాయకులు జరిగిన ఎన్నికలలో పెట్టిన ఖర్చునూ, జరగబోయే ఎన్నికలలో పెట్టవలసిన ఖర్చునూ దృష్టిలో పెట్టుకొని ప్రజాధనం కైంకర్యం చేస్తున్నారు.

ఈ జాడ్యం కర్ణాటక, తమిళనాడు మీదుగా ఇతర రాష్ట్రా లకూ పాకింది. అడ్డదారులు తొక్కి అర్ధంతరంగా సంపన్నులైన క్రోనీ కేపిట లిస్టులకు రాజకీయాలలో పెద్దపీట వేయడం కూడా చంద్రబాబు ప్రారంభించిన ఆనవాయితీనే.  రాజకీయ విలువలకు సమాధికట్టిన నాయకులలో అగ్రగణ్యుడు ఆయన.  విలువలు లుప్తమైన ప్రస్థానంలో చంద్రబాబుపైన అనేక అవినీతి అరో పణలు వచ్చాయి. న్యాయస్థానాలలో దాఖలైన కేసులపైన విచారణ జరగకుండా ‘స్టే’ తెచ్చుకోగలిగారు. ఒక సందర్భంలో సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని హైకోర్టు ఆదేశించినా ఆ సంస్థ వెనువెంటనే కదలలేదు. ఈలోగా చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. బహుశా దేశంలో మరెక్కడా ఇటువంటి పరిణామం సంభవించి ఉండదు.

కాంగ్రెస్‌ నాయకులతో అపవిత్రమైత్రి
కాంగ్రెస్‌ నాయకులతో సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని, కాంగ్రెస్‌కు చెందిన శంకరరావూ, టీడీపీకి చెందిన ఎర్రంనాయుడూ వేసిన పిటిషన్‌ను పురస్క రించుకొని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత  జగన్‌మోహన్‌రెడ్డిపైన సీబీఐని ప్రయోగించి కేసులు బనాయించారు. ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా దర్యాప్తు పేరుతో జగన్‌ను జైలులో పెట్టించి 16 మాసాలు బెయిల్‌ రాకుండా పకడ్బందీగా కథ నడిపించారు. రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత జరిగిన ఎన్నికలలో బీజేపీతో, జనసేనతో పొత్తు పెట్టుకొని అతి ప్రయాసతో గట్టెక్కారు. కడచిన నాలుగున్నర సంవత్సరాలలో అనేక అక్రమాలు జరిగాయి. అవినీతి జడలు విచ్చుకొని నాట్యం చేసింది. గవర్నర్‌కూ, ప్రధానికీ, రాష్ట్రపతికీ ప్రతిపక్షం ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం శూన్యం. తన నిగూఢమైన డిమాండ్లు నెరవేర్చని కారణంగా మార్చిలో బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్లు ప్రకటించినప్పటి నుంచీ చంద్రబాబుకు భయం పట్టుకుంది.  తానూ, చిదంబరం కలిసి సీబీఐని జగన్‌మోహన్‌రెడ్డిపైన ఉసిగొల్పినట్టు మోదీ అదే సీబీఐని తనపైన ప్రయోగిస్తారేమోనన్న భయం వెన్నా డుతున్నట్టున్నది. అటువంటిదే జరిగితే ప్రజలు తన చుట్టూ రక్షణవలయంగా ఏర్పడి తనను రక్షించాలంటూ విజ్ఞప్తి కూడా చేశారు.

సుజనాచౌదరి, సీఎం రమేష్‌లకు చెందిన సంస్థలలో ఆదాయంపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించడాన్ని ఖండించారు. గుజరాత్, కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్‌కు చంద్ర బాబు నిధులు అందజేసినట్టు మోదీకి సమాచారం అందిందని అంటారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడమే కాకుండా కాంగ్రెస్‌ అభ్యర్థులకు నిధులు సమకూర్చడానికి చంద్రబాబు సన్నాహాలు చేశారని మోదీ అనుమానం. కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవంలో రాహుల్‌గాంధీతో కర చాలనం, అనంతరం ఎన్‌డీఏకి ప్రత్యామ్నాయం నిర్మిస్తున్నట్టు ప్రకటనలూ, తెలంగాణలో కాంగ్రెస్‌ నాయకత్వంలో కూటమి, ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళి మీడియాతో మాట్లాడి రావడం, మరోసారి వెళ్ళి రాహుల్‌తో భేటీ కావడం, బెంగళూరూ, చెన్నై సందర్శన, మీడియాలో బ్రేకింగ్‌ న్యూస్‌ మోదీకి ఆగ్రహం కలిగించి ఉంటాయి. చంద్రబాబు ఆర్థిక మూలాలను నియంత్రించకపోతే ఆయన లోక్‌సభ ఎన్నికలలో మాయావతికీ, మమతాబెనర్జీకి, ఇతర బీజేపీ ప్రత్యర్థులకూ నిధులు సమకూర్చగలరనే ఆందోళన మోదీ, షాలను కదిలించినా ఆశ్చర్యం లేదు. 

మోదీ మెతక వైఖరి
మోదీ ప్రత్యర్థులను చిత్తు చేయడానికి ఎంత దూరమైనా వెడతారనే పేరు ఉన్నది. కానీ చంద్రబాబు విషయంలో మెతక వైఖరి అవలంబిస్తున్నారు. ఆయన కవ్వించినా స్పందించడం లేదు. మోదీతో యుద్ధం చేయాలన్న అభిలాష చంద్రబాబుకు ఉన్నది కానీ ఆయన తనకు దీటైన ప్రత్యర్థి అనే అభిప్రాయం కలిగించడం మోదీకి ఇష్టం లేనట్టు కనిపిస్తున్నది. అవినీతి ఆరోపణలు వచ్చినా దర్యాప్తు చేయించే ప్రయత్నం చేయలేదు. బాధితుడిగా ప్రజల సానుభూతికి చంద్రబాబు పాత్రుడు కావడం బీజేపీకి నష్టదాయకమని భావించి ఉంటారు.  చంద్రబాబు మోదీనీ, ఎన్‌డీఏ సర్కార్‌నీ ఎంత ఘాటుగా విమర్శించినా పట్టించుకున్న దాఖలా లేదు. చంద్రబాబును ఆయన పల్లెత్తు మాట అనలేదు. తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రశంసించడమే తనను అభిశంసించడంగా చంద్ర బాబు చెప్పుకుంటున్నారు తప్పితే మోదీ నోటి నుంచి ఒక్క పరుషవాక్యమైనా వెలువడలేదు. చంద్రబాబుకు నష్టం, కష్టం కలిగించే చిన్నపాటి చర్య కూడా తీసుకోలేదు.

‘ఓటుకు కోట్లు’ కేసులో ప్రతిష్టంభనను తొలగించే ప్రయత్నం చేయలేదు. 23మంది శాసనసభ్యులను కొనుగోలు చేసినా ఆక్షేపించలేదు. వారిలో నలుగురిని మంత్రులుగా నియమించినా తప్పు పట్టలేదు. కేంద్ర నిధులకు లెక్క చెప్పకపోయినా మందలించలేదు. అందుకే, ఇప్పటికీ బీజేపీతో చంద్రబాబుకు రహస్య మైత్రి కొనసాగుతున్నదనే సందేహం వెలిబుచ్చేవారు అనేకమంది. టీడీపీ, బీజేపీల మధ్య దోబూచులాట కొనసాగుతుండగానే, అక్టోబర్‌ 25న విశాఖపట్టణం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతిపక్ష నాయ కుడిపైన హత్యాయత్నం జరిగింది. మొదట డీజీపీ, తర్వాత ముఖ్యమంత్రి నేలబారుగా మాట్లాడిన తర్వాత వివరాలు ఒకటి తర్వాత ఒకటి వెలుగు చూడసాగాయి. కోడిపందేలలో ఉపయోగించే వాడైన కత్తితో జగన్‌పైన హత్యా యత్నం చేసిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒంటరి కాడనీ, అతని వెనుక గూడు పుఠానీ చేసిన పెద్దలు ఉన్నారనీ, పటిష్టమైన వ్యూహంతో జగన్‌మోహన్‌రెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నించారనీ నిర్ధారించే నిజాలు క్రమంగా వెల్లడ వుతున్నాయి.

డీజీపీ ఠాకూర్‌ నాయకత్వంలోని పోలీసుల దర్యాప్తులో తమకు విశ్వాసం లేదనీ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ చేత దర్యాప్తు జరిపించాలనీ కోరుతూ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. ఈ ఆరోపణలను సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని రాష్ట్రపతి కానీ ఉన్నత న్యాయస్థానం కానీ ఆదేశిస్తే పరిస్థితులు తలకిందులు అవుతాయనే ఆదుర్దాతో చంద్రబాబు సీబీఐకి ఆగస్టు 3న ఇచ్చిన అనుమతిని నవంబర్‌ 8న ఉపసంహరించుకున్నారు. భయభ్రాంతులతో తీసుకున్న ఈ చర్యను సైతం ఎన్‌డీఏ ప్రభుత్వంపైన పోరాటంగా చిత్రించడానికి వీలుగా రేపు కోల్‌కతా వెడుతున్నారు. 22న ఢిల్లీలో ప్రతిపక్ష నేతల సమావేశం నిర్వహి స్తున్నారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కూడా సీబీఐకి 1989లో వామపక్ష సంఘటన ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటు న్నట్టు ప్రకటించారు. 

అవినీతి ఆరోపణలు అనేకం 
చంద్రబాబుపైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా, సన్నిహితులపైనా తాజా అరోపణలే అనేకం ఉన్నాయి. 1)సీబీఐలో చిచ్చు పెట్టిన సానా సతీశ్‌ చంద్ర బాబుకు సన్నిహితుడు. సీబీఐ ఉన్నతాధికారికి ముడుపులు చెల్లించారనే ఆరోపణ సతీశ్‌ ఎదుర్కొంటున్నారు. 2) చంద్రబాబు, లోకేశ్‌ల అక్రమార్జనపైన సీబీఐ దర్యాప్తును ఆదేశించాలని కోరుతూ రిటైర్డ్‌ న్యాయాధికారి శ్రావణ్‌కుమార్‌ సెప్టెం బర్‌లో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. మరిన్ని సాక్ష్యాధా రాలతో మరో పిటిషన్‌ వేయవలసిందిగా హైకోర్టు కోరింది. 3) 2013లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఆస్తులపైన దర్యాప్తు జరిపించాలంటూ హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌ల ఆస్తులపైన కూడా పరిశీలన జరిపించాలని కోరింది. 4) లోకేశ్‌ 80 ఎకరాల భూమిని కబ్జా చేశారనే అరోపణపైన విచారణ జరిపించాలని సీబీఐకి వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. లోకేశ్‌ భార్య బ్రాహ్మణిపైన సైతం 2011లో ఆరోపణలు వచ్చాయి. 5) సీఎం రమేశ్‌కు చెందిన కంపెనీలపైన ఐటీ దాడులలో లభించిన సాక్ష్యాధారాలు పరిశీలనలో ఉన్నాయి. 6) ‘ఆపరేషన్‌ గరుడ’ అనే హాస్యభరి తమైన నేరకథనంపైన దర్యాప్తు జరిపించాలనే డిమాండ్‌ ఉండనే ఉన్నది. ఇవి కాక అనేక కేసులలో విచారణ జరగకుండా ‘స్టే’ తెచ్చుకున్నారు. ఏ ఒక్క కేసులోనైనా సీబీఐ దర్యాప్తు జరిగినా, ‘స్టే’ ఎత్తివేసినా చంద్రబాబుకు సమస్యలు ఎదురవుతాయి. 

సీబీఐ సోదాలను అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఆగస్టు3 జారీ చేసిన జీవో నంబర్‌ 109ని ఉపసంహరించుకుంటూ మరో జీవో జారీ చేయడం వల్ల వాస్తవంగా ఏమి జరుగుతుంది? సీబీఐ రంగంలో ఎప్పుడు దిగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పుడు లేదా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆదేశించిన ప్పుడు. ఆదాయంపన్ను సోదాలు చేసినా, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ దాడులు చేసినా, సీబీఐ దర్యాప్తు జరిపినా రాష్ట్ర ప్రజలపైన దాడి చేసినట్టుగా అభివర్ణిస్తూ ఆవేశం రగిలించడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు స్వయంగా సీబీఐ దర్యా ప్తును కోరే అవకాశం లేదు. ఉన్నత న్యాయస్థానం ఆదేశిస్తే సీబీఐని అడ్డుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ సంగతి తెలిసి కూడా అనుమతి ఉప సంహరించుకుంటూ జీవో ఎందుకు జారీ చేశారు? తనపైన వచ్చిన ఆరో పణలన్నీ రాజకీయ లక్ష్యంతో, ప్రతీకారేచ్ఛతో చేసినవేనని రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ప్రచారం చేయడానికి ఈ చర్య ఉపకరిస్తుంది. ఉత్తరోత్తరా తాను భయపడుతున్నట్టు సీబీఐ దర్యాప్తు జరిగినా దానికి రాజ కీయరంగు పులమటం తేలిక. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల దృష్టిని మౌలిక సమస్యలపై నుంచీ, టీడీపీ ప్రభుత్వ వైఫల్యాల నుంచీ, పెచ్చరిల్లిన అవినీతి నుంచీ మళ్ళించడానికి ఏదో ఒక నాటకీయమైన ఉదంతం సాగుతూ ఉండాలి.

కొంతకాలం అమరావతి అనే అద్భుతమైన  నగరం గురించి అందమైన కథలు చెప్పారు.  అస్మదీయులతో  కలసి విదేశీ పర్యటనలు చేశారు. ప్రత్యేక తరగతి హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ ఎంత అభిలషణీయమో వివరిస్తూ ప్రసంగాలు చేశారు. ప్యాకేజీ ప్రసాదించినవారికి దండాలు పెట్టారు.  సన్మానాలు చేశారు. మోదీ గ్రాఫ్‌ పడిపోతోందని భావించి, కొత్త కూటమి కట్టడం అనివార్య మనిపించి సరికొత్త నాటకానికి తెరతీశారు. ఎన్‌డీఏ నుంచి వైదొలిగారు.  ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకీ, లోక్‌సభకూ జరిగే ఎన్నికల సమయంలో దీనిని పతా కస్థాయికి తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం. అమరావతి, పోలవరం, విశాఖ రైల్వే జోన్, కడప సిమెంట్‌ ఫ్యాక్టరీ, దుర్గగుడి ఎదుట ఫ్లయ్‌ఓవర్, కరువు జిల్లాలలో సహాయ, పునరావాస చర్యలు, వ్యవసాయదారుల అగచాట్లు, నిరుద్యోగుల నిర్వేదం, డ్వాక్రామహిళల ఆక్రందనల ప్రస్తావన ఎక్కడా కనపడకుండా, వినప డకుండా మీడియాలో మత్తెక్కించే నాటకీయ రాజకీయ సమాచారం దట్టించడం తాజా వ్యూహం.

కె. రామచంద్రమూర్తి

మరిన్ని వార్తలు