దిద్దుబాటే శ్రేయస్కరం

14 Jan, 2018 00:04 IST|Sakshi

త్రికాలమ్‌

సర్వోన్నత న్యాయస్థానంలో నలుగురు అత్యంత అనుభవశాలురైన న్యాయమూర్తులు మీడియా సమక్షంలో హృదయావిష్కారం చేసిన ఘట్టం చరిత్రాత్మకమైనది. శుక్రవారంనాడు ఢిల్లీలో జస్టిస్‌ చలమేశ్వర్, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ మదన్‌ బి లోకుర్, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌లు మీడియాతో మాట్లాడటమే అపూర్వమైన అంశం అయితే వారు అందించిన సందేశం దిగ్భ్రాంతికరమైనది. జస్టిస్‌ లోధా, జస్టిస్‌ ఠాకుర్‌ వంటి మాజీ ప్రధాన న్యాయమూర్తులూ, మాజీ సొలిసిటర్‌ జనరల్‌ సోలీ సొరాబ్జీ వంటి న్యాయకోవిదులూ ఈ పరిణామం దురదృష్టకరమైనదనీ, అవాంఛనీయమైనదనీ అభివర్ణించారు. న్యాయమూర్తులు చేసిన ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయనీ, న్యాయవ్యవస్థను వేధిస్తున్న సమస్యలను వెల్లడిస్తే ప్రయోజనకరంగా ఉండేదనే అభిప్రాయం కూడా ఉంది. 

సుప్రీంకోర్టులో అనుభవం రీత్యా, పేరుప్రఖ్యాతుల దృష్ట్యా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్రా తర్వాత అగ్రగణ్యులైన నలుగురు న్యాయమూర్తులు సంప్రదాయం, నియమావళి పేరుతో తమను కట్టిపడవేసిన బంధనాలను తెంచుకొని, తెగించి ప్రజల ముందుకు వచ్చారంటే అందుకు బలమైన కారణాలు ఉండాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనీ, న్యాయవ్యవస్థ స్వేచ్ఛాస్వాతంత్య్రాలను ప్రజలే కాపాడుకోవాలనీ వారు చెప్పారంటే పరిస్థితి తీవ్రతను ఊహించుకోవచ్చు. ప్రధాన న్యాయమూర్తిని కలసి సంప్రదింపుల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం జరిగింది. బహుశా రాష్ట్రపతిని కలసి ఆయనకు సమస్యను నివేదించి ఉంటే ప్రయోజనం ఉండేదేమో! 

నలుగురూ నిష్ణాతులే
ఇప్పుడు వివాదం సృష్టించడం వల్ల ఈ నలుగురిలో ఏ ఒక్కరికీ ఒనగూరే అదనపు ప్రయోజనం ఏమీలేదు. పైగా ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి వచ్చే అక్టోబర్‌ 2న పదవీ విరమణ చేసిన తర్వాత ఆ పదవిని అలంకరించే అవకాశం ఉన్న రంజన్‌  గొగోయ్‌ తక్కిన ముగ్గురితో గొంతు కలపడం ఆయనకు వ్యక్తిగతంగా నష్టదాయకంగా పరిణమించవచ్చు. జస్టిస్‌ చలమేశ్వర్‌ పదవీ కాలం ఈ యేడాది జూన్‌ 22తో ముగుస్తుంది. జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ నవంబర్‌ 29 వరకే పదవిలో ఉంటారు. జస్టిస్‌ లోకుర్‌ సైతం డిసెంబర్‌ 30న పదవీ విరమణ చేయవలసి ఉంది. నెలా, రెండు నెలల్లో పదవీ విరమణ చేయబోయే వారిని ప్రధాన న్యాయమూర్తి పీఠంపైన కూర్చో»ñ ట్టే సంప్రదాయం లేదు కనుక 2019 నవంబర్‌ 17 వరకూ పదవీకాలం కలిగిన గొగోయ్‌కి ప్రధాన న్యాయమూర్తి పదవి దక్కే అవకాశం ఉంది. ఆయన ముగ్గురు సహచరులతో కలసి తిరుగుబాటు చేయడం నిజంగా సాహసమే. జస్టిస్‌ చలమేశ్వర్‌ చెప్పినట్టు, భావితరాలు తమను తప్పుపట్టకుండా తగిన సమయంలో ప్రశ్నించవలసిన బాధ్యతను నెరవేర్చామని గొగోయ్‌ సైతం భావిం చారు. జాతి రుణం తీర్చుకుంటున్నామని స్వయంగా చెప్పారు. ఇది ఎంతో గంభీ రమైన విషయం కాకపోతే అంత బరువైన మాటలు న్యాయమూర్తులు ఉపయోగించేవారు కాదు. 

సత్యానికీ, ధర్మానికీ కట్టుబడి ఉండే నైజం గొగోయ్‌కి ఉన్నది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కర్ణన్‌ను కోర్టు ధిక్కార నేరంపైన జైలుకు పంపించిన ఏడుగురు సభ్యుల రాజ్యాంగపీఠంలో జస్టిస్‌ గొగోయ్‌ ఉన్నారు. చీఫ్‌ జస్టిస్‌ తర్వాత స్థానంలో ఉన్న జస్టిస్‌ చలమేశ్వర్‌ (నెంబర్‌ 2) నిష్కర్షగా వ్యవహరించి వివాదాలకు కేంద్రమైనారు. న్యాయమూర్తుల నియామకం కొలీజియం ద్వారా కాకుండా జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (నేషనల్‌ జుడిషియల్‌ అపాయంట్‌మెంట్స్‌ కమిషన్‌–ఎన్‌జెఎస్‌సి) ప్రమేయంతో జరగాలని భావించి మెజారిటీ తీర్పుతో విభేదించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగపీఠం 2015 డిసెం బర్‌ 16న వెలువరించిన తీర్పులో తన అసమ్మతిని జస్టిస్‌ చలమేశ్వర్‌ (1:4) నమోదు చేశారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టంలో 66(ఎ) సెక్షన్‌ రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పడం ద్వారా భావ ప్రకటనాస్వేచ్ఛకు దన్నుగా నిలిచారు. కొలీ జియం వ్యవహారాలలో కానీ ఇతర అంశాలలో కానీ పారదర్శకంగా ఉండాలని వాదించే ప్రముఖులలో చలమేశ్వర్‌ ప్రథములు. సీనియారిటీ ప్రకారం నాలుగో స్థానంలో ఉన్న లోకుర్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. గువాహటి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా, ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌గా కూడా ఉన్నారు. రాజకీయవాదులు మతం పేరుతో ఓట్లు అడగరాదంటూ ఉత్తమమైన తీర్పు చెప్పిన న్యాయమూర్తులలో ఆయన ఒకరు. అయిదో స్థానంలో ఉన్న కురియన్‌ త్రిపుల్‌ తలాఖ్‌ చెల్లనేరదని చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి. ఈ నలుగురూ మీడియాతో మాట్లాడటాన్ని తప్పు పట్టినవారు సైతం వారి రుజువర్తనం, నిజాయితీ, న్యాయశాస్త్ర పరిజ్ఞానం, ధర్మనిరపేక్షత, నిబద్ధత పట్ల లవలేశమంత సందేహం వెలిబుచ్చలేదు.

ముదిరిన విభేదాలు
కడచిన రెండు మాసాలలో సంభవించిన కొన్ని పరిణామాలు ఒకానొక అసాధారణ పరిస్థితిని సృష్టించాయి. ఒకటి, ఉత్తరప్రదేశ్‌లో ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టు నడిపే మెడికల్‌ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన కుంభకోణంపైన రగిలిన వివాదం. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసి ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తిని అరెస్టు చేసింది. ఇందులో ప్రధాన న్యాయమూర్తికి ప్రమేయం ఉన్నట్టు పిటిషనర్లు అన్యాపదేశంగా ఆరోపించారు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన పిటిషన్‌ (పిల్‌)ను పురస్కరించుకొని ఈ కేసు విచారణకు ఐదుగురు సీనియర్‌ న్యాయమూర్తులతో ఒక బెంచ్‌ని నెలకొల్పుతూ జస్టిస్‌ చలమేశ్వర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకొని, చలమేశ్వర్‌ ఏర్పాటు చేసిన బెంచ్‌ని రద్దు చేసి ఆయన స్వయంగా తన ఆధ్వర్యంలోనే ఒక బెంచ్‌ని నియమించారు. ‘చీఫ్‌ జస్టిస్‌ ఈజ్‌ ది మాస్టర్‌ ఆఫ్‌ రోస్టర్‌’ అని ఏ కేసు ఎవరు విచారించాలో నిర్ణయించే అధికారం ప్రధాన న్యాయమూర్తికే ఉంటుందంటూ 1998లో రాజ్యాంగపీఠం ఇచ్చిన తీర్పు నెలకొల్పిన సంప్రదాయాన్ని జస్టిస్‌ దీపక్‌మిశ్రా గుర్తు చేశారు. నిజానికి చీఫ్‌ జస్టిస్‌ సమానులలో ప్రథముడే (ఫస్ట్‌ ఎమాంగ్‌ ఈక్వెల్స్‌) కానీ అందరి కంటే అధికుడు కారని నలుగురు న్యాయమూర్తులు విడుదల చేసిన లేఖలో వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, ప్రధాన న్యాయమూర్తికి విశేష ప్రాధాన్యం ఉంటుంది. తక్కినవారంతా సుప్రీం కోర్టు న్యాయమూర్తులైతే (జడ్జెస్‌ ఆఫ్‌ సుప్రీంకోర్టు) చీఫ్‌ జస్టిస్‌ దేశానికి ప్రధాన న్యాయమూర్తి (చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా). అంతమాత్రాన విశేషాధికారాలను వినియోగించే క్రమంలో పక్షపాతం కానీ స్వప్రయోజనాలు కానీ ఉన్నట్టు కనిపిస్తే ప్రధాన న్యాయమూర్తిని సైతం ప్రశ్నించే అధికారం న్యాయమూర్తులకూ, న్యాయవాదులకూ, సామాన్య పౌరులకూ ఉంటుంది. 

సర్వసాధారణంగా ఏదైనా కేసు విచారించేందుకు నియమించిన పీఠాన్ని విస్తరించాలంటే కొత్తగా కొందరు న్యాయమూర్తులను చేర్చుతారు కానీ ఉన్నవారిని తొలగించరు. ఉదాహరణకు ఇద్దరు న్యాయమూర్తులున్న బెంచ్‌ని విషయ ప్రాధాన్యం దృష్ట్యా ఐదుగురు సభ్యుల బెంచ్‌గా విస్తరించాలంటే కొత్తగా ముగ్గురిని నియమిస్తారు కానీ, మొదటి ఇద్దరిలో ఎవ్వరినీ తొలగించరు. ఇది దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. మెడికల్‌ కుంభకోణం కేసు విచారించడానికి జస్టిస్‌ మిశ్రా నియమించిన బెంచ్‌లో జస్టిస్‌ చలమేశ్వర్‌ లేరు. రెండు, గుజరాత్‌ పరిణామాలకు సంబంధించి సోహ్రాబుద్దీన్‌ అనే వ్యక్తిని ‘బూటకపు ఎన్‌ కౌంటర్‌’ చేశారనే ఆరోపణను విచారిస్తున్న సీబీఐ జడ్జి బీహెచ్‌ లోయా మృతి కేసు. నాగపూర్‌లో తన సహచరుడి కుమార్తె వివాహానికి వెళ్ళి అనుమానాస్పద పరిస్థితులలో 2014 డిసెంబర్‌ 1న గుండెపోటుతో లోయా మరణించారు. ఈ కేసు ప్రారంభంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా నిందితుడు. అనంతరం షా పేరు నిందితుల జాబితా నుంచి తొలగించారు. లోయా మరణానికి సంబంధించిన కేసు విచారణ బొంబాయ్‌ హైకోర్టులో నడుస్తుంటే దాన్ని సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఒక పిటిషన్‌ ఆధారంగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి సీనియర్‌ న్యాయమూర్తులకు కాకుండా సీనియారిటీ జాబితాలో పదో స్థానంలో ఉన్న జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా బెంచ్‌కి పోస్ట్‌ చేశారు. 

లోయా పోస్ట్‌మార్టం రిపోర్ట్‌నూ, ఇతర పత్రాలను సుప్రీం కోర్టులో జనవరి 15 నాడు సమర్పించాలని ఆదేశాలు వెళ్ళాయి. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని కూడా కౌన్సెల్‌ నిశాంత ఆర్‌ కర్నేశ్వార్కర్‌కు సుప్రీంకోర్టు పురమాయించింది. సాధారణంగా హైకోర్టులో విచారించవలసిన అంశాలు సుప్రీంకోర్టుకు వస్తే ముందు హైకోర్టుకు వెళ్ళండి అని పిటిషనర్లను న్యాయమూర్తులు ఆదేశిస్తారు. లోయా కేసు విషయంలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. పైగా బొంబాయ్‌ లాయర్ల సంఘం ఈ కేసు విచారణ బొంబాయ్‌ హైకోర్టులోనే జరగాలని కోరుతోంది. ఈ సంఘం తరఫున ప్రముఖ న్యాయవాది దుష్యంత్‌ దవే సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ముంబయ్‌కి చెందిన జర్నలిస్టు బీఆర్‌ లోన్‌ తరఫున ఇందిరా జైసింగ్‌ వాదిస్తున్నారు. కాంగ్రెస్‌ వకీలుగా వరీందర్‌ కుమార్‌ శర్మ మరో పిటిషన్‌ వేశారు. వీరందరి ప్రార్థనా ఒక్కటే. ఈ కేసును సుప్రీంకోర్టులో విచారించవద్దు, బొంబాయ్‌ హైకోర్టులో విచారణ కొనసాగించాలి. ఇంతటి రాజకీయ ప్రాధాన్యం ఉన్న కేసును సీనియర్‌ల నాయకత్వంలోని బెంచ్‌కి అప్పచెప్పకుండా జూనియర్‌కు పంపించడం వివాదాస్పదం అయింది. వాస్తవానికి సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు అందరూ సమానులే. సీనియర్, జూనియర్‌ అనే భేదం లేదు. కానీ రాజకీయ ప్రాముఖ్యం ఉన్న కేసులు సీనియర్లకు కేటాయించడం రివాజు. 

ప్రధాన న్యాయమూర్తిదే బాధ్యత 
ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారక ముందే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. సోమవారం నుంచి తాము యథావిధిగా సుప్రీంకోర్టుకు వెడతామని జస్టిస్‌ చలమేశ్వర్‌ చెప్పారు. శనివారంనాడు సుప్రీంకోర్టు బార్‌ కౌన్సిల్, బార్‌ అసోసియేషన్ల సమావేశాలు జరిగాయి. బార్‌ కౌన్సిల్‌ సీనియర్‌ న్యాయమూర్తులు మీడియాను కలుసుకోవడాన్ని తప్పు పట్టింది. వివాదం పరిష్కరించేందుకు ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. లోయా కేసులో క్షుణ్ణంగా విచారణ జరగాలంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించడం అనవసరమైన రాజకీయ జోక్యమంటూ విమర్శించింది. ఈ వివాదంలో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండాలన్న ఎన్‌డీఏ ప్రధానమంత్రి, న్యాయశాఖ మంత్రి వైఖరిని స్వాగతించింది. న్యాయమూర్తులు మీడియాతో మాట్లాడటం పట్ల బార్‌ అసోసియేషన్‌ అభ్యంతరం చెప్పలేదు కానీ పరిస్థితి తీవ్రత పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. లోయా కేసు సహా అన్ని ‘పిల్‌’లనూ ఐదుగురు సీనియర్‌ న్యాయమూర్తుల ఆధ్వర్యంలోని బెంచ్‌లే విచారించాలని బార్‌ అసోసియేషన్‌ కోరింది. ప్రభుత్వం తక్షణం చేయవలసిన పని ఒకటి ఉంది. న్యాయమూర్తుల నియామకాలను కొలీజియం చేస్తుందని నిర్ణయించిన అనంతరం ఆ నిర్ణయం అమలు జరగాలంటే సుప్రీంకోర్టుకూ, కేంద్ర ప్రభుత్వానికీ మధ్య ఒక ఒప్పంద పత్రం (మెమొరాండం ఆఫ్‌ ప్రొసీజర్‌–ఎంఓపీ) ఉండాలి. ఈ పత్రాన్ని తయారు చేయడంలో సహకరించడానికి అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహట్గీ నిరాకరించినప్పుడు ‘మీరు అటార్నీ జనరల్‌ దేశానికా లేక ప్రస్తుత ప్రభుత్వానికా?’ అంటూ సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధవన్‌ ఎద్దేవా చేశారు. 

ఎంఓపీని సుప్రీంకోర్టు కేంద్రానికి పంపి నెలలు గడిచిపోతున్నా కేంద్రం ఆమోదం తెలపలేదు. ఎంఓపీ లేకపోవడం వల్ల న్యాయమూర్తిగా తనను నియమించడానికి నిరాకరించారంటూ లూత్రా అనే న్యాయవాది వేసిన పిల్‌పైన జస్టిస్‌ ఆదర్శకుమార్‌ గోయెల్, జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌తో కూడిన బెంచ్‌ తీర్పు ఇస్తూ ఎంఓపీని సాధ్యమైనంత త్వరగా కేంద్రం ఆమోదించాలని విజ్ఞప్తి చేసింది. ఎంఓపీ లేకపోవడం వల్ల న్యాయమూర్తుల నియామకాలు నిలిచిపోయి కోర్టులలో ఖాళీలు న్యాయవ్యవస్థను వెక్కిరిస్తున్నాయి. ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారమైతే, న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని పటిష్టం చేసే చర్యలు తీసుకుంటే న్యాయమూర్తులు తమ వంతు కర్తవ్యం నెరవేర్చినట్టే. ఈ మొత్తం కార్యక్రమాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్రా పెద్దమనసుతో నిర్వహించాలి. న్యాయమూర్తులనూ, న్యాయవాదులనూ కలుపుకొని వెళ్ళవలసిన బాధ్యత ప్రధానంగా ఆయనదే. 


కె. రామచంద్రమూర్తి

మరిన్ని వార్తలు