భ్రమల్లో బాబు, పవన్‌ ద్వయం!

14 Dec, 2019 00:01 IST|Sakshi

విశ్లేషణ

సీఎం జగన్‌ చేస్తున్న మంచి పనుల వల్ల ప్రజలకు తాము శాశ్వతంగా దూరమైపోతామన్న భయం చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లలో స్పష్టంగా కన్పిస్తోంది. అందుకే ప్రతి అంశాన్ని భూతద్దంలో చూపించడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందన్న వ్యూహంతో పనిచేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి, కేంద్రం మధ్య అంతరం పెంచే వ్యూహంలో భాగంగానే బీజేపీ ముసుగులు ధరించిన చంద్రబాబు ఏజెంట్లు వైఎస్సార్‌సీపీని బెదిరించాలని ప్రయాస పడుతున్నారు. కేంద్రం కావొచ్చు.. రాష్ట్ర ప్రభుత్వం కావొచ్చు.. ప్రతి ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఎవరి పరిధిలో వారు రాజ్యాంగబద్ధంగా పని చేస్తారు. చంద్రబాబు తన ఏజెంట్ల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మీద కుట్రలకు పాల్పడాలనుకుంటే.. అది వికటించి వారికే బెడిసి కొడుతుంది. తస్మాత్‌ జాగ్రత్త.

అమెరికా ఒకప్పుడు సీఐఏ (సెంట్రల్‌ ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీ) ఏజెంట్లను కొన్ని వ్యవస్థల్లోకి నేర్పుగా చొప్పించి ఎవరికీ అనుమానం కలుగని రీతిలో కుట్రలకు పాల్పడి తన ప్రత్యర్థులను దెబ్బతీసేది. రష్యా గూఢచారి వ్యవస్థ కేజీబీలోకి కూడా చొచ్చుకుపోయేంత నేర్పుగా చాపకింద నీరులాగా అది పనిచేసేది! లక్ష్య సాధనకు ఎంతకైనా తెగించడం సీఐఏ వ్యవహార శైలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఇంటెలిజెన్స్‌ ఏజెంట్స్‌ కొందరు కొన్ని వ్యవస్థల్లోకి చొరబడ్డారు. వీరి లక్ష్యం బాబు చేసిన అక్రమాలకు తాను జైలుకు పోకుండా రక్షించడం, వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయడం. ఈ లక్ష్యంలో భాగంగా బీజేపీలోకి చేరిన సదరు బాబు ఏజెంట్లు బీజేపీ భుజాలపై తుపాకులు పెట్టి వైఎస్సార్‌సీపీపై కాల్పులు జరిపే దుస్సాహసం చేస్తున్నారు. చంద్రబాబు ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్న మరో ముసుగు వీరుడు  జనసేన పవన్‌ కల్యాణ్‌దీ అదేదారి. చేగువేరా, జార్జిరెడ్డి వంటి వామపక్ష భావజాలాలు కలిగిన నాయకులు తనకు స్ఫూర్తి అని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ తాజాగా అమిత్‌షా పట్ల వ్యామోహం పెంచుకున్నారు. పైగా ప్రజా తీర్పును అపహాస్యం చేసే రీతిలో 151 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజలు విస్మయంగా చూస్తున్నారు. 

రాష్ట్రంలో ప్రతిపక్షాలకు నిద్ర కరువు 
గత 6 నెలల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనాపరంగా తీసుకున్న కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు ప్రతిపక్షాలను నిద్రకు దూరం చేస్తున్నాయి. ఎన్నికల వాగ్దానాలను అధికారంలోకి రాగానే ఒక్కటొక్కటిగా నెరవేర్చడం గతంలో ఎవరికీ సాధ్యం కాలేదు. సీఎం వైఎస్‌ జగన్‌ ఎందులోనూ రాజీపడకుండా అమ్మఒడి, రైతుభరోసా, గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ మొదలైన పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. మద్య నియంత్రణలో భాగంగా దాదాపు 45,000 బెల్ట్‌ షాపులను, పర్మిట్‌ రూమ్‌లను ఎత్తివేసి మహిళల అభిమానాన్ని చూరగొన్నారు. సీఎం జగన్‌  చేస్తున్న ఈ మంచి పనుల వల్ల ప్రజలకు తాము శాశ్వతంగా దూరమైపోతామన్న భయం చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లలో స్పష్టంగా కన్పిస్తోంది. ప్రతి అంశాన్ని భూతద్దంలో చూపించడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందన్న వ్యూహంతో పనిచేస్తున్నారు. ఈ ఆరు నెలల్లోనే అనేక అసత్యాలను, అభూతకల్పనలను వ్యాప్తి చేయడానికి నానాతంటాలు పడుతున్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే. కానీ, ఆ నైజం, సంస్కారం చంద్రబాబులో లేదు. తనకెదురైన దారుణ ఓటమికి తన తప్పేమీ లేదన్నట్లు చంద్రబాబు నటిస్తున్నారు. నిజానికి, బాబు ఓటమిని అందరూ ముందుగానే గ్రహించారు. ఐదేళ్లపాటు చంద్రబాబు చేసిన తప్పులు అనంతం. రైతాంగానికి, మహిళలకు, యువతకు చేసిన దగా, అలాగే స్వయంగా పాల్పడిన అవి నీతి, పార్టీ నేతల దోపిడీ, రాజ్యంగేతర శక్తిగా మారిన లోకేశ్‌ చేసిన అధికార దుర్వినియోగం, సామాజిక న్యాయానికి పాతర వేసి ఆశ్రిత పక్షపాతానికి తెర తీయడం, ఇంకా.. ఓటుకు నోటు కేసు కారణంగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టడం, ప్రతిపక్షపార్టీని దెబ్బతీయడానికి ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొని, కొందర్ని రాజ్యాంగ విరుద్ధంగా మంత్రుల్ని చేయడం.. ఇదంతా ఒక ఎత్తయితే.. చంద్రబాబు తన రాజకీయ ప్రత్యర్థులపై చేసిన అనైతిక దాడి మరోఎత్తు.

తన వైఫల్యాలను, పాపాలను అప్పటి ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుల మీద నెట్టివేసి మరోసారి అధికారాన్ని దక్కించుకోవడానికి చంద్రబాబు అతినీచమైన దుష్ప్రచారానికి ఒడిగట్టడం దేశం యావత్తూ వీక్షించింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీతో చెలిమి కుదుర్చుకొని.. మోదీ వ్యక్తిత్వ హననానికి చంద్రబాబు తెగబడ్డారు. మోదీ, అమిత్‌షాల చెర నుండి విముక్తం చేయకపోతే దేశానికి భవిష్యత్తు లేదంటూ  చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో వెళ్లిన ప్రతిచోటా వారిని విమర్శించడం తెలి సిందే. కాంగ్రెస్‌ అధిష్టానానికి వనరులు సమకూర్చడం సహా ఆ పార్టీకి చేయగల ప్రతి సహాయం అందించారు. కానీ, ప్రజల విజ్ఞత కారణంగా ఎన్నికల్లో చంద్రబాబు పాచికలేవీ పారలేదు.

ఊసరవెల్లిని మించి రంగు మారుస్తున్న బాబు
తాజాగా, తాను చేసిన ద్రోహాన్ని, దిగజారుడు ప్రచారాన్ని మర్చిపోయి ఉంటారనే ఆశతో చంద్రబాబు మరోసారి ప్రధాని మోదీ అనుగ్రహం కోసం పాకులాడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణమే వేగంగా తన రంగును మార్చేశారు. ‘కాంగ్రెస్‌ పార్టీ హస్తాన్ని’ వదిలేశారు. మోదీ, షాలను ప్రసన్నం చేసుకోవడానికి తన పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలోకి పంపారు. చంద్రబాబు ఆశిస్తున్నది.. బీజేపీకి దగ్గర కావడంతోపాటు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి, కేంద్రం మధ్య అంతరం పెంచడం. ఈ వ్యూహంలో భాగంగానే బీజేపీ ముసుగులు ధరించిన చంద్రబాబు ఏజెంట్లు బీజేపీ భుజాలపై తుపాకీ పెట్టి వైఎస్సార్‌సీపీని బెదిరించాలని ప్రయాస పడుతున్నారు. చంద్రబాబు గూడుపుఠానీకి ఓ పత్రికాధిపతి సహకారం ఉంది. వైఎస్‌ జగన్, కేసీఆర్, మోదీల ఓటమికి కృషి చేసిన సదరు పత్రికాధిపతి బీజేపీకి అత్యధికంగా సీట్లు రావడంతో వెంటనే గేరు మార్చారు. బీజేపీని భుజానకెత్తుకున్నారు. తాను ఏమి రాసినా తనకు బీజేపీ అండ ఉందన్న సంకేతాలు పంపిస్తూ జగన్, కేసీఆర్‌ల మీద విషం చిమ్ముతున్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రధానిని, బీజేపీ నేతల్ని కలిసినా.. ఏదో జరిగిపోతోందన్న ప్రచారం సాగించడం వెనుక ఇరు పార్టీలమధ్య అంతరాన్ని పెంచే కుట్ర ఉంది. 

బీజేపీ ‘బూచి’కి భయపడేదెవరు?
రాష్ట్ర ప్రభుత్వంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే  బాధ్యతగల ప్రతిపక్షపార్టీగా సూచనలు, విమర్శలు చేస్తే ఎవరూ తప్పుపట్టరు. కానీ, అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్లుగా బీజేపీ ముసుగులు ధరిం చిన తెలుగుదేశం ఏజెంట్లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న తీరు అందర్నీ విస్తుగొలుపుతోంది. సీఎం జగన్‌కి ఉన్నది ప్రజాబలం, నైతికబలం, సిద్ధాంతబలం. తెలుగుదేశం, జనసేన మాదిరిగా పార్టీ, వ్యక్తిగత అవసరాలను దృష్టిలో పెట్టుకొని వైఎస్‌ జగన్‌ ఎన్నడూ పార్టీ విధానాలను మార్చలేదు. ఊసరవెల్లిలా రంగులు మార్చలేదు. గెలుపు కోసం అడ్డదారులు తొక్కలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్షంలో ఉండగా.. ప్రత్యేక హోదా కోసం ప్రజాస్వామ్యయు తంగా దీక్షలు చేశారేతప్ప.. చంద్రబాబులా దొంగ దీక్షలు నిర్వహించి ప్రధాని మోదీని నీచంగా తిట్టించలేదు. మీడియాలో ఆయనను కించపరుస్తూ కథనాలు రాయించలేదు. ప్రారంభం నుంచీ.. ఎక్కడా విధానాల్లో రాజీపడలేదు, మడమ తిప్పలేదు. 

ఎన్నికలముందు బీజేపీతో ఎలాంటి విధానం ఉందో.. ఫలితాల తర్వాత కూడా వైఎస్సార్‌సీపీ వైఖరిలో మార్పులేదు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో సీఎం జగన్‌ ఎలాంటి మొహమాటాలకు పోవడంలేదు. ‘నీతిఆయోగ్‌’తో  జరిగిన తొలి సమావేశంలోనే, ప్రధాని సమక్షంలోనే సీఎం వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి న్యాయంగా ఇవ్వాల్సిన నిధులు, విభజన బిల్లు ప్రకారం నెరవేర్చాల్సిన హామీలు ఏమిటో తేటతెల్లం చేశారు. నీతిఆయోగ్‌కు సమర్పించిన 98 పేజీల నివేదికలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రస్తావించారు. కేంద్రంతో వైఎస్సార్‌సీపీ సఖ్యతను కోరుతున్నది. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండాలని నమ్ముతున్నది. పరస్పర సహాయ సహకారాలతో అభివృద్ధిపథంలోకి వడివడిగా అడుగులు వేయడం వైఎస్సార్‌సీపీ లక్ష్యం. వాస్తవాలు ఈ విధంగా ఉంటే.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని ఏదో చేయబోతున్నట్లు  ప్రజల్లో అనుమానాల్ని, అపోహల్ని సృష్టించడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి.

ప్రతి ప్రభుత్వానికి.. అది కేంద్రం కావొచ్చు.. రాష్ట్ర ప్రభుత్వం కావొచ్చు.. వాటికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఎవరి పరిధిలో వారు రాజ్యాం గబద్ధంగా పని చేస్తారు. చంద్రబాబుకు రాజ్యాంగం మీద విశ్వాసం లేదు. కనుకనే ఐదేళ్లలో అనేక రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. బీజేపీ కూడా తను చూపిన పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందనే ఆశతో చంద్రబాబు ఎదురుచూస్తున్నారు. ఆ దిశగా బీజేపీ ముసుగు వేసుకున్న చంద్రబాబు ఇంటెలిజెన్స్‌ ఏజెంట్లు తెరచాటు వ్యవహా రాలు నడుపుతున్నారు. చంద్రబాబు తన ఏజెంట్ల ద్వారా ప్రజాబలం కలిగిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మీద కుట్రలకు పాల్పడాలనుకుంటే.. అది వికటించి వారికే బెడిసి కొడుతుంది. తస్మాత్‌ జాగ్రత్త! 

సి. రామచంద్రయ్య
మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ
 

మరిన్ని వార్తలు