లోకయాత్రికుడి విశేషయాత్ర

17 Aug, 2018 02:30 IST|Sakshi

అటల్‌ బిహారీ వాజ్‌పేయి. ఆయన పేరుకి అర్థమే లోక యాత్రికుడని. ఐక్యరాజ్యసమితిలో యువ రాజకీయవేత్తగా  అత్యద్భుత ప్రసంగం చేసి భారతీయ ప్రతిభను విశ్వవ్యాప్తం చేసినా,  అణు పరోక్ష వలసవాదానికి (ఇండైరెక్ట్‌ నూక్లియర్‌ కలోనియలిజం) వ్యతిరేకంగా, అమెరికా  నిఘా సంస్థలు కనిపెట్టలేని వ్యూహంతో భారతీయ అణు వైజ్ఞానిక రంగాన్ని  సాహసోపేతమైన  అణు బాంబు పరీక్ష ద్వారా ముందుకు తీసుకు వెళ్లినా.. భిన్నరంగాల్లో జీవన ఆసక్తులు, నైపుణ్యాలు కలి గిన ఈ దేశ రాజకీయవేత్తల తరానికి చెందిన  చివరి  దార్శనికుడుగా భావించదగిన వాడు.

పదవులకు వన్నె తెచ్చిన మానవ శిఖరం ఆయన. తను ప్రధానిగా ఉన్న కాలంలో,  అలవి గాని ముఖ్యమంత్రులకు ‘రాజధర్మం’ అంటే ఏమిటో తెలియచెప్పేందుకు  సహనశీల ప్రయత్నం చేసినవాడు అటల్‌  బిహారీ వాజ్‌పేయి.

ఆయన ఉన్నత సంస్కారం గల భారతీయ పౌరుడు. భారత మాత పుత్రుడు.  వక్త,  రచయిత, కవి, భారతీయ సంస్కృతీ జ్ఞాన సంపన్నుడు, ఇటువంటి విశిష్టమూర్తి  ప్రస్తుత ఓట్ల, నోట్ల, సీట్ల, ఫీట్ల రాజకీయ రంగంలో కనిపిం చడు.

హిందీ కవిగా  కూడా  ఉత్తర భారత సాహిత్య లోకానికి  చిరపరిచితుడు. విలువల రాజకీయాల స్థాపనలో వజ్ర సమానుడు. ఆయన్ని మనం కోల్పోయిన ఈ  క్షణాల్లో, విభేదాలకు అతీతంగా భారతీయ పౌరసమాజం, రాజకీయ నాయకులు, ఇతర వర్గాలు, ముక్తకంఠంతో ఈ నవభారత సేనానికి నివాళి ఆర్పిస్తున్న వేళ, కవిగా ఆయన పలికిన వివేక వాణి నుంచి కొన్ని మంచి ముత్యాలు.           

రెండు రోజులు దొరికాయి ప్రసాదంగా
గాయాల ఈ వ్యాపారంలో
ప్రతిక్షణం లెక్క చూసుకోనా
లేదూ నిధి శేషాన్ని ఖర్చు పెట్టేయనా
ఏ దారమ్మట వెళ్ళాలి నేను?
పగిలిన కలల వెక్కిళ్లు వినేదెవరు
లోలోపలి  తెగని వెత కనురెప్పలపై
నిలిచింది
ఓటమి ఒప్పుకోను,
వెనుతిరగను పోరులో
కాల కపాలం మీది రాత చెరిపేస్తాను
నవగీతం పాడుతాను, నవగీతం పాడుతాను

ఎందుకు నేను క్షణ క్షణంగా బతకకూడదు
కణ కణంలో అలరిన అందాల్ని తాగకూడదు

రేపు రేపంటూ ఉంటే
ఇవాళ  అన్నీ చేజారుతాయి
గతం, భవిత  వీటి  తలపోతలో
ఓడి పోతావు నేడు  అనే పందెం

నన్ను నేను ఇతరుల అంచనాల్లో
చూసుకోగలుగుతున్నాను
నేను మౌనంగానూ లేను,   
పాడడమూ లేదు

నిన్న ఉన్నది నేడు లేదు
నేడున్నది రేపుండదు
ఉండడం, ఉండక
పోవడమనే దశ
ఇలాగే  సాగుతూ ఉంటుంది.
నేనున్నాను, నేనుంటాను
అనే భ్రమ మాత్రం ఉంటుంది నిత్యం

మండుటెండలో కమ్మింది చీకటి
సూర్యుడు నీడ చేతిలో ఓడాడు
లోలోని స్నేహాలకు ఒత్తిడే దక్కింది
ఆరిన దీపాలకు వెలుగిద్దాము
రండి మళ్ళీ  దివ్వెలు వెలిగిద్దాము

మూలం – అటల్‌ బిహారీ వాజ్‌పేయి  
రచన – హిందీ నుంచి
కవితాపంక్తుల అనువాదం

రామతీర్థ, కవి, విమర్శకులు
మొబైల్‌ :  98492 00385 

మరిన్ని వార్తలు