ఆధునికతకు అక్షరాది కందుకూరి

27 May, 2018 01:26 IST|Sakshi

తెలుగు సమాజంలో ఏ ఒక్క వ్యక్తి  పుట్టుకతో అయినా ఇదిగో ఆధునికత మొదలు ఇతనితో అని చెప్పగలమా అంటే, అది ఒక్క కందుకూరి వీరేశలింగం విషయంలోనే సాధ్యం. ఆయన శతవర్ధంతి వత్సరం  మే,  ఇరవై ఏడున  ఆరంభం అవుతున్నది. ఏ చదువులు లేకుండా  అజ్ఞానంలో, బలైపోతున్న పసి ఆడపిల్లల  జీవితాలు, యుక్తవయసు వచ్చేలోపే బాల వితంతువులుగా లక్షలాదిమంది బాలికలు సమాజంలో ఉండటం, వీటిని ఎవరు సహించినా,  తాను వ్యతిరేకినంటూ, వీటిని ప్రశ్నించడానికి 1881లో  రాజమండ్రి  సోషల్‌ ప్రావి న్షియల్‌ క్లబ్‌లో కందుకూరి వీరేశలింగం ఒక ప్రసంగం చేశారు. దీనికి ప్రధాన ప్రేరణ, ఈ బాల్య వివాహాల  జాడ్యం దేశమంతటా  ఉండటం.  

1880లో జరిగిన జనాభా లెక్కల ప్రకారం,  తొమ్మిదేళ్ల వయసులో  భార్య అంటే  ఏమో ఎరుగని వయసు బాలురు, పసి భార్యలను పోగొట్టుకున్న వారు దేశంలో 14,773 మంది ఉన్నారు.  అదే సంవత్సరం, తొమ్మిదేండ్ల వయసు ఉన్న బాలికలు, తమ భర్తలను పోగొట్టుకున్న వారు, 78,976 మంది  లెక్క తేలారు. వీళ్ళు కాకుండా, తరుణ వయసుకొచ్చిన  2,07,388 మంది బాలికలు తమ యవ్వనారంభ జీవితాలను  వితంతువులుగా  మొదలెడుతున్నారు. ఇవీ సంప్రదాయ భారతదేశపు సంఘం చేస్తున్న దుర్మార్గ పరంపర. ఇది కేవలం తెలుగు ప్రాంతాలకే చెందినదిగా,  కొందరు భావించి, గురజాడ (1887–1892 నాటక రచనా కాలం ప్రదర్శన 1892లో)  కన్యాశుల్కం నాటకం రాసే నాటికే, ఈ సమస్య లేదు అని చెప్తూ ఉంటారు. అది వాస్తవదూరం.

 ఈ అగ్రవర్ణ మూర్ఖత్వాన్ని నిరసిస్తూ, గురజాడ వాడిన వాటికన్నా, కటువైన మాటల్లో, ఈ బాల్య  వివాహ దురాచారాన్ని రూపుమాపితే గానీ సమాజం బాగుపడదని విశ్వసించిన నాటికి, వీరేశలింగం వయసుడిగిన ముసలివారు కారు. ఆయన వయసు అప్పుడు కేవలం 33ఏళ్ళు.  మనం  తరచూ చూసే వృద్ధ కందుకూరి ఫోటోకి, ఈ  అతి బాల్య వివాహాలపట్ల   నిరసన తెలుపుతూ, తొలి వితంతు వివాహాన్ని 1881లో  దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా జరిపించిన వ్యక్తి రూపానికి పొలికే లేదు. దక్షిణ భారత రామ్‌మోహన్‌రాయ్‌గా గుర్తింపదగ్గ ఆధునికుడు వీరేశలింగం. 

కేవలం అక్షరయోధుడే  కాదు, ఆచరణసేనాని  కందుకూరి. ప్రసంగాలు, రచనలే కాదు – పెళ్లిళ్లు జరగాలి– అదీ  కందుకూరి కార్యదీక్ష. ఆయన రచనలన్నీ, సాంఘికమౌఢ్యాన్ని పేల్చివేసే మందుపాతరలు. ఏకబిగిన వితంతు వివాహదీక్షతో, సంఘసంస్కరణలో జాతీయస్థాయి  సంస్కర్తగా తన జీవితకాలంలోనే ఎదిగారు కందుకూరి. అప్పటి జాతీయ సంఘ సంస్కర్తలతో కలిసి, తన కార్యాచరణలో ఉన్నారు. ఈ భిన్న ప్రాంతాల ప్రముఖులు, జస్టిస్‌ మహదేవ్‌ గోవింద్‌ రనడె అధ్యక్షతలో, దేశంలోని ప్రధాన నగరాల్లో జాతీయ సామాజిక సంస్కరణ సభలను నిర్వహించేవారు. ఈ మేధావులు సంఘసంస్కరణ మన రాజకీయాకాంక్షలతోబాటుగా, అంతకన్నా వేగంగా సాగాలని, అప్పుడే భారతీయ సమాజం ఆధునికం కాగలదని విశ్వసించి ఆచరించినవారు. 1898లో మదరాసులో జరిగిన మహాసభలకు కందుకూరిని అధ్యక్షులను చేసి గౌరవించారు. ఇక్కడ అధ్యక్షహోదాలో ఆంగ్లంలో ప్రసంగించారు కందుకూరి. ఇక్కడే జస్టిస్‌ మహదేవ్‌ గోవింద్‌ రనడే ‘దక్షిణ భారత విద్యాసాగరునిగా’ కందుకూరికి బిరుదునిచ్చారు.  
  
అరుదైన ఈ ఆంగ్ల ప్రసంగ పూర్తిపాఠం, ఇటీవల లభ్యమైంది. దీనిని  మే 27న, విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం హాల్‌లో ఒక రోజుపాటు జరిగే శతవర్ధంతి వత్సర ప్రారంభోత్సవంలో విడుదలచేసి ఈ ప్రతిని ప్రదర్శనయోగ్యంగా విజయనగరంలోని గురజాడ స్మారక మందిరానికి, అలాగే, రాజమండ్రిలోని కందుకూరి దంపతుల సమాధి ఉన్న ఆనందాశ్రమానికి, ప్రదర్శన నిమిత్తం  జాతికి సమర్పించడం జరుగుతుంది. ‘వ్యాకరణాల సంకెల’ అని, 1895లోనే  ‘‘సరస్వతీ నారద విలాపం’’లో రాసిన కందుకూరి, ‘కవితా ఓ కవితా’లో ‘వ్యాకరణల సంకెళ్లు, శ్మశానాల వంటి నిఘంటువులు, చంధస్సర్ప పరిష్వంగం’ అన్న శ్రీశ్రీ కన్నా 45 ఏళ్లు  ముందరే, సాహిత్య సరస్వతి భాష బరువుల కింద నలిగి  రోదిస్తున్నదని  చెప్పిన వాస్తవిక వాది. వీరి రచనల సమగ్ర ప్రచురణలు, వీలైతే నేటి తరాల కోసం, కాస్త సరళ భాషలో తీసుకురావడం, అలాగే, పలు తెలుగు నగరాల్లో కందుకూరి శతవర్ధంతి సందర్భంగా ‘కందుకూరి జయమాల’ సాహిత్య, సాంస్కృతిక సభల నిర్వహణ, ప్రస్తుతం తెలుగు జాతి బాధ్యత.             
(మే 27న కందుకూరి శతవర్ధంతి సంవత్సరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విశాఖలోని ఆంధ్రవిశ్వవిద్యాలయంలో మొజాయిక్‌ సాహిత్య సంస్థ, అరసం సంయుక్తంగా నిర్వహిస్తున్న సందర్భంగా)


రామతీర్థ ,వ్యాసకర్త కవి, విమర్శకుడు
98492 00385

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా