లక్ష్య రహిత ప్రత్యామ్నాయం

9 Mar, 2018 02:18 IST|Sakshi
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

సందర్భం
అధికారాన్ని నిలుపుకోవడం కోసం అమలుకు సాధ్యం కాని హామీలు ప్రజ లకిచ్చి, వాటిని నెరవేర్చమనే పార్టీల గొంతెమ్మ కోర్కెలను కాదంటే ఫెడరల్‌ స్ఫూర్తిని గౌరవించనట్లేనా? మూడో ఫ్రంట్‌ ప్రతిపాదనకు మూలం ఇదేనా?

తెలంగాణ వచ్చేంతవరకు ఆంధ్రా వాళ్లను నోటికొచ్చి నట్లు, ఇష్టమున్న భాష, యాసలో తిట్టిన తెరాస నాయకులు, ప్రత్యేకించి ముఖ్యమంత్రి ప్రభుత్వం లోకి వచ్చిన తర్వాత ఆ పదజాలాన్ని ప్రతిపక్షాలను తిట్టడానికి యథేచ్ఛగా వాడుతున్నారు. వాస్తవానికి కేసీఆర్‌ అద్భుతమైన వాగ్ధాటి కలిగిన నాయకుడు. ప్రపంచ తెలుగు మహా సభల లాంటి సందర్భాల్లో ఆయన పద్య, గద్య పాండిత్యాన్ని చూసిన/ విన్న వారెవరూ ‘వారెవ్వా’ అనకుండా ఉండలేరు. కానీ దురదృష్టవశాత్తూ సాధారణ జనంలో వారి ఆ పాండిత్యం కంటే ప్రత్యర్థులను ఉద్దేశించి తిట్లే ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఆ భాష మాట్లా డుతున్నప్పుడు మాకేం అడ్డు అన్నట్లు మిగతా మంత్రులు, నేతలు అదే పంథాను ఎంచుకున్నారు.

అయితే, నాయకుల దూషణ, భూషణల మధ్య రాజకీయ సంరంభాన్ని వీక్షిస్తున్న ప్రజలు మాత్రం.. ఏలినవారు తెలంగాణలో ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా తుంగలో తొక్కుతూ పోతున్నా కిమ్మనకుండా ఉంటున్నట్లున్న వైఖరి ఆశ్చర్యం కలిగిస్తోంది. దళిత ముఖ్యమంత్రి అనే హామీని అవలీలగా అవతలికి నెట్టి గద్దెనెక్కినా, దళితులకు మూడెకరాల భూమి అని ఆడంబరంగా పలికి హామీలో పదోవంతు చేయకున్నా  నాయకులు కేసీఆర్‌కి మంగళ హారతులు పట్టారు.

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కనీసంగానైనా పూర్తి చేయకున్నా, ఉద్యోగాల హామీలు నీటి మూటలైనా పూర్తి చేయ కున్నా, ఉద్యోగాల హామీలు నీటి మూటలైనా, అప్పుడు డబులై ఆర్థిక భారం పెరిగినా, భూమిలో సగం, ఆకాశంలో సగం, జనంలో సగం, ఆఖరికి జీవితంలో సగమని చెప్పిన మహిళలకు మంత్రి వర్గంలో స్థానమివ్వకున్నా, కుటుంబ రాజకీయా లను బ్రహ్మాండంగా నడుపుతున్నా, చివరకు ప్రజలు తమకు ఇచ్చిన హామీలు ఏమయినాయి అని అడిగి, నిరసన తెలిపే అవకాశం ఉన్న ధర్నాచౌక్‌ను తొల గించినా, ఉలకని పలకని పరిస్థితి. బలమైన ఉద్య మాన్ని నిర్మించలేని అశక్తత.

తెలంగాణలోని మేధావులేమయిపోయి నారు. స్వజాతికి ఇచ్చిన హామీని తుంగలో తొక్కితే ప్రశ్నిం చాల్సిన దళిత మేధావులెక్కడ. దేశంలో ఎక్కడో ఏదో జరిగితే అవార్డులు వెనక్కిచ్చిన బహుజన కవు లెక్కడ? బహుశా ప్రజల్లోని నిస్తేజం, సమాజంలోని నిష్క్రియాపరత్వం కేసీఆర్‌ను, ప్రధానిని కూడా స్వాతంత్య్రానంతర భారతంలో ఏ ముఖ్యమంత్రీ మరే ప్రధానినీ సంబోధించని పద్ధతిలో మాట్లాడేలా పురిగొల్పినట్లు కన్పడుతోంది. తన వ్యాఖ్యలపై కనీ సంగా విచారం వ్యక్తం చేయలేదు సరికదా. బీజేపీ వాళ్ళే ఆయన అనని మాటలను కూడా అన్నట్లు సృష్టించినట్లు మాట్లాడి, పైగా నాపై కేసులు పెడ తారా? నన్ను ముట్టుకుంటే భస్మం అయిపోతారని హుంకరించారు. పనిలో పనిగా థర్డ్‌ ఫ్రంట్‌ పాట ఎత్తుకున్నారు.

నాలుగు జిల్లాల నుంచి 400 మందిని ప్రగతి భవన్‌కు పిలిపించి పడికట్టు మాటలతో ఉపన్యాసాన్ని దంచితే, వచ్చిన వారంతా అప్పుడే కేసీఆర్‌కు దేశ ప్రజల ఆమోదం లభించేసినట్లు 3వ కూటమి అధికా రంలోకి వచ్చి కేసీఆర్‌ ప్రధాని అయి నట్లు నినాదా లిచ్చి, సాక్షాత్తూ మంత్రులు కూడా ఏదో అయిపో తుందని భ్రమింపజేసే యత్నం ‘పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టినట్లున్న’ సామెతను గుర్తుకు తెస్తుంది. అవసరానికి ఇతరులను మోసం చేసినవాళ్లను చూస్తున్నాం. కానీ ఏమీ జరక్కున్నా ఈ ఆత్మవంచనలు ఎందుకో ఎవరికీ అర్థంకాని పరిస్థితి.

ఇక మూడో ఫ్రంట్‌ ఎందుకనే అంశంపై కేసీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పాలన ప్రజలకు నచ్చలేదని తీర్పిచ్చేశారు. 32 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రజలు ఒక పార్టీని, నాయకుడిని నమ్మి అధికారం కట్టబెడితే ఒక్క అవినీతి మరక కూడా లేకుండా సమర్థ పాలనతో, ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులెట్టిస్తున్న మోదీ పాలనను కాంగ్రెస్‌ పాలనను పోల్చటం సబబేనా? కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండి, అధి కారాన్ని నిలుపుకోవడం కోసం అమలుకు సాధ్యం కాని హామీలు ప్రజలకిచ్చి, వాటిని నెరవేర్చమనే పార్టీల గొంతెమ్మ కోర్కెలను కాదంటే ఫెడరల్‌ స్ఫూర్తిని గౌరవించనట్లేనా? రిజర్వేషన్లను ఇష్టారీతిన ఇచ్చే అధికారం రాష్ట్రాలకివ్వాలనటం విచ్చలవిడితనాన్ని ఒప్పుకోవాలనటం కాదా?

కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న ఫ్రంట్‌లు, వాటి చరిత్ర తెలియంది కాదు. ఈ దేశం నేషనల్‌ ఫ్రంట్‌. యునై టెడ్‌ ఫ్రంట్‌లను చూసింది. అవి అభాసుపాలైన తీరూ చూసింది. వీపీ సింగ్, చంద్రశేఖర్, దేవేగౌడ, ఐ.కె. గుజ్రాల్‌ లాంటి వారు విఫలమైన వ్యవహారాలన్నీ చూసింది. సిద్ధాంత సారూప్యత, దీర్ఘకాలిక లక్ష్యాల్లే కుండా అధికారమే పరమావధిగా నిర్మిత మయ్యే బంధాలు ఎక్కువకాలం కొనసాగలేవన్న సత్యం తెలిసి ప్రత్యామ్నాయ ఫ్రంట్, టెంటు అంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.

చివరగా చెప్పాలంటే ఎవరే ఫ్రంట్‌ కట్టినా, ప్రజల మద్ధతు బలంగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని, రాష్ట్రాల వారీగా విజయాలందుకుంటూ, ప్రజా మద్ద తును మరింత పెంచుకుంటున్న మోదీ ఇమేజ్‌ ముందు ఈ ప్రయత్నాలేవీ ఫలించవు. అధికారం కోసమే ఐక్యత రాగాలు పాడే వారిని ప్రజలు సమర్థించరు.

రావుల శ్రీధర్‌ రెడ్డి
వ్యాసకర్త బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలంగాణ

మరిన్ని వార్తలు