స్వచ్ఛమైన నీటి జాడ ఎక్కడ?

31 Mar, 2020 01:24 IST|Sakshi

సందర్భం 

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఒక్కో దేశం ఒక్కో విధానాన్ని అవలంబిస్తోంది. కానీ, సులువైనదనీ, అందరూ సులభంగా అనుసరించగలరనీ భావించి ‘సబ్బుతో, నీళ్లతో మీ చేతులను కనీసం 20 సెకన్లపాటు కడుక్కోవాలని’ ప్రతి దేశంలోనూ చెబుతున్నారు. ఇందుకు ఎంతో సురక్షితమైన నీళ్లు అవసరం, కానీ ప్రపంచంలో చాలాచోట్ల పరిశుభ్రమైన నీళ్లు దొరకడం లేదు. చాలా ప్రాంతాల్లో సరఫరానే ఉండదు. అత్యవసరంగా పారిశుద్ధ్యం పెంపొం దించాల్సిన ప్రాంతాల్లో మహమ్మారి విస్తరిస్తే అటువంటి ప్రాంతాల్లో ఏం జరుగుతుంది?

 తరచూ, శుభ్రంగా చేతులు కడుక్కోవడం ద్వారా కరోనా–19లాంటి వ్యాధులు సోకవని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. పారిశుద్ధ్య లోపం, చేతులు శుభ్రం చేసుకునే అవకాశాలు లేకపోవడం కారణంగా 2017లో ప్రపంచ వ్యాప్తంగా 15 లక్షల మంది మృతి చెందినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సురక్షితమైన తాగు నీటి వసతి లేకుండా 220 కోట్లమంది జీవిస్తున్నారు. పెద్దగా అభివృద్ధికి నోచుకోని దేశాల్లో కనీస నీటి వసతి లేకపోవడంతో మౌలిక నీటి సదుపాయాలు లేని ప్రాంతాల్లోనే ఆరోగ్య సంరక్షణ కూడా కొరవడుతోందని తేలింది.

 సురక్షితమై నీరు, పరిశుభ్రత అనేవి కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి తప్పనిసరిగా కావాలి. చేతులు కడుక్కోడానికి సరైన నీటి వసతి లేని ఇళ్లలో 75 శాతం మంది ఆఫ్రికన్లు  నివసిస్తున్నారని ప్రపంచబ్యాంకు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కెన్యాలో తాము సందర్శిం చిన 95 శాతం ఇళ్లలో సరైన నీటి వసతి లేదని ఒక స్వచ్ఛంద సంస్థ తెలిపింది. సరైన నీటి సరఫరాలేని  దేశాల్లోని ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిందే. దక్షిణాసియా, ఆఫ్రికాల్లో 2017లో డయేరియా కారణంగా మరణించినవారి సంఖ్య అధికంగా ఉన్నాయి. అపరిశుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం సరిగా లేని కారణంగా 70 ఏళ్లు పైబడినవారిలో వ్యాధులు త్వరగా వ్యాపిస్తున్నాయి.

 దక్షిణాఫ్రికాలోని కరువు ప్రాంతాల్లో అపరిశుభ్రమైన నీళ్ల కారణంగా 2016లో అయిదేళ్ల లోపు చిన్నారులు 72 శాతం మంది మరణిం చారు. అయితే, సరైన నీటి వసతి వున్న ప్రాంతంలో కూడా తరచూ చేతులు కడుక్కోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జోర్డాన్‌లో నివసించేవారిలో 93 శాతంమందికి 2015లో సురక్షితమైన నీరు అందేది. అయితే, దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన కారణంగా ప్రజలందరినీ ఇంట్లోనే ఉండమని ప్రభుత్వం ఆదేశించినప్పుడు నీళ్లకి 40 శాతం డిమాండ్‌ పెరిగింది. 2011లో అంతర్యుద్ధం సందర్భంగా సిరియా శరణార్థులు రావడంతో ఆ డిమాండ్‌ 22 శాతం పెరిగింది. హఠాత్తుగా నీళ్లకు డిమాండ్‌ పెరిగిపోవడంతో చాలా దేశాల్లో నీటి కొరతను ఎదుర్కొనక తప్పడం లేదు.

ఎక్కడైతే నిరంతరం రక్షిత నీటి సరఫరా కొరవడుతుందో అక్కడ వ్యాధులు మరింత తీవ్రంగా ప్రబలుతాయి. కరోనా లాంటి ఉపద్రవం ఎదురైనప్పుడు నీటి కొరత ప్రపంచ సమస్య అవుతుంది. దీన్ని ఎదుర్కోవడానికి సంఘటిత చర్యలు అవసరం. వైరస్‌ వ్యాప్తి చెందకుండా నీళ్లతో చేతులు కడుక్కోవాలని పదేపదే ప్రజలను హెచ్చరిస్తున్న ప్రస్తుత సందర్భం కంటే నీటి సంక్షోభంపై దృష్టి సారించడానికి కీలకమైన సమయం ఏదీ ఉండదు. వాతావరణ మార్పులపై దృష్టిపెట్టి ఉపరితల నీటి కొరతతో తలెత్తుతున్న కరువును కట్టడి చేయవచ్చు. వ్యవసాయ సంస్కరణలు చేపట్టి భూగర్భ జలాల దుర్వినియోగాన్ని నివారించవచ్చు. నీటి వనరులను సంరక్షించడమనేది అందరికీ ముఖ్యమైనది. అందరికీ ఎదురైన సమస్యను పరిష్కరించాలంటే ఐక్య కార్యాచరణే సరైనదని కరోనా వైరస్‌ కారణంగా తలెత్తిన వైద్య సంక్షోభం చెబుతోంది.

పరిశోధకులు కనుగొన్న అంశాలను, వారి నైపుణ్యాలను శాస్త్రవేత్తలకు, ఇతరులకు మధ్య ఉన్న ఖాళీ పూరించడానికి వినియోగించాలి. జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా నీటి వనరులను సంరక్షించుకోవడానికి, పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచడానికి, పరిశుభ్రత పెంపొందించడానికి కొత్త ఆలోచనలు రూపుదాల్చే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి విరుచుకుపడి సురక్షితమైన నీటి సరఫరా మనల్ని ఆరోగ్యంగా ఎలా ఉంచుతుందో, అటువంటి నీటి వసతి లేనివారి పరిస్థితి ఏంటో ఆలోచించేలా చేసింది. శుద్ధమైన నీరు, పరిశుభ్రత అనేవి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరి హక్కుగా చేయడం ఇప్పుడు తక్షణ అవసరం. అంతేకాదు, భవిష్యత్తులో తలెత్తబోయే మహమ్మారులను తట్టుకునేలా ప్రపంచాన్ని సిద్ధం చేయడం కూడా ముఖ్యం.


రయా ఎ. అల్‌–మస్రి 
వ్యాసకర్త పరిశోధక విద్యార్థి,
సైమన్‌ ఫ్రేజర్‌ యూనివర్సిటీ, కెనడా 

మరిన్ని వార్తలు