కడ వరకు విప్లవ స్వప్నాలే

12 Apr, 2018 01:29 IST|Sakshi

సందర్భం

నక్సల్బరీ విప్లవోద్యమంలో కొండపల్లి సీతారామయ్యది చాల విశిష్టమైన పాత్ర. ఈ 16 ఏళ్ల పాటు పూర్తిగా విస్మృతికి గురైన ఆయన పేరిట సంస్మరణలు లేవు, స్మృతి గీతాలు లేవు, స్తూపాలు లేవు.. ఓ గుర్తింపులేని హీరోగా మిగిలిపోయారు.

వ్యవస్థ మార్పు కోసం, సమ సమాజ స్థాపన కోసం తన జీవితాన్ని అంకితం చేసి పోరాడిన త్యాగశీలి, మార్గదర్శకుడు కొండపల్లి సీతారామయ్య అమరులై నేటికి 16 సంవత్సరాలు. ఆయన సహచరులు, అనుచరులు, అభిమానులు ఆయన్ని కె. ఎస్‌ అనీ, పెద్దాయన అనీ పిలుచుకుంటారు. దాదాపు దశాబ్దం పైబడి అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడి 2002 ఏప్రిల్‌ 12న ఆయన తన సుదీర్ఘ విప్లవ ప్రస్థానం చాలిం చారు. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సమాజంలో, ఇతర రాష్ట్రాలలోను వ్యవస్థ మార్పుకోసం సాగుతున్న ఉద్యమాలను వారు ప్రభావితం చేసిన సంగతి తెలి సిందే. చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, చారు మజుందార్‌ వంటి ఉన్నత స్థాయి  కలిగిన అగ్రశ్రేణి నాయకుడాయన. నక్సల్బరీతో ప్రారంభమైన విప్లవోద్యమంలో ఆయనది చాల విశిష్టమైన, విస్మరించరాని పాత్ర. ఈ16 ఏళ్ల పాటు పూర్తిగా విస్మృతికి గురైనారు. ఆయన పేరిట సంస్మరణలు లేవు, స్మృతి గీతాలు లేవు, స్తూపాలు లేవు, స్మారకోపన్యాసాలు లేవు. ఓ గుర్తింపులేని హీరోగా మిగిలిపోయారు.

అల్జీమర్స్‌తో బాధ పడుతున్న జార్జి ఫెర్నాండేజ్‌ని వారి అనుయాయులు ఎంతో అపురూపంగా చూసుకుం టున్నారట. అల్జీమర్స్‌ వ్యాధి గురించి మన సమాజానికి, ప్రత్యేకంగా ఉద్యమ శ్రేణులకు సరైన అవగాహన ఉండి వుంటే ఆయన పట్ల మరింత సహానుభూతి, సానుకూల దృక్పథం కలిగి ఉండే వారేమో! కాని చనిపోయే నాటికి ఒక దశాబ్దం ముందు నుంచే నిశ్శబ్దంగా, దొంగలా ఆయనలో ప్రవేశించిన అల్జీమర్స్‌ మాత్రం ఆయన్ని తన సహచరులకు దూరం చేసింది. అలాంటి స్థితిలో ఉండి కూడా ఆయన విప్లవ స్వప్నాలే కన్నారు. రోగ లక్షణంగా ఆయనకొచ్చిన మానసిక భ్రాంతుల్లో కూడ విప్లవ సైన్యం కదలికలు, కవాతులే ఉండేవి. మొగల్‌రాజపురంలోని ఇంటి పైన టెర్రస్‌ మీద కూర్చుని ఎదురుగా రోడ్డు పైన వెళ్తున్న జనాన్ని, వాహనాలను చూపిస్తూ రెడ్‌ ఆర్మీ కవాతుగా భ్రమించేవారు. ఆయన్ని చూడటానికి వచ్చిన అందరినీ పార్టీ పని చేయమని ప్రేరేపించేవారు.

ఏ కారణం వల్లనైనా మేము అభ్యంతరపెడితే.. మీరు చెయ్యరు.. చేసేవాళ్లతో చేయిం చుకుంటుంటే అడ్డుపడతారు అనేవారు. తన మనవరాలు సుధ, నేను పూర్తి స్థాయి పార్టీ కార్యకర్తల్లా పని యకుండా ఆమె లా కాలేజీ లెక్చరర్‌ గాను, నేను హాస్పిటల్‌ నడుపుతూ ఉండటం ఆయనకంతగా నచ్చేది కాదు. ఒకరోజు నా మూడేళ్ల కూతురితో ‘మీ నాన్న దొంగ. పార్టీ పని చేయకుండా డాక్టరై హాస్పిటల్‌ నడుపుతున్నాడు’ అన్నారు. దానికా పసిది పెద్దగా ఏడుస్తూ తనమీద కొట్లాటకు దిగింది. దాంతో కలవరపడి పసిదాన్ని బాధ పెట్టానే అని కలత చెందిన సున్నిత మనస్కుడాయన. భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో  కె.ఎస్‌.ది ఒక ప్రత్యేకమైన, ముఖ్యమైన అధ్యాయం. తెలంగాణా సాయుధ పోరాటకాలంలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కృష్ణాజిల్లా కార్యదర్శిగా ఆయన చాల కీలక పాత్ర నిర్వహించారు.

చండ్ర రాజేశ్వరరావుతో కలిసి అనుబంధ ప్రజాసంఘాల నిర్మాణంలో, ముఖ్యంగా రైతు సంఘం, ప్రజా నాట్యమండలి నిర్మాణంలో కె.ఎస్‌ది ముఖ్యపాత్ర. అనంతర కాలంలో నక్సల్‌ బరీ ఉద్యమంతో సి.పి.ఐ(ఎం.ఎల్‌) పార్టీ ఏర్పడినప్పుడు, ఆ తర్వాత పీపుల్స్‌ వార్‌ పార్టీ నిర్మాణంలో తన పూర్వ అనుభవాన్నంతా రంగరించి పార్టీకి ‘మాస్‌ లైన్‌’ అందించటంలో తనదే ముఖ్య పాత్ర. రాడికల్‌ విద్యార్థి సంఘానికి వేసవి సెలవుల్లో ‘గ్రామాలకు తరలండి. పేద మధ్య తరగతి ప్రజలతో మమేకం కండి’ అని పిలుపునిచ్చారు. గ్రామాలకు వెళ్ళినప్పుడు ముందుగా దళితవాడల్లో, బీసీవాడల్లో కాంపెయిన్‌ చెయ్యాలని, దళితవాడల్లో వాళ్లు పెట్టిందే తిని, రాత్రిపూట బస కూడా అక్కడే చేయాలని, వారితో పూర్తిగా మమేకం కావాలని ఆయనిచ్చిన డైరెక్షన్‌. ఆ పిలుపు మేరకు ప్రొఫెషనల్‌ కాలేజీలు, యూనివర్సిటీల నుంచి వేలాది మంది విద్యా ర్థులు గ్రామీణ ప్రాంతాలకు తరలి వెళ్లి సామాన్య ప్రజ లతో మమేకమై ఉద్యమ స్ఫూర్తి రగిలించారు.

2009లో కూర రాజన్న అనారోగ్యంతో హైదరాబాద్‌లో ఆసుపత్రిలో ఉన్నప్పుడు కొందరు మిత్రులం ఆయన్ని చూడటానికి వెళ్ళాం. నన్ను చూడగానే రాజన్న ప్రస్తావించిన మొదటి విషయం కె.ఎస్‌.కు విజయవాడలో స్తూపం కట్టాలని. నాతో వచ్చిన మిత్రుడొకరు కె.ఎస్‌. గురించి మీ అభిప్రాయం ఏమిటి అని రాజన్నను అడిగాడు. దానికాయన ‘కె.ఎస్‌. మా గురువు’ అన్నారు. అదేంటి మీ పార్టీ ఆయన పార్టీ వేరు వేరు కదా... కరీంనగర్‌ జిల్లాలో మీ రెండు గ్రూపుల దళాలు చంపుకునే వరకు వెళ్లాయి కదా అని ఆ మిత్రుడు మళ్లీ ప్రశ్నించాడు. దానికాయన ‘అవన్నీ క్షేత్రస్థాయిలో ఆచరణలో దొర్లిన పొరపాట్లు. ఉద్యమపరమైన ఎత్తుగడల విషయంలో ఆయన మాకు గురువే. ఉద్యమంపై ప్రభుత్వ నిర్బంధం పెరిగినప్పుడు మేము ప్రతిఘటనా పోరాటానికి పిలుపు నిచ్చాం. కె. ఎస్‌. అందుకు భిన్నంగా దండకారణ్యానికి విస్తరించమని పిలుపునిచ్చారు. ఆయనే కరెక్ట్‌ అని చరిత్ర రుజువు చేసింది‘ అన్నారు. రాజన్న అంచనా వేసిన రీతి లోనే చరిత్ర, భవిష్యత్తు తరాలు కొండపల్లి సీతారామయ్యని అంచనా వేస్తాయని నా ప్రగాఢ నమ్మకం.


డాక్టర్‌ జి.గంగాధర్‌
(నేడు విప్లవోద్యమనేత కొండపల్లి సీతారామయ్య 16వ వర్థంతి సందర్భంగా)
వ్యాసకర్త ప్రముఖ వైద్యులు, విజయవాడ
మొబైల్‌ 98483 34761

మరిన్ని వార్తలు