డాక్టర్‌జీ.. రోగులు ఎదురుచూస్తున్నారు

19 Jun, 2019 02:26 IST|Sakshi

బహుశా డాక్టర్లకు సమ్మె చేసే హక్కు ఉండకపోవచ్చు. బహుశా వారి ప్రథమ కర్తవ్యం తమ గురించి కాకుండా తమ రోగుల గురించి ఆలోచించాల్సి ఉండటమే కావచ్చు. కానీ ఒక డాక్టర్‌ తల బద్దలైనప్పుడు, మరొక డాక్టర్‌ యాసిడ్‌ దాడిలో కన్ను కోల్పోవలసి వచ్చినప్పుడు, వేరొక డాక్టర్‌ చావుతప్పి లొట్టపోయినట్లు దారుణంగా దెబ్బలు తిన్నప్పుడు, వారి తెల్లటి దుస్తులు రక్తం మరకలతో తడిసిపోయినప్పుడు.. డాక్టర్లకు నిరసన తెలిపే, విలపించే హక్కు లేదనడంలో ఏదైనా అర్థముందా? ‘నేను దేవుడిని కాదు, డాక్టర్‌ని మాత్రమే. నా శక్తిమేరకు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాను, దయచేసి నన్ను కొట్టొద్దు’ అనే హక్కు డాక్టర్‌కు లేదని అనగలమా? మానవ ప్రాణిని కాపాడాల్సిన గొప్ప బాధ్యతలో ఉన్నవారు కుప్పగూలిపోతున్న భారతీయ ఆరోగ్య సంరక్షణా వ్యవస్థలో తొలి బలిపశువుల్లా మిగలాల్సిందేనా? అతడు లేక ఆమె ఒక రక్తమోడుతున్న నౌకలాగా కుదించుకుపోవలసిందేనా?

కోల్‌కతాలోని నీల్‌ రతన్‌ సర్కార్‌ హాస్పిటల్‌లో గత వారం మృతుడి బంధువులు కొందరు తమ ఆగ్రహాన్ని అక్కడ పనిచేస్తున్న ఒక జూనియర్‌ డాక్టర్‌పై ప్రదర్శించారు. గుంపులో ఒకరు విసిరిన ఇటుక దెబ్బకు డాక్టర్‌ పరిబాహ ముఖోపాధ్యాయ్‌ తలకు తీవ్రగాయం తగిలింది. తనకు ఆపరేషన్‌ చేశారు కానీ, మెదడు దెబ్బతినే ప్రమాదం ఉందని సహ డాక్టర్లు భీతిల్లుతున్నారు. వైద్యుడిపై అలాంటి దాడి జరగటం ఈ దేశంలో ఇది తొలి సారి మాత్రం కాదు. దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మె జరిగిన సోమవారం నాడు ఎయిమ్స్‌లో మరొక డాక్టరుపై కూడా కొంతమంది రోగులు దాడి చేశారు. మహానగరాల్లో, పట్టణాల్లో రెసిడెంట్‌ డాక్టర్లు, ట్రైనీ డాక్టర్లు, మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌ నర్సులు, జూనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు వివిధ కారణాలతో రోగులు, వారి బంధువుల ఆకస్మిక ఆగ్రహాలకు గురై గాయాలపాలైన ఘటనలెన్నో.
(చదవండి : వైద్యుల సమ్మె సమాప్తం)

నా కుమారుడు కూడా ప్రస్తుతం ఒక జూనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌. తెల్లకోటు, స్టెతస్కోప్‌ను ధరించి అతడు కూడా ఒంటరిగా హాస్పిటల్‌ రౌండ్స్‌కు వెళుతుంటాడు. డాక్టర్ల తల్లిదండ్రులందరూ వైద్య విద్య అధ్యయన సమయంలో తమ పిల్లలు చేస్తున్న అత్యంత కఠినతరమైన ప్రయాణాన్ని చవిచూసినవారే. తీవ్రాతి తీవ్రమైన పోటీతో కూడిన ఎంట్రన్స్‌ పరీక్షలు, కోర్సు క్రమంలో వైద్య విద్య మోపుతున్న పర్వతభారం, నిత్యం జరిగే పరీక్షలు, వీటన్నింటినీ దాటుకుని ఎంబీబీఎస్‌ డిగ్రీ సాధించడం, తర్వాత పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ కోసం మళ్లీ పరీక్షలు, ఇంటర్న్‌షిప్‌కు సిద్ధమవటం.. తప్పదు. దీంతో మరోసారి నిద్రలేని రాత్రులు గడపడం(షవర్‌ వద్ద నిలబడి ఉన్నప్పుడు కూడా కనురెప్ప వాల్చడాన్ని నేర్చుకోవడం), ఆసుపత్రిలో పని ఒత్తిడి, అఖిల భారత పోటీ పరీక్షల కోసం మరో దఫా తీవ్రంగా సన్నద్ధమవడం, కోచింగ్‌ క్లాసులు, సంపుటాల కొద్దీ పుస్తకాలు చదవాల్సి రావడం, రోగుల పడక పక్కనే కూర్చుని, అదే సమయంలో రోగ వివరాలతో కూడిన ఫైళ్లను నింపడం, పని గంటల మధ్య అమూల్యంగా లభించే 15 నిమిషాలు మాత్రమే నిద్రపోవలసి రావడం.. ఇదీ వైద్య విద్యార్థుల దైనందిన జీవితం. 

జూనియర్‌ డాక్టరుగా ఉంటున్న 24 ఏళ్లున్న నా కుమారుడికి కూడా వారాంతపు సెలవులు లేవు. సెలవుదినాలు లేవు. కానీ మరొక మానవ ప్రాణిని కాపాడాల్సిన గొప్ప బాధ్యత మాత్రం ఉంటుంది. వ్యాధుల బారిన పడిన వారి నొప్పి తగ్గించడం, సంరక్షణ లేని ప్రపంచంలో కేర్‌ తీసుకోవడంతోపాటు ప్రతి వైద్యుడూ పాటించవలసిన ఆ మహోన్నతమైన హిప్పోక్రాట్స్‌ ప్రమాణం కూడా తోడుగా ఉంటుంది. అదేమిటంటే, మొట్టమొదటగా వైద్యుడు చేయవలసింది ‘రోగికి ఎలాంటి హానీ చేయకపోవడం’. వైద్యుల నిత్య జీవితాచరణ యముడినీ భయపెడుతుంది. 

డాక్టర్‌ పరిబాహ ముఖోపాధ్యాయ అంతవరకు తాను సంరక్షకుడిగా ఉన్న అదే ఆసుపత్రిలో పడుకుని ఉన్నారు. తలకు బలమైన దెబ్బలు తగిలాయి. నాలాగే తన తల్లి కూడా అతడు పుస్తకాలతో కుస్తీపడటాన్ని చూసి ఉంటారు. పరీక్షా ఫలితాలలో తాను పొందిన నిమ్నోన్నతాలకు సాక్షిగా ఉండి ఉంటారు. రోగులతో అతడు కలిగివుండే భావోద్వేగ బంధాన్ని గమనించి ఉంటారు. మెడికోగా తన కుమారుడు పడుతున్న ఘర్షణను, ఒత్తిడిని మొత్తంగా ఆమె అనుభూతి చెంది ఉంటారు. అలాంటిది అదే ఆసుపత్రిలో అతడు బెడ్‌ మీద రోగిలా ఉండటం, తలకు బ్యాండేజ్‌ చుట్టి ఉండటం చూస్తూ ఆమె ఎంత ఆందోళన చెంది ఉంటారో! పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడుతున్న ఆమె తన ముద్దుల కుమారుడు నిస్త్రాణగా పడి ఉండటం చూసి తల్లడిల్లిపోయి ఉండరూ!
(చదవండి : జూడాల సమ్మెకు సోషల్‌ మీడియా ఆజ్యం!)

బహుశా డాక్టర్లకు సమ్మె చేసే హక్కు ఉండకపోవచ్చు. వారి ప్రథమ కర్తవ్యం తమ గురించి కాకుండా తమ రోగుల గురించే ఆలోచించాల్సి ఉండటం కావచ్చు. కానీ ఒక డాక్టర్‌ తల బద్దలైనప్పుడు, మరొక డాక్టర్‌ యాసిడ్‌ దాడిలో కన్ను కోల్పోవలసి వచ్చినప్పుడు, మరొక డాక్టర్‌ చావును సమీపించిన స్థితిలో దారుణంగా దెబ్బలు తిన్నప్పుడు, అతడి తెల్లటి దుస్తులు రక్తం మరకలతో తడిసిపోయినప్పుడు.. వారికి నిరసన తెలిపే హక్కు లేదనడంలో ఏదైనా అర్థముందా? ‘నేను దేవుడిని కాదు, డాక్టర్‌ని మాత్రమే. నా శక్తిమేరకు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాను, దయచేసి నన్ను కొట్టొద్దు’ అనే హక్కు డాక్టర్‌కు లేదని అనగలమా? 

కుప్పకూలిపోతున్న భారతీయ ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ ముంగిట జూనియర్‌ డాక్టర్‌ గస్తీ తిరుగుతున్నారు. దేశంలో సరిపడినన్ని ఆసుపత్రులు లేవు. డాక్టర్లు లేరు. ఒకే ఒక్క డాక్టర్‌ వందమంది రోగులను పర్యవేక్షించాల్సి వస్తున్న దుర్భర స్థితిలోనూ రోగులపట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతుంటాయి. ఆసుపత్రుల్లోని వైద్య సామగ్రి మరమ్మతుకు కూడా సాధ్యం కానంతగా పాడై ఉంటాయి. ఈ స్థితిలో శస్త్రచికిత్సలు చేయడం అంటే అదృష్టాన్ని నమ్ముకోవడమే.

చీకటితో నిండి ఉండే ఆసుపత్రి వరండాల్లో, మృత్యువు తనదైన గర్వాతిశయంతో పచార్లు చేస్తుంటుంది. వైద్యులను అద్భుత ప్రావీణ్యతలు కలిగిన శ్రామికుడిగా మనం లెక్కించకూడదు. డాక్టర్లు శక్తినంతటినీ ధారపోసి రోగి ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నిస్తుంటారు కానీ రోగి ఆఖరి శ్వాసను వారు అడ్డుకోగలరా? నా కుమారుడి మెడ వెనుక భాగంలో పొడిపించుకున్న పచ్చబొట్టు ఏమిటో తెలుసా..! ‘సంరక్షించు, నయం చెయ్యి, నూతనంగా సృష్టించు’. రోగిని సంరక్షించడమే ఒక డాక్టర్‌ రెండో స్వభావం అయినప్పుడు, కాపాడటమే తన లోపరహిత వైఖరి అయినప్పుడు, అతడు లేక ఆమె రోగి త్వరగా చావాలని అనుకోగలరా? కానీ మన సమాజానికి బలిపశువులు అవసరం. ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ కుప్పగూలిపోయినందువల్ల, నిస్సహాయుడైన జూనియర్‌ డాక్టర్‌ ప్రజాగ్రహం ఫలితాలను మొత్తంగా తానే భరించవలసి వస్తోంది.

ప్రస్తుతం డాక్టర్‌–పేషెంట్‌ నిష్పత్తి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రతి వెయ్యిమంది ప్రజలకు ఒక్క వైద్యుడు ఉండాలి. కానీ భారతదేశంలో ఇది 1:2,000గా ఉంటోంది. అంటే దేశంలో 50 శాతం డాక్టర్ల కొరత ఉంటోందని దీనర్థం. భారత్‌ లోని 8,56,065 మంది అల్లోపతి వైద్యుల్లో 6 లక్షల మంది క్రియాశల ప్రాక్టీషనర్లుగా ఉంటున్నారు. వైద్యపరీక్షలకు సంబంధించి విస్తారమైన అనుభవం ఉన్న భారతీయ వైద్యులకు ఎనలేని నైపుణ్యాలు ఉంటున్నాయి. కానీ వీరి ప్రావీణ్యతలకు తగినంత మౌలిక వసతుల వ్యవస్థ మద్దతు లేకపోవడంతో అత్యంత దుర్భర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. 

2009లో జస్టిస్‌ కట్జు, జస్టిస్‌ ఆర్‌ఎమ్‌. లోథా ఈ అంశంపై ముఖ్యమైన తీర్పు వెలువరించారు. ‘విధినిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన వైద్యుల పట్ల ఈ న్యాయస్థానం ఎలాంటి సానుభూతి చూపదు. కానీ వైద్య వృత్తిని కూడా వినియోగదారు సంరక్షణ చట్టం పరిధిలోకి తీసుకురావడం వల్ల మన దేశంలో వైద్యులపై ఎక్కడ చూసినా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి’. 

2017 సెప్టెంబరులో డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. కారణం. ఆ సంవత్సరం ఆగస్టు నెలలో గోరఖ్‌పూర్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సౌకర్యం లేక 30–40 మంది పిల్లలు చనిపోయారు. కానీ ఇప్పుడు తెలుస్తున్నదేమిటంటే, ఆసుపత్రికి ఆక్సిజన్‌ సిలిండర్ల సరఫరా విషయంలో డాక్టర్‌ ఖాన్‌ వ్యక్తిగత స్థాయిలో ధీరోదాత్తమైన ప్రయత్నం చేశారు. తన వ్యక్తిగత కార్యాచరణ ద్వారా ఆయన అనేకమంది పిల్లల ప్రాణాలు కాపాడారు. అత్యవసర పరిస్థితుల్లో పిల్లల ప్రాణాలను కాపాడటానికి రక్తం ధారపోసిన నిజమైన హీరో డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌. కానీ ఆయనపై అన్యాయంగా ఆరోపించి, అరెస్టు చేసి మరీ విచారణ జరిపారు.

గోరఖ్‌పూర్‌లోని ఎన్నారెస్‌ హాస్పిటల్‌లో జరిగిన ఘటనలపై రాజ కీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు బలం పుంజుకున్నాయి. రాజకీయ ప్రత్యర్థి పక్షాలు దీంట్లోకి చొరబడి మతపరమైన ఘర్షణలను రెచ్చగొట్టాలని, రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నించారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఈ ఘటనలో రాజకీయ కుట్రను చూశారు. ప్రతిపక్షం దీంట్లో ఎన్నికల ఎజెండాను చూసింది. అయితే ఇవేవీ నాకు ప్రాధాన్యం కాదు. నేను చూస్తున్నదల్లా, ఎలాంటి కళాకాంతులూ లేని వ్యక్తి తన రోగిముందు కూర్చుని అతడి నాడి పట్టి చూస్తూ, గుండె కొట్టుకొనే శబ్దాన్ని వింటూ, ఒక డాక్టరుకు, రోగికి మధ్య ఉండే అత్యంత సాన్నిహిత్య బంధాన్ని దేశం ముందు వ్యక్తీకరిస్తున్నారు. ఇది సమగ్రతకు సంబంధించిన బాంధవ్యం. మాటల్లో వర్ణించలేని సాన్నిహిత్యం. 

కుప్పగూలిపోతున్న భారతీయ ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ.. ప్రతి భారతీయ డాక్టర్‌లో నిబిడీకృతమైన శిలాసదృశమైన, వజ్రకవచ స్ఫూర్తికి వ్యతిరేకంగా నిలుస్తోంది. తనతో ఘర్షిస్తున్న ఈ బాధామయ పరిస్థితులకు వ్యతిరేకంగా భారతీయ డాక్టర్‌ తన వైద్యపరమైన తేజోవంతమైన స్ఫూర్తిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. వారు చేస్తున్న ఈ పవిత్రకర్తవ్యం ప్రజాగ్రహానికి గురై ఇలా తన్నులు తినాల్సిందేనా? అతడు లేక ఆమె ఒక రక్తమోడుతున్న నౌకలాగా కుదించుకుపోవలసిందేనా?

బహుశా, రక్తగాయాల బారినపడిన ఈ వైద్యమూర్తులు మళ్లీ తన విధులను చేపట్టవచ్చు. తమ గాయాలను పక్కనబెట్టి వారు విధుల్లోకి తిరిగిరావచ్చు. తమ వార్డుకు తిరిగిరావచ్చు. వైద్యులను సంరక్షించని పాలనాయంత్రాంగం, కుప్పగూలుతున్న మౌలిక వ్యవస్థకు వ్యతిరేకంగా తమ మానసిక శక్తి అనే ఏకైక కాంతిపుంజాన్ని వారు సమున్నతంగా ఎత్తిపట్టవచ్చు. అతిగొప్ప మహర్షులు, సైంటిస్టులు, చింతనాపరుల పుట్టినిల్లు అయిన భారతదేశం ఇప్పటికీ మహోన్నత వైద్యులను తయారు చేస్తూనే ఉంది. డాక్టర్‌ పరిబాహ ముఖోపాధ్యాయ్‌.. త్వరగా కోలుకోండి. మీ పేషెంట్లు మీకోసం వేచి చూస్తున్నారు.

- సాగరికా ఘోష్, సీనియర్‌ పాత్రికేయురాలు

>
మరిన్ని వార్తలు