ప్రజాగళం విచ్చుకొని పదేళ్లు

23 Mar, 2018 00:35 IST|Sakshi

సమకాలీనం
తెలుగునాట జర్నలిజం వృత్తికి ఎనలేని గౌరవం తెస్తూ ఒక ప్రభంజనంలా మొదలైంది. మీడియా ఉద్యోగులు, ముఖ్యంగా జర్నలిజంలో ఉన్న వారి గౌరవాన్ని, జీతభత్యాల్ని, అవకాశాల్ని ఒక్కపెట్టున పెంచింది సాక్షి. ఈ విషయాల్లో పరిశ్రమ ఊహించని స్థాయీ మార్పు సంతరించుకుందంటే అతిశయోక్తికాదు కదా, ప్రత్యర్థి కూడా కాదనలేని సత్యమిది. పత్రికల, పత్రికలు నిర్వహించే మీడియా సంస్థల ప్రవర్తనలోనే పెను మార్పులకు నాంది పలికింది. ఎన్నో ప్రజా ఉద్యమాలను అద్దమై ప్రతిబింబించింది.

‘వార్త అంటేనే, ఎవరో అణచివేయ జూసేదే. మిగిలిందంతా ఉత్తి వ్యాపార ప్రకటన. ఎజెండా ఏర్పాటుకే శక్తి కావాలి. మనం దేన్ని వెలుగులోకి తెస్తున్నాం, దేన్ని వెలుగులోకి రానీకుండా నిలిపివేస్తున్నామన్నదాంట్లోనే ఎంతో మతలబుంది!’అంటారు, అమెరికా మీడియా దిగ్గజం, రెండు దశాబ్దాల పాటు ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ను నడిపిన క్యాథరీన గ్రాహమ్‌. నిజమే! మొత్తం సమాచార వ్యవస్థనే చెరపట్టిన గుత్తాదిపత్యంతో.... మేం చెప్పిందే వార్త, చేసిందే వ్యాఖ్య! చూపిందే చిత్రం, అల్లిందే కథ! అన్నట్టు కొన్ని మీడియా శక్తులు రాజకీయ గమనాన్ని, సమాజాన్ని శాసిస్తున్నపుడు తెలుగునాట ప్రజాస్వామ్యం పరిహాసం పాలయింది. అబద్ధాలకు నగిషీలు చెక్కి, నిజాలను నిలువునా పాతరేసి ఏకస్వామ్యం నడుస్తున్నపుడు జనహితం కోరే గొంతులకు స్థానం లేకుండా పోయింది. అప్పుడు.... నేనున్నానంటూ ఓ స్వరం గొంతు పెగుల్చుకుంది. గోదావరి ఉధృతితో పరవళ్లు తొక్కుతున్నపుడు ధవళేశ్వరం వద్ద ఏటికెదురీదే పొలసచేపలా వచ్చింది. సరిగ్గా దశాబ్దం కింద.. ఆ పొలికేక పెట్టింది వేరెవరో కాదు ‘సాక్షి’. దిక్కులేని వారికి, దిగాలు పడ్డవారికి, అణచివేత వాతపడిన వారికి, ఆదరణ కోల్పోయిన వారికి... ఇలా సమాజంలో ఎందరెందరికో గొంతుకయింది.

గుంపు గుంపు కొట్టుకుపోతుంటే, వేల సమూహాలు నోరు మెదిపే ధైర్యం, ఆస్కారం, అవకాశం లేని వేళ.. ఒక స్వరం పొలికేకై, మూగవోయిన కోటి గొంతులకు స్వరాన్ని, గుండె ధైర్యాన్ని, ఆత్మ నిబ్బరాన్నీ ఇచ్చిన కొత్త ఊపిరైంది. వ్యవస్థల్ని చెరబట్టిన వారు దుర్బుద్ధితో దాపెట్టిన నాణెపు రెండో పార్శా్వన్ని సాక్షి ఆవిష్కరించింది. ప్రత్యామ్నాయ సమాచారానికి, అవసరానికి, అవకాశాలకు తానే వేదికయింది. సమాచారం సంకెళ్లు విప్పి, నిజాన్ని నిజంలా చెబుతామని సంకల్పం తీసుకొని నేటికి సరిగ్గా పదేళ్లయింది. ఈ పదేళ్ల ప్రస్థానంలో ఎన్నెన్నో ఆటుపోట్లు, మరెన్నో విజయాలు. సరళ సమాజంలోనే విజయాలంత తేలిగ్గా దక్కవు, అటువంటిది సంక్లిష్టమైన మన సమాజంలో అదంత తేలికయింది కాదు. సాక్షి విషయంలోనూ అదే జరిగింది. మొగ్గ దశ నుంచి సాక్షిని తుంచేసే యత్నాల్లో అనేక శక్తులు! ఇప్పటికీ నిరంతరంగా అటువంటి యత్నాలు సాగి స్తూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న, అధికారంతో కళ్లు మూసుకుపోయిన పెద్దలు, ‘ఇంకేముంది, సాక్షిని సీజ్‌ చేసినట్టే, అంటే ప్రభుత్వం గుప్పెట్లోకొచ్చేసింది, రేపో మాపో తీసేసుకొని సర్కారే నడిపిస్తుంద’ని గర్వాతిశయాన్ని చాటడం తెలి సిందే. అన్ని అణచివేతల్ని, దాష్టీకాల్ని సమర్థంగా ఎదుర్కొంటూ, అడుగడుగునా ఉద్యమిస్తూ, తనను తాను నిరూపించుకుంటూ తెలుగువారి గుండె చప్పుడుగా సాక్షి సాగిపోతూనే ఉంది. ఇదొక నిరంతర యజ్ఞం.

నిజం చెప్పే జనం పత్రిక
సాక్షి లేకుంటే ఎన్నో నిజాలు వెలుగు చూసేవి కావు. ఇది సర్వత్రా ఆమోదం ఉన్న వ్యాఖ్య. వారి వారి నేపథ్యాల్ని, సామాజిక పరిస్థితుల్ని బట్టి ఏ విషయంలో ఎవరికి ఏ భిన్నాభిప్రాయమున్నా, ఈ విషయాన్ని మాత్రం అందరూ అంగీకరిస్తారు. సాక్షి పుట్టాక ఏడాదిలోనే వచ్చిన 2009 ఎన్నికలప్పుడు ఇది మరింత స్పష్టంగా కనిపించింది. ఎన్నెన్ని విష ప్రచారాలు! లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు వండివార్చిన వార్తా కథనాల కనికట్టుతో మాయాజాలం చేయజూసింది పచ్చ మీడియా! అది అప్పటివరకు వారికున్న సహజ లక్షణం. పైగా ఎప్పుడూ వారది దాచింది లేదు. ఎన్నికలవడంతో రాజకీయ ప్రయోజనాల కోసం ఆ తత్వాన్ని అనేక రెట్లు పెంచి ఆచరించారు. దాన్ని సాక్షి సమర్థంగా ఎదుర్కొంది. జనం రోజువారీ జీవితంతో ముడివడి ఉన్న ప్రతి విషయంలోనూ వాస్తవం ఇది అని విడమర్చి చెప్పింది. ‘ఇదీ! పనిగట్టుకొని కనుమరుగు చేస్తున్న వాస్తవం’అని సాక్ష్యాధారాలతో ప్రచురించి తన రాతలతో నిజాల్ని నిగ్గుతేల్చింది. జనాన్ని చైతన్య పరచింది.

ముఖ్యంగా రాజకీయ వ్యవహారాలు, పరిణామాలకు సంబంధించిన విష ప్రచారాల తెర వెనుక భాగోతాల్ని ఎప్పటికప్పుడు ఎండగట్టింది. ఆ ఎన్నికల తర్వాత కొందరు సామాజికవేత్తలు, రాజకీయ పరిశీలకుల వ్యాఖ్యల్ని విశ్లేషించినపుడు అప్పుడు సాక్షి నిర్వహించిన పాత్ర ఇట్టే బోధపడుతుంది. ఎన్నికల ఫలితాల తర్వాత ‘అబ్బో! సాక్షి లేకుంటే....!’అని పలువురు వ్యక్తం చేసిన ఆందోళనలోనే సాక్షి సాధిం చిన విజయ గాథలు దాగి ఉన్నాయి. మార్చి 24, 2008 న సర్వసన్నాహాలతో సాక్షి మొదలయినప్పుడు, ముఖ్యమంత్రి హోదాలో ఆవిష్కరణ సభకు విచ్చేసిన డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ఒక ఆశీర్వచనం ఇచ్చారు. కొత్తగా ఆరంభమైన దినపత్రిక సాక్షి నిజాన్ని నిజంలాగే వెల్లడించాలని ఆయన సూచించారు. ‘‘...ఎలాంటి వక్రీకరణలూ వద్దు, ఇది ఆంధ్రప్రదేశ్‌ (నాటి ఉమ్మడి తెలుగు రాష్ట్రం) ఉజ్వల భవిష్యత్తుకు సాక్షిలా నిలబడాలి. ప్రతి తెలుగువాడూ సగర్వంగా చెప్పుకునేలా ఎదగాలి’’అని అభిలషించారాయన. అదే జరుగుతూ వచ్చింది. ఆయన ఆశయాల పునాదులపై ఎదగిన, ఎదుగుతున్న సౌధమిది!

నిరంతర ప్రయోగం
సాక్షి ఓ దినపత్రికగా ఆరంభం నుంచే చాలా ప్రయోగాలు చేసింది. పాఠకుల అభిరుచి, ఆసక్తి, అవసరాలే ప్రాతిపదికగా ఆ పరంపర కొనసాగిస్తూనే ఉంది. 19 నగరాల్లో ప్రింటింగ్, 23 ఎడిషన్లతో ప్రారంభమే ఒక గొప్ప ప్రయోగం! తెలుగునాట జర్నలిజం వృత్తికి ఎనలేని గౌరవం తెస్తూ ఒక ప్రభంజనంలా మొదలైంది. మీడియా ఉద్యోగులు, ముఖ్యంగా జర్నలిజంలో ఉన్న వారి గౌరవాన్ని, జీతభత్యాల్ని, అవకాశాల్ని ఒక్కపెట్టున పెంచింది సాక్షి. ఈ విషయాల్లో పరిశ్రమ ఊహించని స్థాయీ మార్పు సంతరించుకుందంటే అతిశయోక్తికాదు కదా, ప్రత్యర్థి కూడా కాదనలేని సత్యమిది! పత్రికల, పత్రికలు నిర్వహించే మీడియా సంస్థల ప్రవర్తనలోనే పెను మార్పులకు నాంది పలి కింది. మానవసంబంధాల మూల స్తంభమైన కుటుంబాన్ని ఆలంబన చేస్తూ ‘ఫ్యామిలీ’ని విలువల గీటురాయి చేసింది. ఇంటిల్లిపాదినీ పత్రికకు పాఠకుల్ని చేసింది. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల ప్రపంచాన్ని అరచేతికి చేర్చి యువతరం ‘భవిత’కు ఆశాసౌధాలు కట్టింది.

కార్పొరేట్లకు ఎర్రతివాచీలు పరచి వ్యవసాయం దండగ అన్న దుర్నీతి పాలకుల పన్నాగాల్ని ఎండగడుతూ, అన్నం పెట్టే రైతన్నకు ‘సాగుబడి’పాఠాలు చెప్పింది. ప్రకృతి వ్యవసాయాన్ని పొత్తిళ్లలో పెట్టి ప్రోత్సహించింది. ‘ఇంటిపంట’ను ఆర్థిక–ఆరోగ్య మంత్రం చేసింది. మహిళా సాధికారతకు పట్టం గట్టింది. ప్రాంతీయ వార్తలతో పాటు జాతీయ–అంతర్జాతీయ వార్తలకు ప్రాధాన్యం తెచ్చింది. క్రీడలు, వాణిజ్యం, సాహిత్యం, తదితర రంగాలన్నిటా కొత్త పుంతలతో పాఠకుల్ని సరికొత్త తీరాలకు చేర్చింది. వార్తా కథనాల్లోని అంశాలకు కారకులయ్యే, ప్రభావితులయ్యే వారి అభిప్రాయాలకూ ఎక్కడికక్కడే స్థానం కల్పించే సంస్కృతిని విస్తృత పరచింది. మీడియా బాధ్యత–జవాబుదారీతనాన్ని మరింత పెంచింది. ‘‘...లుప్తమయిపోతున్న పత్రికా సత్సంప్రదాయాలూ, కొనప్రాణంతో ఉన్న వార్తా సంస్కృతీ ‘సాక్షి’ద్వారా మళ్లీ జవజీవాలు పుంజుకుంటాయని మీరు నిశ్చయంగా ఆశించవచ్చు’’ అని సాక్షి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి తొలి ప్రతిపై సంతకంతో ఇచ్చిన భరోసా ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగువారికి లభిస్తూనే ఉంటుంది.

మొక్కవోని దీక్ష
ప్రజా సమస్య ఏదైనా నిర్భీతితో స్పందించి, నివేదించడం సాక్షి ప్రాథమిక లక్షణం. రాజకీయ కల్లోల పరిస్థితుల్లో కూడా ఈ నియతిని వీడలేదు. పత్రిక పుట్టిన తొలిరోజు ప్రతిలోనే ప్రకటించుకున్నట్టు ‘‘.... అభిప్రాయాలు కలిగి ఉండే హక్కు అందరికీ ఉంటుందని మేము పూర్తిగా నమ్ముతాము. ఇతరుల అభిప్రాయాలతో విభేదించే హక్కును కూడా మేం గౌరవిస్తాం. ఒక వార్తా పత్రికగా మేము ప్రజాస్వామ్య బద్ధులం కాబట్టి, రాజ్యాంగ బద్ధులం కనుక, సెక్యులరిస్టు భావజాలం కలిగివున్న కారణాన వాటికి విరుద్ధంగా ఉన్న శక్తులను తప్పనిసరిగా వ్యతిరేకిస్తాం. అయితే వ్యతిరేకిస్తున్నాం కాబట్టి సత్యాలను చిత్రవధ చేయబోము. వార్తలను వక్రీకరించే పాడు పనికి ఒడికట్టబోమని పాఠకలోకానికి హామీ ఇస్తున్నాము’’అన్న సంకల్పం సాక్షికి నేటికీ, ఎప్పటికీ శిరోధార్యమే! ఆ హామీని నిలబెట్టుకునే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.

అధికారంలో ఉన్నవాళ్లు, రాజకీయ ప్రత్యర్థులు కుమ్మక్కై సాక్షిని అడ్డదారుల్లో అణగదొక్కినపుడు కూడా పట్టు సడలనీయలేదు. పాత్రికేయ విలువలను వీడలేదు. సంబంధమే లేని వ్యవహారాన్ని అంటగట్టి పత్రికా కార్యాలయంలో సోదాలు చేసినపుడు, అకౌంట్లు స్తంభింపజేసినపుడు కించిత్‌ వెరవలేదు. సాక్షి ఉద్యోగులందరు కూడా ఒక్కతాటిపై నిలిచి సంఘీభావం ప్రకటించారు. సర్కారుకో, నచ్చిన రాజకీయ శక్తులకో కొమ్ముకాసే పచ్చ మీడియా ‘ఇక సాక్షి పని అయిపోయింద..’ని విష ప్రచారం చేసినా, ఒక్కరంటే ఒక్క ఉద్యోగి కూడా ఆ భయంతో సాక్షిని వీడలేదు. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల నడుమ కూడా ఉద్యోగుల జీతం డబ్బుల్ని ఏ నెలా యాజమాన్యం ఒక్క రోజు ఆలస్యం కానీలేదు. కుట్ర పన్నిన ప్రత్యర్థి పాలకశక్తులు ప్రత్యక్ష–పరోక్ష పద్ధతుల్లో పత్రికాస్వేచ్ఛను కాలరాయ జూసినపుడు సాక్షి పరివారమంతా ఉద్యమమై ఉవ్వెత్తున ఎగిసింది. ఎన్నో ప్రజా ఉద్యమాలను అద్దమై ప్రతిబింబించింది.

ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా...
ఎన్నెన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ఏది జనహితమని భావిస్తే ఆ సమాచారాన్ని అన్ని కోణాల్లో స్పృశించి, సమర్పించింది. రాష్ట్ర విభజన తర్వాత అనేకానేక ప్రజాహిత అంశాల్లో పిల్లిమొగ్గలు వేస్తూ పాలకపక్షాలు చేసిన దాష్టీకాలన్నింటినీ పరిశోధనాత్మక కథనాలతో జనం ముందు పరి చింది. పచ్చని పంటపొలాల్లో చిచ్చు పెట్టి జరిపిన భూసేకరణ–సమీకరణైనా, రాజధాని పేరిట రంగుల చిత్రం చూపుతూ సర్కారే ఓ పెద్ద రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి ఒడిగట్టినా, కనికట్టుతో భ్రమలు కల్పించిన పట్టిసీమ దోపిడీ అయినా, స్వప్రయోజనాల కోసం ‘ప్రత్యేక హోదా’ను పణంగా పెట్టి రాజకీయావసరాల కోసం నాలుకను నాలుగు వంకర్లు తిప్పినా.... విశ్వసించదగ్గ సాక్ష్యాధారాలతోనే వార్తా కథనాల్ని ప్రచురించింది. తొలిరోజు సంకల్పంలో చెప్పినట్టు, ‘‘.... మేము కచ్చితంగా ప్రజాహితమైన అంశాన్నే ఎంచుకొని దాన్ని నిర్మొహమాటంగా సమర్ధిస్తాము... ప్రజల మనస్సాక్షిగా వ్యవహరిస్తూ మొత్తం సమాజంలో జరిగే సకల కార్యకలాపాలనూ ప్రజాకోటికి యథాతథంగా, ఉన్నది ఉన్నట్టు నివేదిస్తాం’’అన్నదే సాక్షి అక్షరాలా పాటిస్తోంది. అందుకే ప్రజాదరణ చూరగొంది. ఇది వందేళ్లకు పైబడి నడిచే పత్రికగా నిలదొక్కుకోవాలని ప్రస్తుత చైర్‌పర్సన్‌ వై.ఎస్‌.భారతీరెడ్డి వ్యక్తం చేసిన అభిలాషకు దన్నుగా ఈ దశాబ్ది ప్రస్థానం ఓ బలమైన ముందడుగు.


వ్యాసకర్త
దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వ్యవసాయంతోనే ఆర్థిక సంరక్షణ

జనరంజకం నిర్మల బడ్జెట్‌

ఈ అసమానతలు ఇంకా ఎన్నాళ్లు?

ఒకే దేశం.. ఒకే ఎన్నిక.. ఒకే నేత!

నవ్యాంధ్రలో ‘నవ’శకం

మాండలిక మాధుర్యాల పదకోశం

రాయని డైరీ.. ఎం.ఎస్‌.కె. ప్రసాద్‌ (సెలక్టర్‌)

బాబుగారు నంది అంటే నంది!

అనుసరించారా? వెంబడించారా?

ఆధునికీకరణే అసలైన రక్షణ

ఆ ఎమ్మెల్యేలకు పదవులు గడ్డిపోచలా?

విశ్వవిద్యాలయాల ప్రక్షాళన అత్యవసరం

సాహిత్య వేదికలపై ఫత్వాలు సరికాదు

వృద్ధి కేంద్రంగా క్రియాశీల బడ్జెట్‌

మాతృభాషలో పరీక్షలే మేలు

కర్ణాటకలో అసంబద్ధ నాటకం!

భస్మాసుర హస్తమవుతున్న ఫిరాయింపులు

నిరాశాజనకం.. నిరుత్సాహకరం

సామాజిక ఉద్యమ స్ఫూర్తి ‘దండోరా’

ప్రజాప్రయోజనాలకు పట్టం కట్టిన బడ్జెట్‌

సంక్షేమ రథ సారథి

కారుణ్యమూర్తికి అక్షరాంజలి

విశిష్ట ముఖ్యమంత్రి వైఎస్సార్‌

మధ్యతరగతిపై ‘మైనారిటీ’ ప్రేమ!

ప్రత్యక్ష పన్నులపైనే ప్రత్యేక శ్రద్ధ

‘నిషేధం’ చెరలో రైతుల భూములు

అడవి దొంగలెవరు?

ఆర్థికాన్ని బడ్జెట్‌ ఆదుకునేనా..?

సోషలిజానికి సరికొత్త భాష్యం

 ‘పోడు’ సమస్య ఇంకెన్నాళ్లు?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?