షరపోవా నిష్క్రమణ

28 Feb, 2020 00:31 IST|Sakshi

ఏ ఆరంభానికైనా ముగింపు తప్పదు. తన ఆటతో టెన్నిస్‌ను శాసించి, ఆ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న షరపోవా కూడా తన ఇరవై ఎనిమిదేళ్ల ఆటకు గుడ్‌బై చెబుతున్నట్టు బుధవారం ప్రకటించింది. నాలుగేళ్లక్రితం షరపోవా అతి ముఖ్యమైన ప్రకటన చేస్తారని ఆమె ప్రతినిధి ప్రకటించినప్పుడే నిష్క్రమణపై అంచనాలు వెలువడ్డాయి. ఎందుకంటే అప్పటికే భుజానికి ఏర్పడిన  గాయం ఆమెకు ప్రతిబంధకమైంది. దాన్ని బేఖాతరు చేసి విజయాలు సాధిస్తున్నా మును పటి ఉరవడి మందగించిందన్న అసంతృప్తి అభిమానుల్లో ఉండేది. కానీ ఎవరి ఊహకూ అంద కుండా డోపింగ్‌ వివాదంలో తాను తాత్కాలికంగా నిష్క్రమిస్తున్నానని షరపోవా ప్రకటించి అందర్నీ దిగ్భ్రాంతి పరిచింది.

అటు తర్వాత 15 నెలల సస్పెన్షన్‌ ముగిసి, మళ్లీ టెన్నిస్‌ బ్యాట్‌ పట్టుకున్నా, ఒకటీ అరా విజయాలు సాధించినా పాత గాయాలు ఆమెను వెన్నాడుతూనే వచ్చాయి. 2008 మొదలు ఆమె తన భుజానికి తగిలిన గాయానికి తరచు శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సివచ్చింది. ఒకపక్క ఆడుతూనే నెలల తరబడి ఫిజియో థెరపీలు తీసుకోవాల్సివచ్చింది. బరిలో దిగడానికి అర గంట ముందు ప్రత్యేక థెరపీ తప్పనిసరయ్యేది. కానీ ఇవన్నీ ఆమెను పాత షరపోవాగా మార్చ లేక పోయాయి. 2004లో అప్పటికే దిగ్గజంగా వున్న సెరెనా విలియమ్స్‌తో తలపడి çపదిహేడేళ్ల వయ సులో వింబుల్డన్‌ ఫైనల్‌ను చేజిక్కించుకున్న షరపోవా, అదే సెరెనాతో నిరుడు 6–1, 6–1 తేడాతో ఓడిపోక తప్పలేదు.

ఇక నిష్క్రమించడం మంచిదని అప్పుడే ఆమె నిర్ణయించుకుని వుంటుంది. షరపోవాలాంటివారు ఏ రంగంలోనైనా అరుదుగా వుంటారు. ఆరేళ్ల వయసులోనే అమ్మకు దూరంగా ఉండాల్సిరావడం,  స్వస్థలమైన రష్యాను వదిలి వేల కిలోమీటర్ల దూరంలోని అమెరికాకు శిక్షణ కోసం పయనం కావడం సాధారణం కాదు. అమెరికాలోని ఫ్లారిడాలో తన టెన్నిస్‌ బడిలో ఆండ్రీ అగస్సీ, వీనస్‌ విలియమ్స్, సెరినా విలియమ్స్, మోనికా సెలెస్, అన్నా కోర్నికోవా, మార్టినా హింగిస్‌ వంటి ఉద్దండుల్ని సృష్టించిన నిక్‌ బొలెట్టిరీయే షరపోవాను కూడా చేర్చుకుని మంచి శిక్షణనందించాడు. భవిష్యత్తు గ్రాండ్‌ స్లామ్‌ విజేతగా తీర్చిదిద్దాడు. సరదా ఆటలతో కాలక్షేపం చేయాల్సిన లేత వయసులో తోటిపిల్లల్ని తన ప్రత్యర్థులుగా పరిగణించడం, ఓడించాలనుకోవడం షరపోవా అలవాటు చేసుకుంది. గెలుపు తప్ప మరిదేన్నీ కోరుకోని జీవితం ఆమెకు ప్రత్యర్థులనే కాదు... శత్రువుల్ని కూడా ఇచ్చింది.

2016లో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడిందని రుజువు కావడంతో షరపోవాపై నిషేధాస్త్రం ప్రయోగించినప్పుడు ఆ రంగంలోని వారినుంచి తగిన సానుభూతి లభిం చకపోవడానికి ఇదొక కారణం. కానీ ఈ రంగమే షరపోవాకు కావలిసినంత కీర్తిప్రతిష్టల్ని ఆర్జించి పెట్టింది. కోట్లాదిమంది అభిమానుల్ని సాధించిపెట్టింది. ఆమె సాధించిన విజయాలు చిన్నవి కాదు. వింబుల్డన్‌ సింగిల్స్‌ గెల్చుకున్నాక వరసగా యూఎస్‌ ఓపెన్‌(2006), ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌(2008) చేజిక్కించుకుంది. 2012, 2014 సంవత్సరాల్లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ కూడా ఆమె సొంతమైంది. షరపోవా దూకుడు ఒక్క టెన్నిస్‌కే పరిమితం కాలేదు. వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టి విజయాలు అందుకుంది. ఆమె వ్యాపార సామ్రాజ్యం విలువ 1,200 కోట్ల డాలర్ల పైమాటేనని రెండేళ్లక్రితం ఫోర్బ్స్‌ పత్రిక ప్రకటించింది.  

రష్యాలోని సైబీరియాలో చిన్నపాటి మధ్యతరగతి కుటుంబంలో పుట్టి టీనేజ్‌లోనే వరస విజయాలతో ప్రత్యర్థుల్ని హడలెత్తించిన షరపోవా తన ఆటతో టెన్నిస్‌ రంగానికే వన్నె తెచ్చింది. తర్వాత కాలంలో ఆటలో మాత్రమే కాదు... ఆట వెలుపల కూడా ఆమె సంచలనంగా మారింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నైక్, పోర్షే, ఎవియాన్‌ వంటి అనేకానేక సంస్థలకు ఆమె బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది. ఎన్నో మేగజీన్‌ల ముఖపత్రాలను అలంకరించింది. ఇలాంటి సమయంలో ఆమెపై డోపింగ్‌ ఆరోపణలొచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. క్రీడా రంగ దిగ్గజాలుగా ఉన్నవారెందరో అడపా దడపా పట్టుబడుతున్నా షరపోవాను ఎవరూ అలా ఊహించలేకపోయారు. తాను చాన్నాళ్లుగా వాడుతున్న మందు నిషేధిత ఉత్ప్రేరకాల జాబితాలో చేరిందని తెలియక వాడి దోషినయ్యానని ఇచ్చిన సంజాయిషీ ఎవరినీ సంతృప్తిపరచలేదు. ఎందుకంటే ఆ ఔషధం వాడితే అనర్హత వేటు పడుతుందని అంతకు ముందునుంచే క్రీడా సంస్థలు హెచ్చరిస్తూ వచ్చాయి.

వ్యక్తి మాత్రులుగా ఉన్నవారికి ఆ సంగతి తెలియలేదంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ షరపోవా కోసం ప్రత్యేక బృందం ఉండి పనిచేస్తుంటుంది. ఆమెపై ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా వ్యాఖ్యానిస్తున్నారో, టెన్నిస్‌ రంగంలో జరుగుతున్న పరిణామాలేమిటో, నియమ నిబంధనల్లో ఎటువంటి మార్పులు కావాలన్న డిమాండ్లు వస్తున్నాయో, ఏమేరకు అవి మారాయో ఆ బృందం ఎప్పటికప్పుడు ఆమెకు తెలియజేస్తూ ఉంటుంది. ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతతో పనిచేయడం, ఆ క్రమంలో ఎదురయ్యే అవరోధాలను అధి గమించడానికి నిరంతరం ప్రయత్నించడం వంటివి గెలుపును గ్యారెంటీ చేస్తాయి. షరపోవా అలాంటి అడ్డంకులెన్నిటినో ఎదుర్కొంది.

కేవలం 700 డాలర్ల సొమ్ముతో అమెరికాలో తండ్రితో పాటు అడుగిడిన ఆమె ఈ రంగంలో మిగిలినవారికన్నా మిన్న కావడానికి తనలోని ఏకాగ్రత, పట్టుదల, ఆటను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకునే గుణం దోహదపడ్డాయి. అయితే వచ్చిపడుతున్న వరస విజయాలు చూపును మసకబార్చకూడదు. గత నెలలో మెల్‌బోర్న్‌లో జరిగిన ఆస్ట్రేలియాలో ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఆమెకు సంప్రాప్తించిన అపజయం షరపోవా ర్యాంక్‌ను 373కు నెట్టేసింది. సవాళ్లు ఛేదించే క్రమంలోనో, ఫలానా వారిని మించిపోవాలన్న లక్ష్యాన్ని పెట్టుకోవడంలోనో ఆమె తప్పటడుగులు వేసివుండొచ్చు. కానీ బరిలో దిగిన ప్రతిసారీ షరపోవా చూపిన ప్రతిభాపాటవాలు, విన్యాసాలు ఆమెను ఎప్పటికీ మరిచిపోనీయవు. ఏ రంగంలోనైనా రాణించాలనుకునేవారికి షర పోవా జీవితం అధ్యయనం చేయదగ్గ మహత్తర గ్రంథం. 

మరిన్ని వార్తలు