నదుల అనుసంధానం ఎవరికోసం?

22 Feb, 2019 00:39 IST|Sakshi

విశ్లేషణ 

పట్టిసీమతో దేశంలోనే నదుల అనుసంధానానికి తొలి కర్తగా తన్నుతాను పొగడుకుంటున్న బాబు కొత్తగా గోదావరి–పెన్నా అనుసంధానం కూడా తానే పూర్తిచేస్తానని హోరెత్తిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు  పూర్తయినా దాని కుడికాల్వద్వారా తరలించగలిగే నీరు 11.65 క్యూసెక్కులు మాత్రమే. గోదావరి నీటిని కృష్ణానదికి తరలించే ప్రయత్నం చేయకుండానే నీటి లభ్యత లేకుండా దాదాపు రూ.6 వేల కోట్ల వ్యయంతో గోదావరి పెన్నా అనుసంధాన ప్రాజెక్టు చేపట్టడం మోసపూరితం. పర్యావరణ అనుమతులు లేని, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టని ఈ ప్రాజెక్టును ఇప్పటికైనా నిలిపివేసి పోలవరం కుడికాల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నించడం ఏపీకి మంచిది.

ఆంధ్రప్రదేశ్‌లో నదుల అనుసంధానం అనే అంశాన్ని తరచుగా ప్రస్తావిస్తున్నారు.  పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో గోదావరి నీటిని కృష్ణా నదిలోనికి తరలించడం ద్వారా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం ఇప్పటికే జరిగిపోయినట్లుగా పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆధునిక కాలంలో అపర భగీరధుడుగా టీడీపీ నేతలు కీర్తించడంలో పోటీపడుతున్నారు. కానీ ఈ అనవసర కీర్తి కండూతి యావలో పడి.. ముప్పై సంవత్సరాల క్రితమే ఇదే కృష్ణానది నుంచి పెన్నానది లోనికి తెలుగుగంగ భారీ ప్రాజెక్టు ద్వారా నీరు తరలించిన అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుని మరచిపోవటం భావ్యమా? పట్టిసీమ తర్వాత కొత్తగా గోదావరి పెన్నా అనుసంధానంపై గత రెండు మూడు సంవత్సరాలుగా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రకటనలు ఇస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్‌ వారు 2016 అక్టోబరులో రూపొందించిన గోదావరి–పెన్నా అనుసంధానానికి నాలుగు ప్రత్యామ్నాయాలు సూచించారు. అందులో నాల్గవదానిని దాదాపు ఆమోదించారు.

ఆ నాల్గవ ప్రత్యామ్నాయ వివరాలు :
పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఆ రిజర్వాయర్‌ (45 మీటర్లు) నుండి 80 మీటర్ల లెవల్‌కు కనీసం 60వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి 280 కి.మీ. కాలువలో 24 కి.మీ. వరకు సొరంగాల ద్వారా కృష్ణానదిని 4.5 కి.మీ. ఆక్విడెక్టు ద్వారా దాటించి, తిరిగి 56 కి.మీ.కాల్వను 10 కి.మీ. పంపింగ్‌ మెయిన్ల ద్వారా ఎత్తిపోసి ప్రకాశంజిల్లా బొల్లాపల్లి వద్ద నిర్మించబోయే 360 టిఎంసీల జలాశయం (240 మీటర్ల లెవల్‌కు) ఎత్తిపోస్తారు. ఆ రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా నిర్మించే అత్యంత భారీ స్థాయి కాల్వలకు గాను 28 గిరిజన గ్రామాల నుంచి మాత్రమే కాకుండా, వేలాది ఎకరాల అటవీ భూమిని కూడా సేకరించవలసి ఉంటుంది. దీనికి గానూ 6 నుంచి 7వేల మెగావాట్ల విద్యుత్‌ అవసరం అవుతుంది. ఈ ప్రాజెక్టు మొత్తం ప్రధాన కాల్వల పొడవు 720 కి.మీ.

 2017 మార్చిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అనుసంధానంపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఆ తరువాత వార్తాపత్రికలలో దీనిపై అనేక కథనాలు వచ్చాయి. 2017 సెప్టెంబరులో గోదావరి నుంచి 6,200 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి చింతలపూడి లిఫ్ట్‌ ఫేజ్‌ 2కు శంఖుస్థాపన చేశారు. దీనిద్వారా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టు కింద 2.8 లక్షలఎకరాల స్థిరీకరణకు ఈ నీటిని వినియో గిస్తామని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. మొత్తం నీటి వినియోగం 63 టీఎంసీలు. అంచనా విలువ 4,908 కోట్లు. 2019 జూన్‌ నాటికి పూర్తి చేయాలనే సంకల్పంతో పనులు జరుగుతున్నాయి. 

దరిమిలా గోదావరి–పెన్నా నదుల అనుసంధానం మొదటి దశగా పేర్కొంటున్న పథకానికి 2018 నవంబరులో ఏపీ ముఖ్యమంత్రి నకి రేకల్‌ వద్ద శంఖుస్థాపన చేశారు. కృష్ణా నదిలోని హరిశ్చంద్రాపురం (ప్రకాశం బ్యారేజికి 23 కిలోమీటర్ల ఎగువన) వద్ద 7వేల క్యూసెక్కుల నీటిని 56.35 కి.మీ.కాల్వతో 10.25 కి.మీ. మేరకు పైపులైన్ల ద్వారా మొత్తం 73 టీఎంసీల నీటిని సాగర్‌  కుడికాల్వ (80 కి.మీ.) వద్దకు తరలి స్తారు. దీని అంచనా 6,020 కోట్లు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిర్దేశిం చిన కాలం జూన్‌ 2019. అయితే గోదావరి పెన్నా అనుసంధానం మొదటి ప్రతిపాదనలో ఈ అంశాన్ని ప్రస్తావించలేదు.
పట్టిసీమ ద్వారా వచ్చే 8వేల క్యూసెక్కుల నీటితో పాటు చింతల పూడి లిఫ్ట్‌ద్వారా వచ్చే 6వేల క్యూసెక్కుల నీటిని పోలవరం కుడికాల్వ ద్వారా కృష్ణానదికి తరలిస్తామని ఆ నీటిని కృష్ణాడెల్టా వద్ద కొత్తగా ఏర్పాటుచేసే ఈ అనుసంధానం ద్వారా నాగార్జున సాగర్‌ కుడికాల్వ ఆయకట్టులోని 9.6 లక్షల ఎకరాల భూమికి సాగునీటి అవసరాలు తీరుస్తామని ప్రభుత్వం చెబుతోంది. కాని పోలవరం కుడికాల్వ చివర (174 కి.మీ వద్ద) ప్రవాహ సామర్ధ్యం 11,165 క్యూసెక్కులు మాత్రమే. ఈ నీరు డెల్టా అవసరాలకు కూడా ఏమాత్రం సరిపోదు. ఒకవైపున చింతలపూడి లిఫ్ట్‌ స్కీము ద్వారా 4.8 లక్షల ఎకరాలకు నీరు ఇస్తామని చెబుతూ పట్టిసీమ ద్వారా డెల్టా అవసరాలు పూర్తిగా నెరవేరుస్తామని చెబుతూ ఇంకొకవైపు అదే నీటిని సాగర్‌ కుడికాల్వకు తరలిస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమే. 

పోలవరం ప్రాజెక్టు పూర్తయినప్పటికీ కుడికాల్వ ద్వారా తరలించగ లిగే నీరు 11.165 క్యూసెక్కులు మాత్రమే అని ఈ సందర్భంగా గమ నించాలి. తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు పూర్తయితే గోదా వరిలోని మిగులు జలాలు లభ్యమయ్యే కాలం బాగా తగ్గిపోతుంది. పైగా కృష్ణా నదిలో సాగర్‌ దిగువన లభించే నీరు అంతంత మాత్రమే. సాగర్‌ నుండి నీటి విడుదలకు అవకాశం దాదాపుగా లేదు. అదే సమ యంలో పులిచింతలలోనికి సరిపడా నీరు చేరదు. పోలవరం కుడి కాల్వ ద్వారా వచ్చే నీరు కూడా పరిమితం. మరి అందుబాటులో లేని ఏ నీటిని ఎత్తిపోయడానికి సుమారుగా 6వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు? నీటి లభ్యత లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంలో ఉన్న ఔచిత్యం ఏమిటి అనేది ప్రశ్న. 

ఈ సందర్భంగా ఒకసారి గత 10 సంవత్సరాల కాలంలో నీటి లభ్యత వినియోగం గురించి పరిశీలిద్దాం. శ్రీశైలం వద్దకు చేరిన నీరు 2009–10 నుండి వరుసగా (టీఎంసీలలో) 1222, 1028, 736, 197, 848, 614, 59, 345, 489 ఈ సంవత్సరం 562 టీఎంసీలు. దీనినుండి పోతిరెడ్డిపాడు హంద్రీ నీవా ద్వారా రాయలసీమకు, చెన్నైకు లభించిన నీటి వినియోగం. 2009–10 సంవత్సరాలS నుండి వరుసగా. 60, 84, 84, 30, 106, 76, 9, 105, 126.5, 145 టీఎంసీలు, అలాగే నాగార్జున సాగర్‌ కుడి కాల్వకు 2015–16లో 17.5 టీఎంసీలు, 2016–17లో 59.7 టీఎంసీలు, 2017–18లో 89.9 టీఎంసీలు, 2018–19లో 91 టీఎంసీలు కేటాయించారు. సాగర్‌ కుడికాల్వ ఆయకట్టుకు గత 3 సంవత్సరాల కాలంలో సాగుకు అనుమతించలేదు. ఈ సంవత్సరం అంటే 2018–19కి గాను శ్రీశైలం వద్దకు అదనంగా 200 టీఎంసీల నీరు చేరినప్పటికీ, ఈ లెక్క ప్రకారం కుడికాల్వ ఆయకట్టుకు 132 టీఎంసీలు పొందే హక్కు ఉన్న ప్పటికీ కేవలం 91 టీఎంసీలు (70శాతం) మాత్రమే కేటాయించి వివక్ష చూపారు.

నీరు లేక వంతులవారీగా నీరు విడుదల కావటం వలన కాల్వల చివర ఉన్న వేలాది ఎకరాల భూమికి తీవ్ర నీటి కొరత ఏర్పడింది. తెలంగాణ విడిపోయిన తరువాత నీటి కేటాయింపులు కృష్ణా రివర్‌ బోర్డు ఆదేశానుసారం ఉంటాయి. ఈ కేటాయింపు ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీల దామాషాలో ఉంటుంది. సాగర్‌లో నీరు ఉన్నప్పటికీ కుడికాల్వ ఆయకట్టుకు అదనంగా నీరు వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో గోదావరి నీటిని కృష్ణా నదిలోనికి తరలించే ప్రయత్నం చేయకుండానే నీటి లభ్యత లేకుండా అనుసంధాన ప్రాజెక్టు చేపట్టడం దురదృష్టకరమే కాకుండా, మోస పూరితం కూడా. ఇక్కడ గుర్తించవలసిన మరొక ప్రధాన విషయం ఏమిటంటే, అత్యంత భారీ వ్యయం, భారీస్థాయిలో భూసేకరణ, 360 టీఎంసీల బృహత్‌ జలాశయం నిర్మాణం, 700 కి.మీ. పొడవైన కాల్వ, దానిలో భాగంగా 24 కి.మీ. సొరంగాలు, భారీగా విద్యుత్, అవసరాలు వగై రాలతో కూడిన గోదావరి–పెన్నా నదుల అనుసంధానం చేపట్టి దాన్ని పూర్తి  చేయడానికి దీర్ఘకాలం పడుతుంది. దీనికోసం అత్యంత భారీగా వ్యయం అవుతుంది కూడా. 

అందువలన ముందుగా పోలవరం కుడికాల్వ ప్రవాహ సామర్ధ్యాన్ని 27,500 క్యూసెక్కులకు పెంచాలి. దీనిని త్వరితగతిన పూర్తిచేయడానికి కూడా అవకాశం ఉంది. పోలవరం పూర్తయిన తరు వాత సాగునీటి పారుదల ద్వారా నీటిని ప్రకాశం బ్యారేజి వద్దకు తరలించవచ్చు. ఆ నీటినుంచి కృష్ణాడెల్టా అవసరాలకు పోను మిగులు జలాలను వైకుంఠపురం వద్ద నిర్మించబోయే బ్యారేజి ఎగువకు ఎత్తిపోసి, ఆ నీటిని తిరిగి పులిచింతలలోనికి ఎత్తిపోయడం ద్వారా కృష్ణానదిలో 15 నుంచి 18 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకోవచ్చు. అలాగే పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీటిని నవంబరు తరువాత కూడా నిల్వ చేసుకోవచ్చు.
ప్రకాశం బ్యారేజి, పులిచింతల మధ్య దూరం 87 కి.మీ. పూర్తిస్థాయి నీటిమట్టం ప్రకాశం బ్యారేజి వద్ద 17 మీటర్లు, వైకుంఠపురం వద్ద 25 మీటర్లు, పులిచింతల వద్ద 54 మీటర్లు, సాగర్‌ కుడికాల్వ వద్ద 135 మీటర్లుగా ఉంటుంది. సాగర్‌ కుడికాల్వ ఆయకట్టుకు నీరు సప్లిమెంట్‌ చేయాలంటే పులిచింతలకు 32 కి.మీ.దూరంలో గల సాగర్‌ కుడికాల్వకు ఈ లింకు ఏర్పాటు చేసి దీనిద్వారా సుమారు 10వేల క్యూసెక్కుల నీటిని 90 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోయాలి. దీనివలన కుడికాల్వ ఆయకట్టుకు నీరు అందించే భరోసా ఏర్పడుతుంది. పైగా ఇప్పుడు చేపట్టిన ఈ అనుసంధానానికి ఇంతవరకు పర్యావరణ అనుమతులు లేవు. ప్రజాభిప్రాయ సేకరణ జరుగలేదు. ఈ రెండు అంశాల ప్రాతిపదికన చూస్తే ఇది పూర్తిగా చట్ట ఉల్లంఘన కిందికే వస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఇప్పటికైనా నిలుపుదల చేసి పోలవరం కుడికాల్వ సామర్ధ్యాన్ని పెంచడానికి సమాయత్తమవటం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి శ్రేయస్కరం.

వ్యాసకర్త : యెర్నేని నాగేంద్రనాధ్‌, రైతాంగ సమాఖ్య అధ్యక్షులు
మొబైల్‌ : 98495 59955

మరిన్ని వార్తలు