సమస్యల పరిష్కారంలో భారతీయులు భేష్‌!

4 Feb, 2020 00:30 IST|Sakshi

బ్రిటన్‌ పేరు చెప్పగానే మనకు వలస పాలన, స్వాతంత్య్ర పోరాటం వంటి విషయాలు గుర్తుకు రావడం కద్దు. అయితే స్వాతంత్య్రం తరువాత ఈ 73 ఏళ్లలోనూ బ్రిటన్‌ భారత దేశానికి మధ్య సహాయ, సహకారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. శాస్త్ర, సాంకే తిక పరిజ్ఞాన రంగాల్లో భారతదేశం ప్రతిభను గుర్తించి బ్రిటన్‌ వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతూండటం. పరిశోధన రంగంలో బ్రిటన్‌ ప్రభుత్వ ప్రతినిధిగా గుర్తింపు పొందిన యూకే రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ నేతృత్వంలో 2008 నుంచి భారత్‌లోని ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థలు, యూనివర్సిటీల్లో పలు ప్రాజెక్టులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ అంశంపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ యూకేఆర్‌ఐ డైరెక్టర్‌ (ఢిల్లీ) రెబెకా ఫెయిర్‌బేమ్‌తో ముచ్చటించింది.

ప్ర:  యూకే రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సంస్థ భారత్‌లో రూ. 3,100 కోట్ల పెట్టుబడులు పెట్టింది. వీటి నుంచి మీరు ఆశిస్తున్నదేమిటి? 
జ: ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు యూకే, భారత్‌లు సంయుక్తంగా పరిష్కారాలు కనుక్కోగలగాలని ఆశిస్తున్నాం. మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు పనికొచ్చే పనులు చేపట్టాలన్నది మా ఉద్దేశం.   

ప్ర: భారత్‌తో కలిసి ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రత్యేకమైన కారణమేమైనా ఉందా? 
జ: నా దృష్టిలో భారత్‌లో ఉన్నంత వైవిధ్యత ఇతర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించదు. సమస్యల పరిష్కారం విషయంలో భారతీయులు అనుసరించే పద్ధతులు చాలా వినూత్నమైనవి. సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించేందుకు ఈ వైవిధ్యత చాలా అవసరమవుతుంది.

ప్ర: ఏ రంగాల్లో ప్రాజెక్టులు ఎంచుకుంటారు? 
జ: యునైటెడ్‌ కింగ్‌డమ్‌ తరఫున శాస్త్ర, పరిశోధన రంగాల్లో పెట్టుబడులు పెట్టే ఏకైక సంస్థ యూకేఆర్‌ఐ. సంవత్సరానికి సుమారు 700 కోట్ల పౌండ్లు ఖర్చు పెడుతూంటాము. అత్యాధునిక తయారీ రంగం, పారిశ్రామిక వ్యర్థాలు, ఇంధనం, వ్యవసాయం, పర్యావరణం తదితర రంగాల్లో ప్రాజెక్టులు చేపడుతున్నాం.

ప్ర: భారత్‌లో పదకొండేళ్లుగా మీరు పలు ప్రాజెక్టులు చేపట్టారు.. గుర్తించదగ్గ ఫలితాలు ఏమైనా ఉన్నాయా?  
జ: చాలానే ఉన్నాయి. కేవలం మిలియన్‌ పౌండ్లతో భారత్‌లో మా ప్రయాణం మొదలైంది. ఈ మొత్తం రూ. 3,100 కోట్లకు చేరడమే అతిపెద్ద సాధనగా భావిస్తున్నాను. ఈ క్రమంలో ప్రభుత్వ సంస్థలతో చాలా దగ్గరి సంబంధాలు ఏర్పరచుకోగలిగాము. ఇది మాత్రమే కాకుండా నీటి శుదీ్ధకరణ మొదలుకొని, మాతా శిశు సంరక్షణ విషయంలోనూ పలు కొత్త ఆవిష్కరణలకు యూకేఆర్‌ఐ కారణమైంది. క్రేడల్‌ 3 పేరుతో తయారు చేసిన యంత్రం నవజాత శిశువుల ప్రాణాలకు హాని కలిగించే ఆరోగ్య సమస్యలను సకాలంలో గుర్తించి హెచ్చరిస్తుంది.

ప్ర: తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన ప్రాజెక్టులు...? 
జ: సుమారు రూ. 35 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టాము. నివాస భవనాల్లో విద్యుత్తు వినిమయాన్ని తగ్గించేందుకు హైదరాబాద్‌లోని ట్రిపుల్‌ ఐటీ సాయంతో చేపట్టిన ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయింది. భారత్‌లో భిన్న క్లైమాటిక్‌ జోన్లలో విద్యుత్తు అవసరం తక్కువగా ఉండే భవనాల నిర్మాణానికి పద్ధతులు సిద్ధం చేశాము. ఆర్కిటెక్టులతోపాటు, టౌన్‌ ప్లానర్లు, ఇంజనీర్లు, డిజిటల్‌ సైంటిస్ట్‌లు ఈ ప్రాజెక్టులో క్రియాశీలక పాత్ర పోషించారు. ఇది కాకుండా.. చక్కెర ఫ్యాక్టరీల వ్యర్థాల నుంచి విలువైన పదార్థాలను వేరు చేసి మళ్లీ వాడుకునేలా చేసేందుకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ సహకారంతో ఒక ప్రాజెక్టు ప్రస్తుతం నడుస్తోంది. నగర.. గ్రామీణ ప్రాంతాలకు మధ్య ఉన్న సంబంధాల ఆధారంగా పారిశుద్ధ్య కార్యకలాపాలను సమర్థంగా నిర్వ హించేందుకు, రీసైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌తో కలిసి రస్ట్‌ ప్రాజెక్టు, తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీతో కలిసి వయోవృద్ధులపై ఒక ప్రాజెక్టు నడుస్తోంది.  
– గిళియార్‌ గోపాలకృష్ణ మయ్యా 

మరిన్ని వార్తలు