తొందరపాటు నిర్ధారణతో అనర్థం

2 Apr, 2020 00:24 IST|Sakshi

విశ్లేషణ

కరోనా విస్తరిస్తున్న మార్గం, మరణాల రేటు గురించి ముందే నిర్ధారణలకు వచ్చేయడం సరైంది కాదు. కరోనా సీజన్‌లో మూడు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా పది లక్షలలోపుమందికి మాత్రమే ఈ వైరస్‌ సోకింది. అలాగే వైరస్‌ రోగుల మరణాల రేటు కూడా అస్థిరంగా ఉంది. ప్రస్తుతం నమోదవుతున్న కరోనా మరణాల రేట్లు, మొత్తం వైరస్‌ సోకిన కేసుల ఆధారంగా లెక్కిస్తే ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల రేటు కేవలం 0.01 శాతంగా మాత్రమే నమోదైందని చెబుతున్నారు. ఈ వాస్తవాన్ని చూస్తే, కరోనా వైరస్‌ ఏ మార్గం తీసుకుంటుంది అనే విషయంలో మనం కచ్చితమైన అంచనాలు వేయలేం. అందుకే ఈ వైరస్‌ వ్యాప్తి పట్ల అవాంఛనీయమైన నిర్ధారణలు సముచితం కాదు.

ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థల సామర్థ్యాన్ని ధ్వంసం చేస్తున్న కరోనా సృష్టిస్తున్న ఆరోగ్య సంక్షోభం గురించి ప్రజారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రత్యేకించి ఈ వైరస్‌ ప్రభావానికి అధికంగా లోనవుతుంటాయి. వైరస్‌ వేసే రెండో దెబ్బ ఏదంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అది సర్వనాశనం చేస్తుంది. ప్రపంచ ఆర్థిక మాంద్యం ఇప్పటికే మొదలైందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా వేసింది. అర్థికవేత్తలు ప్రకటిస్తున్నట్లుగా అభివృద్ధి వేగం మందగించడం లేక పతన బాట పట్టడం వల్ల ప్రత్యేకించి అభివృద్ధి చెందిన దేశాల్లో అధిక శాతం జనాభా తీవ్రంగా దెబ్బతింటారు.
 
ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కరోనా వైరస్‌ నివారణకు ఆంక్షలు, నిబంధనలు విధించాయి. మరీ ముఖ్యంగా భారత్‌ వంటి కొన్ని దేశాలు వైరస్‌ వ్యాప్తిని తగ్గించడం కోసం కఠినాతికఠినమైన ఆంక్షల్ని విధించాయి. ప్రజారోగ్యం నిపుణులు ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తున్నారు. పలువురు ఆర్థికవేత్తలు దీన్ని సమర్థిస్తున్నారు. కానీ ఆర్థిక అంశాలపై పనిచేస్తున్న కొందరు మాత్రం అలాంటి ఆంక్షలు తీవ్రమైన ఆర్థిక, సామాజిక దుష్పలితాలకు దారితీస్తాయని భయపడుతున్నారు. మితిమీరిన కఠిన చర్యలు కరోనా ట్రాన్స్‌మిషన్, కేసులు, ఆసుపత్రిలో చికిత్స, మరణాల సంఖ్యకు సంబంధించిన డేటాను సరిగా ప్రతిబింబించనివ్వవని వీరి భావన.

అధికారిక డేటా ఏమేరకు అర్థవంతంగా ఉంటోంది అనే విషయంలో నేను కూడా గుంజాటన పడుతున్నాను. లక్షలాదిమందికి వైరస్‌ సోకడం, ఊహించడానికి కూడా సాధ్యంకాని విధంగా మరణాలు సంభవించడం జరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో ఈ వైరస్‌ను అరికట్టడమనేది మరింత కష్టమైన పనిగా ఉంటోంది. కానీ అందుబాటులో ఉన్న డేటా మొత్తాన్ని అర్థం చేసుకునే విషయంలో మనం దూరపు ఆలోచనలు చేయడం ముఖ్యం. అలాగే వైరస్‌ గురించిన డేటాకు సంబంధించిన సమాచారాన్ని వీలైనంత త్వరగా ప్రజలకు తెలియజెప్పాలి. ఈ ఉద్దేశంతోనే నేను ఈ వ్యాసం రాస్తున్నాను.

జాన్స్‌ హోప్‌కిన్స్‌ యూనివర్సిటీకి చెందిన సెంటర్‌ ఫర్‌ సిస్టమ్స్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏప్రిల్‌ 1 నాటికి ప్రపంచవ్యాప్తంగా 8,62,234 మెందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారించారని తెలుస్తోంది. వీరిలో ఇప్పటివరకు 1,78,718 మంది (20.7 శాతం)కి వ్యాధి నయం కాగా మొత్తం 42,404 మంది (4.9 శాతం) చనిపోయారని సమాచారం. మిగిలినవి వైరస్‌ సోకిన కేసులు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే  మరణాల రేటు 4.9 శాతంగానే ఉన్నప్పటికీ దేశాలవారీగా చూస్తే తేడా ఉంది. ఇటలీలో మరణాల రేటు అత్యధికంగా 11.4 శాతం వరకు ఉండగా, భారతదేశం 2.7 శాతం, అమెరికా 1.8 శాతం, జర్మనీ 0.9 శాతం రేటుతో ఉన్నాయి.
 
అయితే వాస్తవ ఇన్ఫెక్షన్‌ రేటు ఎంత ఉందో మనకు తెలీదన్నది స్పష్టమే. ఎందుకంటే వైరస్‌ సోకిన వారందరికీ ఇప్పటికీ పరీక్షలు నిర్వహించలేదు. చాలావరకు ప్రజలు వైరస్‌ లక్షణాలకు కలిగి ఉంటున్నట్లు, లేదా తక్కువ స్థాయిలో లక్షణాలు ఉన్నట్లు భావించాలి. ఇలాంటి సందర్భాల్లో ప్రత్యేకించి పరిమితమైన వైద్య సౌకర్యాలు ఉన్న దేశాల్లో వైరస్‌ పరీక్షలు సార్వత్రికంగా నిర్వహించడం అసాధ్యమనే తెలుస్తుంది. అయితే వైరస్‌ కేసుల్లో మరణాల రేటు లేదా వాస్తవంగా వైరస్‌ సోకిన కేసుల రేటును పోల్చి చూడటం ఈ వ్యాసం ఉద్దేశం కాదు.

ఇక్కడ వాస్తవ గణాంకాలను నేను లెక్కించలేను, అంచనా వేయలేను. అనేకమంది కూడా నాలాగే ఈ విషయంలో ఆశ్చర్యచకితులై ఉంటారని భావిస్తాను. ఇప్పటికి కరోనా వైరస్‌ బారిన పడిన కేసులు 8,62,234 అని చెబుతున్నారు కానీ ఆరోగ్య నిపుణుల అంచనాలతో ఇవి ఏమాత్రం సరిపోలడం లేదు. లండన్‌ లోని ఇంపీరియల్‌ కాలేజి అధ్యయనం ప్రకారం వ్యాధి నిరోధక చర్యలు తీసుకోకపోతే ప్రపంచవ్యాప్తంగా నాలుగుకోట్ల మంది ప్రజలకు కరోనా వైరస్‌ సోకుతుందని తెలుస్తోంది.

అమెరికాలో కరోనా వైరస్‌కి సంబంధించి సాధికారవాణిని ప్రతి బింబిస్తున్న డాక్టర్‌ ఆంథోనీ ఫాసీ ఇప్పటికే ఈ విషయంపై మాట్లాడుతూ ఒక్క అమెరికాలోనే లక్షలాది కేసులు నమోదవుతాయని కనీసం 2 లక్షలమంది ప్రజలు వైరస్‌ ప్రభావంతో చనిపోతారని తేల్చి చెప్పారు. ప్రస్తుతం అమెరికాలో 4 వేలమంది కరోనా వైరస్‌ ప్రభావంతో చనిపోయారు. భారత్‌ విషయానికి వస్తే మరింత దారుణ పరిస్థితులను చవిచూడాల్సి వస్తుందని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీకి చెందిన రమణన్‌ లక్ష్మీనారాయణన్‌ హెచ్చరిస్తున్నారు. ఈయన అభిప్రాయం ప్రకారం కఠిన చర్యలు చేపట్టకపోతే ఒక్క భారత్‌లోనే 30 కోట్లమంది ఈ వైరస్‌ బారిన పడటం ఖాయమట.

వైద్య పరిశోధకులు, నిపుణులు ప్రకటిస్తున్న ఈ అంచనాలపట్ల ప్రజల్లో భయం, అపనమ్మకం పెరగడంతో పాటు ఆగ్రహావేశాలు రేగుతున్నాయి. కరోనా సీజన్‌లో మూడు నెలలలోపు ప్రపంచవ్యాప్తంగా పది లక్షలకు లోపు మందికి మాత్రమే ఈ వైరస్‌ సోకింది. అలాగే వైరస్‌ రోగుల మరణాల రేటు కూడా అస్థిరంగా ఉంది. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎరాన్‌ బెన్‌డేవిడ్, జే భట్టాచార్య ఇటీవలే వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌లో ఒక వ్యాసం రాస్తూ, ప్రస్తుతం నమోదవుతున్న కరోనా మరణాల రేట్లు, మొత్తం వైరస్‌ సోకిన కేసుల ఆధారంగా లెక్కిస్తే ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల రేటు కేవలం 0.01 శాతంగా మాత్రమే నమోదైందని వాదించారు. వీరి అభిప్రాయాలను ప్రాతిపదికగా చేసుకుని ప్రముఖ ఆర్థికవేత్త రూపా సుబ్రహ్మణ్య అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ కోసం రాసిన వ్యాసంలో, కరోనా వైరస్‌ అత్యధిక మరణాల రేట్లను నమోదు చేస్తున్న ప్రపంచంలో భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన లాక్‌ డౌన్‌ అర్థవంతంగానే కనిపించింది కానీ తాజా గణాంకాల బట్టి చూస్తే భారత్‌లో లాక్‌ డౌన్‌ ప్రకటన సరైంది కాదనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంత కఠినంగా దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ అమలుచేస్తే  ప్రజా జీవితాలకు ప్రమాదకరమే కాకుండా దేశంలో లక్షలాది మందికి హాని చేకూరుతుందని రూపా అభిప్రాయం. ఆమె ఆందోళనతో నేను ఏకీభవిస్తున్నాను.

కరోనా విస్తరిస్తున్న మార్గం, మరణాల రేటు గురించి ముందే నిర్ధారణలకు వచ్చేయడం సరైంది కాదు. ప్రస్తుతం ప్రవంచవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులను అర్థం చేసుకోవాలంటే మనం 2009లో హెచ్‌1ఎన్‌1 ఫ్లూ సాంక్రమిక వ్యాధి నుంచి పొందిన అనుభవాలను మనం తెలుసుకోవాలి. అమెరికాలో ఈ వైరస్‌ 2009లో ప్రారంభమైంది. ఆ సంవత్సరం జూన్‌ నాటికి ప్రపంచ వ్యాప్తంగా హెచ్‌1ఎన్‌1 ఫ్లూ వైరస్‌ ఆరవదశకు చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అప్పటికే 70 దేశాల్లో ఇది వ్యాపించింది. ఆ తర్వాత వెనువెంటనే 214 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాల్లో హెచ్‌1ఎన్‌1 కేసులు నమోదయ్యాయి. 2010 ఆగస్టు నాటికి ఆ మహమ్మారి వైరస్‌ కనుమరుగైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా ప్రకటించింది.

మొత్తంమీద 2009 ఏప్రిల్‌ నుంచి 2010 ఆగస్టు వరకు 18,500 మంది ఆ వైరస్‌ బారినపడి మరణించారని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. అయితే ఈ అధికారిక లెక్కలకు భిన్నంగా 2009లో చెలరేగిన హెచ్‌1ఎన్‌1 వైరస్‌కి దాదాపు 5,75,400 మంది ప్రజలు మరణించి ఉంటారని యూఎస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సంస్థ పరిశోధకులు పేర్కొన్నారు. ఒక్క అమెరికాలోనే అప్పట్లో 6 కోట్లకేసులు నమోదయ్యాయని, 2,75,000 మంది ఆసుపత్రుల పాలుకాగా,  12,500 మంది చనిపోయారని వీరు తెలిపారు.

దీంతో పోలిస్తే ఇంతవరకు కరోనా వైరస్‌కి 42,404 రోగులు బలయ్యారు. ఈ వైరస్‌ వ్యాపించి ఇప్పటికి మూడు నెలలు మాత్రమే. హెచ్‌1ఎన్‌1 వైరస్‌ ప్రభావంతో పోల్చి చూస్తే కరోనా వైరస్‌ కారణంగా మరణాల సంఖ్య అధికంగా ఉంటుందని స్పష్టం. ప్రస్తుత అధికారిక డేటాను అనువర్తించి చూస్తే కరోనా వైరస్‌కు మొత్తం 5,50,000 మంది బలవుతారని అంచనా. ఈ వాస్తవాన్ని చూస్తే, కరోనా వైరస్‌ ఏ మార్గం తీసుకుంటుంది అనే విషయంలో మనం కచ్చితమైన అంచనాలు వేయలేం. పైగా ఆనాటి లాగే కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌పై అప్పుడే క్లినికల్‌ నమూనా పరీక్షలు మొదలయ్యాయి కాబట్టి ఈ వైరస్‌ నిరోధంపై కాస్త ఆశావాదాన్ని కలిగి ఉండటంలో తప్పులేదు
(ది వైర్‌ సౌజన్యంతో)


సల్మాన్‌ అనీస్‌ సోజ్‌ 
వ్యాసకర్త మాజీ వైస్‌ చైర్మన్, ప్రపంచబ్యాంకు

మరిన్ని వార్తలు