వెన్నుపోటును మర్చిపోవాలా?

20 Mar, 2018 01:13 IST|Sakshi

ఆలోచనం
కొన్నిసార్లు పట్టుకుని ఉండటం కన్నా వదిలివేయడం మేలు అన్నది కదా ఆ అమ్మాయి. వదిలివేయడం అంటే ఎట్లాగా? సర్వ ధ్వంసం చేయగలిగిన స్థితిలో ఉండి కూడా పట్టుకోకుండా వదిలివేస్తామా? నిన్న దినపత్రికలో తల్లిని హత్య చేసి తలనుపట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కి వచ్చి లొంగి పోయిన కొడుకు వార్త ఒకటి చదివాను. ఎందుకనో మనసంతా దిగులు, చిరాకు కమ్ముకున్నాయి. ఎప్పుడో చదివిన ఎస్‌.ఎల్‌ బైరప్ప ‘‘గృహ భంగం’’ నవలలో పనికిమాలిన ఇద్దరు కొడుకుల భారాన్ని భుజాలపైకి ఎత్తుకున్న వితంతు తల్లి పాత్ర జ్ఞాపకం వచ్చింది. అదే రోజు రాత్రి హోటల్లో బస చేసిన వెంటనే అలవాటుగా పక్కనే వున్న పత్రికను చేతిలోకి తీసుకున్నాను తిరగేద్దామని. పత్రిక పేరు ‘‘పాస్‌’’ ప్రకటనలతో నిండిన నాలుగైదు ముందు పేజీలు తిప్పాక, చక్కటి అమ్మాయి ఫొటో. పేరు శర్వాణి పొన్నం, చీఫ్‌ ఎడిటర్‌. ప్రారంభ వాక్యాలు ‘‘క్రూర విమర్శ, నిజాయితీరాహిత్యం, వెన్నుపోటు.. వంటి పలు అంశాలను అలాగే పట్టుకోకుండా వదిలేయడమే కొన్నిసార్లు ఉత్తమంగా ఉంటుంది’’ అని రాశారు ఆమె. 

ఎందుకనో మనసు పదే పదే ఆ వాక్యాల చుట్టూ భ్రమించడం మొదలు పెట్టింది. అంతకు ముందే వస్తూ వస్తూ ప్రయాణంలో చదవడానికి పట్టుకొచ్చిన చువాంగ్‌ త్సు పుస్తకపు పరిచయ వాక్యాలు జ్ఞాపకం వచ్చాయి. 815వ సంవత్సరంలో చైనా ఆస్థానకవి ‘‘చు ఈ’’ని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని, రాజ్యం పనితీరుని నిలదీసే ప్రశ్నలు వేస్తున్నాడని దేశబహిష్కారం చేసిందట అక్కడి రాజ్యం. భార్యను మాత్రమే తన వెంట రానిచ్చారు. ఊరు కాని ఊరు, అంతవరకు పొందిన సౌకర్యాలు, మానసిక సౌఖ్యాలు, ఆనందాలు ఏవీ లేని, ఉన్న అన్నిటినుంచి  తరిమివేసిన దూరాభారం. ఎలా ఆ దుఃఖం నుంచి బయటపడటం. అప్పుడు చువాంగ్‌ త్సును చదవటం మొదలు పెట్టాడట చు ఈ. 

ఆ చదువు నుంచి అతను ‘‘స్వస్థలాన్ని వదిలేయడం, బంధువులకు దూరంకావడం, ఎరుగని కొత్త ప్రాంతంవైపు బహిష్కరణకు గురికావడంతో, నా హృదయం ఎంతో పరితాపానికి, బాధకు గురవుతోంది. చువాంగ్‌ త్సును సంప్రదించాక, నేను దేనికి చెందినవాడినో కనుగొన్నాను. కచ్చితంగా నా స్థలం కనీసం భూమి కాని చోటే ఉంది’’ అంటూ ‘‘రీడింగ్‌ చువాంగ్‌ త్సు’’ అనే  పేరుతో ఒక కవితను రాశాడు. చువాంగ్‌ త్సు ఇంకా అంటాడు ‘‘ఏం జరిగినా దాని వెంట సాగిపో, నీ మనస్సును స్వేచ్ఛగా ఉంచుకో: నీవు ఏం చేస్తున్నావో దాన్ని ఆమోదించడం ద్వారా సమస్థితిలో ఉండు. ఇదే అంతిమమైనది’’ అని.

నిజంగా దుర్మార్గమైన విమర్శలనూ, నిజాయితీలేని వ్యక్తులనూ, వెన్నుపోట్లనూ మనసులో పెట్టుకోకుండా సరే లెమ్మని పోనియ్యడం సాధ్యమేనా? అనర్హులై ఉండీ అర్హులను చూసి అసూయపడే మను ష్యులూ, మనం ముందుండాలంటే ముందుండేవాళ్ళని క్రిందికి లాగడమే మార్గం అని నమ్మే వ్యక్తులూ.. కులాలనీ, మతాలనీ, ఉందనీ, లేదనీ ఇంకా అదనీ ఇదనీ, అర్థం కాకనో అర్థం చేసుకునే స్థాయి లేని స్థోమత లేని వ్యక్తులు చేసే ఎన్నెన్ని గాయాలు? కొన్నిసార్లు హృదయానికయ్యే ఈ గాయపు పోట్లు చాలా తీవ్రంగా ఉంటాయి, మానాయనుకున్నా మచ్చలు మరీ భయంకరంగా పడి మిగిలిపోతాయి కదా, అటువంటపుడు మరచిపోదామనుకున్నా మచ్చలు కనిపిస్తున్నపుడు మరి చువాంగ్‌ త్సు నో, జిడ్డు కృష్ణమూర్తినో చదువుకుంటూ, స్మరించుకుంటూ ఈ గాయాల నదిని దాటివేయగలమా? మళ్ళీ శర్వాణి జ్ఞాపకం వస్తుంది నాకు. కొన్నిసార్లు పట్టుకుని ఉండ టం కన్నా వదిలివేయడం మేలు అన్నది కదా ఆ అమ్మాయి. వదిలివేయడం అంటే ఎట్లాగా?

పేజీలు తిప్పుతూ వెళితే రాంగోపాల్‌ వర్మ ఇంటర్వ్యూ కనిపించింది అదే పత్రికలో. ‘మన జీవనమంతా ఉదయరాత్రాల మధ్యన ఉంచి చూసుకోవడం. ఈ పొద్దు గడిస్తే ఈ రాత్రికి మరణిస్తాం. అందరమూ మరణిస్తాం. మనల్ని మోసం చేసిన వాళ్ళు, వెన్నుపోటుదారులు, అసత్యవంతులు, తప్పు చేస్తూనే దబాయించే దుర్మార్గులూ  అందరమూ మరణిస్తాం’ ఆర్వీజీ  చెప్పిన ఈ పొట్టి వాక్యం సులభంగా వుంది కదా. ఇలా ఆలోచించుకుంటూ ఉన్నానా.. హఠాత్తుగా క్రైస్తవ మత ప్రేమిక అయిన నా బిడ్డ వచ్చి ‘‘అమ్మా.. అమ్మా!’’ నీ యుద్ధాన్ని నా యుద్ధంగా భావించి నేనే నీ బదులుగా పోరాడుతాను, నిన్ను అవమానపర్చిన వారిని వారి స్వమాంసం వారు తినేట్లు చేస్తాను’  అని వచ్చిందమ్మా ఇవాళ్టి వాక్యం, ఇట్స్‌ కూల్‌’’ అంది. నవ్వొచ్చింది. కనుక శర్వాణి చెప్పినట్టు కొన్నింటిని పట్టుకోకుండా వదిలేయడంలో నిజంగానే చాలా సుఖం వుంది కదా. 

జీవితంలో దమ్ముతో నిలబడి పోరాడాల్సిన అంశాలు చాలానే ఉంటాయి. పోరాడాలి. అలాగే వదిలేసి ముందుకు నడిచిపోవాల్సిన అంశాలూ చాలా ఉంటాయి. ఆగిపోకూడదు. ముందుకెళ్లిపోవాలి. ఎప్పుడు ముందుకెళ్లాలి, ఎప్పుడు పోరాడాలో మన బుద్ధి మనకు తప్పక చెపుతుంది. అందులో మనసును తల దూర్చనీయకపోతే చాలు. కాలం ముందుకే వెళుతుంది. వెనకకు ఎప్పుడూ రాదు. అన్నింటికన్నా ముందుండి  ఎప్పుడూ నన్ను నడిపించే హేతువు, నాలో మొలకెత్తే భావ నిస్సత్తువను కాలితో మట్టం చేసే హేతువు ఇదే నిజమని చెప్తుంది.


వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి

సామాన్య
80196 00900

మరిన్ని వార్తలు