మతసమస్యా, న్యాయసమస్యా?

17 Oct, 2017 01:14 IST|Sakshi

నమ్మిన మూగజీవులను ప్రేమించడం, వాటికోసం స్వర్గాన్ని కూడా వదులుకోవడం మన సంప్రదాయం. కానీ దీపావళి రోజున పటాసులను పేల్చి వాటికి భంగం కలిగించడం న్యాయమేనా?

నేషనల్‌ కేపిటల్‌ రీజియన్‌లో నవంబర్‌ ఒకటి వరకు బాణాసంచా అమ్మకాలపై నిషేధం విధిస్తూ, అక్టోబర్‌ 9న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. చేతన్‌ భగత్‌ లాంటి వాళ్ళు ఈ విషయానికి మత రంగు పులమాలని ప్రయత్నిస్తున్నప్పుడు జస్టిస్‌ ఏ కె సిఖ్రి  ‘‘నా గురించి తెలిసినవారికి నేను ఆధ్యాత్మికవాదిగా కనబడవచ్చు, కానీ ఇది న్యాయానికి సంబంధించిన సమస్య’’ అన్నాడు. కోర్టు ఇది ప్రజల ఆరోగ్యాలకు సంబంధించింది, మతాలకు కాదు అని నిర్ద్వందంగా ప్రకటించింది. 

మనం మనుషులం కదా, మనకు అభ్యుదయాన్ని కోరుకునే నాగరికులు ఉంటారు, కోర్టులుంటాయి, విప్లవ పోరాటాలూ ఉంటాయి. అందుకనే కోర్టుకెళ్లి బాణాసంచా వల్ల చాలా కాలుష్యం పెరిగిపోతుందని బాణాసంచా అమ్మకంపై నిషేధం తీసుకొచ్చాం. కానీ, పాపం భూమిపై సమాన హక్కే ఉన్నా పశు పక్ష్యాదులకు ఇవన్నీ ఏమీ లేవు. అందుకే  మీరు పేల్చే బాణాసంచాకు మా చెవులు పగిలిపోతున్నాయి, మా గుండెలు ఆగిపోతున్నాయి, బాణాసంచా పేల్చడం ఆపండి అని కోర్టులకు ఎక్కలేకపోతున్నాయి. 

బాణాసంచాపై సుప్రీం కోర్టు తీర్పు వినగానే నాకు మొదట మా రాజమల్లిక జ్ఞాపకమొచ్చింది. రాజ మల్లిక నాకు ఇప్పుడే కాదు, డాం అని టపాసు పేలిన ప్రతిసారీ జ్ఞాపకమొస్తుంది. రాజమల్లిక సెయింట్‌ బెర్నార్డ్‌ జాతి కుక్క. దాదాపు 60 కిలోల బరువు ఉండి, అతి గంభీరమైన ముఖమూ, స్వభావము కలిగిన శున కం ఇది. చుట్టూ హోంగార్డులు ఉండే మా ఇంటిలో మా ఆవును దొంగిలించడానికి దొంగలు పడినప్పుడు, ఎక్కడో మిద్దె పైన ఉన్న రాజమల్లిక, పశువుల దొడ్డిలోని అలజడిని విని మా ఆవును కాపాడింది. మేముండే చోట అతి పెద్ద భూకంపం వచ్చినపుడు గట్టిగా అరిచి మమ్మల్ని హెచ్చరించింది. అలా కాపాడటానికి అవసరమైన శక్తి దానికి సునిశితమైన దాని చెవులు ఇచ్చాయి. అయితే రాజమల్లికకు ఉన్న ఈ శక్తి దానికి ఈ భూమిపైన టపాసులు పేలే ప్రతి పండుగనాడు నరకాన్ని చూపించింది. ఎంత సముదాయిం చినా దాని ఆందోళనను మేము ఆపలేకపోయినప్పుడు పశువైద్యుడు ఆందోళనను తగ్గించే మాత్రలు కానీ, స్వల్ప స్థాయిలో మత్తు ఇంజెక్షన్‌ కానీ ఇచ్చేవాడు. చివరికి ఒక వినాయక చవితి నిమజ్జనం రోజు టపాసుల శబ్దానికి భయపడి గుండె ఆగి రాజమ్మ మరణించింది. రాజమల్లికను ‘‘అక్క’’ అని భావించే నా కూతురు ఎన్నోసార్లు ఈ టపాసుల విషయాన్ని ప్రపంచానికి తెలి సేట్లు రాయమని నన్ను బతిమాలుకుంటూ ఉంటుంది.

సత్యభామ నరకాసురుని వధించినప్పుడు ప్రజలు చాలా సంతోషించి, ఆ అమావాస్య రోజున దీపాలు వెలిగించి, కాంతితో నింపి ఆనందాన్ని ప్రకటించుకున్నారట. మనిషికి ఆనంద ప్రకటన పట్ల మక్కువ చాలా ఎక్కువ. దీపావళి వచ్చే కాలంలోనే వానలు వంకలూ వచ్చి పురుగూ పుట్రా పెరిగిపోయి ఉంటాయి. ఆ సమయంలో బాణాసంచా పేలిస్తే ఆ పొగకు విష పురుగులన్నీ చస్తాయని ఎవరో ఎక్కడో రాస్తే చదివాను. కానీ ఇవాళ మనం కేవలం దీపావళి సమయంలోనే టపాసులు పేల్చి ఆగిపోతున్నామా? నిజానికి మనుష్యులకు పురుగూ పుట్రా కన్నా కూడా తమ ఆనందాన్ని పక్క వీధివారికో, ఊరి చివరి వారికో చెవులలో మోత మోగించి మరీ వినిపించడం పట్ల చాలా ఆసక్తి ఉంటుంది. మన ఈ ఆసక్తి నోరులేని మూగజీవులను ఎంత బాధపెడుతుందో ఆలోచించకపోతే మనం ఆలోచించగల జీవులం ఎలా అవుతాం? పశు పక్ష్యాదులను భయపెట్టి జీవావరణ సమతుల్యతను దెబ్బతీయడం ఇప్పటికిప్పుడు పెద్ద ప్రమాదకారకంగా అని పించకపోవచ్చు కానీ భవిష్యత్తులో అదే పెద్ద చింతనీయమైన విషయంగా మారవచ్చునేమో కదా!

మా తాతకి టామీ అనే దేశీ జాతి కుక్క ఉండేదిట. అది ఎప్పుడూ మా తాతను విడువకుండా తిరి గేది. అది చనిపోయాక మా తాత తినే ప్రతిసారీ మొదటి ముద్దను పక్కన పెట్టడం మొదలు పెట్టాడట. మేం పుట్టాక మాకు మాత్రమే కాదు మా ఊరందరికీ తెలుసు గండవరపు సుబ్బరామిరెడ్డి కుక్క పేరు టామీ అని, ఆయన తినే తిండిలోని మొదటి ముద్దకి అది హక్కుదారని. ధర్మరాజు భార్య, తమ్ముళ్లు మరణిం చాక తానొక్కడే ఒక కుక్క తోడుగా స్వర్గారోహణ చేశాడు. మధ్యదారిలో రథం వేసుకొచ్చి ఇంద్రుడు కలిశాడు, ఇక నడవనక్కరలేదు వచ్చి ర«థమెక్కు అన్నాడు. అందుకు ధర్మరాజు అన్నాడట ఈ కుక్క కూడా ర«థం ఎక్కవచ్చా అని. ఇంద్రుడు కుదరదూ అన్నాడట. కుక్కని వదిలివచ్చేయ్‌ అని బలవంతపెట్టాడట. అప్పుడు ధర్మరాజు ఇంద్రుడితో అన్నాడట ‘స్వామీ! ఈ కుక్కను వదిలి పెట్టడం నాకు కుదరని పని. దీనిని వదిలేసి వచ్చి పొందే స్వర్గం నాకు అవసరం లేదు. ఇక నువ్వు వెళ్ళు’ (మహాప్రస్థానిక పర్వం–59) అని స్వర్గాన్నే తిరస్కరించాడట. చాలామంది అంటున్నారు బాణాసంచా కాల్చడం మన సంప్రదాయం అని. నిజానికి బాణాసంచాకి వాడే గన్‌ పౌడర్‌ చైనా వారి ఆవిష్కరణ. అలా చైనా నుంచి టపాసులు పుట్టాయి. నమ్మిన మూగజీవులను హృదయపూర్వకంగా ప్రేమించడం, వాటికోసం స్వర్గాన్ని కూడా వదులుకోవడం మన సంప్రదాయం.

సామాన్య కిరణ్‌
వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి
91635 69966 

మరిన్ని వార్తలు