ఆ విషయంలో సిగ్గెందుకు!

6 Feb, 2018 00:58 IST|Sakshi
శానిటరీ ప్యాడ్‌తో ప్యాడ్‌ చాలెంజ్‌ విసిరిన నటి దీపికా పడుకొన్‌

ఆలోచనం

ప్రభుత్వం బొట్టు, గాజులు, పారాణి వంటి సౌభాగ్య చిహ్నాలను అడగకుండానే ట్యాక్స్‌ ఫ్రీ చేసింది కానీ, స్త్రీలు నోరు తెరిచి అడిగినా ప్యాడ్‌లను ట్యాక్స్‌ ఫ్రీ చేయకుండా భీష్మించుకుంది. పాలకుల పురుషస్వామ్య దృక్పథానికిది నిదర్శన.

‘‘అవును నా చేతిలో ఉన్నది ప్యాడ్‌ – నేను సిగ్గుపడాల్సింది ఏమీ లేదు... అది చాలా సహజమైనది! పీరియడ్‌’’ అని ట్వీట్‌ చేశారు దీపికా పదుకొనె, ప్యాడ్‌ మ్యాన్‌ చాలెంజ్‌ తీసుకుంటూ. ‘ప్యాడ్‌ మ్యాన్‌’ ఈ నెల 9వ తేదీ విడుదలవుతున్న అక్షయ్‌ కుమార్‌ సినిమా. అరుణాచలం మురుగనంతం జీవితాన్ని ఇది మనకు చూపిస్తుంది. అరుణాచలం తమిళనాడుకి చెందిన వ్యక్తి. తన భార్య నెలసరి రోజులలో పాత గుడ్డముక్కలు, కాగితాలు వాడటం చూసి కలత చెంది, దానికో పరిష్కార మార్గం చూపించాలని భావించాడట. ఈ పరిశోధనలో ఆయన అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. విదేశాలనుంచి దిగుమతి అయ్యే శానిటరీ నాప్కిన్‌ తయారీ మెషీన్‌ విలువ మూడున్నరకోట్లు. ఇంత ఖరీదైన మెషీన్‌తో ప్యాడ్‌లు తయారు చేయడం వలన మార్కెట్‌కు చేరేప్పటికీ ప్యాడ్‌ ఖరీదు పెరిగి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతుందని గ్రహించాడు. చివరికి అన్ని అడ్డంకులనూ అధిగమించి రూ. 65 వేలకే వచ్చే ప్యాడ్‌ ఉత్పత్తి మెషీన్‌ను ఆయన కనుగొన్నాడు. పైగా ఆ మెషీన్‌ను సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌లకు మాత్రమే అమ్ముతానని భీష్మించుకున్నాడు. ఈయన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న 100 మంది వ్యక్తులలో ఒకరని  టైం మేగజైన్‌ ప్రకటిం చింది. భారత ప్రభుత్వం పద్మశ్రీతో సన్మానించింది.

ఇండియాలో అధిక శాతం ప్రజలు అల్పాదాయ వర్గాల వారే. వారికి మార్కెట్‌లో దొరికే ప్యాడ్లను కొనగలిగే స్థోమత ఉండదు. 2016లో చేసిన ఒక పరిశోధన ప్రకారం దేశంలో 84% అమ్మాయిలూ, 92.2% శాతం తల్లులూ ఇప్పటికీ నెలసరి సమయంలో గుడ్డని వాడుతున్నారు. వారిలో కొందరే ఆ గుడ్డని ఎండలో ఆరబెడుతున్నారు. ప్రభుత్వ సర్వే ప్రకారం మనదేశంలో కేవలం 12% మంది మాత్రమే ప్యాడ్‌లు వాడగలిగే స్థితిలో ఉండటం వలన 37.8% పెళ్లి కాని పిల్లలు యోని దగ్గర దురదతో, దుర్వాసనతో బాధపడుతున్నారు. స్త్రీలను అమితంగా బాధించే రీప్రొడక్టివ్‌ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ (ఆర్‌టీఐ)కి, సర్వైకల్‌ కేన్సర్‌కు 70% కారణం నెలసరి సమయంలో శుభ్రమైన ప్యాడ్‌లు వాడకపోవడమేనని 97% మంది గైనకాలజిస్టులు అఇ నీల్సన్‌ సర్వేలో చెప్పారు.  

మహిళలకు ఏమీ చేయడంలేదనిపించుకోకుండా ప్రభుత్వం 2011లో రుతు సంబంధమైన శుభ్రతా పథకం (ఎమ్‌హెచ్‌ఎస్‌)ని ప్రారంభించి, 100 కోట్లను కేటాయించింది. అయితే ఈ కార్యక్రమం గురించి నెల్లూరు జిల్లాలో ఒక ఆశా వర్కర్‌ని అడిగినపుడు ఆమె తన అనుభవాలను పంచుకున్నది. రెండేళ్ల క్రితం ఒకే ఒకసారి రాష్ట్రీయ కిశోర్‌ స్వాస్థ్య కార్యక్రమం క్రింద (ఆర్‌కెఎస్‌కె) గ్రామాలలో ప్యాడ్‌లు పంచడం జరిగిందట. ప్యాకెట్టు విలువ రూ. 6లు. అందులో ఆశా వర్కర్‌కి రూపాయి. మరి గ్రామాలలో స్పందన ఎలా ఉండింది అంటే ‘‘చాలా బాగుండిందమ్మా. రేటు తక్కువ కాబట్టి ‘కౌమార బాలికలు’ ఉత్సాహంగా కొన్నారు’’ అన్నది. ‘కానీ అంత రేటు పెట్టి  కొనగలిగే స్థోమత తమకు లేద’ని 83% మంది దిగువ తరగతి వారు తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు.

ఆడవారి రుతుస్రావం చుట్టూ నొప్పుల బాధలు ప్రకృతి ఎలాగూ పెట్టింది. అది కాక రోగాలు రాకుండా శుభ్రతను పాటించాలంటే నెలనెలా ఖర్చు పెట్టాల్సి రావడం చాలామందికి స్థోమతకు మించిన బాధ. అలాంటిది ప్రభుత్వం సానిటరీ ప్యాడ్‌లను 12% జీఎస్టీలోకి నెట్టడం ఇంకా బాధాకరం. ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థిని జర్మినా ఇస్రార్‌ ఖాన్‌ గత ఏడాది ఈ 12% ట్యాక్స్‌ రాజ్యాంగ విరుద్ధమూ, అన్యాయమూ అని ఢిల్లీ కోర్టులో కేసు వేసినా ప్రభుత్వం చలించలేదు. ప్యాడ్‌లను ట్యాక్స్‌ ఫ్రీ చేయాలనే డిమాండ్‌కి స్పంది స్తూ అరుణ్‌జైట్లీ ‘12 శాతాన్ని తగ్గించినట్లయితే... భారతీయ ఉత్పత్తిదారులు ఎవరూ మిగలరు’ అని వ్యాపార సూత్రాన్ని చెప్పారు. ఈ జనవరి 22న సుప్రీం కోర్టు ముంబై ఢిల్లీ కోర్టులలో ఉన్న ఈ కేసు ప్రొసీడింగ్స్‌పై స్టే విధించి, దీన్ని తన పరిధిలోకి తీసుకోవడంపై పరిశీలిస్తానని పేర్కొన్నది.

‘తాగునీరు, పారిశుధ్య మంత్రిత్వ శాఖ’ వారు 2015లో విడుదల చేసిన ‘రుతుసంబంధమైన ఆరోగ్య నిర్వహణ మార్గదర్శకాలు’ చదువుతూ, నేను నా కూతుర్ని ‘మీ స్కూల్‌ లో ప్యాడ్స్‌ ఎలా వాడాలో ఎప్పుడన్నా చెప్పారమ్మా’ అని అడిగాను. నా కూతురు ‘అవంతా చెప్పలేదమ్మా, ఎక్కడ పడేయాలో మాత్రం చెప్పారు అంటూనే,  ఆ.. ఇంకా మేల్‌ స్టాఫ్‌తో మాట్లాడొద్దని కూడా చెప్పారమ్మా’ అన్నది. ఆడపిల్లల్ని మగవాళ్ళకి దూరంగా ఉంచి పద్దతిగా పెంచడంలో ఉండేంత శ్రద్ధ.. వాళ్ల బడి వాళ్లకు ఆ పిల్లల శుభ్రత మీద లేదు. దీని వెనుకనున్న భావజాలం పేరు పితృస్వామ్యం. ప్రభుత్వం బొట్టు, గాజులు, పారాణి వంటి సౌభాగ్య చిహ్నాలను అడగకుండానే ట్యాక్స్‌ ఫ్రీ చేసింది కానీ, స్త్రీలు నోరు తెరిచి అడిగినా ప్యాడ్‌లను ట్యాక్స్‌ ఫ్రీ చేయకుండా భీష్మించుకున్నది. పాలకుల పురుషస్వామ్య దృక్పథానికి ఇది నిదర్శన. దీపికా వంటి సెలెబ్రిటీలు ప్యాడ్‌ మ్యాన్‌ చాలెంజ్‌ తీసుకోవాల్సింది, ప్యాడ్‌ని ప్రదర్శించడానికి కాదు, వీటన్నిటి గురించీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి తీసుకోవాలి, అప్పుడే అరుణాచలంపై సినిమాకి ఒక అర్థం ఉంటుంది.


- సామాన్య

వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 80196 00900

మరిన్ని వార్తలు